నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

4, జులై 2011, సోమవారం

హోమియో అద్భుత విజ్ఞానం-2

వారం తిరక్క ముందే BHMS ప్రత్యక్షమయ్యాడు. అతని జిజ్ఞాసకు నాకు ముచ్చటేసింది.

" ఆలోచించావా?  ఏం అర్థమైంది? చెప్పు" అని అడిగాను.  

" ఆ సూత్రంలో ఏ ప్రత్యేకతా లేదు సార్. రోగాన్ని నయం చెయ్యడం వైద్యుని కర్తవ్యం అని హన్నేమాన్ చెప్పాడు అంతే కదా. ఇది ప్రతి వారికీ తెలిసిందే. ఇందులో విశేషం ఏముంది?" అన్నాడు. 

"సరే. నీకు అర్ధం కాలేదని నాకర్ధమైంది. చెప్తాను విను." అంటూ ఇలా చెప్పాను. 

"మొదటి సూత్రంలోని పదాలను హన్నేమాన్ వంటి ఘనవైద్యుడూ మేధావీ బహుముఖ ప్రజ్ఞాశాలీ ఆషామాషీగా ఎంచుకొని ఉండడు. ఒప్పుకుంటావా?"

"అవును"

ఇప్పుడు మొదటి సూత్రంలోని ఈ పదాలను మనం ఒక్కసారి ఆలోచిద్దాం. 

1.Physician's high and only mission.
2.Restore the sick to health.
3.To cure.

ఇందులోని మొదటి లైన్ లో హన్నేమాన్ వాడిన పదాలు జాగ్రత్తగా గమనించు. high and only mission అన్నాడు కాని "వైద్యుని పని" అని మామూలు మాటలు అనలేదు. ఉన్నతమైన మరియు ఏకైక ఆశయం అన్నాడు. అంటే వైద్యునికి "ఉన్నతమైన" ఆశయం ఉండాలి. రోగికి స్వస్థత చేకూర్చాలి అన్న "ఏకైక" ఆశయం అతనికి ఉండాలి. ఈ ఒక్క వాక్యంలో మెడికల్ ఎథిక్స్ మొత్తాన్నీ హన్నేమాన్ పొందుపరచాడు. 

అంటే అనవసర టెస్టులు చేయించి కమీషన్ల రూపంలో డబ్బు గుంజటం, అనవసరమైన మందులు వాడి ఒళ్ళు గుల్ల చెయ్యటం, కుల సంఘాలు పెట్టి ఒక్క కులానికే పరిమితం కావడం, సాటి డాక్టర్లతో కలిసి మల్టిస్పెషాలిటీ ఆస్పత్రులు పెట్టి పేషంటును వాళ్ళలో వాళ్ళు ఫుట్ బాల్ ఆడుకోవడం, అవసరం లేకపోయినా డబ్బులకు కక్కుర్తి పడి ఆపరేషన్లు చెయ్యడం, లక్షలు పోసి కొన్న మిషన్ల డబ్బు రాబట్టడం కోసం ఆయా టెస్టులు చేయించడం, తరువాత నీకేమీ రోగం లేదు అని చెప్పడం-- ఇటువంటి నీచమైన ఉద్దేశాలు వైద్యునికి ఉండరాదు అని హన్నేమాన్ చెప్తున్నాడు. 

రోగి మనవద్దకు నమ్మకంతో వస్తాడు. అతన్ని మోసం చేసి  జేబు ఖాళీ చేసి ఆ డబ్బుతో మనం బాగు పడితే ఆ ఉసురు మనకు తగులుతుంది. అంతే కాదు. ఇంకొందరు ఇంకా వికృత చేష్టలు చెసే వైద్యులున్నారు. తమ వద్దకు వచ్చిన స్త్రీ రోగులను వలలో వేసుకుని ఆడించే వాళ్ళున్నారు. ఇదే ఊళ్ళో అలాటి వైద్యులు బోలెడు మంది ఉన్నారు. అలాటి నీచపు పనులు వైద్యునికి పనికి రావు అని మొదటి సూత్రం లోనే హన్నేమాన్ స్పష్టంగా చెప్పాడు. మెడికల్ ఎథిక్స్ మొత్తాన్నీ ఒక్క మాటలో సూచించాడు. ఇది ఈ సూత్రంలోని మొదటి భాగం మాత్రమె అని గమనించు. ఇంకా ఉంది.

"ఇక రెండవ భాగంలో ఆయనేం చెప్పాడో విను. Cure is restoring the sick to health అన్నాడు. ఈ మాటలో-- వ్యాధి అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఏమిటి? నయం చెయ్యడం అంటే ఏమిటి? అన్న మూడు విషయాలు గుప్తం గా సూచించాడు. అర్ధం అవుతున్నదా ?" అడిగాను 

"అర్ధం అవుతున్నది " అని తలాడించాడు BHMS.

మొదటగా ఆరోగ్యం అంటే ఏమిటో చూద్దాం. అల్లోపతీ చెప్పినట్లు మనిషి ఒక యంత్రం కాదు. అతనిలో మనసుంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఆఫ్ కోర్స్. మనసునూ ప్రాణాన్నీ అల్లోపతిలో ఒప్పుకోరు. అది వేరే విషయం. కానీ ఈ మూడింటిలో ఎలాటి వైకల్యం వచ్చినా అది వ్యాధి కిందే లెక్క. మనస్సులో వికృత ఆలోచనలు వస్తే అది మానసిక స్థాయిలో వ్యాధి. ప్రాణ స్థాయిలో వైకల్యం వస్తే అది ప్రాణిక స్థాయిలోని  వ్యాధి. శరీరంలో మార్పులు వచ్చినపుడు అది శరీర స్థాయిలోని వ్యాధి. ఈ మూడు స్థాయిలూ సమతూకంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యానికి పరిపూర్ణమైన హోలిస్టిక్ నిర్వచనం ఇదే. 

హన్నేమాన్ రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ నిర్వచనం ఇచ్చాడు. హన్నేమన్ ఎప్పుడో చెప్పిన నిర్వచనానికి  మోడరన్ మెడిసిన్ ఈనాడు దగ్గరగా వస్తున్నది. సైకో-సోమాటిక్ డిసీజెస్ అన్న కాన్సెప్ట్ ను ఇప్పుడిప్పుడే మోడరన్ మెడిసిన్ అర్ధం చేసుకుంటున్నది. ఈ కాన్సెప్ట్ ను హన్నేమాన్ రెండువందల ఏళ్లనాడే చెప్పాడు. హన్నేమాన్ మేధస్సుకు ఇదే తార్కాణం.  అల్లోపతీ మనిషి శరీరాన్ని మాత్రమె గుర్తిస్తుంది. ప్రాణాన్ని ఒప్పుకోదు.  ఇక మనసుకైతే అల్లోపతీలో  విలువే లేదు. ఇదే అల్లోపతీ వైద్యంలోని భయంకరమైన లోపం. ఇంగ్లీషు వైద్యం మనిషిని ఒక పశువుగా చూస్తుంది. హోమియో వైద్యశాస్త్రం మాత్రమె మనిషిని మనసున్న వాడిగా గుర్తిస్తుంది.

ఇప్పుడు రోగం అంటే ఏమిటో చూద్దాం. శరీర, ప్రాణ, మనో స్థాయిలలో వైకల్యమే రోగం అని అర్ధం చేసుకున్నాం. ఈ నిర్వచనాన్ని ఇంగ్లీషు వైద్యం ఒప్పుకోదనుకో. అది వేరేసంగతి. అసలు ఈ వైకల్యం ఎందుకు కలుగుతున్నది అనేది చూద్దాం? వైరస్, బాక్టీరియా, ఫంగస్ మొదలైన మైక్రో ఆర్గానిజమ్స్ దీనికి కారణం అని అల్లోపతీ చెబుతున్నది. కాని ఒక్క విషయం గమనించాలి. మనలో రెసిస్టన్స్ పవర్ గట్టిగా ఉంటె ఏ వైరస్సూ ఏమీ చెయ్యదు. ఎపిడెమిక్ రోగాలు వచ్చినపుడు కూడా ఒక ఇంట్లో పదిమంది ఉంటె పదిమందికీ రావు. కొంత మందికి వాటినుంచి నేచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఒక ఏరియాలో ఏదైనా ఎపిడెమిక్ ప్రబలినప్పుడుకూడా అక్కడ అందరూ చనిపోరు. చాలామంది అక్కడ ఉన్నవాళ్ళే ఆ వ్యాధి బారిన పడనివారు కూడా ఉంటారు. మలేరియా, టైఫాయిడ్, టీ బీ, కుష్టు మొదలైన రోగాలు కూడా అందరినీ ఎటాక్ చెయ్యవు. వీక్ రెసిస్టన్స్ ఉన్నవారినే అవి ఎటాక్ చేస్తాయి. అలాగే ఎయిడ్స్ కూడా. భర్త ఎయిడ్స్ తో చనిపోతే, భార్యకు నెగటివ్ వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. 

మన చుట్టూ కోట్లాది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనం తాగే నీటిలో, మనం తినే తిండిలో, పీల్చే గాలిలో కూడా ఉంటాయి. అంతెందుకు మన ఇంటేస్టైన్స్ లో కోట్లాది బాక్టీరియా ఉంటుంది. అది మనకు హాని చెయ్యడం లేదే. కనుక నిజానికి మైక్రో అర్గానిజమ్స్ రోగకారణాలు కావు. మనిషిలోని ప్రాణశక్తి క్షీనించడమే అసలైన రోగకారణం. అల్లోపతీ దీనిని ఒప్పుకోదు. అల్లోపతీ దృష్టిలో ప్రాణం అనేది లేదు. కనుక దాని దృష్టిలో సూక్ష్మ క్రిములే వ్యాధి కారకాలు. ఇది పూర్తిగా పొరపాటు అభిప్రాయం.

ఇప్పుడు "నయంచెయ్యడం" అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం. వైకల్యం చెందిన ప్రాణ శక్తిని తిరిగి పునః స్థాపించడమే రోగ నిదానం. దీనినే restore అన్న పదంతో హన్నేమాన్ సూచించాడు. అల్లోపతీ వైద్యం లో ఈ restoration అన్నది ఎన్నటికీ జరుగదు. అక్కడ జరిగేదల్లా సూక్ష్మ క్రిములను చంపడమే. ఈ క్రమంలో మన శరీరంలోని  మంచి బాక్టీరియా, దానితో బాటు శరీరంలోని కణాలూ కూడా చస్తాయి. ప్రాణ శక్తికి మాత్రం బలం రాదు. పైగా ఇంకా క్షీణిస్తుంది. అందుకే అల్లోపతీ మందులు జీవితాంతం వాడుతూనే ఉండాలి. అంతకంతకూ ఇంకా తీవ్ర స్థాయికి చెందిన వ్యాధులు కాలక్రమేణా వస్తుంటాయి.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టైఫాయిడ్ వ్యాధి వచ్చిన ఒక రోగికి అల్లోపతీ వైద్యం చేసి టెంపరేచర్ వెంటనే తగ్గిస్తారు. కాని అతనికి కొన్ని వారాల పాటు ఓపికా, ఆకలీ ఉండవు. ఎందుకని? రోగం అనేది పూర్తిగా తగ్గిపోతే, అతని ఆకలీ, నిద్రా, ఓపికా అన్నీ సక్రమంగా ఉండాలి. అలా ఉండటం లేదు అని మన అనుభవంలో మనం చూడవచ్చు. అంటే అతనికి ఒక్క టెంపరేచర్ మాత్రమె తగ్గింది కాని రోగం పూరిగా నయం కాలేదు. దానికోసం కొన్ని వారాల పాటు టానిక్కులూ, విటమిన్సూ వాడుతూ ఉండాలి. అది పర్ఫెక్ట్ క్యూర్ కాదు. కొన్ని వారాల తర్వాతా కూడా అతను నీరసంగా కనిపిస్తూనే ఉంటాడు. ఏంటీ. అలా ఉన్నావ్. టైఫాయిడ్ తగిలి లేచావా ? అని చూచిన వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఇది రోగం యొక్క అణచివేత మాత్రమె గాని నయం చెయ్యటం కాదు. కనుకనే జ్వరం తగ్గినాకూడా రోగికి సుఖంగా ఉండదు. 

ఈ సుఖం లేకపోవడం అన్న ఒక్క లక్షణాన్ని బట్టి అతనికి పూర్తిగా తగ్గలేదు అని చెప్పాలి. హన్నేమాన్ దృష్టిలో ఇది రోగనిదానం కానే కాదు. మోసపూరితమైన అణచివేత మాత్రమె. రోగికి మానసికంగా, ప్రాణికంగా , శారీరికంగా హాయిగా ఉన్నపుడే రోగం పూర్తిగా తగ్గినట్లు లెక్క. ఈ పని ఒక్క హోమియోపతి మాత్రమె చెయ్యగలదు. హోమియో ఔషధాలతో నీకు రోగం తగ్గినపుడు ఏ స్థాయిలోనూ నీకు అసౌకర్యం ఉండదు. నీరసం ఉండదు. ఫాలో అప్ గా ఏ విధమైన టానిక్కులూ వాడనవసరం లేదు. నిజమేనా కాదా? ప్రశ్నించాను.

" నిజమే సార్ " అన్నాడు. 

" To restore the sick to health అన్న మాటల్లో గూడార్ధం ఉంది. రోగాన్ని నయం చెయ్యడంలో వైద్యుని యొక్క దృష్టి రోగం మీద కంటే రోగిమీద ఉండాలి. వైద్యుడు రోగి యొక్క స్థితిని బాగుచెయ్యాలి. అంతే కాని రోగ క్రిముల్ని డైరెక్ట్ గా  చంపడం వైద్యుని పని కాదు. రోగి యొక్క ప్రాణశక్తికి బలం ఇవ్వగలిగితే బాగుపడిన ఆ ప్రాణశక్తి రోగక్రిముల్ని తనంతట తానే సులభంగా తొలగిస్తుంది. ప్రాణానికి సాధ్యం కానిది లేదు. That is why we say, in Homoeopathy, we treat the patient not the disease. Nevertheless, the disease gets cured effortlessly. మనకు రోగంకంటే రోగియొక్క ప్రాణస్థితి  ముఖ్యం. ఇది వినడానికి ఏదోగా ఉంటుంది. కాని అన్ని సత్యాలలాగే ఇది కూడా త్వరగా అర్ధం కాదు. 

To restore the sick to health అనేబదులు to remove the disease అన్న పదం హన్నేమాన్ ఎందుకు వాడలేదో ఆలోచించు. ఆయన యొక్క ఎంఫసిస్ మొదటి సూత్రం నుంచీ రోగియొక్క ప్రాణస్థితి  మీదే ఉంది కాని, రోగం మీద లేదు. రోగిని తన స్వస్థ స్థితికి పునరుద్ధరించడమే క్యూర్ అన్న అద్భుత నిర్వచనం హన్నేమాన్ ఇక్కడ ఇచ్చాడు. ప్రస్తుతం జనం బాధ పడుతున్న ఏ రోగాన్నైనా తీసుకో. 

ఉదాహరణకు డయాబెటిస్ ను తీసుకో. జీవితాంతం మందులు వాడుతూ బాధ పడుతూ ఉండటం restoration ఎలా అవుతుంది? అక్కడ రోగం నయం కావడం లేదు. అంతకంతకూ పెరిగి కాలక్రమేణా ఇతర అనేక బాధలకు కారణం అవుతున్నది. కనుక, వైకల్యం చెందిన ప్రాణశక్తి తిరిగి పునస్థాపితం కాబడటం లేదు. అందుకే రోగి జీవితాంతం మందులు వాడవలసి వస్తున్నది. జనం అదే అసలైన ట్రీట్మెంట్ అన్న భ్రమలో ఉంటారు. హన్నేమాన్ దృష్టిలో  ఇది సరియైన క్యూర్ కాదు. కొన్ని రోగాలకు మందు లేదు అని అల్లోపతీ లో చెప్పే మాట చేతగాక చెప్పే మాటేగాని మరొకటి కాదు. ఇంగ్లీషు వైద్యం చేతులెత్తేసిన అనేక రోగాలు హోమియోపతిలో పూర్తిగా నయం అవుతాయి. అల్లోపతీ లో దేనికి మందుందో చెప్పు. జలుబుకూ లేదు, కాన్సర్ కూ లేదు. ఈ స్పెక్ట్రం  మధ్యలోని ఏ రోగానికీ అందులో పర్ఫెక్ట్ క్యూర్ లేదు. ఆలోచించు.
   
"కనుక ఇప్పుడు చెప్పు. హన్నేమాన్ చెప్పిన మొదటి సూత్రంలోనే ఎంత లోతైన హోమియో తత్వ శాస్త్రాన్ని నిగూడంగా  ఇమిడ్చి చెప్పాడో ఇప్పుడు అర్ధమైందా?  రోగం అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే ఏమిటి? క్యూర్ అంటే ఏమిటి? అన్న విషయాలనే కాక, వైద్యుడు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడై ఉండాలి? అన్న విషయాలను హన్నేమాన్ ఈ ఒక్క సూత్రంలో చెప్పాడు. ఇప్పుడు ఈ సూత్రంలోని లోతు అర్ధమైందా?" అడిగాను.

"అర్ధమైంది. హన్నేమాన్ ఎంతటి మేధావో ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్ధమౌతున్నది సార్. మొదటి సూత్రంలోనే ఇంత లోతుంటే ఇక ఆర్గనాన్ లోని వందలకొలదీ సూత్రాలలో ఎంత విజ్ఞానాన్ని ఆయన పొందుపరచాడో కదా." అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు BHMS.

"అందుకే గదా. హోమియోపతీ మాత్రమే అసలైన, నిజమైన వైద్య శాస్త్రం అని తెలిసిన వాళ్ళు నమ్ముతారు." అన్నాను. 

" బాగుంది సార్. డౌట్స్ వచ్చినపుడు మీ దగ్గిరికి వచ్చి  అడుగుతుంటాను. మీకు చెప్పటానికి వీలౌతుందా సార్. "అడిగాడు.

"యు ఆర్ మోస్ట్ వెల్కం. హన్నేమాన్ చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించావంటే నీకు గొప్ప వైద్యుడు అన్న పేరు రావటం ఖాయం. ముఖ్యంగా ఆయన చెప్పిన మెడికల్ ఎథిక్స్ ను గట్టిగా గుర్తుంచుకో. ట్రీట్ మెంట్ విషయంలో నీకు ఏ డౌటు వచ్చినా నిరభ్యంతరంగా నన్ను కలువు. ఏ పరిస్తితిలోనూ పేషంట్లను మోసం చెయ్యకు."  అని అతనికి వీడ్కోలు పలికాను.