Pages - Menu

Pages

9, ఆగస్టు 2011, మంగళవారం

అభినవగుప్తుని అద్భుతజీవితం

అభినవగుప్తుడు పదవ శతాబ్దంలో కాశ్మీరదేశంలో నివశించినట్లు ఆధారాలున్నాయి.జీవించి ఉన్న కాలంలో ఆయనను పరమేశ్వరుని అవతారంగా భావించి అనేకమంది శిష్యులు పూజించారు.వేదాంత,తంత్ర శాస్త్రములలో మహాపాండిత్యమూ,అద్భుతమైన యోగ శక్తులకుతోడు అమేయమైన శివాద్వైత అనుభవజ్ఞానం ఆయన సొంతం.

ఇవిగాక నాట్య సంగీత వ్యాకరణాది విద్యలలో ఆయన జ్ఞానసంపన్నుడు. "కాశ్మీర శంకరాచార్య" అని ఆయన్ను అనేకమంది నవీన పండితులు పిలిచారు. కాశ్మీర శైవాద్వైతాన్ని ఆయన పరిపుష్టం చేసినట్లు ఇంకెవ్వరూ చెయ్యలేకపోయారు. వెయ్యిసంవత్సరాల క్రితమే కులాన్ని నిరసించి జ్ఞాన తృష్ణకే ప్రాధాన్యతనిచ్చి, అద్వైతశివానుభావం అందరికీ సాధ్యమే అన్నమాట చెప్పడమేగాక సమస్త కులాలకూ చెందిన ముముక్షువులను కరుణతో చేరదీసి వారికి ఈశ్వరాద్వైతానుభావానికి సరియైన మార్గాన్ని చూపిన కారణజన్ముడు అభినవగుప్తుడు. స్త్రీలకూ సాధనా మార్గంలో సమాన స్థానాన్ని ఇచ్చిన మహనీయుడు.నాట్య సంగీతాది విద్యలలో ప్రతిభా సంపన్నుడు మాత్రమే గాక,కాశ్మీర శైవ తంత్రశాస్త్రంలో అనుభవ జ్ఞాని.

ఎలాగైతే వేదాలలో దాగిఉండి జనులకు అర్ధంకాకుండా ఉన్న వేదాంత తత్వాన్ని తన అద్వైతసిద్ధాంతం ద్వారా శంకర భగవత్పాదులు జనులకు తేటతెల్లం చేసారో,అదే విధంగా శైవాగమశాస్త్రాలలో నిగూడంగా ఉన్న శివాద్వైత తత్వాన్ని తన గ్రంధాలద్వారా అభినవగుప్తుడు లోకానికి వివరించాడు.

ఆయన వివిధ సాధనామార్గాలలోనూ, మతాలలోనూ    మహాపండితుడేగాక, అతిరహస్యమైన తంత్రజ్ఞానం తెలిసినవాడు, భరతముని యొక్క  నాట్యశాస్త్రానికి  వ్యాఖ్యానం వ్రాశిన  నాట్యశాస్త్రకోవిదుడు, సంగీతనిధి, అష్ట సిద్దులనూ అరచేతిలో ఉంచుకున్న మహాయోగి, దాదాపు ఏభైకి పైగా సునిశితతర్క పూరితములైన, మహోన్నత సిద్ధాంత ప్రతిపాదితములైన, ఉత్తమగ్రంధాలను సంస్కృతంలో  రచించిన మహాకవి, వ్యాకరణవేత్త,శంకరుని అద్వైతంలోనూ, బుద్ధుని అనాత్మవాదంలోనూ ఉన్న లోపాలను సవరించిన ధీశాలి. 

ఆయన జీవితం ఒక అద్భుతం. ఒక సంప్రదాయపరులైన బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. తండ్రిగారైన నరసింహగుప్తుడు మళ్ళీ వివాహం చేసుకోకుండా మహేశ్వరభక్తుడై అంతరిక జ్ఞాన సాధనకు అంకితుడైనాడు. తననుగురించి వ్రాసుకుంటూ "యోగినీభూ" అన్న పదాన్ని అభినవగుప్తుడు వాడాడు. అంటే, తల్లి దండ్రులు యోగావస్థలో ఉన్నప్పుడు కలిగిన సంయోగం వల్ల జన్మించిన శిశువు అని  అర్ధం. ప్రాచీన కాలంలో ఇటువంటి ప్రక్రియలు ఉండేవి. ఉత్తమ సంతానాన్ని కనాలని సంకల్పించిన భార్యాభర్తలు నిష్టాపరులుగా యోగతత్పరులుగా ఉంటూ తత్ఫలంగా ఉద్భవించిన ఓజోశక్తితో కలిగిన భైరవస్తితిలో ఒక శిశువుకు జన్మనిస్తే ఆ శిశువు ఉత్తమసంస్కారాలతో జన్మించి, కాలాంతరంలో అత్యంత మేధాసంపన్నునిగా అత్యంత మహానీయునిగా రూపుదిద్దుకునేవాడు. అభినవగుప్తుడు పుట్టుకతోనే అట్టి యోగశిశువుగా జన్మించాడు.

బాల్యంనుంచి జ్వలిస్తున్న జ్ఞానతృష్ణతో అనేకమంది మహాగురువుల వద్ద శిష్యరికం చేసాడు. కనీసం 15 మంది మహనీయులైన గురువుల వద్ద ఈయన శిష్యరికం చేసినట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. వీరిలో సిద్దులైన శైవసంప్రదాయ గురువులే గాక వైష్ణవ, బౌద్ధ, జైన గురువులున్నారు.

ఆధ్యాత్మికతృష్ణ అనేది ఒకని ముసలితనంలో వస్తే అది సరియైన తృష్ణ కాదు. నిజమైన ఆధ్యాత్మిక తపన అనేది చాలా చిన్నవయసులోనే ఎవరికైతే జ్వలిస్తుందో వారే ధన్యులు.వారే జీవిత పరమగమ్యాన్ని చేరుకోగలరు. ఇతరులకు అది అసాధ్యం.

ముఖ్యంగా త్రిక సిద్ధాంతమైన కాశ్మీరశైవాన్ని, తంత్రమార్గమైన కౌలాన్నీ ఈయన నిష్ఠగా అధ్యయనం చేశాడు. వసుగుప్తుడనే సిద్ధగురువుచేత 8 శతాబ్దంలో క్రోడీకరించబడినదే త్రికసిద్ధాంతం.సృష్టి స్తితి లయములు మూడు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు మూడు,సత్వ రజో తమో గుణములు మూడు, జీవుడు, శక్తి, శివుడు మూడు. ఈ విధంగా మనకు కనిపిస్తున్న చరాచర సృష్టి మొత్తాన్నీ మూడు స్థాయిలలో సంపూర్ణంగా వివరించగలిగిన సిద్ధాంతమే త్రికసిద్ధాంతం.

దీనిలో నిశితతర్కమయమైన సిద్ధాంతభాగమే గాక ఆధ్యాత్మికంగా అత్యున్నతికి తీసుకెళ్లగల ఆచరణాత్మక తంత్రమార్గం నిగూఢంగా దాగి ఉన్నది.అభినవగుప్తుడు ఈ రెంటిలోనూ అత్యంత ప్రతిభాపూర్వక అభ్యున్నతిని పొందాడు.ఈ రెంటినీ సమర్ధవంతంగా బోధించగల సద్గురువులు ఆయనకు లభించారు. అదే ఆయన అదృష్టం.

తన గురువులందరిలోనూ సోమానందుని, శంభునాధుని ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నాడు. సోమానందుడు ఆయనకు క్రమ, త్రిక, ప్రత్యభిజ్న సిద్ధాంతాలను బోధించాడు. శంభునాధుని వద్ద తాంత్రికపధమైన కౌలాచారాన్ని ఈయన ఔపోసన పట్టాడు. శంభునాధుని పత్ని(తన గురుపత్ని)నుంచి అభినవగుప్తుడు శక్తిపాతాన్ని పొందాడు అన్నదాన్ని బట్టి వెయ్యేళ్ళ క్రితమే స్త్రీలు తంత్రమార్గంలో గురుత్వాన్ని వహించగల శక్తి స్వరూపిణులుగా విరాజిల్లేవారని మనకు తెలుస్తుంది.నిజం చెప్పాలంటే ఒక తాంత్రిక గురువుగా స్త్రీ రాణించినట్లు పురుషుడు రాణించలేడు.దానికి చాలా మార్మిక కారణాలున్నాయి.అందుకనేనేమో శ్రీరామక్రిష్ణులు కూడా భైరవీ బ్రాహ్మణినే తన తంత్రసాధనా గురువుగా ఎన్నుకున్నారు.

తన గురువులలో అందరిలోకీ శంభునాధుని ఈయన ఎక్కువగా అభిమానించాడు. ఈయన కరుణ వల్లనే తాను పూర్ణజ్ఞానాన్ని పొందానని చెప్పుకున్నాడు. శైవాద్వైతాన్నీ తంత్రమార్గాన్నీ అప్పటి వరకూ ఉన్న సాధనా మార్గాలనూ సమన్వయము చేస్తూ ఒక సంపూర్ణ అద్భుతగ్రంధాన్ని వ్రాసే బృహత్కార్యాన్ని తలపెట్టమని శంభునాధుడే ఈయనకు ప్రేరణ కలిగించాడు. ఈ ప్రేరణ నుంచి ఉద్భవించినదే " తంత్రాలోక " మనే అద్భుత  గ్రంథరాజం. మాలినీ విజయతంత్రమనే ప్రాచీన గ్రంధరాజాన్ని దీనికి ఆధారంగా తీసుకున్నాడు.

ఇది 37 అధ్యాయాలతో విరాజిల్లే అద్భుతగ్రంధం. అప్పటివరకూ ఉన్న సమస్త తంత్ర సాధనలనూ క్రోడీకరించి దానికి తన అనుభవాన్ని రంగరించి అభినవగుప్తుడు ఈ గ్రంధాన్ని వ్రాశాడు. దీనిని అర్ధం చేసుకోలేని మంద బుద్ధులకోసం దీని యొక్క సంక్షిప్తరూపంగా తంత్రసారమనే ఇంకొక గ్రంధరాజాన్ని కూడా ఆయన లోకం కోసం వ్రాశాడు.

శ్లో|| వితత స్తంత్రాలోకో విగాహితుం నైవ శక్యతే సర్వైహి 
ఋజువచనవిరచితమిదం తు తంత్రసారం తతః శృణుత ఇతి ||

"తంత్రాలోకమనే గ్రంధము అతి విస్తారమైనది అగుటచే దానిని అందరూ  చదివి అర్ధం చేసుకోలేరు గనుక, ఈ తంత్రసారమనే గ్రంధాన్ని తేలిక భాషలో అందరికీ అర్ధమయ్యే లాగున వ్రాస్తున్నాను." అంటూ తంత్రసారమనే గ్రంధాన్ని ప్రారంభిస్తాడు.

 శ్లో||అజ్ఞానం కిల బంధహేతురుదితః శాస్త్రై మలం తత్స్మృతం
పూర్ణజ్ఞాన కళోదయే తదఖిలం నిర్మూలతాం గచ్చతి 
ధ్వస్తాశేషమలాత్మ సంవిదుదయే మోక్షశ్చ తేనామునా  
శాస్త్రేణ ప్రకటీకరోమి నిఖిలం యత్జ్నేయ తత్త్వం భవేత్ ||  
   
"సమస్త బంధాలకూ కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని శాస్త్రాలు "మలం" అన్నాయి. "నేనే పరమాత్మను" అన్న పూర్ణజ్ఞానం ఉదయించడం వల్ల ఈ అజ్ఞానమలం సమస్తమూ నిర్మూలనం అవుతుంది. ఈ విధంగా అజ్ఞాన ధ్వంసం కావడమూ సంవిత్ జ్ఞానోదయం కావడమే మోక్షం అనబడుతుంది. అట్టి మోక్షాన్ని పొందే మార్గాన్ని ఈ శాస్త్రంలో నేను వివరిస్తున్నాను." అని ఈ గ్రంధంలో అంటాడు.

శ్లో|| ఇద్దం షడర్ధ క్రమసంప్రదాయం 
స ప్రత్యయాప్రత్యయ భిన్నమాప్య 
శ్రీ శంభునాధ కరుణారసేన 
స్వయం ప్రసన్నాదనపేక్ష్య వృత్త్యా ||

నా గురువైన శంభునాధుని కరుణవల్లనూ, నాయొక్క నిర్మలమైన భావనచేతనూ నేను గ్రహించిన -- తెలియబడునది తెలుసుకోనేవాడు అన్న భేదం లేని (అద్వైత) స్థితిని కలిగించు -- షడర్ధ (త్రిక) సాంప్రదాయాన్ని  ఇక్కడ  వివరిస్తున్నాను." అంటాడు.


శ్లో|| కాష్మీరికోభినవగుప్త పదాభిదానః 
శ్రీతంత్రసార మకరోద్రుజునా క్రమేణ 
యత్తెన సర్వజన ఏష శివం ప్రయాతు
లోకోత్తర ప్రసర శాంభవతంత్రసారం ||

"సమస్తజనులకూ శుభాన్నీ శివాద్వైత స్థితినీ కలిగించగలదీ సమస్త తంత్రములయొక్క సారమూ అయినట్టి ఈ శాంభవతంత్రం లోకోపకారం కోసం కాశ్మీరవాసియైన అభినవగుప్తునిచే వివరంగా చెప్పబడినది." అని ఈ గ్రంధంలో ఉన్నది.

ఈ మహనీయుడు వ్రాశిన 25 గ్రంధాలవరకూ ప్రస్తుతం లభిస్తున్నాయి.కానీ దాదాపు అంతకంటే ఎక్కువ గ్రంధాలు మన ఖర్మకొద్దీ నశించిపోయాయి. వీటన్నిటిలోకీ తలమానికమైన "తంత్రాలోక"మనే గ్రంధం ప్రస్తుతం మనకు లభిస్తున్నది అంతవరకూ మనం అదృష్టవంతులమే అనుకోవాలి. ఈ తంత్రాలోకమనే గ్రంధాన్ని "రనేరో నోలి" అనేవాడు  సంస్కృతంనుంచి ఇటాలియన్ భాషలోకి అనువాదం చేశాడు ఈ అద్భుతగ్రంధాన్ని చదవాలనే ఆశతో జ్ఞాన తృష్ణతో ఎంతోమంది  యూరోపియన్, అమెరికన్ స్కాలర్స్ ఇప్పుడు ఇటాలియన్ నేర్చుకుంటున్నారు.

కానీ భారతీయులమైన మనకు మాత్రం అభినవగుప్తుని గురించీ లోకంకోసం ఆయన వ్రాసిన అద్భుతమైన గ్రంధాల గురించీ, వాటిలోని విషయాల గురించీ ఏమాత్రం తెలియదు. కనీసం తెలుసుకుందామన్న  ప్రయత్నమూ మనకు లేదు.అదీ మన మహర్షులకు మనమిచ్చే గౌరవం.