Pages - Menu

Pages

10, సెప్టెంబర్ 2011, శనివారం

రెండు నెలల గండకాలం

మనుష్యులు చేస్తున్న అధర్మానికి తగిన శిక్ష వేసే కోపగ్రహం కుజుడు ఈ రోజునుంచి నీచస్తితిలో ప్రవేశిస్తున్నాడు. తనయొక్క  యుద్ధప్రియత్వాన్నీ, రక్తదాహాన్నీ చల్లార్చుకునేందుకు అనేక పధకాలు రచిస్తున్నాడు. అయితే, ఆయా పధకాలు  ఆయన సొంత పధకాలు కావు. మనుష్యులు తెలివితక్కువతనంతో దూరదృష్టిలేమితో, అత్యాశతో చేసుకుంటున్న చెడుకర్మ ఫలితాలే అవి. ఇక యాక్సిడెంట్లకూ, ఆయుధఘాతాలకూ, రక్తదర్శనాలకూ, శస్త్రచికిత్సలకూ ప్రజలు సిద్ధంగా ఉండాలి. 

కుజుడు మిధునరాశిలో చివరినక్షత్రపాదంలో సెప్టెంబర్ 4 న ప్రవేశించగానే ప్రపంచవ్యాప్తంగా దుర్ఘటనలు మళ్ళీ మొదలయ్యాయి. మొన్న ఏడవతేదీన ఏకాదశిరోజున డిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ళ వెనుక ఎవరిహస్తమైనా ఉండవచ్చుగాక. అంతిమంగా మాత్రం మనకు కనిపించకుండా వీటిని ప్రేరేపించిన ప్రకృతిశక్తులు ఉన్నాయి. వాటి ప్రేరేపణ కూడా మన ఖర్మానుసారమే ఉంటుంది. అదీ అసలైన విచిత్రం.

కుజుడు తనయొక్క నీచస్తితిలో  అక్టోబర్ 30 వరకూ ఉంటాడు. ఈ రోజునుంచి 14 వరకూ రాశి నవాంశలలో నీచ స్తితి కొనసాగుతుంది. ఈ సమయంలోనే భాద్రపద పౌర్ణమి వస్తుంది. కనుక ఈ నాలుగు రోజులు కూడా గండకాలమే.  తరువాత, సెప్టంబర్  27 న వస్తున్న భాద్రపద అమావాస్య, అక్టోబర్  26 న వస్తున్న ఆశ్వయుజ అమావాస్యలకు అటూఇటూగా కుజుడు తనప్రతాపం ఖచ్చితంగా చూపిస్తాడు. ఈ సంఘటనలు ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జాతకాలలోనూ కూడా ఉంటాయి. భూకంపాలు, వాహనప్రమాదాలు, ప్రక్రుతిభీభత్సాలు, దుండగులదాడుల రూపంలో ప్రజాజీవితంలో ఇవి కనిపిస్తాయి. యాక్సిడెంట్లు, ఆపరేషన్లు, గొడవలు, దెబ్బలు తగలడం, రక్తాలు కారడం, జ్వరాలు వంటి రూపంలో వ్యక్తిగతజాతకాలలో ఉంటాయి. మనం ఏమిచేసినా చెల్లుబాటు అవుతుంది, మనల్ని గమనించేవారు ఎవరూలేరు అని అనుకుంటూ అధర్మాన్ని పోషిస్తున్న నాయకులూ,  దైవధర్మాన్ని, ప్రక్రుతి ధర్మాన్ని తప్పుతున్న ప్రజలూ తమచర్యలకు తగిన ఫలితాన్ని పొందడానికి, కుజాగ్రహాన్ని చవిచూడటానికి ఈ సమయంలో సిద్ధంగా ఉండండి.