నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆయన త్వరగా వచ్చుచున్నాడు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప మూఢ నమ్మకాలలో-- ఆయన మళ్ళీ వచ్చును-- అనేది అతి గొప్ప హాస్యాస్పదమైన నమ్మకం. తాము నమ్మిన మహాత్ముడు మళ్ళీ పుడతాడని ఎదురుచూస్తూ బతకటం అందులో ప్రధానమైన అంశం. ఇదెప్పటికీ జరగదు, జరుగలేదు, జరుగబోదు అన్నది నగ్న సత్యం.

పునర్జన్మను నమ్మని సెమెటిక్ మతాలూ ఈ నమ్మకానికి మినహాయింపు కాదు. ఉదాహరణకి క్రైస్తవాన్ని చూద్దాం. వాళ్ళ నమ్మకం ప్రకారం రెండోసారి వచ్చినపుడు జీసస్ మేఘాల్లోంచి దిగివస్తాడు. మేఘాల్లోనుంచి వచ్చినా, భూమ్మీద నడుచుకుంటూ వచ్చినా, రెండోసారి రావడం మాత్రం తప్పనిసరి. ఒకసారి చేయించుకున్న పరాభవం చాలదన్నట్లు ఆయన మళ్ళీ రావాలి మనకోసం!!! మనమేమో ఈలోపల కొత్త మేకులూ సుత్తీ రెడీ చేసుకుందాం. "ఆయన త్వరగా వచ్చుచున్నాడు"-- అని రెండువేల సంవత్సరాల నుంచీ క్రైస్తవ సోదరులు మైకుల్లో అరుస్తూనే ఉన్నారు. ఎటునుంచి వస్తున్నాడో గాని, ఆయన జాడ మాత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు. రెండువేల ఏళ్లనుంచీ నడిచీ నడిచీ ఆయనకు కాళ్ళు నొప్పి పుట్టి ఎక్కడన్నా కూచున్నాడేమో తెలియదు.

ముస్లిములలో కూడా ఇలాటి నమ్మకమే ఒకటి ఉంది. మహమ్మద్ ప్రవక్త తర్వాత పన్నెండుమంది ఇమాం లు రాజులుగా పరిపాలించారు. వాళ్ళలో పన్నెండో ఇమాం (బారా ఇమాం) ఒకరోజున ఏమయ్యాడో పత్తా లేకుండా మాయమైపోయాడు. బహుశా రాజకీయ కారణాలవల్ల ఆయన రహస్య హత్యకు గురయ్యాడో, లేక రాజ్య నిర్వహణా గొడవలుభరించలేక బుద్దుడిలా రాత్రికి రాత్రే ఇల్లొదిలి పారిపోయాడో ఎవరికీ తెలియదు. వాళ్ళు మాత్రం అల్లా ఆయన్ను దాచిపెట్టాడని నమ్ముతున్నారు. సరియైన సమయంలో అల్లా ఆయన్ని రిలీజ్ చేస్తాడనీ, ఆయనొచ్చి ప్రపంచాన్ని ఇస్లాంమయంగా మారుస్తాడనీ వాళ్ళ నమ్మకం. అప్పటినుంచీ ఆయన మళ్ళీ వస్తాడని వాళ్ళంతా చకోరపక్షుల్లా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. షియా ముస్లిములలో ఇదొక నమ్మకంగా ఈనాటికీ కొనసాగుతూ ఉంది. ఆయన అడ్రస్ మాత్రం కనిపించటం లేదు.

హిందువుల్లో అయితే అధర్మం బాగా పెరిగిపోయినప్పుడల్లా భగవంతుడు అవతార రూపంలో వచ్చి కాపాడతాడని నమ్మకం గట్టిగా ఉంది. మనకి మహనీయులు మహాత్ములు చాలరు. సాక్షాత్తూ భగవంతుడే దిగి వస్తే గాని మనం సాగిస్తున్న అధర్మానికి అడ్డుకట్ట వెయ్యలేడు. మన అధర్మం లెవెల్ ఆ స్థాయిలో ఉంటుంది. అందుకేనేమో స్విస్ బాంకు లో అందరికన్నా మన భారతీయుల ఖాతాలే ఎక్కువట. చెప్పేదొకటి చేసేదొకటి అనే విషయంలో పోటీ పెడితే భారతీయులే ప్రపంచం మొత్తానికీ ప్రధమస్థానం లో ఉన్నారట కూడాను.

అదలా ఉంచితే, అధర్మం పెరిగినప్పుడల్లా దేవుడే వచ్చి దాన్ని అంతం చేస్తాడు అనే నమ్మకానికి భగవద్గీతా శ్లోకం ఒకటి ఆధారంగా ఉంది. అంటే, భగవంతుని అవతారం రావాలంటే మనవంతుగా మనం అధర్మాన్ని గట్టిగా పెంచి పోషించాలన్నమాట. రకంగా చూస్తే, మన సమాజం సరియైన దారిలోనే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. పైగా దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. అధర్మాన్ని అంతం చెయ్యటం మన పని కానే కాదు. అది భగవంతుడి పని. దాన్ని బాగా పెంచి పెంచి తీవ్ర స్థాయికి చేర్చడమే మన పని. తరువాత విషయం చూసుకోటానికి దేవుడెలాగూ ఉన్నాడు. మనం పెంచే అధర్మాన్ని తుంచటం తప్ప ఆయనకీ వేరే పనీ పాటా ఏముంది గనక.

భగవంతునికి
తన భక్తులకన్నా, విరోదులంటేనే ఎక్కువ ఇష్టమట. రావణుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల వంటి మహా రాక్షసులు వైరభక్తితో ఆయన్ను కలలో కూడా మరిచిపోకుండా నిత్యం స్మరిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మామూలు సాదాసీదా భక్తులకంటే త్వరగా చేరుకున్నారట. బైబిల్లోని ప్రాడిగల్ సన్ కధకూడా ఇదే పాయింటుని నొక్కి చెబుతుంది. అంటే, నేడు వార్తల్లోని ప్రముఖ అవినీతిపుంగవులూ, నేరచరిత్రాఘనులూ అందరూ భగవంతుని ప్రియ భక్తులని, ఋషులనీ మనం అర్ధం చేసుకోవాలి. మన అజ్ఞానంవల్ల , వాళ్ళ బృహత్ ప్రణాళిక మన బుర్రకు ఎక్కటం లేదు. అధర్మాన్ని బాగా పెంచడం ద్వారా భగవంతుని రాకడకు సర్వం సిద్ధం చేస్తున్న మహర్షులు వీరంతా అని మనం నమ్మాలి.

పాపం, బౌద్ధులు కూడా దీనికి అతీతులు కారు. బౌద్ధం అనాత్మవాదం. వారు ఆత్మ ఉన్నదని నమ్మరు. కాని పునర్జన్మను నమ్ముతారు. అదేమి వింతో తెలియదు. ఆత్మ లేనప్పుడు మరి పుట్టేదేమిటి అంటే, వారివద్ద సమాధానం లేదు. " మైత్రేయ " అనే అవతారంగా బుద్ధుడు మళ్ళీ పుడతాడని గత రెండువేల అయిదువందల సంవత్సరాలనుంచీ (?) బౌద్ధులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన జాడా జవాబూ మాత్రం ఇంతవరకూ ఎక్కడా లేదు.

కల్కి అవతారం వస్తుందని హిందువుల నమ్మకం. ఆయన గుర్రాన్నేక్కి కత్తి ఝుళిపిస్తూ వస్తాడని ఒక నమ్మకం. విమానాలూ, రాకెట్లూ, గైడెడ్ మిస్సైళ్ళూ, ఆటం బాంబులూ ఉన్న ఈ కాలంలో గుర్రమెక్కి కత్తిచేత బట్టుకొని వస్తే ఏం ఉపయోగం ఉంటుంది? ఇదంతా పురాణకాలంలో వాళ్ళు ఊహించుకున్న కల్పన అనీ, ఆ కాలానికి గుర్రమూ కత్తీ గొప్ప ఆయుధాలు గనక అలా ఊహించారు, కాని అది నిజం కాదు అన్న వాస్తవం మనం ఎప్పుడు గ్రహిస్తామో ఏమో? అదలా ఉంచితే -- ఈ లోపల, సందట్లో సడేమియా అంటూ, కల్కి అవతారం నేనే అని చెప్పి కొందరు స్వాములు చక్కగా కోట్లు వెనకేసుకోవడం మాత్రం స్పీడుగా జరిగిపోయింది.

ఒకసారి పోయిన వ్యక్తి మళ్ళీ రావడం అసాధ్యం అని జనాలందరూ ఎప్పుడు అర్ధం చేసుకుంటారో భగవంతునికే తెలియాలి. ఒకవేళ వచ్చినా అదే వేషంలో రావటం అసంభవం. ఇప్పటివరకూ అలాటి దాఖలాలు ఎక్కడా లేవు. వచ్చిన వ్యక్తిని ఆయన పాత భక్తులు గుర్తు పట్టటమూ అసంభవమే. చాలా సార్లు కొత్త వ్యక్తి తన పాత భక్తుల చేతిలోనే పరాభవానికి గురవడం జరుగుతుంది. అదే సృష్టి వింతల్లో ఒకటి.

జనాన్ని ఉద్దరించాలనుకోవటం మహనీయుల గ్రహచారం. మహనీయుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకోవటం జనాల అజ్ఞానం. పిచ్చి లోకాన్ని దేవుడే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉద్దరిస్తూ ఉండాలి.

నిజంగా ఉద్దరించబడాలని తపన ఉన్నవాడు ఏదో అవతారం వస్తుందనో, మహనీయులు మళ్ళీ పుడతారనో ఎదురుచూస్తూ సమయాన్ని వ్యర్ధం చెయ్యడు. తాను వచ్చిన పని మౌనంగా పూర్తి చేసుకుంటాడు. ఇప్పటికే టన్నుల కొద్దీ ధార్మిక బోధలు ప్రపంచమంతా ఉన్నాయి. వాటిలో కొన్నైనా అనుసరిస్తే చాలు. ఏ మహానీయుడూ అవసరం లేదు. కాని నిజాలు ఎవరిక్కావాలి? మన పిచ్చి నమ్మకాలే మనకు శ్రీరామరక్ష.

సత్య సాయి పోయీ పోక ముందే అక్కడెక్కడో ఇద్దరు పిల్లలు పుట్టారని, వాళ్ళ రూపంలో ఆయనే మళ్ళీ పుట్టాడని, ఆ పిల్లలకు పూజలు మొదలు పెట్టారట. ఈ భయానక పిచ్చికి అంతం లేదేమో అనిపిస్తుంది. ఇక్కడేమో ఆకాశంలో చంద్రుడు కనిపించాడని భక్తులు గుడ్డలు చించుకుంటున్నారు. చంద్రుడు ఆకాశంలో కనిపించక, నేలమీద కనిపిస్తాడా? చాలా సార్లు పగలు కూడా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు. కనిపిస్తాడు. అదేమీ ప్రపంచ వింత కాదు.

ఓ మహానీయుల్లారా. వింటున్నారా? త్వరగా పుట్టండి మరి. మీ భక్తులు మీకోసం సుత్తీ మేకులూ పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఏంటీ? మమ్మల్ని చూస్తె మీకు భయమేస్తోందా? ఈ పాడు లోకానికి రావాలని లేదా? అదా అసలు సంగతి. డామిట్. కధ అడ్డం తిరిగిందే. ఇప్పుడెలా?