Pages - Menu

Pages

21, మే 2011, శనివారం

లోమశ సంహిత -- అరిష్ట ప్రకరణం

మానవులకు మరణాన్ని గురించి చాలా సందేహాలుంటాయి. కొందరు బలవన్మరణాలు పొందుతూ ఉంటారు. ఇంకొందరు చాలా హాయిగా పోతుంటారు. కొందరు దాదాపు నూరేళ్ళు జీవిస్తారు. ఇంకొందరు అల్పాయుష్కులై మరణిస్తారు. కొందరు చివరి వరకూ ఆరోగ్యంగా జీవిస్తారు. మరికొందరు ఎప్పుడూ ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. కొందరు అయిదు నిమిషాల్లో హటాత్తుగా వెళ్ళిపోతారు. ఇంకొందరు నెలలతరబడి మంచానపడి నరకయాతన అనుభవించి పోతుంటారు. కొందరు తమ తప్పుల వల్ల మరణిస్తే, ఇంకొందరు ఇతరులు చేసిన తప్పుల వల్ల మరణిస్తారు.  ఈ తేడాలు ఎందుకు కలుగుతాయి అన్న సందేహం కలుగుతుంది.

సనాతన వైదికధర్మం దీనికి కారణాలు చెప్పింది. మన పూర్వకర్మ ననుసరించి ఈ తేడాలన్నీ వస్తుంటాయి. అయితే కర్మను అనుభవించవలసినదేనా? వేరే మార్గాంతరం ఏమీ లేదా? అన్న ప్రశ్నకు జవాబు ఉన్నది. కర్మను మార్చుకోవడానికి మార్గం ఈశ్వరుడే ఏర్పరిచాడు. కర్మను కర్మతో జయించవచ్చు. ఆ ఉపాయాలు జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. వాటిని అనుసరించ గలిగితే కర్మను మార్చుకోవచ్చు. 

లోమశమహర్షి ప్రణీతమైన లోమశసంహిత ఆయుర్దాయాన్ని గురించీ, వివిధ రకాలైన మరణాలలోని తేడాలను గురించీ, తనదైన పంధాలో వివరించింది.

శ్లో || అరిష్టం ద్వివిధం పుంసాం దైవం స్వకృత సంజ్నితం 
స్వకృతం సర్వకాలీనం విష శస్త్రానలాదిభిహి  || 

అరిష్టం అనేది మానవునికి రెండు విధాలుగా కలుగుతుంది. ఒకటి దైవికం. రెండవది స్వయంకృతం. దైవికం అంటే దైవం చేత చెయ్యబడినది అని కాదు.  దైవం తనంతట తాను ఎవరినీ శిక్షించదు.  ఎప్పుడో చెయ్యబడిన కర్మ పరిపక్వానికి వచ్చినపుడు తానంతట అదే కలిగే ఫలితం అనే "దైవికం" అన్న పదానికి అర్ధం. అంటే మానవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా ఒచ్చిపడే ఆపదలే దైవికాలు. ఇక స్వయంకృతం అన్నది మనకు తెలిసిందే. తనంతట తానుగా చేసుకునే హానీ, చెడూ,  ఆత్మహత్యలు ఇత్యాదులు ఈ కోవలోకి వస్తాయి. 

ఈ స్వయంకృతంకూడా విషము, శస్త్రము, అగ్ని మొదలైన రూపాలుగా ఉంటుంది. విషము అంటే సరాసరి విషసేవనం కావచ్చు లేదా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు.  ఆహారపరంగా ఏర్పడే వైకల్యం అని విశాలార్ధం  లో గ్రహించాలి. శస్త్రము అంటే ఏదో ఒక ఏక్సిడెంట్ కావడం, లేదా దెబ్బలు తగలడం, లేదా ఆపరేషన్ జరగడం ఇలా రకరకాలుగా ఉండవచ్చు. అంటే బయటనుంచి వచ్చి శరీరానికి తగిలి గాయం చేసేది  ఏదైనా శస్త్రమే.  అగ్ని అంటే అగ్ని ప్రమాదం గాని,ఒంట్లో అతి వేడి పుట్టటం కాని, జ్వరం గాని ఇలా వివిధ రూపాలలో ఉండవచ్చు. ఇలాటి ఉపద్రవాలు సర్వకాలీనములుగా ఎప్పుడైనా జరుగవచ్చు. వీటిని విశాలమైన అర్ధంలో గ్రహించాలి.

శ్లో || స్వకరేనాహతో దీపో యదా నశ్యం తత్ క్షణాత్
నిర్వాతే  తైల పూర్ణోపి  స్వ కృతేన తదానర :
ఆయుర్దీపం తధైవోక్తం ద్వివిధం ద్రుహినోదితం 
గ్రహయోగాదిభిర్యైవ మన్యయోగాది సాధితం 

దీపంలో తైలం నిండుగా ఉన్నప్పటికీ తన చేతులతో దీపాన్ని ఆర్పుకుంటే, ఆ క్షణం లోనే దీపం ఆరిపోయినట్లుగా ఆయుస్సు అనబడే దీపం కూడా అలాగే ఆర్పబడటానికి అవకాశం ఉన్నది. అంటే, ఆయుస్సు ఇంకా ఉన్నప్పటికీ, మానవుడు చావాలి అని బలంగా  అనుకుంటే ఆత్మహత్య చేసుకుని  చనిపోగలడు. కాని ముందుగా నిర్ణయించబడిన తన ఆయుస్సు తీరేవరకూ ప్రేత శరీరంతో తిరుగాడుతూ ఉండవలసి వస్తుంది. దేవుడిచ్చిన శరీరాన్ని బుద్ధిహీనతతో ముందుగానే తెంచుకున్న వారు ప్రేతాత్మలై అల్లాడుతూ వారి ఆయుస్సు తీరేవరకూ ఇక్కడే  తిరుగుతూ ఉంటారు.  అది వేరే సబ్జెక్టు. దాన్ని గురించి ఇంకోసారి చర్చిద్దాం. ప్రస్తుతానికి అరిష్టాల గురించి మాట్లాడుకుందాం. ఈ విధాలైన అరిష్టాలు  రెండు విధాలుగా జరుగవచ్చు. ఒకటి-- గ్రహయోగాలవల్ల (జననకాల యోగాలవల్ల)  రెండవది--  ఇతర యోగాలవల్ల (గోచార యోగాలవల్ల ) ఇది జరుగవచ్చు. 

శ్లో || ఏవం చతుర్విధం పుంసాం మరణం జాయతెత్రహి 
యస్య మాన్దీయుత చంద్రాస్త్రికోణే    యది సంస్థితా:
యోగాభ్యాసాదిభి  స్తస్య హ్యాయుర్వర్ధతి  నిశ్చితం 
వ్యయ షష్టాష్టగో  మాన్దిర్యది క్రూర ఖగాన్విత:

ఈ విధంగా మనిషికి నాలుగు రకాలైన మరణాలు సంభవించవచ్చు. అంటే దైవకృతం, స్వయంకృతం, జననకాలయోగఫలితం, గోచారయోగఫలితం అని ఇవి నాలుగురకాలు. మాంది తో కలసి చంద్రుడు త్రికోణములలో ఉన్నప్పుడు ఇవి సంభవిస్తాయి. మాన్దీ గ్రహం ఇతరములైన క్రూర గ్రహములతో కలసి 6 -8 -12 రాశులలో ఉన్నపుడు కూడా ఇలా జరుగుతుంది. కాని అలాంటప్పుడు కూడా యోగాభ్యాసాది ప్రక్రియలవల్ల ఆయుస్సును పెంచుకొనవచ్చును.

శ్లో || స్వక్రుతేనైవ దోషేణ మరణం తస్య జాయతే 
లగ్నే చంద్రే క్షితే యుతే లగ్నాధిపతినాధవా      ||

లగ్నముతో గాని లగ్నాదిపతితో గాని చంద్రుడు కలసి ఉన్నా, లేక దృష్టి కలిగి ఉన్నా అటువంటప్పుడు తాను చేసుకున్న తప్పుల వల్ల (స్వకీయ కారణాల వల్లనే ) మరణం సంభవిస్తుంది.

చంద్రుడు మాన్దీ  సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ విధమైన అరిష్టాలు కలుగుతాయి. అదే చంద్రునికి గనుక లగ్నంతో గాని లగ్నాధిపతి తో గాని సంబంధం ఉన్నప్పుడు చేతులారా చేసుకున్న కారణాలచేత ఈ అరిష్టాలు కలుగుతాయి. 


ఉదాహరణకు, రాజీవ్ గాంధి జాతకంలో సింహ లగ్నంలో లగ్నాధిపతి అయిన సూర్యునితోబాటు  చంద్రుడు స్థితుడై ఉన్నాడు. సింహరాశికి పంచమ కోణంలో ధనుస్సులో మాన్దీ గ్రహం ఉన్నది. నవాంశలో సింహ రాశిలో రాహువూ, గులికుడూ  ఉండటం వల్ల , స్వకీయ కారణాల వల్లనే ఆయనకు దుష్టమరణం సంభవించింది అని మనం తెలుసుకోవచ్చు.   
 

ఏదిఏమైనప్పటికీ, యోగాభ్యాసాది సాధనలవల్ల ఆయుస్సును పెంచుకొని అరిష్టాలనుంచి తప్పుకొనే అవకాశం ఉన్నది అని లోమశ మహర్షి చెప్పాడు. ఇక్కడ యోగాభ్యాసం అన్న పదం వాడుతూ దానివెనుక -- పరిహార క్రియలవల్ల పూర్వ కర్మ తొలగుతుంది -- అన్న విషయం నిగూడంగా   చెప్పాడు. అయితే ఆ పరిహారాలు పాటించాలి అన్న బుద్ధి  ఆ జాతకునికి కలగాలి. లేకపోతె కర్మను తప్పుకోవటం సాధ్యం కాదు. రాజీవ్ గాంధి చనిపోయిన రోజున ఆయన్ను బయటకు వెళ్ళవద్దని, జాగ్రత్తగా ఉండమని కంచి పరమాచార్యులు ఆయన్ని ముందుగానే హేచ్చరించారనీ కాని రాజీవ్ గాంధీ ఆయన మాటలని లెక్క చెయ్యలేదనీ అంటారు. కర్మానుభవం ముంచుకొస్తున్నపుడు మహనీయుల మాటలు చెవికి ఎక్కవు అనడానికి ఇదొక ఉదాహరణ.  

మన ప్రాచీన గ్రంధాలలో ఈ విధంగా, మానవులకు రాబోయే అరిష్టాలను ఎలా గుర్తించాలి, వాటినుంచి ఎలా రక్షించుకోవాలి అన్న విషయాలు ఎన్నో చోట్ల మహర్షులచేత చర్చించబడ్డాయి. వాటిని స్వీకరించి ఆచరించి మేలు పొందటం విజ్ఞుల లక్షణం.