Pages - Menu

Pages

5, ఆగస్టు 2011, శుక్రవారం

జెన్ కథలు - ఖాళీ టీ కప్పు

"A cup of Tea" జెన్ కథను చదివి బాగా ప్రభావితుడైన ఒక వ్యక్తి దాన్ని తనకు తెలిసిన స్నేహితునిమీద ప్రయోగిద్దామని అనుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యనా అప్పుడప్పుడూ వేదాంత చర్చలు జరిగేవి. 

ఒకరోజు సాయంత్రం తన స్నేహితుని " టీ తీసుకుందాం రమ్మని" పిలిచాడు మనవాడు. పిలిచిన సమయానికి  స్నేహితుడు వచ్చి కూర్చున్నాడు. ఆమాటా ఈమాటా అయిన తర్వాత ముందే అనుకున్నట్లుగా టీ కప్పును సాసర్లో ఉంచి కేటిల్ లోనుంచి దాంట్లోకి టీ పొయ్యడం ప్రారంబించాడు మన కధానాయకుడు. టీ  పోర్లిపోతున్నా కూడా అలాగే పోస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు కధలో జెన్ సాధువు అదే చేసాడు కదా. 

ఇతను ఊహించినట్లుగానే " పోర్లిపోతున్నా పోస్తున్నావ్. ఉపయోగం ఏముంది?" అని అన్నాడు స్నేహితుడు. 

దీనికోసమే వేచి చూస్తున్న మనవాడు " నీ కప్పు నిండుగా ఉంటె ఇక నేను పోస్తున్న టీ ఎలా నిలబడుతుంది ?" అని అన్నాడు. 

దానికి స్నేహితుడు చిరునవ్వుతో "నీవు చదివిన జెన్ కధ నాకూ తెలుసు. కానీ నా కప్పు ఖాళీగా ఉంటె ఇక నీ టీతో పనేముంది?" అని జవాబిచ్చాడు.

------------------------------------------------------

మొదటి జెన్ కథ చైనాలోనో జపాన్ లోనో జరిగింది. కానీ ఈ రెండవ కధ మన దేశంలోనే, అందులోనూ ఆంధ్రాలోనే జరిగింది. చాలామంది ఆధ్యాత్మికులు ఇలాగే ప్రవర్తిస్తారు. పుస్తకాలు చదివి అందులో ఉన్నదంతా తమ అనుభవం లాగా ఎదుటివారికి చెప్పబోతారు. ఇటువంటి వారి మాటలకు, తెలియనివారు బోర్లా పడిపోతారు. కాని తెలిసినవారికి వీరి వ్యవహారం వెంటనే అర్ధం అవుతుంది. విపరీతమైన నవ్వు పుట్టిస్తుంది. 

రజనీష్ సాహిత్యాన్నీ, రమణ మహర్షి సాహిత్యాన్నీ, జిడ్డు సాహిత్యాన్నీ చదివి తమని తాము వారిలాగా భావించుకుంటూ ఇతరులకు బోధించేవారు  చాలామంది మనకు కనిపిస్తారు. కానీ వారు గమనించవలసిన విషయం ఒకటుంది. రజనీష్ గానీ, జిడ్డు గానీ, రమణ మహర్షి గానీ ఆ స్థాయికి చేరకముందు చాలా ఏళ్ళు సాధన చేశారు. ఆ సాధన సమయంలో వారు పెద్దగా మాట్లాడలేదు. తరువాత తరువాత వారి అనుభవాన్ని బట్టి లోకులతో మాట్లాడారు. కానీ వారి పుస్తకాలు చదివినవారు మాత్రం ఈ విషయం పెద్దగా పట్టించుకోరు. వారు చేసిన సాధన వీరు చెయ్యరు. కాని వారి మాటలు మాత్రం చిలక పలుకులు పలుకుతారు. సాధనా మార్గంలో ముందుకు వెళ్ళినవారి వద్ద వీరు అడ్డంగా దొరికిపోతారు.

అనుభవంతో మాట్లాడేవారి మాటలకూ, పుస్తకాలు చదివి మాట్లాడేవారికీ ఇదే భేదం. పుస్తకం నుంచి అనుభవం ఎన్నటికీ రాదు. కాని అనుభవం నుంచి ఎన్నో పుస్తకాలు పుట్టుకొస్తాయి. పుస్తకాలలో లేని కొత్తకోణాలు అనేకం అనుభవంలో దర్శనమిస్తాయి. పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే వారికి వ్యాకరణార్ధం తెలియవచ్చు. కాని అది అనుభవం లోకి రాదు. మెదడుకు అర్ధమైన దాన్ని హృదయగతమైన  అనుభవంగా మార్చుకోవాలంటే సాధన చెయ్యాలి. పండితులకూ సాధకులకూ ఉన్న తేడా ఇదే.

అందుకే జిల్లెళ్ళమూడి అమ్మగారు "పుస్తకం అనుభవాన్నివ్వదు  నాన్నా, అనుభవం పుస్తకాన్నిస్తుంది " అని చాలాసార్లు అనేవారు. అనుభవ జ్ఞానం ముందు పుస్తక జ్ఞానం వెలవెలా పోతుంది. ఎందుకంటే అనుభవం నిత్యనవీనం. పుస్తక జ్ఞానం జడం.

ఈ కధలోని వ్యక్తి జెన్ కధలు చదివి బాగా ప్రభావితుడైనాడు. కాని ఎదుటి వ్యక్తి స్థాయి ఇతనికి తెలియదు. చెప్పేవాడికి వినేవాడు లోకువ కదా. అందుకే మౌనంగా ఉన్న తన స్నేహితుడి ముందు తన జ్ఞాన ప్రదర్శన చేద్దామని చూసి బోర్లా పడ్డాడు. స్నేహితుడు ఈ కధలన్నీ తెలిసినవాడే. అంతేగాక సాధనానుభావం ఉన్నవాడు కావటంతో ఒకడుగు ముందుకేసి సమాధానం చెప్పగలిగాడు. మొదటి జెన్ కథలో ప్రొఫెసర్, జెన్ సాధువు వద్దకు వెళతాడు. కాని అప్పటికే అతని తలనిండా అంతకుముందే చదివిన తత్వశాస్త్రపు బరువు నిండి ఉండటంతో తానూ చెప్పబోయే జెన్ విధానం అతనికి ఎక్కదని పోర్లిపోతున్న టీ కప్పు ద్వారా  జెన్ సాధువు మార్మికంగా సూచిస్తాడు. అదే సంఘటనను ఇక్కడా రిహార్సల్ చెయ్యబోయి మనవాడు భంగపడ్డాడు. 

సినిమాలు చూసి అందులోని హీరో తో ఐడెంటిఫై అయ్యే అర్భకులు చాలామంది ఉంటారు. వాళ్ళు సినిమా చూచి హాల్ బయటకొచ్చి అచ్చు ఆ హీరోలా ప్రవర్తించబోయి భంగ పడుతూ ఉంటారు. ఇదీ అలాటిదే. ఆ హీరోలా మనం ఉండాల్సిన పనిలేదు. మనం మనలా ఉంటె చాలు. సినిమా పాత్ర ఊహాలోకంలోది. దానిని అనుకరిస్తూ  ఊహల్లో విహరించేవాడు వాస్తవంలో భంగపడక తప్పదు.

జీవితం నిత్యనూతనం. ప్రతి క్షణమూ ఒక కొత్త సుగంధాన్ని మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ఒకసారి జరిగిన ఘటనలో మళ్ళీ మళ్ళీ కొత్తదనం ఉండదు. అక్కడ ప్రొఫెసర్ కూ ఇక్కడి స్నేహితునికీ పోలిక లేదు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులు. ప్రొఫెసర్ ఎన్నో గ్రంధాలు చదివిన తత్వవేత్త. కాని సాధన లేనివాడు. ఈ కధలోని స్నేహితుడు గ్రంధ పాండిత్యమూ సాధనా బలమూ రెండూ ఉన్నవాడు. అందుకే చక్కని సమాధానం చెప్పాడు. 

అతను అడిగిన ప్రశ్నలో మంచి అర్ధం ఉంది. "నా కప్పు ఖాళీగా ఉంటే ఇక నీవు టీ పోయ్యవలసిన అవసరం ఏముంది? " అంటూ ఇతనికి తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. మామూలుగా టీ తాగడమే ఇక్కడి విషయమైతే ఇంత చర్చ అవసరం లేదు. ఇద్దరూ టీ తాగి ఎవరి దారిన వారు పోవచ్చు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్న కప్పులోనే టీ పోయ్యగలం. తాగగలం కూడా. కానీ, ఇక్కడ విషయం అది కాదు. కప్పు ఖాళీగా ఉండటం అంటే భావశూన్యస్థితిని పొందటం. అలా శూన్య స్థితిని పొందిన వ్యక్తికి ఇక బయటిజ్ఞానం యొక్క అవసరం లేదు. శూన్యమూ పూర్ణమూ ఒకటే. లోపల నిరంతరం ఊట ఊరుతున్న వాడికి బయటినుంచి ఏదీ సరఫరా చెయ్యవలసిన అవసరం ఉండదు. శ్రీ రామకృష్ణులు ఇదే అనేవారు. ధాన్యపుకొట్టులో గుట్టగా నిలువఉన్న ధాన్యాన్ని లాగుతున్నకొద్దీ, వెనుకనున్న ధాన్యం నిరంతరమూ ముందుకొస్తూనే  ఉంటుంది. అలాగే నిత్యనూతనమైన భావ పరంపరను జగన్మాత ఎప్పుడూ సరఫరా చేస్తూనే ఉంటుంది. విశ్వ చైతన్యంతో అనుసంధానం కాగలిగినవారికి భావాల లోటు ఎప్పటికీ ఉండదు. ఈ విషయాన్నే స్నేహితుడు సున్నితంగా సూచించాడు.

జెన్ సాధువును ఇమిటేట్ చేద్దామని మనవాడు అనుకున్నాడు. కాని ఆధ్యాత్మిక జీవితంలో అనుకరణకు విలువలేదు. చివరకు గురువును కూడా అనుకరించడం పనికిరాదు. ఇక్కడ మన అనుభవాన్ని బట్టి మనం ప్రవర్తించవలసి ఉంటుంది. మన కాళ్ళమీద మనం నిలబడవలసి ఉంటుంది. అప్పుడే మన ప్రవర్తనలో స్వచ్చత ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటన అదే. కాకపొతే మొదటి జెన్ కథలో జరిగింది స్వచ్చందంగా జరిగిన సంఘటన. ఇది నకిలీ. ఈ నకిలీ ఘటనలో కూడా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా నూతనత్వాన్ని తేగలిగాడు స్నేహితుడు. జీవితం నిత్యనవీనం. ధ్యాని కూడా నిత్యనవీనమైన స్తితిలోనే నిత్యమూ ఉండాలి. అప్పుడే భూతకాలపు నీడలు అతన్ని దరిచేరకుండా ఉంటాయి.

పుస్తకాలు చదివి ఇతరులకు చెప్పేవారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. ప్రస్తుతపు కార్పోరేట్ గురువులందరూ మన ప్రాచీన సాహిత్యాన్ని కాపీ కొడుతున్నవారే. కాకపోతే ఎవరూ కూడా మూలాన్ని ఉదాహరించరు. అదే విచిత్రం. పుస్తకం చదివి ఇతరులకు చెప్పడం గొప్ప కాదు. అది చాలా తేలిక. కాని, చదివినదానిని తన అనుభవంగా తెచ్చుకోవడానికి చాలా కష్టపడి సాధన చెయ్యవలసి ఉంటుంది. అలా చేసేవారు తక్కువగా ఉంటారు. ముందు సాధన, తరువాత 'అవసరమైతే' బోధన. అవసరం లేకపోతే మౌన నిష్క్రమణ. ఆధ్యాత్మిక మార్గంలో ఇదే సరియైన విధానం. 

ఆధ్యాత్మిక లోకంలో పాండిత్య ప్రదర్శనకు దమ్మిడీ విలువలేదన్న విషయమూ, సాధనాపరులవద్ద వినయమే శోభిస్తుంది కాని పాండిత్యం భంగపడుతుందన్న విషయమూ   మనం గ్రహించాలి.