నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, అక్టోబర్ 2011, గురువారం

లక్నో విశేషాలు - 2

A wise man learns by the mistakes of others, a fool by his own.

అని ఒక మంచి సామెతుంది. కొందరు ఇదొక లాటిన్ సామెత అంటారు. ఇంకొందరేమో దీన్ని కన్ఫూషియస్ చెప్పాడంటారు. ఎవరు చెప్పినా, దీనిలో గొప్ప జీవితసత్యం ఉన్నమాట వాస్తవం. ఇలాంటి సామెతే ఇంకోటుంది. 

A wise man learns from life, a fool from books.

ఇందులో కూడా గొప్ప సత్యం ఉంది. ఈ సామెతలన్నీ పనీ పాటాలేనివాళ్ళ  సృష్టి అని కొందరంటారు. కాని అవి జీవితపు చేదు అనుభవాలనుంచి పుట్టినవని నేను విశ్వసిస్తాను. 

మొన్న లక్నో ప్రయాణమంతా నాతో ప్రయాణం చేసిన చాలామందికి చాలా బోరుగా గడిచింది. 60 గంటల ప్రయాణం అదీ తిండీ తిప్పలూ లేకుండా అంటే మాటలా? కానీ నాకు మాత్రం ఈ ప్రయాణం చాలా విషయాలు నేర్పింది. మానవ మనస్తత్వాలను దగ్గరగా గమనిస్తే అనుక్షణం ఎన్నో insights కనిపిస్తాయి. అలా అనుక్షణం  గమనించగలిగితే, నేర్చుకోగలిగితే  "బోర్" అనేదే ఉండదు. తోటి ప్రయాణీకుల విసుగునీ, చిరాకునీ, అసహనాన్నీ, భయాన్నీ, దురాశనీ, అవకాశవాదాన్నీ, నటననీ, అహాన్నీ, దిగజారుడుతనాన్నీ, స్వార్దాన్నీ ఇంకా ఎన్నోఎన్నో కోణాలను నా కళ్ళముందు ఈ ప్రయాణం సాక్షాత్కరింపచేసింది. 

మీకంతా చెడే కనిపించిందా? ఎవరిలోనూ మంచి కనిపించలేదా? దుర్యోధనుడి లాగా మీలోపలే అసలు ఈ కుళ్ళు అంతా ఉందేమో? అన్న అనుమానం చదివేవారికి రావచ్చు. నేనే కాదు, సాక్షాత్తూ ధర్మరాజు వచ్చిచూసినా నేడు మంచి అనేది ఎక్కడో తప్ప ఆయనకి కూడా కనిపించదు. ఆ సంగతి అలా ఉంచితే, ఈ విధమైన పరిశీలన ఎన్నో విషయాలను నేర్పుతుంది. బహుశా అందుకేనేమో లోకం తిరిగిచూస్తేగాని విషయం అర్ధం కాదు అని పాతకాలంలో నమ్మేవారు. 

మన చేతుల్లో లేని విషయాన్ని గురించి పదేపదే ఆలోచిస్తూ బాధపడే రకపు మనుషులు చాలామంది నేడు సమాజంలో ఉన్నారు. దీన్నే anxiety neurosis అనుకోవచ్చు. దీనికి కారణం మితిమీరిన ఆశా, భయమూ, ఆదుర్దాలు. 

"నువ్వెక్కాల్సిన రైలు ఓ జీవిత కాలం లేటు"  అన్నది ఆరుద్ర అనుకుంటా. అంతలా కాకపోయినా నేనెక్కిన రైలు ఓ 20 గంటలు లేటుగా నడిచింది. ఇక రైలెక్కిన దగ్గర్నించీ సాటి ప్రయాణీకులు ఒకటే నస. "ఇంత లేటు ఎందుకవ్వాలి? ఆ కేసీఆర్ కి అసలు బుద్ధుందా? తన స్వార్ధంకోసం జనాన్ని చంపుకు తింటాడా?  రైల్వేవాళ్ళకి జ్ఞానం లేదా? ఇంత చుట్టూ తిప్పి తీసుకుపోకపోతే అసలు ట్రెయిన్  కేన్సిల్ చెయ్యవచ్చుకదా? " అంటూ ఒకటే గోల. వాళ్ళు  నిద్రపోతున్న కాసేపు తప్పితే, లేచీ లేవటంతోనే  చాలామంది ఇదే చర్చా, ఇదే నస. 

ఒకామె అయితే " కాన్పూర్ ఇంకా ఎప్పుడొస్తుంది?" అన్న మాట కొన్ని వందలసార్లు అనుంటుంది. వినీవినీ చివరికొకసారి " ఏవండీ కాన్పూర్ ఇంకెప్పుడోస్తుంది" అని  నేనే అడగటం మొదలుపెట్టా. నేను ఎగతాళి చేస్తున్నానని ఆమెకు అర్ధమైంది. ఆమె కోపాన్ని గమనించి,  బైబిల్ నుంచి ఆక్షణంలో నాకు గుర్తొచ్చిన కొన్నిమాటలు ఆమెకు చెప్పా. "ఆదుర్దా పడటం వల్ల మీ తలవెంట్రుకలలో ఒకదాన్ని నల్లగాగాని తెల్లగాగాని మార్చగలరా? మీ ఎత్తుకు ఒక అంగులాన్ని చేర్చగలరా? లేక మీ జీవితంలో ఒక గంట కాలాన్ని పెంచగలరా?" అని జీసస్ అన్నాడు. అలాగే, ఆదుర్దా పడటం వల్ల మీ బీపీ పెరగడం తప్ప ఇంకేమీ జరగదు. మీరు ఆదుర్దాపడినంత మాత్రాన రైలు త్వరగా వెళ్ళదు. పడనంత మాత్రాన మెల్లగానూ వెళ్ళదు. అది చేరే సమయానికి చేరుతుంది. కనుక మీరు నిశ్చింతగా ఉండండి -- అని చెప్పాను. 

"మీరు క్రిష్టియనా?" ఆమెకు  అనుమానం వచ్చింది.
" కాదు. అవును." అని జవాబిచ్చాను.

"అదేంటి?" అందామె.

"మతరీత్యా నేను హిందువునే. కాని క్రీస్తు ఒక మహాయోగి అని నేను నమ్ముతాను. ఆయన చెప్పినదాంట్లో ఎంతో మంచి ఉందనీ విశ్వసిస్తాను. ఆయనకు నమస్కరిస్తాను. కనుక ఆ కోణంలో నేను "క్రిస్టియన్" అని మీరనుకుంటే నాకభ్యంతరం లేదు." అని చెప్పాను.

ఇదంతా వింటున్న ఒకాయన "ఇదేనండీ మన హిందువుల్లో ఉన్న జాడ్యం. మనకు మన భగవద్గీత కంటే బైబిలే ఎక్కువ తెలుసు" అన్నాడు ఎగతాళిగా.

"అనవసర ఆదుర్దా పనికిరాదనీ శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. మనం ఆయన్ని పూజించడమే కాని ఆయన చెప్పినమాట పాటించం కదా. వినండి అని " అశోచ్వా నన్యసోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూన్శ్చ నాను శోచంతి పండితాః " అన్న గీతాశ్లోకాన్ని ఉదహరించాను.

"అందరూ నీతులు చెప్పేవాళ్ళే. పడేవాళ్ళకి తెలుస్తుంది బాధ." అన్నాడు ఇంకో ముసలాయన నీరసంగా.

"బాధ ఉండదని నేను చెప్పటం లేదు. నేనూ మీతోనే ప్రయాణం చేస్తున్నాగా. కాని మాటిమాటికీ విసుగును పెంచుకోవడం వల్ల ప్రయోజనం లేదనే నేనంటున్నాను. అదిగో చూడండి మీరు ఇంతగా ఎదురుచూస్తున్నారనే ఈ స్టేషన్లో క్రాసింగ్ పెట్టినట్లున్నాడు. ఇంకో అరగంటో గంటో ఇక్కడ వెయిటింగ్ తప్పదు." అన్నాను.  బండి ఏదో స్టేషన్లో ఆగనే ఆగింది.

"అలా దేభ్యంలా కూచోకపోతే దిగి విషయం ఏమిటో కనుక్కోండి." అని పక్కనించి ఒక ఆడగొంతు ఎవరినో గదమటం వినిపించింది. వెంటనే ఓ అర్భకపు నడివయసు మొగుడు తప్పదన్నట్లు కాళ్ళీడ్చుకుంటూ ప్లాట్ఫారం మీదికి దిగటమూ జరిగింది. "పదండి. తినటానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం" అని ఇంకొందరు దిగారు.

పచార్లు చేద్దామని, నవ్వుకుంటూ నేనూ రైలు దిగాను.