Pages - Menu

Pages

19, నవంబర్ 2011, శనివారం

హస్తసాముద్రికం -- అద్భుతశాస్త్రం

హస్తసాముద్రికం అనేది ఒక అద్భుతమైన శాస్త్రం. దీని గురించి కొంత మాట్లాడుకుందాం. చేతిలో గీతలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని తెలియనివాళ్ళు అనుకుంటారు. కాని అలా ఉండవు. చూట్టానికి ఒకేరకంగా ఉన్న మనుషుల్ల్లో కూడా హస్తరేఖలు ఒకేలా ఉండవు. వేళ్ళ అమరికలోనూ, ఆకారంలోనూ, చర్మపుతీరులోనూ, గోళ్ళ తీరులోనూ, కణుపుల తీరులోనూ మనిషికీ మనిషికీ చాలా తేడాలుంటాయి. ఇక గ్రహస్థానాలు, రేఖలు, ప్రత్యెకమైన గుర్తులు ఇలా ప్రతి విషయంలోనూ తేడాలుంటాయి. 

తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పిడికిలి బిగించి చేతులు ముడుచుకుని ఉంటుంది కనుక ఆ గీతలు ఏర్పడతాయని హేతువాదులూ నాస్తికులవంటి అజ్ఞానులు టీవీలలో చెబుతుంటారు. అందరూ శిశువులూ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకేలా పిడికిలి బిగించుకుని ఉంటారు. కాని హస్తరేఖలు ఏ ఇద్దరు శిశువులకూ ఒకేలా ఉండవు. అంతే  కాదు, ఒకే శిశువులోనే కుడిచేతిరేఖలకూ ఎడమచేతిరేఖలకూ తేడాలుంటాయి. దీనికి ఎవ్వరూ వివరణ ఇవ్వలేరు. 

అసలు విషయం అది కాదు.నాడీశాస్త్రం ప్రకారం శరీరంలోని నాడులన్నీ అరచేతిలోనూ అరికాళ్ళలోనూ కేంద్రీకరించబడతాయి. ఆక్యుపంచర్, ఆక్యుప్రెజర్ విద్యలు కూడా ఈ నిజాన్ని గ్రహించినవే. కనుకనే చేతిలోనూ కాళ్ళలోనూ ఉన్ననాడులను మాసేజ్ చెయ్యడం ద్వారా చాలా రోగాలను తగ్గించవచ్చు. మార్షల్ ఆర్ట్స్ లో శరీరంలోని మర్మకేంద్రాల జ్ఞానంకూడా ఇలాగే ఉంటుంది. మనిషి ఒంటిలో ఎక్కడ ఏరకంగా కొడితే స్పృహ తప్పించడం నుంచి, పక్షవాతం వంటి స్తితులు వచ్చేట్టు చెయ్యడం లేదా స్పాట్లో ప్రాణం తియ్యగల ప్రమాదకరమైన దెబ్బల వంటివి అన్నీ మర్మవిద్యలో ఉన్నాయి. అదే వేరే సబ్జెక్టు గనుక ప్రస్తుతం మన విషయానికి వద్దాం.

Face is the index of the mind. అన్న సామెత బాగా వాడుకలో ఉన్నదే. కాని ముఖం ఒక్కటే కాదు. మనిషి శరీరంలోని ప్రతి అవయవమూ మనిషి యొక్క మనస్తత్వాన్నీ, ఆలోచనా సరళినీ, అలవాట్లనూ పట్టిస్తుంది. అలాగే హస్తరేఖలు కూడా మనిషిని గురించి సమస్తమూ వెల్లడిస్తాయి. జాతకచక్రం ఎంతో మనిషి అరచెయ్యి యొక్క ప్రింటూ అంతే. ఇవి రెండూ రెండు రకాల భాషలు అనుకుంటే, అవి చెప్పే విషయం మాత్రం ఒకటే ఉంటుంది. మనిషి ఆలోచనల ప్రభావం నాడుల ద్వారా హస్త రేఖలను మారుస్తూ ఉంటుంది.

మనిషి ఆలోచనలు అతని శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, చేతి రేఖలనూ ప్రభావితం చేస్తాయి. అందుకే మన ఆలోచనా ధోరణి మారుతున్న వయస్సులో చేతి రేఖలూ మారుతాయి. పాతరేఖలు మాయం అవుతాయి. కొన్ని కొత్తరేఖలు పుట్టుకొస్తాయి. ఇది ఎవరి చేతిలో వారే గమనించుకోవచ్చు. అప్పుడు నేను చెబుతున్నది నిజమే అని ఎవరికి వారికే అర్ధం అవుతుంది. ఈ విషయాన్ని మన ప్రాచీన ఋషులు ఎప్పుడో గమనించారు. గమనించడమే కాదు, ఈ శాస్త్రాన్ని చాలా లోతుగా రీసెర్చి చేసి అనేక సూత్రాలను వ్రాసిపెట్టారు. ఆయా సూత్రాలను ఉపయోగించి చూస్తే, అవి చాలావరకూ నిజం కావడం మనం చూడవచ్చు.

మనిషి చేతిలో గ్రహాలను దర్శించవచ్చు. జాతక చక్రాన్ని మనిషి చేతిలో చూడవచ్చు. చేతిని చూచి మనిషి యొక్క జాతకాన్ని ఖచ్చితంగా వ్రాసే విద్య మన దేశంలో ఉంది. అలా వ్రాయగలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వారు గీసిన జాతకచక్రం, మన జనన సమయానికి పంచాగంతో మనం గుణించిన జాతకచక్రం ఒకేలా వస్తాయి. గ్రహాల పోజిషన్స్ అన్నీ ఒకేలా సరిపోతాయి. చాలా మందికి జనన సమయం ఉండదు. అనేక కారణాలవల్ల తల్లితండ్రులు ఆ సమయాన్ని గుర్తుంచుకోక పోవచ్చు. ఒకవేళ గుర్తున్నా, అన్ని కుటుంబాలలోనూ జాతకాలు వ్రాయించే అలవాటు ఉండదు. కనుక అటువంటి వారికి ఈ విధానం ద్వారా జాతక చక్రాన్ని రాబట్టవచ్చు. దాన్ని బట్టి జననతేదీని నిర్ధారణ చెయ్యవచ్చు. అంటే చేతిని చూచి ఒక వ్యక్తి యొక్క date of birth చెప్పడం సాధ్యమే అన్నమాట. ఇదెంత అద్భుతమో చూడండి. అంటే మనిషి ఒక రకంగా తన జాతకాన్ని ఎప్పుడూ తన చేతిలోనే మోస్తూ తిరుగుతున్నాడు.

అంగుష్ఠవిద్య అని దీనిలో సూపర్ స్పెషలైజేషన్ ఒకటుంది. అందులో అయితే చేతిరేఖలను కూడా పరిశీలించరు. ఒక్క బొటనవేలి మీద ఉన్న గీతలనుబట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తాన్నే చదివేస్తారు. ఈ విద్యలో రావణుడు అఖండమైన ప్రజ్ఞాశక్తి కలిగినవాడని అంటారు. ఆయన వ్రాసిన 'రావణసంహిత' అనే గ్రంధంలో ఈ వివరాలు ఉన్నాయి. ఇలా అనేకానేక అద్భుత విద్యలు మన దేశంలో ఉండేవి. అవన్నీ కాలక్రమేణా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇవన్నీ పునరుజ్జీవనాన్ని చవిచూస్తున్నాయి. దీనికి కారకులు మన వాళ్ళే కాదు , అమెరికా, యూరోప్ లోని అనేకమంది పాశ్చాత్యులు ఈ విద్యల గొప్పతనాన్ని గుర్తించి వాటిమీద అనేక సంవత్సరాలుగా రీసెర్చి చేస్తున్నారు. నేడు మన జ్యోతిష్యం గురించి మనకు తెలియని అనేక విషయాలను మనమే బిత్తరపోయేలా చెప్పగల అనేకమంది పాశ్చాత్యులు ఉన్నారంటే వింతగా ఉన్నా ఇది నిజం. దానికి కారణాలు -- ఒకపక్క  మన చేతగానితనమూ, మన ప్రాచీన విద్యలను మనమే ఎగతాళి చేసుకుని, అదొక ఫేషన్ అనుకునే భావదారిద్ర్యమూ, సూడో సైంటిఫిక్ వాదమూ, కమ్యూనిస్టువాదమూ వగైరా వగైరాలు. 

పాతతరంలో కీరోవంటి మేధావులు మనవిద్యలను నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. ఈ తరంలో కూడా మన జ్యోతిష్యాది విద్యలను లోతుగా అధ్యయనం చెయ్యడంలో అనేకమంది పాశ్చాత్యులు పరిశ్రమ చేస్తున్నారు.  

బహుశా తెల్లవాళ్ళు చెబితేగాని మన సంస్కృతి ఎంత గొప్పదో మనకు తెలియదేమో. దీన్నంతా చూస్తుంటే, మన ప్రాచీనవిద్యల గొప్పతనాన్ని గురించి పాశ్చాత్యులు వివరిస్తుంటే నోరెళ్ళబెట్టి మనం వినేరోజు దగ్గరలోనే ఉంది అనిపిస్తోంది. అప్పటికైనా మనకు పట్టిన భావదరిద్రం వదులుతుందా?