Pages - Menu

Pages

28, ఆగస్టు 2011, ఆదివారం

ప్రజా ఉద్యమాలు -- శనిగ్రహ ప్రభావం

జ్యోతిర్విజ్ఞానంలో శనిగ్రహ పాత్ర చాలా గొప్పది. అందరూ శనిని తిట్టుకుంటారు. కాని శనిగ్రహం భగవంతుని ధర్మ స్వరూపం అన్న విషయం తెలుసుకోలేరు. ధర్మానికి తనా మనా అన్న భేదం లేదు. ఎవరైనా సరే ధర్మం తప్పితే దానికి తగ్గ శిక్ష విధించడమే ఈ సృష్టిలో శనిగ్రహం యొక్క పాత్ర. 

మనుషులు శనిగ్రహాన్ని తిట్టుకోవడం మానాలి. గ్రహాలు దేవతా స్వరూపాలు. వాళ్ళను వాడు వీడు అని సంబోధించడం, " శనిగాడు" లాంటి మాటలు వాడటం వల్లకూడా చెడుకర్మ మెడకు పాములా  చుట్టుకుంటుందని మర్చిపోరాదు. తాము గతంలో చేసిన తప్పులకే ఇప్పుడు శిక్షారూపంలో బాధలు పడుతున్నామన్న సత్యాన్ని జనులు గ్రహించాలి. అంతేకాదు శనికి తైలాభిషేకాలూ  పూజలూ చేస్తూ నిత్యజీవితంలో మాత్రం  మళ్ళీ అవే తప్పుడుపనులు చేస్తున్న రాజకీయులూ వ్యాపారులూ అవినీతిఅధికారులూ తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.మీ దొంగపూజలవల్ల గ్రహాలు ఏమాత్రం లొంగవు. మీరు భూమ్మీద ఉన్న ఏ న్యాయవ్యవస్థ కళ్ళైనా కప్పవచ్చు.కాని ధర్మంకళ్ళు కప్పలేరన్న విషయం గుర్తుంచుకోవాలి. ధర్మస్వరూపం అయిన శనిగ్రహం ఎవరినీ ఒదిలిపెట్టదు. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో శనిభగవానునికి తెలిసినట్లు ఎవరికీ తెలియదు. 

గ్రహాలు సృష్టిని నడిపించే దైవీశక్తులు. మన నిత్యజీవితంలో నడవడికలో ధర్మాన్ని అనుసరించకుండా చేసే దొంగపూజలవల్ల ఏమీ ఉపయోగంలేదన్న విషయం ముఖ్యంగా మనం మర్చిపోరాదు. అధర్మపరులకూ అవినీతిపరులకూ తాత్కాలికంగా అంతా  బ్రహ్మాండంగా సాగుతున్నట్లు కనపడవచ్చు. కాని వారిసమయం వచ్చినపుడు వారుపడే బాధలు పరమభయంకరంగా ఉంటాయి. గ్రహాలు పూజలకు లొంగవన్న విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మన నిత్యజీవితంలో మార్పురాని ఉత్తపూజలవల్ల ప్రయోజనంలేదనీ మనం అర్ధం చేసుకోవాలి.

శని భగవానుడు సామాన్య ప్రజలకు కారకుడు. సహజరాశిచక్రంలో శని బలాన్ని పుంజుకున్న ప్రతిసారీ ప్రజా ఉద్యమాలు జరగటం ప్రత్యక్ష సత్యం. ఇది ఎలా జరుగుతుందో కొన్ని ఉదాహరణలద్వారా బాగా అర్ధం చేసుకోవచ్చు.

నవంబర్ 2011 లో శని భగవానుడు తులారాశిలో ప్రవేశించి ఉచ్చస్తితిలోకి రాబోతున్నాడు. అంటే బలాన్ని పుంజుకుంటున్నాడు. ప్రస్తుతం కొన్నినెలలుగా అనేక ప్రజాఉద్యమాలు చూస్తున్నాం. లిబ్యాలో ఈజిప్టులో  ఉద్యమాలు దీనిఫలితమే. అంతేకాదు, నేడు అవినీతికి వ్యతిరేకంగా భారతదేశంలో జరుగుతున్న " అన్నా ఉద్యమమూ " దీని ఫలితమే. వీటన్నిటిలో సామాన్యపౌరులే ప్రముఖపాత్ర పోషిస్తున్నారన్న విషయం గమనిస్తే మామూలుమనుషుల ప్రతినిధి అయిన శనిగ్రహపాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉపవాసం ఉండటమూ, ఒకచోట బంధింపబడటమూ ( అది ఐచ్చికంగా కూడా కావచ్చు), ధర్మంకోసం పోరాటమూ, వృద్ధునిదీక్షా, వైద్యపరీక్షలూ  ఇవన్నీ శనిగ్రహ కారకత్వాలేనన్న విషయం "అన్నాహజారే"  సత్యాగ్రహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నాదీక్ష వల్ల, ప్రజాభిప్రాయం విజయం సాధించడంవెనుక బలం పుంజుకుంటున్న శనిగ్రహం కనిపిస్తుంది.

ప్రజావిజయాలలో విప్లవాలలో శనిగ్రహపాత్ర కొంచం చూద్దాం. ప్రతి 30 ఏళ్లకొకసారి రాశిచక్రాన్ని చుట్టివచ్చి తులారాశిలో ఉచ్చస్తితికి శనిభగవానుడు వస్తాడని, అందులో రెండున్నరేళ్ళు ఉంటాడనీ మనకు తెలుసు. గతంలో శనిభగవానుడు తులారాశిలో ఉచ్చస్తితిలో ఉన్న సంవత్సరాలు అప్పుడు జరిగిన సంఘటనలు ఇక్కడ చూద్దాం.


2011 -- విజయవంతమైన అన్నాదీక్షతో ప్రజాగ్రహానికి తలొగ్గిన భారతప్రభుత్వం ఆయన డిమాండ్లను  ఆమోదించింది. 2012 లో శని పూర్తిగా ఉచ్చస్తితికి వచ్చినపుడు జనలోక్ పాల్  బిల్లుకు పూర్తివిజయం లభిస్తుంది అనడానికి ఇదొక సంకేతం.

1982 -- విసిగిపోయిన ప్రజలకోసం ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశంపార్టీ స్థాపన జరిగింది. తర్వాత ఎన్నికల్లో ఘనవిజయంతో ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరధం పట్టారు. ఆ తరువాత ఆ పార్టీలోనూ అవినీతి ప్రవేశించి తన పూర్వవైభవాన్ని కోల్పోయి పార్టీ పతనమైంది. అది వేరేసంగతి.

1952 -- భారత దేశపు మొదటి ఎన్నికలు జరిగాయి. దేశమంతటా స్వేచ్చ కోసం నవజీవనం కోసం ప్రజల ఎదురుచూపులు, ఎల్లెడలా ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

సింగపూర్ లో CPIB (Corrupt Practices Investigation Bureau) మొదలు పెట్టబడింది. ఈరోజు ప్రపంచంలోనే అతితక్కువ అవినీతి ఉన్న దేశాలలో ఒకటిగా సింగపూర్ ( మిగతావి డెన్మార్క్, న్యుజీలాండ్) ఎదిగింది. Transparency International ఇచ్చిన కితాబులే అందుకు నిదర్శనం.

1919 -- జలియన్ వాలాబాగ్ మారణకాండలో వందలాది సామాన్యజనం హత్య చేయబడ్డారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహజ్వాల ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ( ఈ సమయానికి శని తులారాశిలోకి ప్రవేశించలేదు. కాని దగ్గరగా ఉన్నాడు.)

1923 --జనాకర్షణ కలిగిన రంగస్తలనటుడు, నాయకుడూ అయిన NTR , గాయకుడు ముకేష్, నటుడు దేవానంద్, సామాన్యజనానికి యోగాన్ని చేరువ చేసిన "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వ్యవస్థాపకుడు స్వామి సత్యానందసరస్వతి మొదలైనవారి జననం జరిగింది. వీరందరూ సామాన్యునికి చేరువ అయినవారే అన్నది గమనించదగ్గ అంశం.

1893 -- ప్రపంచ వ్యాప్తంగా భారతీయవేదాంతం యొక్క మహత్యాన్ని ఎలుగెత్తి చాటి " India is the Guru of the world " అని నిరూపించిన వివేకానందుని ప్రధమప్రసంగం చికాగో పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఇవ్వబడింది. భారతదేశపు సనాతనధర్మానికి స్వామి తెచ్చిన గుర్తింపుతో భారతదేశపు ప్రజలందరిలో ఆత్మవిశ్వాసమూ ధైర్యమూ గర్వమూ కలిగాయి. అంతేకాదు, భారతదేశపు మహత్తర యోగవిజ్ఞానమైన క్రియాయోగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహనీయుడు "పరమహంస యోగానంద" ఈ సంవత్సరంలోనే జన్మించారు. ఈనాడు సామాన్యునికి కూడా యోగా గురించీ మన హిందూధర్మం గురించీ ఎంతోకొంత తెలుసంటే వీరే దానికి కారకులు.

1863 -- భారతదేశ పునరుజ్జీవనానికి ఆద్యుడైన శ్రీరామకృష్ణుని ప్రత్యక్షశిష్యులు స్వామివివేకానంద, స్వామిబ్రహ్మానంద, స్వామితురీయానంద, స్వామి రామక్రిష్ణానంద మొదలైన 16 గురు మహాసిద్ధుల జననం జరిగింది. ఈ మహనీయుల పుట్టుకతో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మపునరుజ్జీవనం ప్రారంభమైంది. వీరిలో ఒకరైన స్వామి అఖండానంద శిష్యుడే-- RSS రెండవనేత అయిన "పూజ్యగురూజీ" మాధవసదాశివ గోల్వాల్కర్ అని చాలామందికి తెలియదు. ఇదే సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ జరిగింది. ఆ సందర్భంగా బానిసలకు స్వేచ్చనిస్తూ అబ్రహాం లింకన్ " Emancipation Proclamation " ఇవ్వడం జరిగింది. ఇదీ ప్రజావిజయమే.

1833 -- Government of India Act, Abolition of slavery Act అనే ముఖ్యమైన చట్టాలు బ్రిటిష్ పార్లమెంట్ లో చేయబడ్డాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల Governor General of India పోస్ట్ సృష్టించబడింది. Abolition of slavery Act వల్ల బ్రిటిష్ రాజ్యం ఉన్న అన్ని దేశాల్లో బానిసత్వం నిర్మూలిస్తూ చట్టం చెయ్యబడింది. అదే సమయంలో మనదేశంలో భయంకరమైన క్షామం తాండవించింది. కలరా కరాళనృత్యం చేసింది. గుంటూరు లో ఈ ఏడాదివచ్చిన దారుణమైన కరువువల్ల కొన్ని వేలమంది తుడిచిపెట్టుకుపోయారని చెబుతారు. దీనినే "డొక్కల కరువు" అంటారు. దీని ప్రభావంవల్ల ఒంగోలునుంచి మచిలీపట్నం వరకూ, ఆకలితో, కలరాతో చచ్చిపోయిన వారి శవాలు ఎక్కడచూసినా గుట్టలుగా పేరుకుపోయాయి అంటారు. 

1835 -- "లార్డ్ మెకాలే మినిట్స్" వల్ల దేశచరిత్రనూ, విద్యారంగాన్నీ, జనుల జీవనవిధానాన్నీ తీవ్రంగా ప్రభావితంచేసిన ఇంగ్లీష్ విద్య మన దేశంలో కాలుమోపింది. లింక్ లాగ్వేజ్ అయిన సంస్కృతం మరుగునపడింది. ఇంగ్లీష్ వల్లే ఈనాడు మనం చైనా వంటి ఇతరదేశాలకంటే కొన్నిరంగాల్లో ముందున్నాం. కాని సంస్కృతం మరచిపోవడంవల్ల మన ధార్మికమూలగ్రంధాలను చదువలేకపోతున్నాం.

ఇలా వ్రాస్తూపోతే మనదేశంలోనూ ఇతరదేశాల్లోనూ  ఎన్నో ఎన్నెన్నో ఉదంతాలున్నాయి. ఒక్కటిమాత్రం స్పష్టం. భూమ్మీద జరుగుతున్న ప్రతిసంఘటన వెనుకా మనకు కనిపించని కారణాలూ శక్తులూ పాత్రపోషణ చేస్తున్నాయన్నది వాస్తవం. ఇందులో శనిభగవానుని పాత్రవరకూ కొద్దిగా మనం చూడగలిగాం. ఇలాగే మిగతాగ్రహాల పాత్రనుకూడా అర్ధం చేసుకోగలిగితే, ప్రపంచమనే స్టేజీ మీద జరుగుతున్న నాటకం మొత్తం అర్ధం అవుతుంది. పగళ్ళూ, రాత్రులూ, ఋతువులూ, ఎలా వరుసగా రిపీట్ అవుతున్నాయో అలాగే ప్రజాజీవితంలోనూ కొన్ని రిథమ్స్ ఉన్నాయి. నిర్దిష్టమైన కొన్నేళ్ళకు అవేఅవే  సంఘటనలు రకరకాల రూపాల్లో జరుగుతాయి. ప్రతిసారీ అవేసంఘటనలు జరుగకపోయినా, వాటి వెనుకనున్న theme మాత్రం అదేఉంటుంది.  అవి తెలుసుకుంటే భవిష్యత్తును స్తూలంగా దర్శించడం సాధ్యమే. బహుశా ఇలాగేనేమో బ్రహ్మంగారూ, నోస్త్రాడేమాస్ మొదలైనవారు భవిష్యత్తును చూడగలిగారు.

పై సంఘటనలను చదివినవారికి కొన్ని అనుమానాలు రావచ్చు. ఆ సంఘటనల్లో ప్రతిసారీ ప్రజలకు మంచి జరగలేదు. కొన్నిసార్లు చెడుకూడా జరిగింది. పైగా వాటిల్లో మతమూ ఉంది, రాజకీయాలూ ఉన్నాయి, ప్రజాజీవితమూ ఉంది, పరిపాలనా ఉంది, ప్రజాక్షయమూ ఉంది. శనిప్రభావం ఇన్నిరకాలుగా ఉంటుందా?  అన్న సందేహం రావచ్చు. దానికి ఒకటే సమాధానం. శనిప్రభావం రకరకాలుగా ఉంటుంది. ఆయన ప్రభావంవల్ల  ధర్మం అనేది అన్ని రంగాల్లోనూ స్తాపించబడుతుంది. అది మతం విషయంలో ఒకరకంగా జరుగుతుంది. రాజకీయాల్లో ఒకరకంగా జరుగుతుంది. ప్రజాజీవితంలో ఇంకొకరకంగా జరుగుతుంది. ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. 

కరువుకాటకాల్లో వేలమంది చనిపోవడం ప్రజలకు మంచి ఎలా అవుతుంది? అనికూడా అనుమానం రావచ్చు. చెడు అనేది సమాజంలో భరించలేనంత స్థాయికి చేరినప్పుడు ప్రజానిర్మూలనం తప్పదు. అప్పుడు ప్రకృతిభీభత్సాలు జరుగుతాయి. మనిషి చెయ్యి దాటిపోయినప్పుడు ప్రకృతే స్టీరింగ్ తీసుకుంటుంది. అప్పుడు అవసరమైతే వేలలక్షల సంఖ్యలో జనాన్ని నిర్మూలనం చెయ్యడంద్వారా తిరిగి సమతుల్యత స్తాపించబడుతుంది. మానవులకు తెలివిఉంటే అంతవరకూ తెచ్చుకోకుండా ఉండాలి. ప్రక్రుతి మనల్ని క్షమించే లిమిట్ లో మనం ఉన్నంతవరకూ పరవాలేదు. అది దాటితేమాత్రం జరిగే ఘోరాలు దారుణంగా ఉంటాయి. మానవుడు రాక్షసస్థాయికి దిగజారినప్పుడు ప్రకృతే మహిషాసురమర్ధినిగా మారి  అతన్ని ముక్కలు చేస్తుంది.  ఈ మధ్యలో జరిగిన ఒకనాయకుని ఉదంతమే అందుకు నిదర్శనం.

విశ్వప్రణాళిక బహుసూక్ష్మంగా విచిత్రంగా ఉంటుంది. శనిభగవానుని ధర్మస్థాపనా విధానాలుకూడా బహుచిత్రంగా ఉంటాయి. ఆయా సమయాలకు ఆయన మీదఉన్న గురువు, రాహువు, కుజుడు ఇత్యాది మిగతా ముఖ్యగ్రహాల ప్రభావాన్నిబట్టి అప్పటి సంఘటనలు జరుగుతాయి. వీటినుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మన అధికారమూ, హోదాలూ, డబ్బూ, పలుకుబడీ ఏవీ ఆ సమయానికి రక్షించవు.

ఏదేమైనా, శని భగవానుడు మంచిబలంగా ఉండబోయే వచ్చే మూడేళ్ళలో ప్రజాజీవితాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే సంఘటనలు దండిగా జరుగబోతున్నాయని చెప్పవచ్చు.