నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, అక్టోబర్ 2011, గురువారం

స్టీవ్ జాబ్స్ -- ఒక జ్యోతిష్యకోణం

యాపిల్ కంపెనీ అధిపతి స్టీవ్ జాబ్స్ 56  ఏళ్ల వయసులో నిన్న చనిపోయాడు. 2004  సంవత్సరం నుంచీ అతను "పాంక్రియాస్ కేన్సర్"తో బాధ పడుతున్నాడు. అతని జాతకాన్ని ఇక్కడ చూడవచ్చు. 

ప్రస్తుతం ఇతని జాతకంలో చంద్ర/శని/చంద్రదశ జరుగుతున్నది. ఇది విషదశ. ఇటువంటి యోగాన్ని పరాశరాదిమహర్షులు "విషయోగం' అన్నారు. కేన్సర్ కణాలు శరీరమంతా వ్యాపించి మరణాన్ని కొనితేవడం అంటే శరీరం విషపూరితం కావడమే. చంద్రుడు ద్వాదశాదిపతిగా అష్టమంలో ఉన్నాడు. శని రోగస్తానాదిపతిగా ఆయుష్యస్థానంలో ఉచ్చస్తితిలో ఉన్నాడు. చంద్ర శనులిద్దరూ షష్ట-అష్టక స్తితిలో ఉన్నారు. గోచారరీత్యా గురువు ఇప్పుడు నవమ (భాగ్య) స్థానంలో వక్రించి ఉన్నాడు. శని ద్వితీయమారకస్థానంలో కన్యలో ఉన్నాడు. అంతేగాక అష్టమారూడం మీద సంచరిస్తున్నాడు. చంద్రలగ్నాత్ గోచారబుధశనుల డిగ్రీ కంజంక్షన్ సప్తమ/ద్వితీయ మారకస్థానంలో జరిగింది.కనుక ఇది మారక సమయం అయి కూచుంది. ఈ సంఘటన జరిగింది కూడా బుధవారం కావడం గమనార్హం.

జాతకంలో రోగస్తానంలో వక్రించిఉన్న బుధుడు మూడవద్రేక్కాణంలో ఉన్నాడు. మకరంనుంచి మూడవ ద్రేక్కాణం అంటే కన్యఅవుతుంది. కన్య పొత్తికడుపు ప్రాంతాన్ని, అక్కడ రాబోయేరోగాన్ని సూచిస్తుంది. షష్ఠ-అంశ చక్రంలో లగ్నం మళ్ళీ కన్యఅయింది. అందులో గురు, శుక్ర, శనులు కొలువై ఉన్నారు. దీనివల్ల పొత్తికడుపు ప్రాంతానికి సంబంధించిన రోగంవస్తుందని సూచన ఉంది. జాతకరీత్యా గోచారరీత్యా కన్యారాశికి ఇతనిజాతకంలో ఉన్న ప్రాధాన్యత చూడవచ్చు.

గోచార బుధశనులిద్దరూ కుజునిచిత్తా నక్షత్రంలో కలవడమూ, కుజుడు చంద్రలగ్నాత్ ద్వితీయమారక స్థానంలో ఉండి సప్తమ దృష్టితో అష్టమంలో ఉన్న శనిని వీక్షించడమూ చూడవచ్చు. ప్రస్తుతం విమ్శోత్తరీ దశారీత్యా  శని అంతర్దశ జరుగుతున్నదనీ, యోగినీదశారీత్యా శని అంతర్దశలో కుజ విదశ జరుగుతున్నదనీ గ్రహిస్తే తెరవెనుక ఉన్న లింకులు చక్కగా అర్ధమౌతాయి.   

2004లో ఇతనికి రవిమహాదశలో శనిఅంతర్దశ మొదలైంది. అప్పుడే పాంక్రియాస్ కేన్సర్ ఉన్నట్లు బయటపడింది. రవిశనులిద్దరూ  బద్ధశత్రువులు, రవి రాహు నక్షత్రంలో ఉంటూ, నయంకాని దీర్ఘరోగాన్ని సూచిస్తున్నాడు. శనిభగవానుడు గురునక్షత్రంలో ఉండి అవయోగాన్నిస్తున్నాడు. తరువాత వరుసగావచ్చిన బుధ, కేతు, శుక్ర అంతర్దశలు రోగాన్ని ముదిర్చాయి. బుధుడు వక్రీకరించి రోగస్తానంలో ఉండటమూ, శుక్రుడు పాపిగా రాహువుతో కలిసిఉండటమూ కారణాలు. కేతువు సంగతి  ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ధనం ఉన్నంతమాత్రాన అన్నీ సాధించగలం అనుకోవడం పెద్దపొరపాటు అని ఇతని జాతకం రుజువుచేస్తోంది. కర్మఫలితాన్ని ఎంతటివారైనా  తప్పించుకోలేరు అనడానికి ఈ జాతకం ఒక ఉదాహరణ.

చంద్రుని శనినక్షత్ర స్తితివల్ల ఇతనికి వేదాంతధోరణి ఉండేది. చంద్రునికీ శనికీ డైరెక్ట్ సంబంధం లేకపోయినా నక్షత్ర స్థాయిలో సంబంధం ఉంది. 2005లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో ఇచ్చిన ప్రసంగంలో -- మనం ఈభూమ్మీద జీవించేసమయం తక్కువగనుక, ఇతరులభావాలకు కీలుబొమ్మలుగా బతకరాదనీ, మనం ఏమి కావాలనుకుంటున్నామో అదిఅవ్వాలనీ, ఏది చెయ్యాలనుకున్నామో అదిచెయ్యాలనీ చెప్పాడు.  బహుశా ఇదొకరకమైన ప్రిమోనిషన్ కావచ్చు.ఇటువంటి వైరాగ్యధోరణిని ఈ రకమైన గ్రహస్తితి ఇస్తుంది. ఎంతసేపూ మరణంగురించి ఆలోచించేవారికీ మాట్లాడేవారికీ  జాతకంలో శనిచంద్రుల సంబంధం తప్పకుండా ఉంటుంది. జరగబోయే చెడు, లీలగా వారికి స్ఫురిస్తూ ఉంటుంది. ఒకరకమైన తొందరా, నిరాశా వాళ్ళమాటల్లో తొంగిచూస్తాయి. అతనిచ్చిన  స్పీచిలో కొంత భాగం చూస్తే నేను చెప్పినది నిజమని అర్ధమౌతుంది.

"Remembering that I’ll be dead soon is the most important tool I’ve ever encountered to help me make the big choices in life. Because almost everything — all external expectations, all pride, all fear of embarrassment or failure – these things just fall away in the face of death, leaving only what is truly important. Remembering that you are going to die is the best way I know to avoid the trap of thinking you have something to lose. You are already naked. There is no reason not to follow your heart.”
 
“Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma — which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition. They somehow already know what you truly want to become. Everything else is secondary.”


యోగినీదశాపరంగా కూడా ఇతనికి ప్రస్తుతం చంద్ర/శని/కుజ దశ జరుగుతున్నది. ఇదొక విచిత్రం. రెండు రకాలైన దశలు ఒకే గ్రహదశలను చూపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇతని జాతకంలో అదే జరిగింది.

అన్నీఉండి ఆయుస్సు లేకపోవడం ఒక దురదృష్టం అయితే, అమితసంపన్నులూ ఆధునికవైద్యాలు అందుబాటులో ఉన్నవారూ కూడా కొన్నిరోగాలను నయం చేసుకోలేక వాటితో బాధపడి చిన్నవయసులో  మరణించడం మరొక దురదృష్టం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే - అంతా తనచేతుల్లో ఉందన్న అహంకారాన్ని మనిషి విడనాడి, కర్మనూ దాని ఫలితాన్నీ, పునర్జన్మనూ, ప్రపంచం అనే ఈ లీలనూ, దానివెనుక ఉన్న మహాశక్తినీ  నమ్మవలసి వస్తుంది. అలాంటి ఆలోచనలే క్రమేణా మనిషిని జీవితసాఫల్యత వైపు నడిపిస్తాయి.

ఇతని జాతకంలో ధనయోగాలను ఇంకోసారి చూద్దాం.