Pages - Menu

Pages

24, అక్టోబర్ 2010, ఆదివారం

అంబేద్కర్ జాతకం-కొన్ని ఆలోచనలు












డా|| అంబేద్కర్ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన నాయకుడేగాక, సమాజంలో అట్టడుగున ఉండి బాధలు పడుతున్న దళితులను ఉద్ధరించిన కారణ జన్ముడని చెప్పవచ్చు. ఆయన జాతకాన్ని విశ్లేషించమని కొందరు మిత్రులు నన్ను చాలా కాలం నుంచి కోరుతున్నారు. నెట్ లో వెతుకగా, ఆయన జననతేది దొరికింది గాని ఆయన జన్మ సమయం దొరకలేదు. ఆయన 14-4-1891 న మధ్యప్రదేశ్ లో మహో అనే ఊళ్ళో జన్మించాడు.ఖచ్చితమైన జనన సమయం దొరకనందున చంద్రలగ్నం నుంచి ఆత్మ కారకుని నుంచీ కొన్ని పాయింట్స్ చూద్దాం.

ఈయన మేష సంక్రాంతి రోజున జన్మించాడు. రవి ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. గురువు దశాంశలో ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఒక కారణ జన్ముడని చెప్పవచ్చు.

ఈయన జాతకంలో ముఖ్యమైన యోగం రవి ఉఛ్ఛ స్తితి. ఈ రవి మేషం ఒకటవ డిగ్రీలో ఉండి దాదాపుగా పరాశరుని షోడశ వర్గ చక్రాలన్నింటిలోనూ ఉఛ్చ స్థితిలో ఉన్నాడు. కనుక ఈయన ఉత్తమమైన ఆత్మశక్తి కలవాడని తెలుస్తున్నది. బుదాధిత్య యోగం వల్లనూ, రవి తృతీయాధిపతిగా ఉఛ్చస్థితివల్ల భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యే యోగం కలిగింది. అనేక పుస్తకాలు ఆర్టికిల్సూ ఈ సూర్యభగవానుని యోగం వల్లనే ఆయన వ్రాయగలిగాడు. రవి రాజులకు సూచకుడు. కనుకనే బరొడా మహారాజిచ్చిన స్కాలర్ షిప్ వల్ల కొలంబియా యూనివర్శిటీలో చదువుకునే సహాయం వచ్చింది.

ఈయనకు దశాంశ చక్రములో గురువు ఉఛ్ఛ స్థితిలో ఉన్నాడు. దేవగురువైన బృహస్పతి ఈయన జాతకంలో ఉఛ్ఛ స్థితివల్ల ఉన్నత పదవులు, మంచి మేధాశక్తి, వాక్పటిమ ఈయనకు వచ్చాయి.అయితే ఇదే చక్రంలో శుక్రుని నీచ స్థితివల్ల ఇవన్నీ ఆయనకు అనేక కష్టాల తర్వాతా, ఎదురుదెబ్బల తర్వాతా మాత్రమే లభించాయి.

గాంధీగారి లగ్నాధిపతి అయిన శుక్రుడు ఈయన జాతకంలో దశాంశలో నీచ స్థితిలో ఉండటం చూడవచ్చు. ఈయనకు గాంధీగారంటే ఏమంత గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆయన తన ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో కూడా లభిస్తున్నది.

పంచమ దశమాధిపతులైన శుక్ర గురువులు నవమ స్థానంలో కలసి ఒక రాజయోగాన్ని ఈయనకు ఇచ్చారు. కాని వారిద్దరూ శత్రువులైనందున ఆ యోగం సునాయాసంగా అందలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు పడిన తర్వాతనే అది లభించింది.

శని వక్ర స్థితివల్ల ఈయన సమాజంలోని బలహీన వర్గాలకు మేలు చేయటానికి జన్మించాడని సూచింపబడుతున్నది. అది సూర్యుని దైన సింహరాశిలో జరగడం వల్ల సమాజంలో ఉన్నత పదవులలో, ఉన్నత స్థాయిలో ఉన్నవారితో పోరాటం వల్ల అది సాధిస్తాడని కూడా సూచింపబడుతున్నది.

ఈయన జాతకం లోని మరొక గొప్ప అనుకూల యోగం రాహు కేతువుల ఉఛ్చ స్థితి. అది ద్వాధశ, షష్ట స్థానములలో ఉండటం వల్ల ఆయనకు శత్రువిజయాన్ని ఈ గ్రహాలు ఇస్తాయని , కాలం చక్కగా అనుకూలిస్తుందని తెలుస్తున్నది.

గాంధీగారి లగ్నమైన తులకు, ఈయన యొక్క రవి సప్తమస్థానంలో ఉంటూ వీరిద్దరి భావాలూ ఎప్పుడూ విభేదించేవని తెలుపుతున్నాడు.

వింశాంశలో తులారాశిలో రాహు, గురు, కేతువులు కలసి ఉన్నారు. వీరి కలయిక బౌద్ధ మతాన్ని సూచిస్తుందని మనకు తెలుసు. కనుకనే ఆయన జీవిత చరమాంకంలో బుద్ధుని అనుయాయిగా మారాడు. అన్ని దేశాలు తిరిగీ, క్రైస్తవంలో బాగా పాండిత్యం ఉండి కూడా, ఆయన మనదేశపు మతమే అయిన బౌద్దాన్ని ప్రేమించటం ఆయనలోని ఒక గొప్ప ఆలోచనాపరుని సూచిస్తున్నదని నా నమ్మకం. కొన్ని కొన్ని కోణాలలో బౌద్దమతం అనేది నేడు మనం ఆచరిస్తున్న హిందూమతం కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనదని నా నమ్మకం మాత్రమే గాక సత్యం కూడా.

ఆత్మ శక్తి కారకుడైన సూర్యుని పరిపూర్ణ అనుగ్రహం ఈయనకు ఉంది. దానికి సూచనగానే, షోడశ వర్గ చక్రాలలోనూ సూర్యుడు ఉఛ్ఛ స్థితిలో దర్శనం ఇస్తాడు. ఇంత గొప్ప యోగం గాంధీగారి జాతకంలో లేదు. అందుకనే గాంధీ గారి జాతకాన్ని ఈయన జాతకాన్ని పక్కపక్కన పెట్టి, ఏ జాతకం ఎవరిదో చెప్పకుండా, ఎవరి జాతకంలో ఆధ్యాత్మిక బలం అధికం అంటే, అంబేద్కర్ జాతకాన్నే చూపవలసి వస్తుంది.

సరియైన జన్మసమయం దొరికితే ఇతర జీవిత వివరాలను కూడా చక్కగా వివరించవచ్చు.