Pages - Menu

Pages

17, అక్టోబర్ 2011, సోమవారం

నాక్కూడా శత్రువులా? అసంభవం

ఒక వారం ట్రెయినింగ్ కోసం ఈరోజే లక్నో వచ్చాను. దారిలో ట్రెయిన్లో ఉండగా ఒక వింతవార్త తెలిసి నవ్వొచ్చింది. ఒక అభిమాని నాకు ఫోన్ చేసి "సార్. మీ బ్లాగ్ డిలీట్ కాబడింది. నిన్న రాత్రినుంచి చూద్దామంటే కనిపించటం లేదు. ఇదేంటి సార్ ఇలా జరిగింది? " అని అడిగాడు. సరే చూద్దామని వెంటనే లాప్టాప్ తెరిచి చూస్తే నిజంగానే "Your blog is deleted" అని గూగిల్ నుంచి మెసేజి ఉంది. నేను వ్రాసిన వ్రాతలలో నాకు నచ్చిన మంచి పోస్ట్ లను pdf format లోకి ఇప్పటికే మార్చి ఉంచాను. కనుక ఇబ్బంది లేదు. కాని, నా బ్లాగు ఇష్టపడేవాళ్ళు ఎందఱో ఉన్నారు. ప్రతిరోజూ నా బ్లాగు చూడకుండా ఏ పనీ ప్రారంభించనివాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం ఎందఱో నాకు మెయిల్ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. వారంతా ఈ సంగతి తెలిస్తే చాలా బాధపడతారు. అందుకని వెంటనే గూగిల్ కి ఆన్ లైన్  కంప్లెయింట్ ఇవ్వటం, ఒక అరగంట వ్యవధిలో మళ్ళీ బ్లాగు రెస్టోర్ కావడం చకచకా జరిగిపోయాయి.

బ్లాగు డిలీట్ అయినందుకు నాకు బాధ కలుగుతుందేమో అని అనుకుంటూ మనసువైపు ఒకసారి తేరిపార చూశా. కాని విచిత్రంగా నాకు ఇసుమంత కూడా బాధ కలగలేదు. మనసులో ఏ విధమైన రియాక్షన్ లేదు. ఈ స్తితి నాకే ఆశ్చర్యం అనిపించింది. పైగా నవ్వొచ్చింది. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మనుషులే శాశ్వతం కానప్పుడు ఇక మన వ్రాతలెంత? అనిపించింది.

నాకు కంప్యూటర్ పరిజ్ఞానం అంత గొప్పగా ఏమీ లేదు. ఇంటర్నెట్ లోని వైరస్ వల్ల ఇలా కావచ్చు అని నేను సరిపెట్టుకున్నాను. కాని ఎవరైనా పనికట్టుకుని కూడా చేసిఉండొచ్చు అని కొందరు మిత్రులు ఫోన్ లో అన్నారు. అలాటి వాళ్ళు ఉంటారని నేననుకోను. ఒకవేళ ఉంటె, వాళ్ళ ఖర్మకు నేను బాధ్యున్ని కాను కదా. ఎవరి చర్యలకు వారే బాధ్యులౌతారు. దానికి తగిన ఫలితం ప్రత్యక్షంగానో పరోక్షంగానో తప్పకుండా ఉంటుంది. మన జ్ఞానసంపద మనతోనే ఉంటుంది. అదేక్కడికీ పోదు. ఒకవేళ పోయేది అయితే అది మన సొంతం కాదు. కనుక మనం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను.

ఈరోజుండి రేపు మనల్ని వదలి పోయే జ్ఞానం జ్ఞానమే కాదు. అలాంటి జ్ఞానం ఉండకపోతేనే మేలు.