Pages - Menu

Pages

2, ఫిబ్రవరి 2011, బుధవారం

జెన్ కథలు - పళ్ళెం శుభ్రం చెయ్యి

కొత్తగా ఆశ్రమంలో చేరిన ఒక భిక్షువు, జెన్ మాస్టర్ జోషును సమీపించి ఇలా అడిగాడు.
"నేను ఆశ్రమం లో కొత్తగా చేరాను. ధ్యానం లో ప్రధమ సూత్రాన్ని నేర్చుకోవాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది. అదేమిటో చెప్తారా?"
జోషు అతని వైపు చూశాడు.
"భోజనం చేశావా" అడిగాడు జోషు.
"చేశాను" చెప్పాడు శిష్యుడు.
"అయితే నీ పళ్ళెం శుభ్రం చెయ్యి" అన్నాడు జోషు.
------------------------------------------------------------------------------------------
అనవసరమైన సిద్ధాంత రాద్ధాంతాలకు జెన్ దూరం గా ఉంటుంది. జెన్ విధానం అతి సరళం. అందుకనే అతికష్టం కూడా. ఎందుకంటే జీవితంలో అతి సింపుల్ గా ఉండేవాటి విలువను గ్రహించాలంటే అతి లోతైన దృష్టి ఉంటేనే సాధ్యపడుతుంది. ఊహల్లో విహరించేవారిని జెన్ నేలమీదకు దించి నడిపిస్తుంది. ఎందుకంటే ఊహల్లో ఉండేవారికి సత్యం కనిపించదు.

మనుషులు సరళత్వాన్ని ఇష్టపడరు. కాని అలా నటిస్తారు. సరలత్వాన్ని అభిమానిస్తారు. కాని ఆచరించరు. ఎందుకంటే దానిని ఆచరించాలంటే ఎన్నింటినో వదులుకోవాలి. అలా వదులుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే అతి సరళమైన జెన్ విధానం ఆచరణకు కష్టంగా తోస్తుంది. ఏవేవో ఊహించుకుంటూ భావరాజ్యంలో విహరించేవారికి జెన్ బోధపడదు. ఎందుకంటే సత్యం కళ్లెదుటనేఉంది. కళ్ళు తెరిచి చూడగలిగితే సత్యం చక్కగా కనిపిస్తుంది. కాని కళ్ళు తెరవటమే అతి కష్టం. మూసిన కళ్ళు తెరిస్తే సాధన అయిపోయినట్లే. ఆ తెరవడానికే అనేక జన్మలు పడుతుంది.

కొత్తగా చేరిన శిష్యుడు ధ్యాన మార్గంలోని ప్రధమ సూత్రాన్ని తెలుసుకోవాలని తలచాడు. గురువుగారు తనకి ఏదోమంత్రాన్నో, ధ్యానవిదానాన్నో ఉపదేశిస్తారని తలచాడు. అలా ఆశించడమే అతని పొరపాటు. గురువు చెప్పబోతున్న బోధ తన ఆలోచనకు అనుగుణంగా ఉండాలని అతను అనుకోవడమే తప్పు. కాని అందరు శిష్యులూ ఇలాగే ఆశిస్తారు. ఏదో గొప్ప ధ్యానక్రియను నేర్చుకోవాలని వారు ఆశిస్తారు. అన్ని క్రియలకూ అతీతమైనది జెన్ విధానం. ఇది ఏదో బయటి అనుభవాన్ని నీకివ్వదు. దేన్నో అనుభవించాలని ఆశిస్తున్న నిన్నే కరిగిస్తుంది. నిన్ను లేకుండా చేస్తుంది. తద్వారా ఉన్నదేదో అదే మిగులుతుంది. ఓపెన్ మైండ్ తో గురువును సమీపించగలిగితే కిటుకు చిటికెలో అర్ధమౌతుంది. తెలియనంతవరకూ బ్రహ్మ విద్య తెలిస్తే కూసువిద్య అన్న సామెత అందుకే వచ్చింది.


ఎదురుగా ఉన్న పనిని చెయ్యటమే ధ్యానంలో ప్రధమ సూత్రం. అది వదిలిపెట్టి, ఏవో లోకాల్లో విహరించటం జెన్ విధానం కాదు. విధమైన ఉపదేశం ద్వారా ప్రతి నిముషం ఎరుకలో జీవించమని, వర్తమానం లో జీవించమని జోషు శిష్యునికి బోధిస్తున్నాడు. అలా ఉండగలిగినవానికి జీవితంలో చీకటి ఉండదు. ఎరుక అనే వెలుగు ప్రతి క్షణం అతన్ని ఆవరించి ఉంటుంది. జెన్ విధానం ఎరుకతో అనుక్షణం జీవించటమే. అనుక్షణం వర్తమానంలో ఉండటమే.

ఎరుకతో బ్రతకగలిగితే మనస్సు ప్రతి క్షణం వర్తమానం లోనే ఉంటుంది. అది గతం లోనో లేక భవిష్యత్తుకు చెందిన ఊహల్లోనో ఉండలేదు. ప్రతి క్షణం ఎరుకతో ఉండగలిగిన మనిషి తన సహజ స్థితిలోనే నిరంతరం ఉంటాడు. రమణమహర్షి దీనిని సహజ సమాధి అని పిలిచారు. అట్టివాడు దర్శనాలకు కూడా అతీతమైన భూమికను అందుకుంటాడు. ఎల్లప్పుడూ తనలో తాను మునిగి ఉండేవాడు ఆత్మనే ఆరామముగా కలిగిన వాడౌతాడు. ఆత్మారాముడౌతాడు .

జోషు బోధనలో లోతైన అర్ధం దాగుంది. భోజనం చెయ్యటం అంటే కర్మను పోగు చేసుకోవటం. ఇంద్రియముల ద్వారా నిత్యమూ సమస్త సమాచారాన్ని లోనికి స్వీకరిస్తూ ఎప్పుడూ మనం భోజనం చేస్తూనే ఉన్నాం. భోజనం చెయ్యటానికి మనస్సు అనే ప్లేటును వాడుతూ దానిద్వారా మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. ప్రక్రియలోమనస్సు అనే ప్లేటు ఎంగిలి అవుతున్నది. దాని నిండా రకరకాల సాంబారు, రసం, కూరలు, పప్పు, పెరుగు ఇత్యాదిమరకలు నిండి ఉన్నాయి. మరకలతో నిండి, వాసనలతో నిండి, మనస్సు కంపు కొడుతున్నది. తన స్వచ్చమైన స్వభావాన్ని ప్రతిఫలించలేక పోతున్నది. దానిని శుభ్రం చెయ్యగలిగితే, ఎంగిలిని కడిగి వెయ్యగలిగితే, పళ్ళెం మళ్ళీ మిలమిలా మెరుస్తుంది. అలా శుభ్రం చెయ్యటమే సాధన. నిరంతరం ఎరుకతో ఉండటమే సాధన. అలా చెయ్యటం ద్వారా మనస్సుఅనే పళ్ళెం శుభ్రం చెయ్యబడుతుంది.

నిరంతరం ఎరుకతో బ్రతకటం ద్వారా, ఊహల్లో విహరించకుండా తన ఎదురుగా ఉన్న పనిని చెయ్యటం ద్వారా వర్తమానం లో జీవించమని జోషు ఒక గొప్ప ఉపదేశం ఇచ్చాడు. శిష్యుడు ధ్యానం లో మొదటి సూత్రాన్నికోరుకున్నాడు. కాని జోషు అతనికి అంతిమ సూత్రాన్ని ఉపదేశం చేశాడు.

జెన్ లో ఎన్నో అడుగులు ఉండవు. ఒకే అడుగుతో గమ్యాన్ని చేరుకోవచ్చు. జెన్ లో ప్రధమ ఉపదేశమే అంతిమఉపదేశం. ఎవరి పళ్ళెం వారు శుభ్రం చేసుకుంటే సర్వం సమాప్తం అవుతుంది. ఇక తర్వాత మిగిలేది మౌనమే. తన స్వస్తితిలో నిరంతరమూ ఉండగలిగితే ఇక చెయ్యటానికి ఏమున్నది? పొందగలిగేది ఏమున్నది?