Pages - Menu

Pages

31, అక్టోబర్ 2010, ఆదివారం

ఉచ్చాటన క్రియ పనిచేస్తుందా?

తాంత్రిక క్రియల్లో ఒకటైన ఉచ్చాటన క్రియకు నిత్యజీవితాలలో జరిగిన కొన్ని ఉదాహరణలు చూద్దామా.

>>పాము మంత్రం వేసేవాళ్ళు మంత్రించిన ఇసుకను ఇంటి చుట్టూ పొయ్యమంటారు. ఇసుకను దాటి సర్పాలు లోపలికి రాలేవు. అక్కడి దాకా వచ్చి వెనక్కు వెళ్ళిపోతాయి. ఇది నిజంగా జరుగుతుంది. పాము మంత్ర సిధ్ది నిజంగా ఉన్నవాళ్ళు ఇది చేసినప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది ఒక రకమైన ఉచ్చాటన క్రియే. కాని పాము మంత్రగాళ్లమని చెప్పుకునే వారందరికీ నిజమైన మంత్ర సిద్ది ఉండదు. నిజమైన సిద్ధి ఉన్నవారు ఇదిచేస్తే చక్కగా జరుగుతుంది.

>>ప్రేతాత్మలను మనిషి నుంచి వదిలించటమూ (exorcism), భూతగృహం (haunted house) నుంచి దురాత్మను వెళ్లగొట్టే పద్ఢతులూ కూడా ఉచ్చాటన క్రియలే. మహనీయులు సంకల్ప మాత్రం చేత వీటిని చెయ్యగలుగుతారు. మామూలు సాధకులు అయితే ఆ క్రియా విధానం ప్రయోగించి కష్టపడవలసి వస్తుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు శక్తి చాలకపోతే ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది కూడా.

>>ఒక భూతపీడితుడైన మనిషి నుంచి ప్రేతాత్మలను జీసస్ తన యోగశక్తితో వెళ్లగొడితే అవి అక్కడే ఉన్న పందుల గుంపులో ప్రవేశించగా, ఆ పందులన్నీ పిచ్చిపిచ్చిగా పరిగెత్తి సముద్రంలో దూకి చచ్చాయని బైబుల్ లో ఉంది. అతను అనేక ఆత్మలచేత ఆవేశించబడిన దురదృష్టవంతుడు. ఇది ఉచ్చాటన క్రియనే.

>>షిరిడీ ఊరిలో కలరా మహమ్మారి ప్రబలుతున్నపుడు బాబా స్వయంగా తిరగలితో పిండి విసిరి ఆ పిండిని దుష్ట శక్తులకు ఆహారంగా విసురుతున్నట్లుగా చేస్తూ ఊరంతా చల్లాడని, తత్ఫలితంగా కలరా ఆ ఊరిని తాకలేదనీ ఆయన జీవిత చరిత్రలో వ్రాసి ఉంది. ఇదీ ఒకరకమైన ఉచ్చాటన క్రియనే.

>>గౌతమబుద్ధుని వద్దకు ఒక ప్రేతాత్మ ఆవేశించిన వ్యక్తిని తీసుకురాగా, ఆయన తన శక్తితో దానిని ఆ వ్యక్తి నుంచి వెళ్లగొట్టినపుడు, ఆ ఆత్మ పోతూ పోతూ తాను పోతున్నందుకు నిదర్శనంగా పక్కనున్న చెట్టుకొమ్మను పేళ్ళున విరిచి వెళ్ళిపోయిందని బుద్దుని జీవితం లో ఉంది. ఇదీ ఉచ్చాటన క్రియే.

>>శ్రీరామకృష్ణుని జీవితంలో ఒక సంఘటన. ఆయన చివరిరోజులలో కాశీపూర్ గార్డెన్ హౌస్ లో ఉన్నపుడు, ఆ ఇంటి ఆవరణలో ఒక మూలన ఉన్న ఈత చెట్టువద్ద
తన శిష్యులను కాటేయటానికి పొంచి ఉన్న విషసర్పాన్ని అక్కడనుంచి పొమ్మని ఆదేశించి దానిని వెళ్లగొట్టాడు. ఇదీ ఒక రకమైన ఉచ్చాటన క్రియనే.

>>తన చెల్లెలి వెంట పడుతున్న ఒక వ్యక్తి బారినుంచి తన చెల్లెలిని కాపాడమని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. అతను దాన్ని తూచా తప్పకుండా ఆచరించాడు. దాని ఫలితంగా ఆ యువకుడు హఠాత్తుగా ఆ ఊరినుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్లీ ఆ అమ్మాయివైపు చూడలేదు.

>>> ఒక ఆఫీసర్ తన క్రింది ఉద్యోగి అయిన నా మిత్రుని అనవసరంగా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడు. నా మిత్రుడు తట్టుకోలేని స్థితిలో నన్ను సంప్రదించాడు. అతనికి ఈ క్రియ ఎలా చెయ్యాలో చెప్పాను. దాని ఫలితంగా ఆ ఆఫీసర్ ఉన్నట్టుండి ఒక కేసులో ఇరుక్కుని ట్రాన్స్ ఫర్ కాబడి ఆ ఊరినుంచి వెళ్ళిపోయాడు. సామాన్యంగా టర్మ్ పూర్తికాకుండా అలా ట్రాన్స్ ఫర్ కావటం జరుగదు.

>>>ఒకసారి నేను నడుస్తూ వెళుతుంటే ఒక బర్రె కొమ్ములు విసురుతూ నాకే ఎదురొచ్చింది. నెను దానిపైన ఉచ్చాటనక్రియను మౌనంగా ప్రయోగించాను. విచిత్రంగా ఆ బర్రె సడన్ గా ఆగిపోయి ఎవరో తరుముతున్నట్లు వేరే దిక్కులో పారిపోయింది.

>>>కావ్యకంఠ గణపతి ముని జీవితంలో జరిగిన సంఘటన. ఆయన కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక పొలంలో తన శిష్యులతోకూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. వారి చుట్టూ ఉన్న గడ్డివాములను మంటలు ఆక్రమించి వాళ్ళు తగలబడే పరిస్థితి వచ్చింది. అప్పుడాయన ఒక వైదిక మంత్రాన్ని ప్రయోగించగా హఠాత్తుగా సుడిగాలి చెలరేగి గడ్డివాములను దూరంగా చెదరగొట్టింది. వైదిక మంత్రాలకున్న శక్తిని ఆయన ఆ విధంగా చూపించాడు. ఇదీ ఉచ్చాటనా క్రియనే.

>>>వదలకుండా తనను వేధిస్తున్న ఒక ఆలోచన (obsessive thought) గురించి అరవిందులకు ఒక శిష్యుడు వివరించి సాయం చెయ్యమన్నాడు. ఆయన అతని తలదగ్గరగా చెయ్యిపెట్టి ఒక పురుగును తీసి విసిరినట్లుగా చెయ్యిని దూరంగా విదిలించాడు. తరువాత ఆలోచన తిరిగి శిష్యుడి మనసులో తలెత్తలేదు.మదర్ ను విషయమై అడిగితే అరవిందులు తన చర్య ద్వారా ఆలోచనను దూరంగా శూన్యాకాశంలోకి విసిరేశారని చెప్పారు. ఇదీ ఒక ఉచ్చాటనక్రియనే.

అధర్వణ వేదంలో ఇలాటి విధానాలు ఎన్నెన్నో ఇవ్వబడ్డాయి. సాధన చెయ్యగలిగితే వీటిని సాధించవచ్చు.
ఈ విధంగా ఉచ్చాటన క్రియను మంచిపనులకు కూడా చక్కగా వాడవచ్చు.