Pages - Menu

Pages

5, జనవరి 2011, బుధవారం

విశ్వాత్మగారితో పరిచయం

మొన్న రెండో తేదీన విజయవాడ పుస్తక మహోత్సవానికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఏడాది అదొక అలవాటు అయింది. కొన్నా కొనకపోయినా పుస్తకాభిమానుల మధ్యన తిరుగుతుంటే ఆనందంగా ఉంటుంది. ఏడాది అనుకోకుండా ఒక విశిష్టవ్యక్తి పరిచయం కలిగింది. ఆయనే విశ్వాత్మ గారు.

పుస్తక మహోత్సవానికి నేను, మాధవ్, తమ్ముడు సుబ్రహ్మణ్యం కలిసే వెళ్ళాము. అక్కడ నవ్వులాట శ్రీకాంత్, హేమచంద్ర కలిశారు. అనుకోకుండా తమ్ముడు రామాంజిబాబు కూడా కలిశాడు. అనుకోకుండా జరిగేవే ఆనందాన్ని ఎక్కువగాఇస్తాయి. అందరం చక్కగా మాట్లాడుకుంటూ కాలం గడిపాము. ఎవరికి కావలసిన పుస్తకాలు వారు కొనుక్కున్నారు. శ్రీకాంత్ గారు వ్రాసిన " నవ్వులాట " పుస్తకం కూడా రిలీజ్ అయ్యి స్టాల్స్ లో ఉన్నది. హైదరాబాద్ పుస్తక మహోత్సవంకంటే విజయవాడ మహోత్సవం చాలా పెద్దది. స్టాల్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను మొన్నీ మధ్యనే హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి వెళ్లి వచ్చాను గనుక తేడా బాగా కనిపించింది.

కీ.శే. దివాకరుని వెంకట సుబ్బారావు గారు గొప్ప జ్యోతిష పండితులు పరిశోధకులూను. మనకు ఇప్పుడు వస్తున్న ఎన్నోజ్యోతిష్యసందేహాలను ఆయన గతతరంలోనే పరిశోధించి, పరిశీలించి, పరిష్కరించారు. ఆయన చాలా పుస్తకాలు వ్రాశారు. కాని అవి ఇప్పుడు ముద్రణ లో లేవు. ఆయన నాడీ విధానం మీద కూడా బాగా పరిశోధన చేశారని అంటారు. మధ్యనే ఆయన వ్రాసిన ' లగ్న నాడి' అనే పుస్తకం మళ్ళీ ముద్రణలోకి వచ్చింది అని శ్రీకాంత్ గారు చెప్పారు. ఏ స్టాల్ లో ఉందొ కూడా ఆయనే చెప్పారు. ఆయనకు చాలా మంది పబ్లిషర్స్ తెలుసు. మేమిద్దరం చెరొక కాపీ కొనుక్కున్నాము.

కొద్దిసేపు తిరిగిన తర్వాత గ్రౌండ్ మధ్యలో కూచుని టీలు తాగుతూ మాట్లాడుకుంటున్నాం. శ్రీకాంత్, హేమచంద్రలు టీలు తాగరు. కాని ఆ సంగతి తెలియక ఆర్డర్ చేసాము. సరే చేసేదేముంది అని నేను రెండు టీలు తీసుకున్నాను. రెండుచేతులతో రెండు టీలు తాగుతుంటే నాకొకవిషయం గుర్తొచ్చింది. చువాన్ జు అనే తావోఇస్ట్ మాస్టర్ తానొక సీతాకోక చిలుకగా మారినట్లు కలగని, మేలుకున్నతర్వాత అసలు తాను మనిషినా సీతాకోక చిలుకనా అన్న సందేహానికి లోనయ్యాడు. అలాగే నేనూ చేత్తో టీని ముందుగా తాగుతున్నానా మర్చిపోయి సందిగ్ధం లో పడ్డాను. అదే విషయం సరదాగా పైకి చెప్పాను. "అసలు తాగుతున్నది నేను కాదు అనుకుంటే సరి" అని తమ్ముడు రామాంజిబాబు సలహా ఇచ్చాడు. ఇది అమనస్క యోగంలోని భావన. వేదాంత పరంగా అది నిజమేగా మరి. అందరూగట్టిగా నవ్వుకున్నాం.

సందర్భంగా నాకింకొక సంఘటన గుర్తుకొచ్చింది. శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన తురీయానందగారి జీవితం లోనో లేక ప్రేమానందగారి జీవితంలోనో అనుకుంటాను చివరిలో ఒకసంఘటన జరిగింది. ఆయన మరణశయ్య మీదున్నారు. శిష్యుడు గొంతులో నీరుపోస్తున్నాడు. అప్పుడు స్వామి" బ్రహ్మాన్ని బ్రహ్మంలో పొయ్యి " అన్నారు. సర్వం బ్రహ్మమే అన్న ఉత్కృష్టభావనాస్థితిలో ఆయన సమయంలో ఉన్నారు. సంఘటనను అన్వయించుకుంటూ- "తాగుతున్న నేను, తాగబడుతున్న టీ అన్నీ బ్రహ్మమే అన్న భావన ఇంకా శ్రేష్టం కదా" అని నేనన్నాను. ఇది పూర్ణయోగంలోని భావన. ఇదీ బాగానే ఉందని అనుకున్నాం.

"తెనాలి రామకృష్ణుని తలచుకొని రెండు గ్లాసులూ ఒకేసారి తాగమని" శ్రీకాంత్ గారు తన సహజహాస్యధోరణిలో అన్నారు. అందరం మళ్ళీ నవ్వుకున్నాం. కాని నేను బయటకుచెప్పని ఇంకొకభావన నాలోనే ఉండిపోయింది. అసలు టీని ఇంకొక పదార్ధమని ఎందుకు అనుకోవాలి? టీ అనేది టీ నే. నేను నేనే. చేత్తో తాగితే ఏమైంది? నేను సమయంలో టీతాగుతున్నాను. అంతే. అప్పుడు ఇంకొక ఆలోచన ఎందుకు ? దానికి అన్వయాలు ఎందుకు? ఇలా అనుకుంటూ రెండు టీగ్లాసులూ రెండు చేతులతో పట్టుకుని తాగేశాను. ఇది జెన్ భావన.

ఇలా చక్కగా వేదాంతభావాలలో ఆనందంగా తేలుతూ ఉండగా 'విశ్వాత్మ గారొచ్చారు' అని శ్రీకాంత్ గారు గబగబా నడుచుకుంటూ ఒకవైపుగా వెళ్ళారు. ఎవరా అని చూడగా దూరంగా ఒక స్టాల్ లో ఒక ఆజానుబాహువైన కాషాయ వస్త్రధారి ఏవో పుస్తకాలుచూస్తూ కనిపించారు. మేమూ నిదానంగా నడుస్తూ ఆయన ఉన్న చోటికి వెళ్ళాము. ఆయనే విశ్వాత్మ గారు.

తరువాత విశ్వాత్మ గారితో జరిగిన ఉత్తేజకరమైన చర్చలో రెండు గంటల సమయం ఎలా గడిచి పోయిందో తెలియలేదు. వివరాలు తరువాతి పోస్ట్ లో.