Pages - Menu

Pages

3, డిసెంబర్ 2010, శుక్రవారం

ముఖ్య మంత్రి ప్రమాణ స్వీకార ముహూర్తం - విశ్లేషణ

25-11-2010 మధ్యాన్నం 12-14 నిముషాలకు కొత్త ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేశారు. ముహూర్తాన్ని విశ్లేషణ చేద్దామా?

ముహూర్తం ఎవరు పెట్టారో గాని ఉన్నదాంట్లో చక్కని ముహూర్తమే పెట్టారు. స్థిర లగ్నమైన కుంభాన్ని తీసుకోవడం అందులో గురువు ఉండటం మంచిదే. అన్ని దోషాలు పోగొట్టగలదు అని చెప్పబడే అభిజిత్ ముహూర్తాన్ని ఎంపిక చేసి తద్వారా సమయానికి ఉన్న కొన్ని దోషాలు నివారణ చేసే ప్రయత్నం చేసారు.


లగ్నం
లోని గురువు పంచమాన్ని నవమాన్ని చూస్తాడు కనుక వాటిని కాపాడతాడు. మంత్రాంగం భాగ్య స్తానం బాగుంటాయి. అంటే ప్లానింగ్ మరియు ఫైనాన్స్ రంగాలు రక్షింపబడతాయి. తొమ్మిదింట శుక్రుడు స్వస్తానంలో ఉండటం దీనికి దోహదం చేస్తుంది. అదృష్ట స్థానాన్ని స్త్రీ గ్రహమైన శుక్రుడు కాపాడుతూ ఉండటం ఈయనకు సోనియా ఆశీస్సులు పుష్కలంగా ఉండటాన్ని సూచిస్తున్నది. గురువు లగ్నం లో ఉండటాన్ని బట్టి ఈయనకు కాంగ్రెస్స్ పెద్దల ఆశీస్సులు కూడా దండిగా ఉన్నాయని అర్ధం అవుతున్నది. సప్తమం మీద గురువు దృష్టి వల్ల శత్రువులు నిగ్రహింపబడతారు. ఇతరులతో సంబందాలు నిజాయితీగా ఉంటాయి.

పదింట
రవి- కుజ- బుదులుండటం కూడా మంచిదే. ఇది స్థిర రాశి కావటం వల్ల, రవి కుజులవల్ల హోం శాఖా, వ్యవసాయ రంగం, పరిపాలనా బాగుంటాయి. బుధుని వల్ల వ్యాపారం బాగుండాలని ఈ ముహూర్తం పెట్టారు. ఏకాదశం లో రాహువూ మంచిదే. దీనివల్ల కేంద్రంతో సంబంధాలు బాగుంటాయి. తాగుడు మొదలైన రంగాలవల్ల ఆదాయం బాగుంటుంది. ఇంతవరకూ చక్కని ముహూర్తమే పెట్టారు.

కాని ముహూర్తమైనా నూటికి నూరుపాళ్ళు సర్వలక్షణ సంపన్నంగా ఉండదు. కారణమేమంటే కాలం ఎవ్వరినీ సంపూర్తిగా కరుణించదు. ఏదో ఒక పక్కన కొన్ని బాధలు తప్పకుండా ఉంటాయి. అదే జీవితంలోని విచిత్రం. ఇప్పుడు ముహూర్తం లో గల దోషాలు చూద్దాం.

పంచమం లో చంద్ర కేతువులవల్ల ఎప్పుడూ ఏదో ఒక తలనెప్పి తప్పదు. సమస్యలు హటాత్తుగా తలెత్తుతూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. ఎంతసేపూ ఎత్తులు పైఎత్తులే సరిపోతుంది. మంత్రివర్గంలోని స్త్రీలవల్ల, మహిళారంగంవల్ల విరోధాలు పెరగటం ఉంటుంది. చంద్రునికి షష్టాదిపత్యం రావటం దీనికి సూచన. హోరాధిపతి అయిన చంద్రుడు పంచమంలో కేతుగ్రస్తుడవటం మంచి సూచన కాదు. కాకపోతే దూరంగా ఉన్నాడు గనుక పరవాలేదు.

లగ్నాధిపతి శని అష్టమంలో ఉండటం ఇంకొక చెడు సూచన. దీనివల్ల ఏం చేసినా అనుకున్నంత లాభం ఉండకపోవచ్చు. మిత్రులకోసం తను నష్టపోయే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాని గుడ్డిలో మెల్ల ఏమంటే ఆయన మిత్రస్థానంలో ఉండటం వల్ల చివరికి సామరస్యంగా పనులు పూర్తి అవుతాయి. అక్కణ్ణించి ఆయన దశమ స్థానంలో ఉన్న మూడు గ్రహాలను చూస్తున్నందువల్ల, తన పదవికి భంగం కలుగకుండా ఉండేవిధంగా మంత్రివర్గాన్ని నియంత్రిస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుంది. అంటే నిరంతర ఎత్తులు పైఎత్తులు మార్పులు- చేర్పులు- సర్దుబాట్లు తప్పవు.

శనిదృష్టి పంచమంలోని చంద్ర కేతువులమీద ఉన్నందువల్ల ఎప్పుడూ ఆత్మరక్షణ వ్యూహాలే సరిపోతాయి. మంత్రులను కంట్రొల్ చెయ్యటానికి చాలా ప్రయత్నాలు చెయ్యటం నిత్యకృత్యం అవుతుంది. ఫైనాన్స్ రంగం అంతగా రాణించదు. ధరలు అదుపులో ఉండవు. నవాంశలో వ్యాపారకారకుడైన బుధుడు నీచలో ఉండటం దీన్ని బలపరుస్తున్నది. శని రాహువులు కలిసి ఉండటం వల్ల బలమైన రహస్యశత్రుబాధ మిక్కుటంగా ఉంటుంది.

ఇంటా బయటా సమస్యలను ఎదుర్కొంటూ ప్రతిరోజూ ఎత్తులతో పరిపాలన సాగవలసిందే అని ముహూర్తం చెబుతున్నది.

ప్రస్తుతం గురువులో శని దశ 2013 వరకూ జరుగుతున్నది. ఇది మంచి దశ కాదు. గురు శనులిద్దరూ షష్టాష్టకంలోఉన్నారు. ఇలాటి సమయంలో పరిపాలన మొదలు కాబోతున్నది. ఇది అంతగా మంచి సూచన కాదు. అనుకున్న అన్ని పనులూ చెయ్యటం సాధ్యం కాదు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకోటమూ కష్టమే. కష్టం ఎక్కువ ఫలితం తక్కువా అన్నట్లు పరిపాలన సాగుతుంది. ఉన్నంతలో ఇంతకంటే మంచి ముహూర్తము దొరకటమూ కష్టమే. ఏంచేస్తాం మన రాష్ట్ర పరిస్థితికి ఈ ముహూర్తం అద్దం పడుతున్నది.