నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, జనవరి 2011, బుధవారం

బ్రాహ్మణ ద్వేషం-మన దేశానికి శాపం

దేశంలోని ప్రతి సమస్యకూ బ్రాహ్మణుల్ని కారణాలుగా చూపిస్తూ వాదించే ఒక మూర్ఖ వాదం చాలా రోజులనుంచికనిపిస్తూనే ఉంది.ఇది కొత్త కాదు. దానికి ముఖ్య కారణం అకారణ ద్వేషం, అసూయా, ఓర్వలేనితనం తప్ప ఇంకేమీ కావు.

తరతరాలుగా సాగుతున్న దుష్ప్రచారానికి తెరపడాలంటే బ్రాహ్మణులు వాదానికి ఎదురు తిరగాలి. అదే జరగాలంటేముందుగా తమ మీద జరుగుతున్న దుష్ప్రచారానికి ఎంతవరకు ప్రామాణికత ఉన్నదో బ్రాహ్మణులు తెలుసుకోవాలి. ప్రచారంలో ఎంత నిజం ఉందో కూడా వాళ్ళు గ్రహించాలి. దానికోసం తమ పురాణాలనూ శాస్త్రాలనూ తిరిగి చదవాలి. అప్పటి సామాజిక పరిస్థితుల్ని చక్కగా అర్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ ద్వేషపూరిత దాడిని సమర్దవంతంగా ఎదుర్కొగలుగుతారు.

ఎవరు ఎన్ని విధాలుగా బురద చల్లాలని చూచినా బ్రాహ్మణులవల్లనే భారతదేశ సంస్కృతి నిలబడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. వారిని విమర్శించే ఒకే ఒక్క విషయం. అంటరానితనం పాటించారని. మరి నాదొక్క సందేహం. నిమ్న కులాలని చెప్పుకుంటున్నవారిలో ఏదైనా ఒక కులం కొంచెం ఎదిగితే తమకన్న నిమ్న కులాలను వారితో సమంగా చూస్తున్నారా? లేదుకదా. నిమ్నకులాల మధ్యనకూడా ఎక్కువాతక్కువా తేడాలున్నాయి కదా. మరి వాళ్ళుకూడా తమ మధ్యలోనే వివక్షతను పాటిస్తూ ఒక్క బ్రాహ్మణులను మాత్రమే ఈ విషయంలో తరతరాలుగా విమర్శించడం ఎందుకో? ఎందుకంటే- ఎవరు ఏమన్నా బ్రాహ్మణులు నోరుమూసుకుని పడిఉంటారని, పోనీలే వాడి ఖర్మకు వాడే పోతాడు అని కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఊరుకుంటారనీ అందరికీ తెలుసు కాబట్టి.

కాని ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే- తమపైన మోపబడుతున్న నిందలను అన్నింటినీ నిజాలేనని బ్రాహ్మణులే నమ్మే స్థాయికి పరిస్తితి దిగజారింది. దానికి కారణం ప్రాచీన సమాజం లోని పరిస్థితులు, కట్టుబాట్లు, వ్యవస్థలను ఇప్పటి తరంవాళ్ళు అధ్యయనం చెయ్యకపోవటం. ప్రస్తుత సామాజిక సిద్ధాంతాలను పరిస్తితులను దృష్టిలో పెట్టుకుని, ప్రాచీన కాలపు పరిస్తితులు సరిగా అర్ధం చేసుకోకుండా, ప్రతిదానికీ బ్రాహ్మణులను బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానాలు చేయ్యబోవటమే ఈ అపార్ధాలకు కారణం. అసలు నిజమేమంటే, ఆ అపవాదులన్నీ నిజాలు కావు. వాటిల్లో అవగాహనా రాహిత్యమూ, అసూయాద్వేషాలపాళ్ళే ఎక్కువ. అప్పటి సామాజికన్యాయాన్నీ, కాలమాన పరిస్థితులనూ, వ్యవస్థనూ అర్ధం చేసుకోకుండా మాట్లాడే పిచ్చివాగుడే ఈ విమర్శలకు కారణం.

మొదటినుంచీ దేశాన్ని దోచుకున్నది, నేరాలు చేసింది , విదేశీరాజులను ఆహ్వానించి మన గుట్లు వాళ్లకుచెప్పి రాజ్యాలు కట్టబెట్టింది బ్రాహ్మణులు కాదు. వెయ్యిసంవత్సరాల బానిసత్వానికి కారకులు బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులను ఇప్పుడు విమర్శిస్తున్న వారివల్లే
ఖచ్చితంగా ఇవన్నీ జరిగాయి. కాని తెలివిగా దోషాన్ని ఒక్క బ్రాహ్మణులమీదే మోపుతున్నారు. బ్రాహ్మణులెప్పుడూ సమాజ హితాన్నే కోరుకున్నారు. అందరూ బాగుండాలన్న ప్రార్ధనతోనే వారి దినచర్య మొదలవుతుంది, ముగుస్తుంది.

బ్రాహ్మణులు అధికారంలో ఉన్నపుడు ఎన్నడూ అధికార దుర్వినియోగం చెయ్యలేదు. సమాజాన్ని విచ్చలవిడిగా దోచుకోలేదు. ఆస్తులు వెనకేసుకోలేదు. అడ్డగోలుగా అవినీతిని ప్రోత్సహించలేదు. కనీసం వాళ్ల కులాన్ని వాళ్ళు బాగుచేసుకోలేదు. అది వాళ్ళు చెయ్యలేరు. వాళ్ళు సహజంగానే ధర్మాన్ని అనుసరిస్తారు ఆచరిస్తారు. దైవానికి భయపడతారు. ధర్మానికి భయపడతారు. నీతికి నిజాయితీకి తలొగ్గుతారు. దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఇహం కంటే పరానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. ఈ గుణాలు సహజంగానే తరతరాలుగా వాళ్లలో ఉంటాయి.

బ్రాహ్మణుల్లో దుర్మార్గులు దుర్నీతిగలవారూ లేరా? అంటే లేరని నేను చెప్పను. తప్పకుండా ఉన్నారు. కాని స్వార్ధం పాళ్ళు వాళ్ళలో బాగా తక్కువనే చెప్పాలి. బ్రాహ్మణుడు దారితప్పితే అది స్వతహాగా జరుగదు. అదికూడా ఇతరస్నేహితుల సాంగత్యంతోనూ, ప్రోద్బలంతోనే, జరుగుతుంది గాని సహజంగా అతడు ధర్మాన్ని తప్పటానికి ఇష్టపడడు. ఇంకొకళ్లని దారితప్పమని ప్రోత్సహించడు. అవసరమైతే పస్తుంటాడుగాని ఇంకోణ్ణి దోచుకోని ఆస్తులు కూడబెట్టాలని, పైరవీలు చెయ్యాలనీ, పక్కవాడి నోరుకొట్టి విలాసంగా బతకాలనీ అతడు ఆశించడు. నిరాడంబరంగా బతకటం, పేదరికంలో బతకటం వాళ్లకు కొత్తేమీ కాదు.

బ్రాహ్మణజాతి దేశాన్ని దోచుకోవాలని ఎన్నడూ అనుకోలేదు.అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలని ఎన్నడూ అనుకోలేదు. దేశాన్ని పరాయిపాలకులకు తాకట్టుపెట్టాలనీ అనుకోలేదు. దొంగతనాలు, దోపిడీలు, నేరాలు, చేసి బ్రతకలేదు. వాళ్ల బ్రతుకు వాళ్లు బ్రతుకుతూ తమ సంఘంలోనే తిరస్కరణకు గురవుతూ, చెయ్యని నేరాలకు తిట్లు భరిస్తూ, ఎదురుగా నమస్కారం పెట్టినవాళ్ళే వీపు చాటున హేళనగా మాట్లాడినా తిట్టినా మౌనంగా సహిస్తూ, సమాజ హితాన్ని కోరుకుంటూ, ఎవరి సపోర్టూ లేకుండానే
ఈదేశపు సంస్కృతిని తరతరాలుగా పోషిస్తున్నది వాళ్ళుగాక ఇంకెవరు?

వేదాలు వింటే చెవుల్లో సీసం పొయ్యమన్నారనీ, వర్ణవ్యవస్థను రూపకల్పన చేశారనీ, అంటరానితనాన్ని పోషించారనీ, సామాన్యంగా వారిపైన వేసే నేరారోపణలు. ఈ నేరారోపణలు చేసేవారికి ఏ మాత్రం జ్ఞానం లేదన్న విషయం ముందుముందు నేను వ్రాసే పోస్ట్ లలో తేటతెల్లంగా నిరూపిస్తాను. శ్రీరాముడు శంబుకుణ్ణి వధించడం తప్పనీ అందువల్ల అతడు అవతారం కాదన్న వాదనకూడా తెలివితక్కువ-ద్వేషపూరిత-అజ్ఞానజనిత వాదనే. ఎలాగో ముందుపోస్ట్ లలో వ్రాస్తాను.

బ్రాహ్మణద్వేషం ఇతర రాష్ట్రాలకంటే తమిళనాడులో మహా ఎక్కువ. దానికి ప్రత్యేక కారణాలేమీ కనిపించవు. సాధారణంగా తమిళులకుండే అతిపైత్యమూ, పెడసరపు ధోరణులే దీనికి కారణం.

ప్రజాస్వామ్యం అరవైఏళ్ళుగా పరిఢవిల్లుతున్నా కూడా ఇంకా ఒకకులాన్ని పాతకాలపు లోపాలు చూపి ఆడిపోసుకోవటం ఎంతవరకు న్యాయం?