Pages - Menu

Pages

9, డిసెంబర్ 2011, శుక్రవారం

శ్రీరామరాజ్యం

ఈ సినిమామీద మీఅభిప్రాయం ఏమిటో వ్రాయకూడదా అని ఒకమిత్రుడు అడిగాడు. ఎందుకులే బాబు, నా అభిప్రాయాలు చాలామందికి నచ్చవు. ఏదన్నా అంటే అదుగో ప్రతిదానికీ విమర్శిస్తావు అంటారు. అని తప్పుకుందామని చూశాను. నచ్చటం నచ్చకపోవటం వేరేసంగతి ముందు మీరేమనుకుంటున్నారో మాకు తెలియాలి. చెప్పండి అని బలవంతం చేసాడు. సరే వ్రాస్తాలే అని చెప్పాను.

మొన్నెప్పుడో వినుకొండలో దోమలచేత కుట్టించుకుంటూ ఒక మామూలుహాల్లో ఈసినిమా చూశాను. కొందరు అంటున్నంత మహాగొప్పగానూ లేదు, అలాగని చెత్తగాకూడా ఏమీలేదు అనిపించింది. బాగులేని హాలూ, దోమలబాధ వల్ల కలుగుతున్న అసహనమూ నా అభిప్రాయాన్ని ఏమాత్రమూ ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్తపడుతూ మరీ ఈ సినిమా చూశాను.

బాపు స్వతహాగా చిత్రకారుడు గనుక ప్రతి ఫ్రేమూ చక్కగా చిక్కగా ఒక పెయింటింగ్ లాగా ఉండేలా జాగ్రత్తపడుతూ సినిమాని తీశాడు. కాని ఒక కళాఖండాన్ని తీసేటప్పుడు అదొక్కటే సరిపోదు. అందులోనూ ఉత్తరరామచరితం వంటి మహత్తరమైన కథని తీసేటప్పుడు చాలాజాగ్రత్తగా తియ్యాలి. ఒక్క ఆర్టిస్టిక్ అవుట్ లుక్ ఒక్కటే చాలదు.

ముందుగా కేరక్టర్ ఫిట్నెస్ ఉన్న నటులను ఎంచుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బహుశా ఆయనకు ఈ విషయంలో స్వతంత్రం లేదేమో అనిపించింది.  సీతారాములను మన దేశంలో వాడవాడలా పూజిస్తారు. అలాటి పురాణపాత్రల కథను తీసేటప్పుడు ఎంతో రీసెర్చిచేసి ఎన్నోకోణాల్లో ఆలోచించి మరీ సినిమా తియ్యాలి.అందులోని సంగీతమూ, సాహిత్యమూ, తరతరాలకూ చిరస్థాయిగా నిలిచిపోయేలా జాగ్రత్త వహించాలి.  సరైన ట్యూన్లకోసం, సరైన సాహిత్యం కోసం ఒక తపస్సులాగా నెలల తరబడి సిట్టింగ్స్ చెయ్యాలి. నటీనటుల ఉచ్చారణా, ఆహార్యమూ స్పష్టంగా ఆహ్లాదంగా ఉండేలా చూచుకోవాలి. డైలాగ్స్ మంచి భాషలో ఉండేటట్లు చూచుకోవాలి. ఇవేవీ ఈ సినిమాలో లేవు.  ఇలా చెప్పుకుంటే బోలెడన్ని లోపాలు ఈ సినిమాలో ఉన్నాయి.

>> పౌరాణిక చిత్రానికి ఒక ప్రత్యేకమైన భాష వాడాలి. జానపద భాషలోనో, సాంఘిక భాషలోనో డైలాగులు వ్రాస్తే పౌరాణికానికి అతకదు. పోనీ కధలోని గ్రామీణప్రజల చేత గ్రామ్యభాష మాట్లాడించినా నాగరిక పాత్రలచేతకూడా గ్రామ్యమాండలిక పదాలను పలికిస్తే పాయసంలో రాళ్ళలాగా బాధ కలిగిస్తాయి. గ్రాంధికభాష వాడితే సామాన్యజనానికి అర్ధం కాదు అందుకే అలా  మామూలుభాష వాడారులే అని సర్ది చెప్పుకోవచ్చు. ఇక  ఆ విధంగా దిగజారుతూ పొతే ఆ దిగజారుడుతనానికి అంతూపొంతూ ఉండదు. కనుక ఎక్కడో ఒకచోట ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుని గ్రాంధికానికీ గ్రామ్యానికీ మధ్యేమార్గం పాటించాలి. అలా చెయ్యలేకపోవడం ఈ సినిమాలోని ఒక పెద్ద లోపం.

>> ఇకపోతే ఒక భాషాశైలిని  ఎంచుకున్న తర్వాత, అదే భాషను అన్ని ఫ్రేముల్లోనూ అన్ని సీన్లలోనూ ఉండేలా దర్శకుడు జాగ్రత్తపడాలి. దీన్నే 'డిక్షన్ కంటిన్యూటీ' అంటారు.అందుకు విరుద్ధంగా ఈ సినిమాలోని  కొన్ని ఫ్రేముల్లో గ్రాంధికమూ, కొన్ని ఫ్రేముల్లో సాంఘికమూ, ఇంకొన్ని ఫ్రేముల్లో అదేదో అర్ధంకాని కలగలుపు భాషా,  వినిపిస్తుంది. ఇవీ పాయసంలోని రాళ్ళేనని  చెప్పుకోవచ్చు. ఉదాహరణకు సీతాదేవిని లక్ష్మణుడు అడివిలో వదిలి వెళ్ళిపోయాక భూదేవి ప్రత్యక్షమౌతుంది. అప్పుడు శ్రీరాముని శపించబోతున్న భూదేవిని అడ్డుకుని సీతాదేవి " అసలు నువ్వెందుకోచ్చావ్ ? వెళ్ళిపో ఇక్కణ్ణించి " అనే సాంఘికనాటకరీతిలో మాట్లాడటం చాలా చికాకుగా అనిపిస్తుంది. ఇదే డైలాగులు ఇంకాబాగా వ్రాసి ఉండవచ్చు. ఇలాటి పరిస్తితి సినిమా మొత్తంమీద చాలాసార్లు ఎదురౌతుంది. భాషాశైలిలో ఒక స్తిరమైన నడక లేకపోవడం  పెద్ద లోపం.

>> ఇకపోతే అక్కినేని నటన చాలా నిరాశపరిచింది. ఆయన ముఖంలో వాల్మీకిమహర్షి ముఖంలో ఉండవలసిన మార్దవం ఎక్కడా కనిపించలేదు. ఏదో కరుకుదనం గోచరిస్తూ ఉంది. వాల్మీకి ఒక మహర్షి మాత్రమేకాదు, క్రౌంచపక్షుల వ్యధనుచూచి చలించిన దయార్ద్రహృదయుడు. తన బాధాపూరితభావాన్ని ఆశువుగా శ్లోకరూపంలో చెప్పిన మహాకవి. వాల్మీకియొక్క మహర్షిత్వాన్నీ, ఒక కవియొక్క ముఖంలో ప్రతిఫలించే సున్నితమైన సుకుమారమైన దార్శనికతనూ అక్కినేని పండించలేకపోయాడు. బహుశా ముసలితనం వల్ల ఆయన ముఖంలో భావవ్యక్తీకరణా సామర్ధ్యం తగ్గిపోయిందేమోలే  అని సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

>> బాలకృష్ణకూ శ్రీకాంత్ కూ ఒత్తులు స్పష్టంగా పలకవు. అయినా సరే డైలాగ్స్ చెప్పడానికి వాళ్ళు శ్రమించిన తీరు పరవాలేదనిపించింది. ఇలా ఎక్కడికక్కడ సర్దుకుంటూ సినిమా చూడటమే కాని శభాష్ అనిపించేలా ఒక్క సీనూ లేదు.

>> పాత్రలకు మేకప్ చేసిన తీరు చూస్తే,  పౌరాణికానికి సరిగ్గా మేకప్ చేసే ఆర్టిస్టులు ఇప్పుడు లేరేమో అన్న సందేహం కలిగింది. ముఖ్యంగా వాల్మీకి ని దగ్గరగా చూపించిన సీన్లలో అవి పెట్టుడుగడ్డమూ, పెట్టుడుమీసమూ, విగ్గూ అని స్పష్టంగా తెలిసేటట్లు మేకప్ చేశారు. ఆంజనేయుడి మూతిని కూడా మరీ కదలటానికి సాధ్యంకాకుండా బిగించి మరీ అతికించారు. ఆయన డైలాగులు చెప్పేటప్పుడు నోరు తెరవలేక పడుతున్న అవస్త స్పష్టంగా కనిపించింది. ఇలాటివి  చికాకు కలిగించాయి.

>> ఇకపోతే ఆంజనేయుడు ఒక పిల్లవాని రూపంలో వాల్మీకి ఆశ్రమంలో కోతిచేష్టలు చేస్తూ సీతమ్మ వారిని అలరిస్తూ ఉన్నట్లు చూపించడం, వినోదంకోసం సినిమాలో  చేసిన మార్పు అని సర్దుకున్నప్పటికీ, మూలకథలో లేదుకనుక అసహజంగా ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు మార్చడంవల్లే మన పురాణకధలు గందరగోళంగా తయారయ్యాయి. పురాణపాత్రల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చి రావణుణ్నీ  కర్ణుణ్నీ   దుర్యోధనున్నీ హీరోలుగా చూపించే ఇటువంటి ట్రెండ్ ఎన్టీఆర్ తో మొదలైంది.

>> లవకుశలో ఘంటసాల ఇచ్చిన సంగీతానికీ ఈ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన సంగీతానికీ పోలికే లేదు. ఘంటసాల సంగీతమూ అప్పటి సాహిత్యమూ తపోఫలాలుగా అనుకుంటే, ఈ సినిమా సంగీతం ఇమిటేషన్ పండ్లలాగా ఉంది.  ఎంతగా పోలిక కూడదనుకున్నప్పటికీ, ఘంటసాల కూర్చిన పాతపాటలు గుర్తురాక మానవు. ఘంటసాల బాణీలముందు ఇళయరాజా బాణీలు పేలవంగా తేలిపోయాయనే చెప్పాలి. అయితే వినగా వినగా ఇళయరాజా పాటలు కూడా బాగున్నట్లుగానే అనిపించినప్పటికీ, ఘంటసాల పాటలతో పోల్చుకుంటే చాలా నాసిరకంగా ఉన్నాయి.

>>పాటలలో వాడిన సాహిత్యం అన్నింటిలోకీ పరమచెత్త అని చెప్పవచ్చు. పాటలు ఎవరు వ్రాశారో నేను గమనించలేదు గాని, సాహిత్యం ఖూనీ అయింది అనిమాత్రం చెప్పగలను. అది గ్రాన్దికమో, గ్రామ్యమో, ఇంకేదో తెలీనంతగా ఇష్టంవచ్చిన పదాలు కలగాపులగంగా వాడుతూ వినడానికి కంపరం పుట్టించారు. పాటల సాహిత్యంలో జీవం లేదు. కృతకంగా ట్యూన్ కోసం అక్కడ ఆ పదాలను బలవంతంగా ఇరికించి  వాడినట్లుగా ఉన్నాయి.  

>> సీతాదేవిగా నయనతార అభినయం పరవాలేదు అనిపించిందిగాని, సీతాదేవి ముఖంలో పలకవలసిన భావాలు ఆమె ముఖంలో ఏమాత్రం పలకలేదు. మరీ ఎక్కువగా ఒదిగిపోయి నటించడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కన్నెసీతగా చూపించిన సీన్లలో ఆమె హావభావాలు అస్సలు అతకలేదు. పరికిణీ ఓణీ వేసినంత మాత్రాన ప్రౌఢవయస్కురాలు కన్యగా కనిపించడం కష్టమని దర్శకుడు మర్చిపోయాడు లాగుంది. పైగా జీరోసైజు కోసం డైటింగ్ చేసి ఎక్సర్సైజులూ గట్రాలూ చేసేవారి ముఖంలో లావణ్యమూ నవకమూ లోపిస్తాయి. ముఖం ఎండిపోయినట్లుగా, జీవం లేనట్లుగా తయారౌతుంది. ఎంత మేకప్ చేసినా జీవకళ లోపం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్లలో ఆమె నవ్వినపుడు అస్తిపంజరం నవ్వినట్లు అనిపించింది. శ్రీరాముని పాత్ర ఎవరైనా చెయ్యవచ్చు. కాని సీతాదేవి పాత్ర చెయ్యటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ముఖంలో దేవతాభావం, కళ్ళలో పవిత్రతాభావం ప్రతిఫలించాలి. గ్లామర్ పాత్రలకు అలవాటుపడ్డ నయనతార, తన కళ్ళల్లో ముఖంలో పవిత్రతాభావాన్ని పలికించటంలో  పూర్తిగా విఫలం అయింది. నీరసంగా నవ్వినంత మాత్రాన ముఖంలో దైవత్వం కనిపించదు  అన్నది వీళ్ళు తెలుసుకోవాలి.

>> బాలయ్యా, మురళీమోహన్ వంటి సీనియర్ నటుల డైలాగ్ డెలివరీ చాలా అసహజంగా బట్టీపట్టి పట్టిపట్టి ఒప్పజేప్పినట్లు ఉంది. వాళ్ళకు సరిగా అతకని పెట్టుడుపళ్ళసెట్లు ఉన్నాయేమో అని అనుమానం వచ్చింది.

>> ఇకపోతే, సీతాదేవి భూప్రవేశం అడివిలో జరగలేదు. వాల్మీకం ప్రకారం అది సభామధ్యంలో జరిగింది. జైమినిమహర్షి ప్రకారం అసలు జరగనేలేదు. లవకుశలో చూపినట్లు మక్కీకిమక్కీగా ఈ సినిమాలోనూ చూపబోయారు. కాకపోతే నేటి టెక్నాలజీ ఉపయోగించి గ్రాఫిక్స్ బాగా వాడుకున్నారు. నేను లవకుశ చూడలేదు. చాలా చిన్నప్పుడు ఒకటి రెండు సంవత్సరాల వయసులో చూసానేమో గుర్తులేదు. మొన్న యూట్యూబ్ లో లాస్ట్ సీన్ మాత్రం చూశాను.  

>> సీతాదేవి రామబాణాన్ని పూజించడమూ  అదోచ్చి రామ-కుశుల యుద్ధాన్ని ఆపడమూ వంటి కృతకఘట్టాలు ఏమాత్రం అలరించలేకపోయాయి. తన సృజనాత్మకతను దర్శకుడు ఇలాకాకుండా వివిధ రామాయణాలలో ఉన్న ఘట్టాలను రీసెర్చిచేసి ఒక గొప్ప కళాఖండాన్ని నిర్మించడంలో చూపించి ఉంటె ఇంకా బాగుండేది. 

>> మొత్తం మీద రామాయణంమీదా, ఇంకా ఘట్టిగా చెప్పాలంటే సీతాదేవియొక్క ఔన్నత్యంమీదా ఉన్న భక్తీగౌరవాల కొద్దీ ఈసినిమాను చూడవచ్చు. అంతేగాని పెద్ద గొప్పగా ఏమీలేదు. నేను లవకుశ చూడలేదు కాబట్టి దానితోపోల్చి ఈ సినిమాను చూడలేకపోయాను. కాకపోతే లవకుశ పాటలు చిన్నప్పటినుంచి విన్నాను.

>>  బాలకృష్ణ బాగా కష్టపడి జాగ్రత్తగా నటించాడు. అయితే దగ్గర్నించి అతన్ని చూడలేం. వయసుమళ్ళిన చాయలు స్పష్టంగా కనిపించాయి. అదీగాక క్లోజప్ షాట్లలో నీలి మందుడోసు మరీ ఎక్కువైనట్లుంది. లాంగ్ షాట్లు పరవాలేదు.
లవకుశులుగా పిల్లలనటన బాగుంది. బాలహనుమంతుడి నటనా బాగుంది. ఇంతమంది సీనియర్ నటులు నటించిన ఈ సినిమాలో పిల్లల నటన మాత్రమే బాగుంది  అని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం.

ముఖ్యంగా నేటికాలంలో ఇలాటి సినిమా తియ్యాలన్న సాహసంచేసిన నిర్మాత ఒక్కడే ఈచిత్రం మొత్తానికీ అభినందనీయుడు.