Pages - Menu

Pages

20, జనవరి 2012, శుక్రవారం

ఎం ఎఫ్ హుసేన్ జాతకం - పరిశీలన



వివాదాస్పద పెయింటర్ హుసేన్ 17-9 -1915 న మహారాష్ట్ర లోని పండరిపురంలో జన్మించాడు. జననసమయం 6.18  అనీ 7.20 అనీ అంటున్నారు. ఇతను చనిపోయిన తేదీ మనకు తెలుసు. చనిపోయిన సమయమూ తెలుసు. 9-6-2011 న ఇతను లండన్లో చనిపోయాడు. దానిని బట్టి జననసమయాన్ని లెక్కించవచ్చు.అలాటి పద్దతులు జ్యోతిష్యశాస్త్రంలో ఉన్నాయి. కాని ఆ వివాదంలోకి నేను పోదలుచుకోలేదు. ఇతని జాతకాన్ని లోతుగా పరిశీలించి రెక్టిఫై చేద్దామనీ నాకు ఉద్దేశ్యం లేదు. అంత సమయం ఇలాటి నీచుడికి ఇవ్వడం నాకిష్టం లేదు. పైపైన పరిశీలించి అసలు ఇతని వివాదాస్పద వ్యక్తిత్వానికి ఏఏ గ్రహాలు ఎలా కారణమయ్యాయో చూద్దామని మాత్రమే ఈ ప్రయత్నం.

భరతమాతనూ, సరస్వతీదేవినీ, లక్ష్మీదేవినీ నగ్నంగా చిత్రించి అదో గొప్ప ఈస్తటిక్ సెన్స్ అని డప్పు కొట్టుకున్న ఇలాటి వెధవజాతకం అసలు చూడాలా అని కొంతమందికి ఒక అనుమానం రావచ్చు. శ్రీరాముని జాతకాన్ని చూచి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే రావణుడి జాతకాన్ని చూచికూడా కొన్ని విషయాలు రాబట్టవచ్చు. అందులో మంచి కనిపిస్తే, ఇందులో చెడు కనిపిస్తుంది. అయితే చెడు జాతకంలో కూడా, వారికి పట్టిన వైభవమూ,రాజయోగాలూ,ఎలావచ్చాయో, కారణాలేమిటో  పరిశీలించవచ్చు. తద్వారా దురూహ్యమైన కర్మగతిని అంచనా వెయ్యవచ్చు. 'కాదేదీ కవిత కనర్హం' అని శ్రీశ్రీ అన్నట్లు, జ్యోతిష్య శాస్త్రవేత్తలకు ఎవరి జాతకమూ అంటరానిది కాదు. ఇలాటి జాతకాలు చూచి వారివారి వ్యక్తిత్వాలలోని శాడిస్టు ఆనందాన్నీ, కుత్సిత మనస్సునీ ఏఏ గ్రహాలు ఎలా సూచిస్తున్నాయో, అదే సమయంలో వారి జాతకంలోని రాజయోగాలు ఏమిటో, అవి ఎలా వచ్చాయో చదవవచ్చు. కాకపోతే రావణుడూ, కీచకుడూ, కంసుడూ,దుశ్శాసనుడూ మొదలైనవారి జాతకవివరాలు మనకు ప్రస్తుతం లభించడం లేదు. ఇలాటి జాతకాలు చూడటం ద్వారా అలాటివారి జాతకాలలో ఏఏ గ్రహయోగాలు ఉండేవో మనం ఊహించవచ్చు. ఈ జాతకాల ప్రయోజనం అంతవరకే.

ఇకపోతే, పోయినవారి జాతకాలు చూచి ప్రయోజనం ఏమిటి? అని కొందరు అంటారు. వారి అజ్ఞానానికి నా జోహార్లు. గతించిన విషయాలనూ, జరుగుతున్న విషయాలనూ జాగ్రత్తగా పరిశీలిస్తేనే శాస్త్రవేత్తలకు ప్రకృతి సూత్రాలు అర్ధమయ్యాయి. అవుతాయి కూడా. వాటిని ఉపయోగించి భవిష్యత్తులో కూడా అలాటివి పునరావృతమైనప్పుడు ఆయా ఫలితాలను అంచనా వెయ్యవచ్చు. ఇది శాస్త్రీయ విధానమే. పైగా చనిపోయిన ప్రతివారీ జాతకమూ చూడవలసిన పనిలేదు. చూడకూడదు కూడా. మంచో చెడో ఏదో ఒక పేరు సంపాదించినవారి జాతకంలో కొన్ని ప్రత్యేకతలుంటాయి. కనుక అలాటివి చూడవచ్చు. వాటికి కారణాలు ఆయా గ్రహయోగాలు దర్శించవచ్చు. ప్రముఖుల జాతకాలైతే ఎప్పుడైనా చూడవచ్చు. హిట్లర్ జాతకాన్ని ఇప్పటికీ ఎంతో మంది జ్యోతిష్కులు విశ్లేషించారు. ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. కనుక పోయినవారి జాతకాలు చూచి ప్రయోజనం ఏమిటి? అన్న  ఆరోపణ అర్ధరహితమని గ్రహించండి. ప్రముఖుల జాతకాలు, వారున్నా పోయినా, ఎప్పటికీ నిత్యనవీనాలే. ఆ ప్రముఖుల పేరు మంచిది కావచ్చు, లేదా చెడ్డది కావచ్చు. జాతక పరిశీలనకు రెండూ ఉపయోగపడుతాయి. ఇక విషయంలోకొద్దాం.

లగ్నం వివాదాస్పదం గనుక స్థూలవిచారణ చేద్దాం. ఉచ్ఛబుధుని వల్ల తెలివైన మనస్తత్వమూ, లలితకళలలో ప్రావీణ్యతా కలిగాయి.నీచశుక్రునివల్ల నీచకామాసక్తీ, గౌరవించి పూజించదగినవారిని నగ్నంగా చిత్రించే శాడిష్టు నీచ మనస్తత్వమూ వచ్చాయి. కీర్తిని ఇచ్చే రవి వీరితో కలిసి ఉండటంతో ఇలాటి పనులవల్ల కీర్తి కలిగింది. నవాంశలో శనినీచత్వం వల్ల, రాశిచక్రపు బుధశుక్రులకు ఇది అష్టమం అవడంవల్ల నీచమైన కర్మవల్ల వచ్చే ప్రఖ్యాతి సూచితం. రాశిశనికి ఈ స్థితి లాభస్థానం కనుక, ఈ వివాదం ఇతనికి వృత్తిపరంగా లాభాన్నే కలిగించింది అని చెప్పవచ్చు. 

గురుని వక్రతవల్ల విపరీతమైన వక్రించిన మతభావాలు కలిగినవాడని చెప్పవచ్చు. నవాంశలోని రాహుగురువులు రాశిగురువుకు పంచమంలో ఉండటంవల్ల ఇది మరీ కరెక్ట్ అవుతున్నది. వారు రాశిరాహువుకు సప్తమంలో ఉండటం వల్ల మతసంబంధగొడవల మూలకంగా ఇతరదేశాలలో తలదాచుకోవలసిన పరిస్తితి వస్తుంది అని సూచన ఉంది. 

రవిగురువుల బలహీనతవల్ల వారి కారకత్వాలు బాగా దెబ్బతిన్నాయి.కనుక వారిచ్చే అన్ని వరాలూ పనికిరాకుండాపోయాయి అని చెప్పవచ్చు.అందుకే ముసలి వయసులో కూడా తగ్గనికామానికి, సౌందర్యారాధన అని ముసుగుపేరు పెట్టుకున్నాడు. శుక్రుని నీచత్వమూ బలహీనతా, అతనిమీద శనితో కూడిన కుజునిదృష్టీ, శనిక్షేత్రంలోని  రాహువుయొక్క దృష్టీ అన్నీ ఇదేకోణాన్ని నిరూపిస్తున్నాయి.

పై రెండు సమయాలకూ లగ్నం కన్యే అవుతుంది. ఒకవేళ అది నిజమే అనుకుంటే విశ్లేషణ ఇలా ఉండవచ్చు.

పంచమరాహువు యొక్క దృష్టి నవమంమీద పడుతూ ఇతని కళానైపుణ్యం విదేశాలలోనే రాణిస్తుంది. స్వదేశంలో భంగపడుతుంది అని చెబుతోంది.దానికి తగినట్లే దశమంలోని శనికుజుల తృతీయదృష్టి ద్వాదశం మీద ఉంటూ, వృత్తిపరమైన చిక్కులవల్ల ఇతను విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది అని సూచిస్తున్నది.

చతుర్ధంలోని క్షీణ చంద్రునివల్ల ఇతని మానసిక స్థితి అంత మంచిదేమీ కాదని సూచితం. ఈ చంద్రుణ్ణి,దశమం నుంచి శనికుజులు చూస్తున్నారు. ఈ గ్రహస్తితివల్ల ఇతను చిన్న తనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లిప్రేమ అంటే ఏమిటో తెలియని ఇతనికి ప్రతి స్త్రీమూర్తీ ఒక భోగవస్తువుగానూ, విలాసవస్తువుగానూ, కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కుజునికి పట్టిన అష్టమాదిపత్యంవల్ల ఇతనిలోని అమిత కామాసక్తి సూచితం అవుతున్నది.ఇతని ఆత్మకారకుడు కూడా కుజుడే కావడం గమనించాలి. నవాంశలో శనిక్షేత్రంలోని శుక్రరవికేతువులవల్ల ఏమి జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.చతుర్దంలో నీచ శని ఉన్నాడు.పంచమంలో శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నాడు. కనుక ఈ జాతకుడికి కనిపించిన ప్రతి అమ్మాయీ (వయసులో ఉంటే చాలు) మహాఅందంగా కనిపిస్తుంది. వక్రించిన సప్తమాధిపతి గురువు యొక్క పంచమదృష్టి కుజశనులమీద పడుతూ అక్కణ్ణించి చతుర్ధంలోని చంద్రునిమీదకు వారినుంచి సరఫరా అవుతున్నది. ఈ గ్రహప్రభావమే ఇతనిలోని సౌందర్యారాధన అనే ముసుగులో ఉన్న తోడేలును క్లియర్ గా చూపిస్తున్నది. స్త్రీలో ఇతనికి వంపుసొంపులు తప్ప ఇంకేమీ కనిపించవు. అందువల్లే తల్లికంటే ఎక్కువగా గౌరవించవలసిన దేవతామూర్తులను బూతుబోమ్మలేసి అవమానించి ఆనందించే శాడిస్టుగా మారాడు. దేవతలను కూడా కామదృష్టితో చూచేవారిని ఏమి పేరుతో పిలవాలో నిఘంటువు వెదికినా కనిపించదేమో.   

సప్తమంలోని వక్రగురువుమీద ఇదే శనికుజుల దృష్టివల్ల, వృత్తిపరంగా చేసిన తప్పులవల్ల ఇతను విదేశాలలోనే మరణించక తప్పదు అని సూచన ఉంది. చంద్రలగ్నాత్ పంచమాదిపతి అయిన కుజుని సప్తమస్తితికూడా ఇతనికి గల పరాయిమతాభినివేశమూ, చివరికి పరాయిదేశంలోనే ఉండిపోవడమూ సూచిస్తోంది.

దేవతామూర్తుల మీద తాను గీసిన అశ్లీల పెయింటింగులతో  హిందువుల మనోభావాలను ఇతను ఎంత తీవ్రంగా గాయపరచాడో తెలిస్తే ఇతన్ని 'పికాసో ఆఫ్ ఇండియా' అని కొనియాడిన  ఫోర్బెస్ మేగజైన్ 'పిచ్చికుక్క ఆఫ్ ఇండియా' అనేదేమో తెలియదు. కాని చాలామంది హిందువుల అభిప్రాయం మాత్రం ఇదే. పికాసో పెయింటింగ్స్ మార్మికంగా ఉండేవి. వాటిలో కొన్నికొన్ని అస్సలు అర్ధమయ్యేవి కావు. చూచేవారికి వాటిలోని అర్ధాన్ని ఎవరైనా వివరించవలసి వచ్చేది. కాని హుసేన్ గీసిన పెయింటింగ్స్ లోని అర్ధం మాత్రం చాలా క్లియర్ గా ఉంటుంది. అందులో అర్ధంకాని మార్మికత ఏమీ లేదు. అంతఃసౌందర్యం కూడా ఏమీ లేదు.  

ఇతని జాతకంలో గ్రహాలు మాత్రం ఒక  వికృత కళాకారుడిని సూచిస్తున్నాయి. ఇతను పుట్టిన సంవత్సరం కూడా 'రాక్షస' నామ సంవత్సరమే. రాక్షసులకూ పిశాచాలకే ఇలాటి వికృత ఆలోచనలు వస్తాయి. గురువారంనాడు ఇతను పుట్టాడు. గురువు ఇతని జాతకంలో వక్రించి ఉన్నాడు. సూర్యహోరలో ఇతను పుట్టాడు. సూర్యుడు అతి బలహీనుడుగా రాశిసంధిలో ఉన్నాడు. ధార్మికగ్రహాలైన ఈ రెండూ ఇలాఉన్న స్తితిలో పుట్టినవాడు ఇంతకంటే మంచి పేరు ఎలా తెచ్చుకోగలడు? 

ఒక దేశసంస్కృతిని తన అసభ్య బొమ్మలతో అవమానించినవాడికి అదే దేశం పద్మశ్రీలూ, పద్మభూషణ్ లూ ఇచ్చి గౌరవించడం మన దేశంలోనే సాధ్యం. ఇతనే చైనాలో పుట్టి ఇలాటి పనులు అక్కడ చేస్తే, ఇతన్ని ఇలా శిక్షించేవారో ఊహించుకుంటేనన్నా మనకు బుద్ధి వస్తుందా? తనకు దురుద్దేశ్యాలు ఎంతమాత్రం లేవనీ ఇదంతా సౌందర్యపోషణ మాత్రమేననీ వాదించిన అతను మొహమ్మద్ నూ, క్రీస్తునూ కూడా నగ్నంగా చిత్రించి తన నిజాయితీని నిరూపించుకుని ఉంటే  బాగుండేది. 

అయితే మరి ఇలాటి వాళ్లకి కూడా ధనమూ భోగభాగ్యాలూ ఎలా వస్తాయి అని అనుమానం వస్తుంది. హుసేన్ చాలా పేదరికం నుంచి మంచి సంపన్నుడయ్యాడు. అలా జరగాలంటే జాతకంలో మంచియోగాలు తప్పకుండా ఉండాలి. అవేమిటో చూద్దాం.

ఇతని జాతకంలో పంచమాదిపతి అయిన శని దశమ కేంద్రంలో ఉండటంవల్ల రాజయోగం పట్టింది. కాని అష్టమాదిపతి అయిన కుజుని కలయికవల్ల అది భంగమై అతను విదేశాలలో తలదాచుకోవలసి వచ్చింది. చంద్ర లగ్నాత్ చూస్తే, చతుర్ధ కేంద్రాదిపతి అయిన గురుని మీద నవమ కోణాదిపతి అయిన సూర్యుని దృష్టి వల్ల రాజయోగం పట్టింది. దశమ లాభాదిపతులైన బుధశుక్రులు దశమ స్థానంలో ఉండటంవల్ల కూడా వృత్తి పరంగా మంచి లాభార్జన కలిగింది. వీరితో భాగ్యాధిపతి అయిన రవి కలిసి ఉండటం మంచి ధనయోగం. ఈ యోగమే సినిమా హోర్డింగులు గీసుకునే ఇతనికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టింది. ఇలాటి యోగం పూర్వపుణ్యం వల్లనే వస్తుంది. కాని ఈ జన్మలో చేసిన చెడు కర్మ కూడా ఇతను అనుభవించక తప్పదు. కర్మ అనే బాలెన్స్ షీట్ లో మంచికి మంచీ చెడుకు చెడూ తప్పదు. లగ్నం నుంచీ చంద్ర లగ్నం నుంచీ ఉన్న మంచి రాజయోగాలూ ధనయోగాల వల్ల ఇతను ధనాన్నీ కీర్తినీ ఆర్జించగలిగాడు. ఇంతకంటే ఈ జాతకాన్ని ఎక్కువగా చర్చించనక్కరలేదు.   

ఏది ఏమైనా, భక్తిమార్గప్రవర్తకులైన ఎందఱో మహానుభావులకు జన్మనిచ్చిన 'పండరిపురం' లో ఇలాటివాళ్ళు కూడా జన్మించడం చాలా బాధాకరం. ఇలాటి వారిని సమర్ధించే 'భారతీయులు' కూడా ఉండటం ఇంకా బాధాకరం.