Pages - Menu

Pages

22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక సోమవారం శ్రీశైల యాత్ర










మనం
అనుకోని ఏదైనా చేస్తే అది మన సంకల్ప ఫలితం. అనుకోకుండా ఒక పని చెయ్యవలసి వస్తే అది భగవత్సంకల్పం. అనుకోని వ్యక్తులు తటస్థ పడటం అద్భుతం. గమనించే ప్రజ్ఞ ఉంటే అద్భుతాలు ప్రతిరోజూ కనిపిస్తాయి.

అలాటి సంఘటన ఈ మధ్యన జరిగింది.

మొన్న పదిహేనో తేదీన ఒక వీవీఐపీ గారితో కలిసి శ్రీశైలం సందర్శించే అవకాశం పరమేశ్వరుడే కల్పించాడు. ఆదివారమే అడ్వాన్స్ పార్టీగా అక్కడకు చేరి అన్ని ఏర్పాట్లూ సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించాము. మధ్యాహ్న సమయంలోపరమేశ్వరీ పరమేశ్వరుల దర్శనం చేసుకొని రాత్రివరకూ అక్కడి ఆహ్లాదకర అటవీ వాతావరణాన్ని ఆధ్యాత్మికస్పందనలనూ ఆస్వాదిస్తూ గడిపాను. పాతాలేశ్వర సదన్ లో బస చేశాను. ఆది పాతాళ గంగకు వెళ్ళే దారిలో రోప్ వె దగ్గరగా ఉన్నది. ఆ రెండు రోజులూ మబ్బులు పట్టి సన్నటి చినుకులు పడుతూ వాతావరణం మంచి ఆహ్లాదకరంగా ఉంది.

సాయంత్రానికి మందీ మార్బలంతో వారందరూ రావడం, హడావుడి, దర్శనాలు చేసుకోవటం అన్నీ జరిగిపోయాయి. మర్నాడు సోమవారం తెల్లవారు జామునే లేచి మళ్ళీ దర్శనాలు, అభిషేకాలు, చండీ హోమం ఇత్యాదులు చకచకా జరిగిపోయాయి. నేను మాత్రం హాయిగా కాటేజీలో మౌనంగా ధ్యానంలో గడిపాను. రెండో సారి వారితో దర్శనానికి వెళ్ళలేదు. ఆరోజున దాదాపు డెబ్బై వేలమంది దర్శనార్ధమై వచ్చి ఉన్నారు. ఒకటే తోక్కిడిగా ఉంది. క్రితం రోజే స్వామి దర్శనం చేసుకున్నాను గనుక సోమవారం నాడు నేను మళ్ళీ వెళ్ళలేదు. కార్తీక సోమవారం నాడు శ్రీశైలం లో ఉండీ శివదర్శనానికి వెళ్ళని నన్ను వింతగా చూస్తూ మా గ్రూప్ లో వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. నేను మౌనంగా కళ్ళు మూసుకొని నా లోకంలో ప్రవేశించాను. ఆలయంలో దర్శనం కంటే గొప్పదైన అనుభవాన్ని నాకు నా గదిలోనే పరమేశ్వరుడు అనుగ్రహించాడు.

భ్రమరాంబికా ఆలయంలోని వరండాలో లోపాముద్రా దేవి విగ్రహం ఉంటుంది. నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా అక్కడ కొంతసేపు మౌనంగా కూచుంటాను. ఆమె అగస్త్య మహాముని పత్ని. లలితా సహస్ర నామాలను ప్రచారం లోకి తీసుకొచ్చిన మహా యోగిని. శ్రీవిద్యోపాసనలో ఆమె ఉపాసించిన విధానాన్ని చాలామంది నేటికీ అనుసరిస్తున్నారు. తంత్ర సాధకులకు ఆమె పరమ గురువు అని చెప్పవచ్చు. "లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా"--అని లలితా సాహస్రం ఆమహాతల్లికి సముచిత స్థానాన్ని ఇచ్చింది.

శ్రీశైల మహాక్షేత్రం సిద్ధులకు ముఖ్యంగా రససిద్ధులకు నిలయం. ఇనుమును రాగిని ఆకుపసరులతో బంగారంగా మార్చగల సిద్ధులు అక్కడ ఎందఱో ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు. కాని సామాన్యుల దృష్టికి అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తారు. మన వద్దఒక రూపాయికోసం చేయి చాచే వాని వద్ద ఇలాటి అద్భుత శక్తి ఉన్నదని అందరూ గ్రహించలేరు. నేను అక్కడ తిరుగుతూఉన్న సమయంలో అలాటి ఒక సిద్ధుడు నాకెదురు పడ్డాడు.

ఏదో ఆలోచనలో ఉండి నడుస్తున్న నేను " బాబూ ధర్మం" అన్న మాటతో ఈ లోకం లోకి వచ్చి ఎదురుగా చాచిన చేతివైపు యదాలాపంగా చూచాను. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. కారణం !!! బిచ్చగాళ్ళ చేతులు ఒక విధంగా ఉంటాయి. వాటి రేఖలూ ప్రత్యేకంగా ఉంటాయి. చూడగానే వాటిని గుర్తించవచ్చు. అందుకు భిన్నంగా నా ఎదురుగా చాచిన చేయిలో
పరుసవేది రేఖ (line of alchemy) కనిపించింది. అలాటి రేఖ కోట్లాది మందిలో ఒకరికి కూడా ఉండదు. తలెత్తి అతని ముఖం లోకి పరిశీలనగా చూచాను. సామాన్య దృష్టికి మామూలు బిచ్చగానివలేనే ఉన్నప్పటికీ అతని ముఖంలోని నిర్లిప్తతా, ముఖ్యంగా అతని కళ్ళలో ఉన్న ఈలోకానికి అతీతమైన మెరుపు లాంటిది అతనెవరో నాకుతెలియ చెప్పింది. అతని కళ్ళలోకి లోతుగా చూచేసరికి అతనూ నన్ను గుర్తించాడు. నిగూఢమైన చిరునవ్వుతో నన్ను పలకరించాడు. నేనూ చిరునవ్వు నవ్వి మనస్సులోనే ఆయనకు నమస్కరించి నా దారినసాగిపోయాను. క్షుద్ర లోహాన్ని బంగారంగా మార్చగల మనిషి బిచ్చగాడిలా అడుక్కుంటున్నాడు. జగన్మాత లీలకు మనస్సులోనే ఆశ్చర్య పడ్డాను.

యోగం కూడా పరుసవేదివిద్యయే. పరుసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది. పశు స్థాయిలోఉన్న మనిషిని దేవతగా యోగం మార్చగలదు. రెండూ అక్కచెల్లెళ్ళవంటివే. ఈ కోణంలో దీనిని అంతర్గత పరుసవేది విద్య (Inner Alchemy) అని చెప్పవచ్చు. పరుసవేది విద్య కోటిమందిలో ఒకరికి కూడా లభించదు. నిజమైన యోగం కూడా అంతే.

శ్రీరామకృష్ణుల అద్వైతవేదాంత గురువైన తోతాపురికి ఈ విద్య తెలుసు. వారి మఠంలో కొన్ని వందల సాధువులుండేవారు. వారు నగ్న సాధువులు కనుక బయట ప్రపంచంలోకి రారు. ఎవరినీ ఏమీ అడగరు. ఎవరితోనూ సంబందాలు ఉండవు. కాని వారికి కావలసిన సరుకులు, వస్తువుల విషయంలో వారికి ఎలాటి కొరతా ఉండేది కాదు. వారికి కావలసినంతవరకూ ఇనుమును, రాగిని, ఇంకా చెప్పాలంటే మట్టిని కూడా బంగారంగా మార్చుకొని దానితో వారి నిరాడంబర జీవితానికి కావలసిన రొట్టెలో ఇంకేవో వారు సమకూర్చుకునేవారు.

శ్రీ శైలానికి పదహారు మైళ్ళ దూరంలో అక్కమహాదేవి గుహలున్నాయి. ఆమె పదకొండో శతాబ్దానికి చెందిన గొప్ప శివభక్తురాలు. మహా యోగిని. దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కన్నడ దేశాన్నుంచి శ్రీశైలానికి వచ్చి ఇక్కడికీకారణ్యంలో కొండగుహలలో ఒక్కతే ఉంటూ ఆరేళ్ళు తపస్సు చేసింది. శివ సాయుజ్యాన్ని పొందిన ధన్యాత్మురాలనిచెబుతారు. పండితారాధ్యులు కూడా ఇక్కడ నివసించారు. ఆయన ఆశ్రమం అమ్మవారి ఆలయానికి పోయే దారిలోనేఉంటుంది. ఎందరో మహాయోగులు ఇప్పటికీ ఉన్న మహా క్షేత్రమిది.

సోమవారం సాయంత్రానికి బయలుదేరి తిరుగు ప్రయాణం అయ్యాము. దారిలో వస్తుంటే శ్రీశైల శిఖరంకనిపించింది. ఆ శిఖరాన్ని దర్శిస్తే మళ్ళీ జన్మ ఉండదని అంటారు నిజమేనా? అని నాతొ ఉన్న ఒకరు అడిగారు. కావచ్చుఅని క్లుప్తంగా అన్నాను. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అన్న శ్లోకం గుర్తుకొచ్చింది.
శ్రీశైల శిఖరం అంటే యోగిక అర్ధం ఉంది. శ్రీ శైలం అంటే సంపదలతో నిండి ఉన్న కొండ. మన శరీరం సమస్త దేవతా నివాసమైన ఒక అద్భుతం. శరీరమే శ్రీశైలం. ఇందులో దేవతా శక్తుల రూపంలో సమస్త సంపదలూ ఉన్నాయి. దీని శిఖరం అత్యద్భుతమైన రంగులలో వెలుగుతూ ఉండే సహస్ర దళ పద్మం. శ్రీశైల శిఖరం దర్శించటం అంటే సహస్రార చక్రాన్ని చేరుకోవటం. దానిని ధ్యానంలో అందుకున్నసాధకునికి పునర్జన్మ ఉండదు. ఇదే అర్ధం ఈ శ్లోకంలో రహస్యంగా ఇమిడ్చి చెప్పారు. సమస్త దేవతలూ యోగికి తన దేహంలోనే దర్శనం ఇస్తారు.
నిజమే. గమనించగలిగితే అద్బుతాలు అడుగడుగునా కనిపిస్తాయి.