Pages - Menu

Pages

31, మార్చి 2012, శనివారం

డిల్లీ విశేషాలు

రెండురోజులు డిల్లీలో నివాసం.ఉన్న కొద్దిసమయంలోనే ముఖ్యమైన ప్రదేశాలు చూడటం. ఇరవైఏళ్ల క్రితం సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఒక వారం అక్కడ ఉన్నాను. ఆ తర్వాత కొన్నిసార్లు వెళ్ళినా పని చూచుకొని వెంటనే బయలుదేరి రావడం జరిగేది. ఈసారి కూడా, కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, ఎర్రకోట, పార్లమెంట్, ఇండియాగేట్, రాజఘాట్ లాంటి కొన్ని మాత్రమె చూడగలిగాను. కన్నాట్ ప్లేస్, ఖాన్ మార్కెట్, సరోజినీమార్కెట్ లాంటి కొన్నిచోట్ల షాపింగ్ చెయ్యడంతో ఉన్న కాస్త సమయం అయిపొయింది. మళ్ళీ తిరుగు ప్రయాణం. అక్షరధామ్ చూడటం కుదరలేదు.  



డిల్లీ వెళితే సాగర్ పబ్లికేషన్స్, రంజన్ పబ్లికేషన్స్ కి వెళ్లి ఒక సంచినిండా పుస్తకాలు కొనడమూ అవి మొయ్యలేక నాతో వచ్చినవాళ్ళు విసుక్కోవడమూ, ప్రయాణం పొడుగూతా ఆ పుస్తకాలు తిరగెయ్యటమూ,గమ్యం చేరేలోపు అవన్నీ చదివేయ్యడమూ,మామూలుగా జరుగుతుంది. కానీ ఈసారి అటువైపు వెళ్ళే సమయం చిక్కలేదు. అందువల్ల సమయమూ డబ్బూ ఆదా అయ్యాయి. నాతో వచ్చిన వాళ్లకు విసుగూ తప్పింది. 


పంచవటి సభ్యుడూ తెలుగు బ్లాగర్లకు సుపరిచితుడూ 'విట్రియల్'. పాపం నేనున్న చోటికి వెతుక్కుంటూ వచ్చి మరీ కాసేపు మాట్లాడాడు. ఆయనా పనుల్లో బిజీగా ఉన్నాడు. నేనూ ఊరు తిరిగే పనిలో ఉన్నాను. కనుక మాట్లాడుకునే సమయం పెద్దగా చిక్కలేదు.'వ్రాతలను బట్టి మనిషిని ఎప్పుడూ అంచనా వెయ్యకూడదు అని నేనెప్పుడూ మా స్టాఫ్  కి చెబుతూ ఉంటాను. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది మన వ్రాతద్వారా పూర్తి సరిగ్గా ఎదుటివారికి చెప్పలేము. అందువల్ల చదివేవారికి మనమీద కలిగే అభిప్రాయం సరిగ్గా ఉండదు.మిమ్మల్ని చూచాక  నా ఆలోచన నిజం అనిపిస్తోంది'. అన్నాడు. నా వ్రాతలను బట్టి నేనొక రాక్షసున్నై ఉంటానని ఆయన ఊహించాడేమో అనిపించి నాకు నవ్వొచ్చింది.


మాటల సందర్భంలో ఒక జాతకం చర్చకు వచ్చింది. వివాహవిషయం. కర్కాటక లగ్నంలో రవిశనులు ఉన్నారు. ఈ గ్రహస్తితి చూస్తూనే, 'వీరి నాన్నగారికీ ఈయనకూ భేదాభిప్రాయాల వల్ల సంబంధాలు ఆలస్యం అవుతున్నాయా?' అని అడిగాను. 'నిజమే' అని చెప్పాడు. ఇందువల్లనే కొన్ని సంబంధాలు ఆఖరి నిముషంలో కేన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే అనుమానం నవమంలోని కేతువువల్ల తనకూ వచ్చింది. ఈవిధంగా జాతకంలో ఒకదానికోకటి సాయం చేసుకునే గ్రహగతులుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే విషయం చక్కగా అర్ధం చేసుకోవచ్చు. సరైన పరిహారక్రియల ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు కూడా.




మెట్రో రైల్ ఎలా పని చేస్తున్నదో చూద్దామని వెళ్ళాను. నేను బస చేసిన ద్వారకా-13 సెక్టార్ కు దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంది. ఒకసారి ఆ మూలనించి ఈ మూలకు రైల్లో ప్రయాణం చేసి దాని పనితీరు ఎలా ఉందో గమనించాను. దానితో బాటు మనుషుల తీరుతెన్నులూ, పోకడలూ కూడా గమనించాను.హైస్కూల్ వయసునుంచీ ప్రేమలూ,ఎక్కడ చూచినా కుర్రజంటలూ కనిపించాయి. ప్రతి స్టేషన్ లోనూ ఇదే వరస. రైల్లోనూ ఇదే వరస. ఒంటరిగా ఖాళీగా ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ తక్కువగా కనిపించారు. పక్కన మనుషులున్నారు మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాం అన్న ధ్యాస కూడా వీరిలో కనిపించలేదు. డిల్లీలో నేరాలూ ఎక్కువే. మనుషులలో దురుసుతనం బాగా ఎక్కువ. పనీ పాటా చేసేవాళ్ళూ, చిన్న చితకా వ్యాపారాలూ, పనులూ చేసేవాల్లందరూ రాజస్థాన్ నుంచీ, హర్యానా నుంచీ వచ్చినవాళ్ళు. ఊరంతా కార్ల మాయం. ఒక ఇంటికి కనీసం నాలుగు కార్లున్నాయి. పార్కింగ్ కి చాలా ఇబ్బంది.మెట్రో రైల్ పుణ్యమాని బస్సులూ పొగా లేవు. కాని ఊరంతా జనారణ్యం లాగా కనిపించింది. జనమంతా ఒకటే ఉరుకులు పరుగులు. జీవనపోరాటంలో ప్రతివాడూ ఒక సైనికుడి లాగా పోరాడుతున్నాడు. పొట్టతిప్పలకే జీవితంలో ఎక్కువభాగం అయిపోయేటట్లు  కనిపించింది. 

నేనక్కడ ఉన్నరోజునే ఒక ఘోరం జరిగిందని పేపర్లు కోడై కూశాయి. ఒకమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఊరంతా తిప్పుతూ ఏడుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆ అమ్మాయిని ఎక్కడో రోడ్డు పక్కన పడేసి  వెళ్ళిపోయారు.వాళ్ళంతా బాగా డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు. అంతా పాతికేళ్ళ లోపున్నవాళ్ళు. రెండో రోజే డిల్లీ పోలీసులు వాళ్ళని పట్టేశారు.డబ్బు ఎక్కువైతే మనిషి బుద్ధి ఎంత వెర్రి వేషాలు వేస్తుందో వీళ్ళు నిరూపిస్తున్నారు. పెద్దలుకూడా అడ్డగోలుగా డబ్బు సంపాదించి పిల్లలకు సౌకర్యాలు సమకూర్చడమే గొప్ప అనుకుంటున్నారు గాని వారికి సంస్కారం నేర్పాలన్న జ్ఞానం వీరికి ఉండటం లేదు. దానికి తోడూ చిన్నప్పుడే సెల్ ఫోనూ, నెట్టూ, టీవీ ప్రభావమూ, స్నేహాలూ, చేతిలో డబ్బూ అన్నీ కలిసి యువనేరస్తులు పుట్టుకొస్తున్నారు. నేను చూచిన ప్రదేశాలలో ఎక్కడా ఆధ్యాత్మిక స్పందనలు అస్సలు లేవు. అంతా కామకాంచనాలమయంగా కనిపించింది.ఎవరి 'ఆరా' చూచినా ఈ రెండే ఆలోచనలు కనిపించాయి. అమ్మాయిలయితే మరీ ఘోరం. వాళ్ళు పుట్టిందే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికా అన్నట్లు ఉంది ప్రతివారి వేషమూ. ఇలాంటి  కిడ్నాప్  గ్యాంగులూ, క్రిమినల్సూ నాకొక్కసారి తగిల్తే బాగుండు నేర్చుకున్న విద్యకు సార్ధకత కలుగుతుంది అని చాలాసార్లు అనుకుంటాను. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే మార్షల్ ఆర్ట్స్ వాడే అవకాశం ఒకటి రెండుసార్లు కలిగింది. తర్వాత చేతులూ కాళ్ళూ తుప్పుపట్టి పోతున్నాయి. ఇదే మాట మా ఫ్రెండ్ తో అంటే, 'నువ్వు అమ్మాయివి కావుగా, నీకా చాన్స్ లేదు' అంటాడు నవ్వుతూ.

కుతుబ్ మీనార్లో ఉన్న ప్రాచీన కట్టడాలు పరికిస్తే ఒక విషయం గోచరిస్తుంది. అక్కడ హిందూ సాంప్రదాయ శిల్పరీతులున్న మంటపాలు చాలా కనిపిస్తాయి. వాటిపక్కనే తర్వాత ముస్లింశిల్ప రీతులతో కట్టిన బురుజులూ దర్వాజాలూ కనిపిస్తాయి.హిందూ కట్టడాలు అతి ప్రాచీనమైనవని చూస్తేనే అర్ధమైతుంది. అదొక విష్ణుదేవాలయం, లేదా శివాలయం అయ్యి ఉంటుందని నాకు అనిపించింది. తురక రాజులు హిందూ దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని జయించినప్పుడు ఇక్కడ ఒక్కొక్క దర్వాజా కట్టించారు. బానిసవంశపు రాజుల సమాధులూ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళలో మొదటి రాజు అల్తమష్ సమాధి ఉంది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ  సమాధి చూచినప్పుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ లో ఆన్సర్ చేసిన 'అల్లా ఉద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు' ప్రశ్న గుర్తొచ్చింది.



లోటస్ టెంపుల్ లో ఏమీ లేదు. బహై గ్రూపు వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని చెప్పే వాలంటీర్లు అక్కడ ఉన్నారు. అవి వాళ్లకు ప్రత్యేకంగా కనిపిస్తాయేమో గాని నాకు వాటిల్లో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు.వాళ్ళు ఊరకే బట్టీపట్టి అప్పచెబుతున్నట్లుగా నాకు అనిపించింది.హిందూమతాన్ని సరిగ్గా కూలంకషంగా అర్ధం చేసుకుంటే, ఇక ప్రపంచంలోని ఏ మతంలోనూ, ఏ సంప్రదాయంలోనూ, కొత్తదనం ఏమీ కనిపించదు. అంతటి విశాలపరిధి, అంతటి లోతూ మన మతానికి ఉంది. కాని దానిని అర్ధం చేసుకునే వారు హిందూమతంలో కూడా అరుదుగా ఉన్నారు. లోటస్ టెంపుల్లో ఉన్నంతసేపూ ఒక చర్చిలోకి వెళ్లి కాసేపు కూర్చొని వచ్చినట్లు అనిపించింది. అంతేగాని అక్కడ ఆధ్యాత్మికస్పందనలు ఏమీ లేవు.  

ఎర్రకోట మొత్తం తిరిగి చూడాలంటే ఒక పూట పడుతుంది. అక్కడ ఉన్న ఒక భవనం చూస్తే  చాలు విసుగు పుడుతుంది.అన్నీ అలాగే ఉంటాయి. ముస్లిం శిల్పకళలో ఉన్నపెద్ద లోపం అదే. అందులో పెద్ద శిల్ప చాతుర్యమూ అచ్చెరువు గొలిపే నైపుణ్యమూ ఉండవు. ఏదో పేలవంగా డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుంది. విగ్రహాలూ జంతువుల బొమ్మలూ ఇతరత్రా అన్ని శిల్పాలూ ఈ రీతిలో నిషేధం. కొంతలో కొంత లతలు మాత్రమె చేక్కనిస్తారు. క్రూరమైన మతపుచట్రంలో కళ వికసించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఎర్రకోట బయట అంతా చెత్తాచెదారమూ తినిపారేశిన కాయితాలూ, ప్లాస్టిక్ కవర్లూ  దరిద్రంగా ఉంది. కనీసం పర్యాటకస్థలాలలో కూడా పరిశుభ్రత లేకపోతే ఎలా? 

పరిశుభ్రత పాటించడం అంటే మనకు అస్సలు పడదు అని మళ్ళీ రుజువైంది. 'ఇండియాగేట్' పార్లమెంట్ కు అతి దగ్గరలో ఉంది. అక్కడికి విదేశీ యాత్రికులు ఎందఱో వస్తుంటారు. అక్కడ మేయిన్టేనేన్స్ మాత్రం ఘోరంగా ఉంది. ఒక 'డీ' క్లాస్ పార్కులో అంతకంటే మంచి పరిశుభ్రత ఉంటుంది. నీళ్ళన్నీ మడుగుకట్టి ఒక మురికికాలవలాగా అక్కడ తయారై ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అదిచూచి కొందరు విదేశీయులు ఎగతాళిగా నవ్వుకోడం గమనించాను. మనసు చివుక్కుమంది. ఊరిచివరనున్న 'స్లం' ఏరియాలు బాగుచెయ్యడం ఎలాగూ మనకు రాదు. దేశ రాజధాని నడిబొడ్డునకూడా పరిశుభ్రత లేకపోతే ఎలా? డిల్లీ మున్సిపల్ యంత్రాంగం ఏమి చేస్తోందో మరి? కనీసం పబ్లిక్ ప్రదేశాలలో ఖచ్చితమైన పరిశుభ్రత పాటించేలా ముందు మన దేశం మారాలి. ఈ కోణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.

హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా చూద్దామని అనుకున్నాను కాని కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్లిరావాలి. నేను కాలేజీ రోజుల్లో సూఫీతత్వాన్ని బాగా చదివాను. అందుకే కొందరు సూఫీ సాదువులంటే నాకు చాలాఇష్టం. కరుడుగట్టిన ఎడారిలాంటి ఇస్లాంమతంలో సూఫీ సాధువులు ఒయాసిస్సుల వంటివారు. విశాలభావాలూ ప్రేమతత్వమూ వారి విధానాలు. కనుక హిందువులకు వీరు నచ్చుతారు.

మొత్తమ్మీద డిల్లీలాంటి ఉరుకులు పరుగులతో నిండిన ఇంద్రియభోగపూరిత జనారణ్య ప్రదేశాలు మనకు నప్పవు అని అతిత్వరలోనే అర్ధం అయింది. ఇంకో రెండు రోజులు అక్కడ ఉంటె పిచ్చి పుట్టేటట్లు అనిపించింది. చూచింది చాల్లే అనుకోని తిరుగుప్రయాణం మొదలు పెట్టాము.

29, మార్చి 2012, గురువారం

కాలజ్ఞానం - 7

అధికార వర్గాలపై అవినీతి ప్రభావం
ఉన్నత స్థాయిలలో లుకలుకలు
దిక్కుతోచని రాజుల మల్లగుల్లాలు
మొయ్యలేని ముళ్ళ కిరీటాలు 
మనం పెంచి పోషించిన అవినీతి
మనల్నే మింగబోతుంది
అధికారవర్గాలకు గండం ఈరోజు
అనైతిక సమావేశాలు
మత గురువులకూ తప్పవు తిప్పలు
విధికి అతీతులెవ్వరు?   


27, మార్చి 2012, మంగళవారం

విరోచనాలకు పదివేలు

మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఎంత అద్వాన్నంగా ఉందొ అందరికీ తెలుసు. అలాగే, వైద్య రంగంలో డాక్టర్ల జవాబుదారీతనం కూడా అంత అధ్వాన్నంగానే ఉంది. పొరపాటున ఏదోఒక రోగంతో ఆస్పత్రికి వెళ్ళామా ఇక అంతేసంగతులు. వాళ్లకు గుర్తొచ్చిన టెస్టులు అన్నీ చేయించేసి జేబులు ఖాళీ చేసేసి చివర్లో 'అబ్బే. ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. అయినా ఎందుకైనా మంచిది" అంటూ రెండు సీసాలు సెలైన్ పెట్టి, బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేయించి సాయంత్రం దాకా ఉంచి తరువాత ఇంటికిపంపే డాక్టర్లు ఎందఱో ఉన్నారు. రోగం ఏమీ లేకపోతే మందులూ ఇంజక్షన్లూ ఎందుకో చేసేవాడికీ తెలియదు చేయించుకునే వాడికీ తెలియదు.  

మా క్లాసులో కొంతమంది 'నాకు మెడిసిన్లో అరవైశాతం వచ్చింది' అని విర్రవీగేవారు. అలాటివాళ్ళతో మా హోమియో గురువుగారు ఒక మాట అనేవారు.  "మెడిసిన్లో నీకు అరవై మార్కులోచ్చి పాసయ్యావు బాగానే ఉంది. అంటే, మిగతా నలభై శాతం నీకు సబ్జెక్టు తెలీదనేగా. ఈ అరవైని కాదు. ఆ నలభైని గుర్తుపెట్టుకో". నేటి కార్పోరేట్ డాక్టర్లు రోజూ బట్టీపట్టి మరీ గుర్తుపెట్టుకోవలసిన మాట అది. వైద్యుడనేవాడు  ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉండాలి. కాని ఆ నేర్చుకోవడం అనేది రోగిప్రాణాలతో ఆటలాడుతూ కాకూడదు.

మొన్నీ మధ్య మా స్నేహితుడు ఒకాయన విరోచనాలతో బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. వరసగా నాలుగు రోజులు క్యాంపుల మీద తిరగడంతో బయట తిండి, ఎండల వల్ల విరోచనాలు పట్టుకున్నాయి. డాక్టర్ వెంటనే అడ్మిట్ చేసుకుని సాయంత్రం వరకూ సెలైన్ పెట్టి యాంటీ బయోటిక్స్ దంచికొట్టి సాయంత్రానికి ఇంటికి పంపించాడు.ఇంటికొచ్చాక మళ్ళీ యధాప్రకారం సమస్య మొదటికొచ్చింది. ఇలాకాదని మర్నాడు ఒక కార్పోరేట్ హాస్పిటల్ కు వెళ్లారు. వాళ్ళు టెస్టు లంటూ ఏడువేలు ఖర్చు పెట్టించి సాయంత్రం దాకా కూచోపెట్టి "అంతా బానేఉంది ఏంటో అర్ధం కావడం లేదు" అంటూ ఒక మూడువేలకు మందులు మూటగట్టి ఇచ్చి మళ్ళీ రమ్మన్నారు. "అసలు కారణం మూలనున్న ముసలమ్మకే కనిపిస్తుంటే దానికి ఇన్ని టెస్ట్ లు   చేయించి, ఇన్ని యాంటీబయోటిక్సూ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవడం అవసరమా?" అంటే, "మేమేమన్నా మా ఆస్పత్రికి రమ్మని మిమ్మల్ని బొట్టుపెట్టి పిలిచామా?వచ్చినప్పుడు ఖర్మ అనుభవించక తప్పదు."అని వారిజవాబు. "రోగం ఏమిటో తెలీకుండా ఇన్ని మందులెందుకు" అని అడిగితే దానికసలు జవాబుకూడా చెప్పకుండా, "ముందా మందులువాడి తర్వాత కనపడండి" అన్నారట. వైద్యులలో చిత్తశుద్ధి ఘోరంగా లోపించింది అనడానికి ప్రతిరోజూ ఇలాంటి ఉదాహరణలు  ఎన్నో కనిపిస్తున్నాయి.  

రోగి కనిపిస్తే చాలు వాడి జేబూ ఒళ్ళూ గుల్లచేసి పంపే డాక్టర్లే నేడు ఎక్కడ చూచినా దర్శనం ఇస్తున్నారు. అంతేగాని, నాడి పరిశీలించి, వివరాలు కనుక్కుని, చిన్నపాటి మందులతో రోగాన్ని ట్రీట్ చేసే వైద్యులు ఎక్కడా లేరు. కనీసం ఆర్.ఎం.పీ కూడా నేడు సరాసరి స్టెరాయిడ్స్ తప్ప ఇంకేవీ ఇవ్వడం లేదు అంటే అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. 

జవాబుదారీతనం అనేది వైద్యరంగంలో మొత్తంగా లోపించింది. జనాల భయాన్ని ఆసరాగా తీసుకొని అవసరంలేని మందులను విపరీతంగా వాడించే అలవాటు వైద్యులలో ప్రబలింది.జనాలు కూడా దానినే ఇష్టపడుతూ ఉన్నారు. కలిధర్మం ఇలాగే ఉంటుందా? నేటి వైద్యులు కలిపురుషుని ఏజెంట్లా? వారి వారి ధర్మాన్ని నిర్వర్తిస్తూ భూభారాన్ని తగ్గించే పనినీ, జనాల పాపఖర్మాన్ని అనుభవిమ్పచేసే పనినీ సక్రమంగా వాళ్లకు తెలీకుండానే నిర్వర్తిస్తూన్నారా? రోగీ పాలే కోరాడు. వైద్యుడూ పాలే చెప్పాడు అంటే ఇదేనేమో. వైద్యా నారాయణా హరీ !!!  

26, మార్చి 2012, సోమవారం

కాలజ్ఞానం - 6

మాటలలో వ్రాతలలో దోషాలు పొరపాట్లు
నిర్ణయాలలో ఊగిసలాటలు 
పనులన్నీ వాయిదాలు 
వ్యాపారాలలో వ్యవహారాలలో ప్రతిష్టంభనలు 
తప్పవు ఇంకో పదిరోజులు 


అనుకున్నవి సరిగా చెప్పలేకపోవడం
చెప్పినది సరిగా అర్ధం కాబడకపోవడం 
నేరస్తుల, మతవాదుల, రోగుల పోరాటాలు 
అనైతిక మేధోహక్కుల ఆరాటాలు
తప్పవు ఇంకో పదిరోజులు  


మళ్ళీ తప్పదు విధ్వంసం
తెలివైన కుట్రల ఫలితం 
మనిషి జీవితం అతలాకుతలం 
రెండురోజుల్లో వాహన జలప్రమాదాలు 
జరిగాక తెలుస్తాయి రుజువులు  

25, మార్చి 2012, ఆదివారం

యాగంటి యాత్ర


యాగంటి అనేది బనగానపల్లెకు దగ్గరగా ఉన్న ఉమామహేశ్వర క్షేత్రం. అహోబిలం నుంచి ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల మీదుగా బనగానపల్లె వచ్చి అక్కణ్ణించి యాగంటి చేరాలి. యాగంటి కూడా ఎత్తైన కొండలమధ్యలో ఉన్న క్షేత్రమే. ఇక్కడ కొండలు పొరలుపొరలుగా, పలకలను ఒకదానిపైన ఒకటి పెర్చినట్లుగా ఉంటాయి. బహుశా వీటిలో సున్నం పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లుంది. స్థలపురాణం ప్రకారం, అగస్త్య మహర్షి ఇక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసిన తర్వాత విష్ణువు కోసం ఒక ఆలయం నిర్మించాలని భావించాడట. ఆలయం అంతా పూర్తయిన తర్వాత వేంకటేశ్వరుని విగ్రహాన్ని చెక్కిన చోటనుంచి కదిలించి గర్భ గుడిలోనికి తీసుకురాబోతుంటే ఆ విగ్రహం కాలి బొటనవేలు విరిగిందట. భిన్నమైన విగ్రహం ప్రాణప్రతిష్టకు పనికిరాదు గనుక ఏమి చెయ్యలా అని ఆలోచిస్తున్న అగస్త్యుని కలలోకి ఈశ్వరుడు వచ్చి, " నాయనా. ఇక్కడ ఏడాది పొడుగునా పారే జలపాతం చూచావు కదా. నేను అభిషేక ప్రియుణ్ణి. కనుక ఈ జలపాతం ఉన్నచోట నాకు ఆలయం కట్టించాలి కాని విష్ణువుకు కాదు. కనుక నీవు వెంకటేశ్వర విగ్రహప్రతిష్ట మానుకో. దానిబదులు శివలింగాన్ని ప్రతిష్టించు ". అని చెప్పాడు. అందువల్ల, ఆలయం విష్ణువుదైనా విగ్రహప్రతిష్ట జరిగే సమయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసారు. అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఉండదు. శివునిలోనే అమ్మవారు కూడా ఉన్నట్లు భావిస్తారు. ఇదీ ఇక్కడి ఆలయప్రత్యేకత. ఆలయంలో ద్వారపాలకులు,ఇతరవిగ్రహాలూ అన్నీ విష్ణుఆలయంలో వలె ఉంటారు. కాని గర్భాలయంలో శివలింగం ఉంటుంది. అదికూడా మిగతా శివలింగాల వలె కాకుండా ఒక గొగ్గులుగా ఉన్న పలక మాదిరి ఉంటుంది. బహుశా అక్కడ దొరికే పలకలలో ఒకదానిని ప్రాణప్రతిష్టకు వాడారేమో అన్న అనుమానం కలుగుతుంది.


రాయలసీమలో ఉన్న ఆలయాలలో ఒక పుష్కరిణి దానికి నాలుగు వైపులా స్నానానికి మండపాలు ఉంటాయి. ఇవి అక్కడి ప్రాచీన ఆలయాల నిర్మాణ రీతులు. అలాంటి పుష్కరిణిని ఇక్కడ చూడవచ్చు. ఎక్కడో కొండలనుంచి జాలువారుతున్న జలపాతం గుడి ఆవరణ గుండా ప్రవహిస్తూ వచ్చి ఈ పుష్కరిణిలో పడి అక్కడనుంచి పల్లానికి ప్రవహిస్తూ క్రిందుగా ఉన్న పొలాలను సాగుచేయ్యడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్లాన్ తో కట్టిన దేవాలయాలు రాయలసీమలో చాలా ఉన్నాయి. మహానంది కూడా ఇలాగే ఉంటుంది. పాతకాలంలో, నీటివసతి ఉన్న చోట ఇలాంటిబహుళ ఉపయోగకర ప్రాజెక్టులవంటివి కట్టేవారు. దైవదర్శనంవల్ల ప్రజలకు ధర్మచింతనా పెరుగుతుంది. దేవాలయానికీ యాత్రికులకూ ఏడాది పొడుగునా నీటివసతి ఉంటుంది. పొలాలకు సాగునీరూ సరఫరా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఇలాంటి దేవాలయాల వల్ల కలిగేవి.మేము వెళ్ళిన సమయంలో వానరవీరులు ఆ పుష్కరిణిలో చక్కగా ఈతలు కొడుతూ కనిపించారు.ఇక్కడ ఉన్న ఇంకొక విచిత్రం. ఈ ఆలయ ప్రాంగణంలో  కానీ చుట్టూ ఉన్న కొండలలో కానీ ఎక్కడా 'కాకి' కనిపించదు. దానికొక కధ చెప్తారు. అగస్త్య మహర్షి తపస్సు చేసుకునే సమయంలో కాకులు ఆయన చుట్టూ చేరి గోలగోల చేసి చీకాకు పరచాయట. ఆయనకు కోపం వచ్చి"మీకు కానీ మీ స్వామి అయిన శనీశ్వరునికి కానీ ఇక్కడ స్థానం లేదు. పొండి" అని శపించాడట. అందుకనే ఈ ఆలయంలో నవగ్రహాలు ఉండవు. అలాగే కాకి కూడా ఇక్కడ వాలదు.చూద్దామన్నా ఎక్కడా కనిపించదు. శని అడుగుపెట్టలేని క్షేత్రం ఇదొక్కటే అని అంటారు. అందుకనే శనిదోషాలున్న వారు ఇక్కడకు వచ్చి పూజలుచేస్తే ఆ దోషాలు తొలగిపోతాయని చెప్తారు.  ఆలయం వెనుకగా ఎత్తైన గుట్టమీద ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఆ గుట్ట ఒంటికొమ్ము స్తంభంలాగా ఉంటుంది. మెట్లు ఉండవు. అలవాటు ఉన్న ఒక పూజారి మాత్రమే గత ఇరవై ఏళ్లుగా దానిపైకి పాకుతూ ఎక్కి అక్కడ దీపాన్ని వెలిగించి వస్తాడు. ఎంత గాలికీ అది ఆరకుండా వెలుగుతుంది. ఎక్కేటప్పుడు చెయ్యిజారి అక్కణ్ణించి పడితే ఇంతే సంగతులు.





ఇక్కడే పక్కగాఉన్న కొండలలో ఒక గుహలా కనిపిస్తుంది. మెట్లెక్కి దానిలోకి పోతే, అక్కడ ఒక వెంకటేశ్వరస్వామి విగ్రహం కనిపిస్తుంది. వెంకటేశ్వరస్వామి తిరుమలకు పోక ముందు ఇక్కడే ఉన్నాడనీ, చివరిలో ఆలయాన్ని శివాలయంగా మార్చడం వల్ల ఆయన మూడు 
అంగలలో తిరుమలకు చేరుకున్నాడనీ చెప్తారు. మొదటి అడుగు యాగంటిలో, రెండవ అడుగు దేవునికడపలో, మూడవ అడుగు తిరుమలలోని శ్రీవారి పాదాలవద్దా వేశాడని ఒక కధ చెబుతారు. గుహలోనుంచి ఆయన వెళ్ళినట్లుగా చెబుతున్న దారిలోని మెట్లవద్ద దేపాలు వెలిగిస్తారు. ఇక్కడే ఇంకొక పక్కగా ఉన్న గుహలో బ్రహ్మంగారు తన శిష్యురాలికి ఉపదేశం చేసిన ప్రదేశం ఉంది. బ్రహ్మంగారు ఇక్కడ గుహలో కొన్నాళ్ళు తపస్సు చేసాడని చెబుతారు. బనగానపల్లె ఇక్కడకి బాగా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రదేశం అంతా కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. యాత్రికులను ఏమీ చెయ్యవు. వాటి ఆటలు అవి ఆడుకుంటూ, మనం ఏమైనా పెడితే తింటూ తిరుగుతూ ఉంటాయి. మనం పూజలు చేసేటప్పుడు కూడా పైన చూర్ల లో, పందిళ్ళలో దాక్కుని కిందఉన్న మన చేతిలో ఏమున్నాయో గమనిస్తూ ఉంటాయి.ఒక్కొక్కసారి చేతిలోని సెల్ఫోన్లూ,కళ్ళజోడులూ,కెమేరాలూ లాక్కుని పారిపోవడమూ జరుగుతుంది.




వెంకటేశ్వరస్వామి గుహలోనుంచి చూస్తె యాగంటి గోపురం ఇలా కనిపిస్తుంది. ఈ గోపురం ఎదురుగానే గర్భగుడి ఉంటుంది. మామూలుగా శివాలయంలో స్వామి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇక్కడ ఒక పక్కగా ఉండటం చూడవచ్చు. కొన్నేళ్ళ క్రిందట ఆ నంది విగ్రహం నాలుగు స్తంభాల మంటపం మధ్యలో ఉండేది. అప్పుడు నందికి ప్రదక్షిణం చెయ్యాలంటే మంటపం లోపలే చెయ్యగలిగేవారు. కాని నేడు ఆ నంది పెరిగి మంటపం అంతా ఆక్రమించింది. కనుక ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యాలంటే స్తంభాల బయటగా చెయ్యవలసి వస్తున్నది. కొన్ని బండరాళ్ళకు పెరిగే గుణం ఉంటుంది. వాటిని విగ్రహాలుగా చెక్కటం వల్ల ఆ విగ్రహాలు కూడా క్రమేణా పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. కాణిపాకం వినాయకుని విగ్రహమూ అలాంటి లక్షణం ఉన్నదే. యాగంటి నంది పెరుగుతున్న విధం చూస్తే, ఒక తీరూ తెన్నూ లేకుండా అసౌష్టవంగా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. చేక్కినప్పుడు మంచి సౌష్టవంగా ఉన్నప్పటికీ తర్వాత ఆ రాయి అన్ని వైపులకూ సమంగా పెరిగినట్లు కనపడదు. అందుకే నంది యొక్క కొలతలు అన్నీ తారుమారుగా ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. బ్రహ్మంగారు ఈ నంది గురించే వ్రాస్తూ ఇది పెరిగి పెరిగి కలియుగాంతంలో రంకె వేస్తుందని అంటారు. అంటే బాగా పెరిగి పెటిల్లని పగిలిపోతుందేమో. దానినే రంకె వెయ్యడం అని మార్మికభాషలో వ్రాసి ఉండవచ్చు.   



బనగానపల్లె నుంచి యాగంటికి పోయే దారిలో అరుంధతి కోట ఉంది. హారర్ సినిమా 'అరుంధతి' లో కోట ఇదేనని అక్కడివారు చెప్పారు. సినిమా యూనిట్ అంతా అక్కడ ఒక నెలరోజులు ఉండి, షూటింగ్ తీశారని ఆ కోటకు కాపలాగా ఉన్న ఒక ముసలమ్మ చెప్పింది. తనకు కొంత డబ్బులిస్తే లోపల రూములు చూపిస్తానంది. సరే అలాగే చేసి, తాళాలు తీయించి లోపలి రూములు చూచాము. మాంత్రికుణ్ణి జీవసమాధి చేసే హాలు లోపల ఉంది. ఈ కోట ఒక పెద్ద గుట్టమీదుగా ఉంటుంది. నిజానికి ఇది బనగానపల్లె నవాబు తన ఉంపుడుకత్తెకు కట్టించి ఇచ్చిన కోట అని ఆమె చెప్పింది. ప్రస్తుతం నవాబు కుటుంబీకులు హైదరాబాదులో ఉన్నారనీ, కోటని కనిపెట్టుకుని ఉన్నందుకు తనకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తారనీ చెప్పింది. కోట లోపల కొన్ని గదుల్లో కప్పు రాలిపోయింది. మొత్తం తొమ్మిది గదులూ పెద్ద హాలూ ఉన్నాయి. కింద నేలమాళిగ ఉన్నట్లుంది. దాని తలుపు మాత్రం ఆమె తియ్యలేదు.


మన దేశంలో అనేక బౌద్దాలయాలు శివాలయాలుగా విష్ణ్వాలయాలుగా మార్చబడ్డాయి. అలాగే, శైవులకూ వైష్ణవులకూ జరిగిన గొడవలలో అనేక దేవాలయాలు ఇటునించి అటూ,అటునించి ఇటూ మార్చబడ్డాయి. అటువంటి ఆలయాలలో ఇదీ ఒకటి అయ్యుండవచ్చు అని నాకూ అనిపించింది. దానికి అగస్త్యమహర్షికధను అల్లి జోడించి ఉంటారు.ఇలాటి కధలు అల్లడంలో మనవాళ్ళు సిద్ధహస్తులు.ఏది ఏమైనా,ఒకసారి తప్పక దర్శించదగ్గ శైవక్షేత్రాలలో యాగంటి ఒకటి అని చెప్పవచ్చు.

23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది గ్రీటింగ్స్ చెప్పుకొటం మాత్రమె మనకు తెలుసు

ప్రతి పండుగా ఒక ఉత్తేజకరసంఘటన నుంచి పుడుతుంది. క్రమేణా అది నిర్జీవం అవుతుంది. మనమే దాన్ని అలా మారుస్తాం. చివరికి అది ప్రాణం లేని తంతుగా మిగిలిపోతుంది. ఎందుకంటే జీవం లేని జనం చేతిలో అది పడింది గనుక.

పండుగల లోని అంతరార్ధాలు మనకు అనవసరం. వాటిని తెలుసుకుంటే ఆచరించాల్సి రావచ్చు. కనుక అసలు ఆ కోణాన్ని తెలుసుకోకుండా ఉత్త గ్రీటింగ్స్ చెప్పుకోడం, మళ్ళీ మన కుళ్ళు బతుకులు మనం బతకడం చాలా సులభమైన పని. ఇదే మనకు తెలిసిన అసలైన విద్య.

ఈ దేశపౌరులంత వెన్నెముక లేని వెధవలు ఎక్కడా ఉండరు. అన్నిరంగాలలో దేశం సర్వదోపిడీకి గురవుతుంటే, కిమ్మనకుండా మౌనంగా అన్నీ భరించే సామాన్యుడికి అంత సహనం ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే వెయ్యేళ్ళ ముస్లిం పాలనా, రెండు వందలేళ్ళ ఇంగ్లీష్ పాలనా కారణాలా అన్న సందేహం వస్తుంది. లేదంటే మొదటినుంచీ మన జాతిగుణమే ఇంతేమో. స్వార్ధమూ పిరికితనమూ చేతగానితనమూ కలగలిసిన జాతి మనదే అని అనిపిస్తుంది.

మన సంస్కృతీ మన సంప్రదాయమూ మన వేదాలూ మన చట్టుబండలూ అన్నీ జనమందరి గొప్పలు కావు, మన అందరి కష్ట ఫలితాలూ కావు. అవి కొందరు ప్రత్యెకవ్యక్తుల తపోఫలాలు మాత్రమె. ఏ కాలంలోనైనా వాటిని ఆచరించినవారు బహుకొద్దిమంది మాత్రమె. మిగతా వారందరూ వాటి చాటున దాక్కుని, అవి పాటించకుండా, వాటిని తమ స్వార్ధానికి కావలసినంతవరకూ వాడుకోవటం, దేశాన్ని చేతనైనంత దోచుకోవడం మాత్రమె చేస్తున్నారు. ఇది తరతరాలుగా నడుస్తున్న చరిత్ర.

కులాన్ని దాటి మనం ఆలోచించలెం. ప్రాంతాన్ని దాటి మనం చూడలేం. ఎవడు ఎంత తప్పు చేసినా, ఎంతగా దేశాన్ని సర్వనాశనం చేసినా వాడు మన కులంవాడైతే చాలు. వాడు చేసింది మంచే అని వాదిస్తాం. ఈ నీచమైన మనస్తత్వం పోనంతవరకూ ఎన్ని పండగలు జరుపుకున్నా మన దేశం బాగుపడదు గాక బాగుపడదు.

మన దేశానికి పట్టిన ఇంకొక ఖర్మ ఏమిటంటే, ఎన్నుకోడానికి సరైన నాయకులు మనకు లేరు. ఒకసారి ఒకాయనకి పట్టం కడతాం. కొన్నాళ్ళు ఆయనా, ఆయన అనుచరులా దోపిడీ సాగుతుంది. విసుగొచ్చి ఇంకోకాయనను గద్దేనేక్కిస్తాం. ఇక వీరి దోపిడీ మొదలు. ఏతావాతా, ప్రతిసారీ కొందరు వ్యక్తులు వాళ్ళ గ్రూపులు దేశాన్ని దోచుకుని బాగుపడటం మాత్రమె ఈదేశంలో తరతరాలుగా జరుగుతున్న కధ. మళ్ళీ నీతులు మాత్రం అందరూ చెబుతూ ఉంటారు. ఒకరినొకరు 'దొంగలు' అని తిట్టుకునే దొంగలమయం మన దేశం.

మనకు నీతి లేదు. కాని నీతికబుర్లు మాత్రం భలే చెబుతాం. రూలు మనం పాటించం. కాని ఎదుటివాడికి బాగా రూల్స్ చెబుతాం. ఎదుటివాన్ని చూచి ఏడవటం, దోపిడీ అవకాశం కోసం ఎదురు చూడటం, అవకాశం వస్తే నీతులూ రూల్సూ తుంగలో తొక్కి ఎగబడి దోచుకోవటం -- ఈ మూడే ఈ దేశంలో పౌరుడికైనా నాయకుడికైనా తెలిసిన అసలైన రూల్స్.

మన ఆధ్యాత్మికత ఒట్టి నేతిబీరకాయ. అది మాటలకే పరిమితం. మన జీవితాలలో ఎక్కడా నిజమైన ఆధ్యాత్మికత లేనేలేదు. కులగురువులూ, బిజినెస్ దేవాలయాలూ, పండగలలో మాత్రమె గుర్తొచ్చే దేవుళ్ళూ -- ఇవే ఆధ్యాత్మికత అనుకునేవాళ్ళను చూచి నేను జాలిపడతాను. వెలయాలికీ భార్యకూ ఎంత తేడా ఉందొ ఇలాంటి ఆధ్యాత్మికతకూ నిజమైన ఆధ్యాత్మికతకూ అంత తేడా ఉంది.

నిన్న రాత్రి ఒంటిగంట సమయంలో ఒక పని ముగించుకుని ఇంటికి వస్తున్నాను. ఈ మధ్యనే బాగా పాపులర్ అవుతున్న ఒక రోడ్డుపక్కన  సాయిబాబాగుడి ముందు ఒకభక్తుడు రోడ్డుమీదే కిందపడి మరీ సాష్టాంగనమస్కారం చేస్తున్నాడు ఇంత రాత్రిపూట ఈసమయంలో, ఎవరా ఇంత మహాభక్తుడు అని ఆగి చూచాను. మొదటిభార్యను పెట్రోల్ పోసి తగలపెట్టి రెండవపెళ్లి చేసుకున్న ఒక ఘనుడాయన. అర్ధరాత్రి సాయిబాబా గుడి ముందు రోడ్డుమీద సాష్టాంగం చేస్తున్నాడు. బహుశా మూడోపెళ్ళాం కోసం ముడుపు కట్టుకుంటున్నాడేమో. 'మీరు మారర్రా, మీ బతుకులింతే ' అని అనుకుంటూ ఇంటివైపు కదిలాను. మన సమాజంలోని మనుషుల మనస్తత్వానికి ఆ వ్యక్తి ప్రతిబింబంలా కనిపించాడు.

హిపోక్రసీ ఒక్కటే నేడు మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలు సమస్య. అది ఒదిలిన నాడు దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా మనఖర్మ ఇంతే. పొరుగున ఉన్న చైనా మనల్ని దాటి 100 ఏళ్ళు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోయింది.మనమేమో అన్నిరకాల రోగాలతో అవినీతితో కుళ్ళిపోతున్నాం. కారణాలేంటి? హిపోక్రసీ ఒక్కటే అసలు కారణం. సామాన్యుడైనా నాయకుడైనా, అట్టడుగుస్థాయిలోనైనా,లేక అత్యున్నతస్థాయిలోనైనా  చెప్పేదొకటి చేసేదొకటి. రూల్స్ నీకు దోపిడీ నాకు. వాగుడేక్కువ ఆచరణ తక్కువ -- ఇదే మన పతనానికి కారణం. ఒకవేళ చైనాతో గనక యుద్దమే వస్తే వాళ్ళు మనల్ని పిచ్చికొట్టుడు కొట్టడం ఖాయం. వాళ్లకు సమర్ధమైన గట్టి నాయకత్వం ఉంది. మనకు అదే లేదు.

రైల్వే బడ్జెట్లో రేట్లు ఎనిమిదేళ్ళ తర్వాత పెంచారని రైల్వేమంత్రిని తొలగించిన సంఘటనచూచి ఇతరదేశాలు పగలబడి నవ్వుతున్నాయి అన్న స్పృహకూడా లేని అవకాశవాదనాయకులు మనదేశానికి శ్రీరామరక్షలు. రేపు ట్రాక్ భద్రతకోసం, వంతెనల భద్రతకోసం, మెయింటేనేన్స్ కోసం ఖర్చుపెట్టడానికి డబ్బులేక రైలుప్రమాదాలు జరిగి జనం వేలల్లో చస్తే బాధ్యులెవరు? జవాబు లేదు. నెలకు 250 రూపాయలు సామాన్యుడు భరించలేడట. చాలా వింతగా ఉంది. నేడు ఇండియాలో బెగ్గర్ కూడా రోజుకు రెండువందలు తేలికగా సంపాదిస్తున్నాడు.

అన్నీ నాటకాలూ నయవంచనలూ స్వార్ధమూ పిరికితనమూ కలగలిసిన వెన్నెముకలేని జాతికి ఇంతకంటే మంచిస్తితి వస్తుందని ఊహించడం కూడా తప్పే. ఇలా జరుగుతుందని ఇంగ్లీషువాడు మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడే అన్నాడు. అదే తూచాతప్పక జరుగుతోంది. అయినా ఎవరెలా పోతే మనకెందుకులే. మన ఉగాదిపండగ మాత్రం మనం చేసుకుందాం అది కూడా ఇంగ్లీషులో గ్రీటింగ్స్ చెప్పుకుంటూ.

హెప్పీ ఉగాడీ.

14, మార్చి 2012, బుధవారం

అహోబిలం - యాగంటి యాత్ర


ఈమధ్య అనుకోకుండా హటాత్తుగా అహోబిలం, యాగంటియాత్ర చెయ్యవలసి వచ్చింది. ఆ క్షేత్రాధిదేవత పిలుపు వస్తే తప్ప, నా అంతట నేను ఏ యాత్రా చెయ్యను. అలాటి పిలుపు ఇప్పుడు అహోబిలం నుంచి వచ్చింది. యాగంటి ఇంతకుముందు చూచాను.కాని అహోబిలం ఇప్పటిదాకా చూడలేదు. రెండూ రాయలసీమలోనివే. కర్నూలు జిల్లాలో ఉన్నాయి. రాయలసీమ అంటే నాకు చాలా ఇష్టమైనప్రదేశం గనుక యాత్ర  అంతా ఆనందంగా జరిగింది.

అహోబిలం అనేది నవనారసింహక్షేత్రం.ఇక్కడ తొమ్మిది నరసింహ దేవాలయాలున్నాయి. దిగున అహోబిలంలో మూడు, ఎగువ అహోబిలంలో ఆరు, మొత్తం తొమ్మిది నృసింహదేవళాలున్న క్షేత్రమిది.దీనిని తమిళంలో తిరుసింగవేల్ కుండ్రం అంటారు. అహోబిలపీఠంలో స్వాములు తమిళులు. వీరిని 'మహాదేశికన్' అంటారు. అంటే మహాగురువు అని అర్ధం. వీరందరూ విశిష్టాద్వైత పరులు. కొండొకచో ద్వైతులూ ఉంటారు.

"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం"- అంటూ నవనారసింహులనూ స్తుతించే శ్లోకం బహుప్రసిద్ధం.

అహోబల నృసింహస్తుతి 
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం 
వందే కృపానిధిం అహోబలనారసింహం 

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం 
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం  
వందే కృపానిధిం అహోబలనారసింహం

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం 
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం 
వందేకృపానిధిం అహోబలనారసింహం

వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం  
వందేకృపానిధిం అహోబలనారసింహం

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం 
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం  

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం 
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం 




నరసింహస్వామి యొక్క బలాన్ని తేజస్సునూ ఉగ్రరూపాన్నీ చూచిన దేవతలు 'అహో! బలం, అహో! బలం' అని ఆశ్చర్యంతో ఘోషించినందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని అంటారు. అదే కాలక్రమేణా అహోబిలం అయిందని ఒక గాధ ఉన్నది.  





దిగువ అహోబిలం కొండకింద సమతలప్రదేశంలో ఉంటుంది. ఎగువఅహోబిలం కొండమీద అడివిలో ఉంటుంది. పైవరకూ కారు,బస్సు పోతున్నాయి. అక్కడ నుంచి కొన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అక్కడ ఒకగుహలో నరసింహస్వామి స్వయంభూవిగ్రహం ఉన్నది.ఎగువ అహోబిలానికి ఇంకాపైగా కనిపించే కొండలెక్కి పైకి కొన్నికిలోమీటర్లు పోతే అక్కడ హిరణ్యకశిపుని కోట శిధిలావస్థలో కనిపిస్తుందట.అక్కడ నృశింహస్వామి ఉద్భవించిన స్థంభంకూడా ఉందని చెబుతారు.అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించిన గురుకులంకూడా ఉందని అహోబిలమఠంలోని వారు చెప్పారు. మొత్తం ప్రహ్లాదచరిత్ర అంతా జరిగినప్రదేశం ఇదే.దీనిని రాజధానిగా చేసుకుని హిరణ్యకశిపుడు పరిపాలించేవాడు.చుట్టూ చాలాఎత్తైన కొండలతో శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. ఇదంతా తిరిగి చూడాలంటే రెండుమూడురోజులు పడుతుంది. ఇదంతాకూడా,బాగా నడవగలిగినవారైతేనే చూడగలరు. కాళ్ళనెప్పులు, కీళ్ళనొప్పులున్నవారు తిరగడం కష్టమే.

మన హిందూధర్మమంతా కూడా నవగ్రహాలయొక్క  ప్రాబల్యం అమితంగా కనిపిస్తుంది. జ్యోతిష్యశాస్త్రం లేక హిందూజీవితం లేదు. మనిషి పుట్టిన దగ్గరనుంచీ పోయేవరకూ ప్రతిదీ జ్యోతిష్యశాస్త్రంతో ముడిపడి ఉంటుంది.అంతగా వారి నిత్యజీవితంతో జ్యోతిష్యమూ నవగ్రహాలూ  అనుసంధానింపబడి ఉంటాయి.నవగ్రహాలకూ నవనారసింహులకూ అనుబంధం ఉంది.నవగ్రహాలు ఒక్కొక్కటీ స్వామిని ఒక్కొక్కరూపంలో పూజించి వారివారిశక్తులను స్వామినుంచి అనుగ్రహపూర్వకంగా పొందాయని చెప్తారు.

వీరిలో 1.భార్గవనరసింహుడు  సూర్యునికీ,2.కారంజనరసింహుడు చంద్రునికీ,3.జ్వాలానరసింహుడు కుజునికీ,4.పావననరసింహుడు బుధునికీ,5. అహోబలనరసింహుడు గురువుకూ. 6. మాలోల నరసింహుడు శుక్రునికీ, 7.యోగానందనరసింహుడు శనికీ, 8. క్రోధనరసింహుడు రాహువుకూ, 9.క్షత్రవటనరసింహుడు కేతువుకూ అధిదేవతలని ఇక్కడ చెబుతారు.ఆయా గ్రహబాధలున్నవారు ఆయారూపాలలో నృసింహస్వామిని పూజించితే ఆ గ్రహబాదలనుంచి విముక్తి కలుగుతుంది.

పరమంత్ర భేదనానికీ, గ్రహబాధలనుంచి రక్షణకూ, రోగాది ఆర్తిశమనానికీ, భీతిశమనానికీ, శత్రుహననానికీ వైష్ణవులు నృసింహమంత్రాలను అనుష్టానం చేస్తారు. నృసింహమంత్రానుష్టాన పరులకు ఉగ్రం కొంచం ఎక్కువగానే ఉంటుంది.కానీ వారిఉగ్రం అనేది అధర్మం వైపే ఉంటుంది. సదాచారపరాయణులూ,సత్పురుషులూ అయినవారిపట్ల వారి ప్రవర్తన అమితసౌమ్యంగా, మృదువుగా ఉంటుంది. ఈ విషయం నా అనుభవంలో చూచాను.నవనారసింహులలో ఒక్కొక్కరికీ ఒక్కొక్కకధ ఉంది.ఉదాహరణకి కారంజనరసింహుని గురించిన గాధ ఇది. ఒకానొకప్పుడు ఈప్రదేశంలో ఆంజనేయస్వామి శ్రీరాముని గూర్చి తపస్సు చేయగా,ఆయన బదులు నృసింహస్వామి ప్రత్యక్షమైనాడు. అప్పుడాంజనేయుడు,తాను శ్రీరాముని దివ్యమంగళస్వరూపాన్ని మాత్రమే చూడగోరుతున్నానని, దయచేసి ఆరూపంతో మాత్రమే కనిపించమనీ ప్రార్ధిస్తాడు. దానికి సంతసించిన నృసింహస్వామి, చేతిలో ధనుర్బాణాలతో కూడిన శ్రీరామునిస్వరూపాన్ని తనలోనే ఆంజనేయునికి చూపించాడని గాధ. ఇక్కడ నృసింహస్వామికి మూడవ కన్ను ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకత. ఈ విధంగా నవ నారసింహులలో ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క గాధ ఇక్కడ ఉంది.

వైష్ణవంలో జ్ఞానానికి ప్రాధాన్యత లేదు. భక్తికే ఇక్కడ పెద్దపీట.కాని నృసింహోపాసనలో జ్ఞానసంబంధమైన పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ద్వంద్వాతీతమైన పరమాత్మను నృసింహనామంతో కొలవడం జరుగుతుంది. అంటే, భక్తిప్రధానమైన వ్యక్తిఉపాసన బదులుగా, జ్ఞానసంబంధమైన అద్వయపరమాత్మను ప్రపత్తితో ఉపాసించే విధానం నృసింహోపాసనలో ముఖ్యవిషయం.

తిరుమల శ్రీనివాసుని కల్యాణం ఇక్కడే జరిగిందని చెబుతారు. శ్రీనివాసుడు నృసింహుని పూజించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆ కళ్యాణ సమయంలో వండిన ఆహారాన్ని అంతటినీ ఎవరికీ నివేదన చెయ్యాలీ అన్న ప్రశ్న ఉద్భవించినప్పుడు, దేవతలలో ఆదిదేవుడైన నృసింహునికి నివేదన చెయ్యాలని నిర్ణయించిన శ్రీనివాసుడు అలా చెయ్యడం జరిగిందిట. అందుకనే ఇప్పటికీ తిరుమలనుంచి ఇక్కడికి మర్యాదాపూర్వక లాంచనాలు వస్తూ ఉంటాయి. కుమారుడు తండ్రిని గౌరవించినట్లు శ్రీనివాసుడు నృసింహుని గౌరవిస్తాడని చెబుతారు.

ఈ అరణ్యంలో పులులూ సింహాలూ ఎలుగుబంట్లూ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎవరినీ దాడిచేసి గాయపరచిన దాఖలాలు లేవు. నృసింహ నామస్మరణతో క్రూరమృగాల నుంచి కూడా రక్షణ కలగటం నిజమేనని ఇక్కడివారు నాతో చెప్పారు.

అగ్నితత్వస్వరూపుడైన కుజుడు ఆత్మకారకునిగా సింహరాశిలో ఉన్న జాతకులు నృసింహాంశను తమలో కలిగిఉంటారు. ఎదిరించిన అధర్మంపట్ల వారికి దుస్సహమైన కోపం క్షణకాలం కలిగినప్పటికీ, లోపల పరమశాంతస్వభావులై, యోగనిష్టాపరులై ఉండటం చూడవచ్చు. వీరిలో ఉన్న ఈ పరస్పర వైరుధ్యాలను అర్ధం చేసుకోలేనివారు వీరిని కోపిష్టులని భావించడమూ సహజమే. కాని నిజం అది కాదు.ఇట్టివారికి నృసింహోపాసన ఉంటుంది. వారికి కలిగే ఉగ్రం నృసింహోపాసనా ఫలితం. కాని అది తాటాకుమంటవలె వెంటనే చల్లారి పోతుంది. ఇదే విధంగా మిగతా గ్రహాలనూ అర్ధం చేసుకోవచ్చు.


నృసింహోపాసన చాలా అద్భుతమైనది. దుష్టగ్రహాల పీడలకు దీనిని మించిన ఉపాసన లేదు. శంకరుల జీవితంలోకూడా,కాపాలికుని బారినుండి  నృశింహస్వామి ఆయన్ను రక్షించడం చూడవచ్చు. త్వరలోనే మళ్ళీ అక్కడకు వెళ్లి రెండుమూడురోజులు ఎగువ అహోబిలంలో జపధ్యానాలలో గడపాలని నిశ్చయించుకొని వెనుదిరిగాను.


(వచ్చే పోస్ట్ లో యాగంటి విశేషాలు)

11, మార్చి 2012, ఆదివారం

కుజప్రభావానికి రుజువు - అన్నీ ముందే తెలిసే స్తితి.

పౌర్ణమి తర్వాత ఈరోజు సరిగ్గా మూడోరోజు. నిన్న హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 400 పైగా గుడిసెలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అని కొందరూ, కుట్ర అని కొందరూ అంటున్నారు.ఏదిఏమైనా అగ్నిప్రమాదం మాత్రం జరిగింది.

ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి నా మిత్రుడొకరు ఫోన్ చేసాడు. 

'కంగ్రాట్స్' అన్నాడు. 

'ఎందుకు' అడిగాను.

'నీవు చెప్పిన ప్రిడిక్షన్ మళ్ళీ నిజమైంది. పౌర్ణమికి అటూఇటూగా ప్రమాదాలున్నాయనీ కుజునివల్ల  అగ్నిప్రమాదాలు జరుగవచ్చనీ చెప్పావు. అలాగే ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకే కంగ్రాట్స్' అన్నాడు.

'నాకేమీ సంతోషం లేదు. అన్ని కుటుంబాలు రోడ్డునపడిన స్తితి తలచుకొని బాధగా ఉంది.' అన్నాను.

'కానీ నీలో ఒక్కటే లోపం. హైదరాబాదులోనే,అదికూడా ఈరోజే ప్రమాదం జరుగుతుంది అని మాత్రం నీవు చెప్పలేకపోయావు' అన్నాడు.

'ఇంకా నయం. నాగోల్ లో 13 నంబర్ వార్డులో 12 /24 /3 -5 -2 నంబరు గుడిసెలో ప్రమాదం జరుగుతుందనీ అదికూడా సరిగ్గా ఉదయం 7.11నిముషాలకు గుడిసె అంటుకుంటుందనీ  చెప్పలేదని నీకు బాధగా ఉందా?' అడిగాను.

'అదికాదు. అలా చెప్పినప్పుడే కదా జ్యోతిష్యానికి విలువ?' సందేహం వ్యక్తం చేసాడు.

'ఒకవేళ అలా చెప్తే ఏం చేసేవాడివి?' అడిగాను.

'ప్రెస్ ని పిలిచి అందరినీ ఎలర్ట్ చేసి ఆ ఘోరం జరుగకుండా ఆపేవాణ్ని' అన్నాడు.

'నువ్వాపని చేస్తావనే ఆ అడ్రసు మనకు ముందుగా తెలియనివ్వదు ప్రకృతి' - చెప్పాను.

'అంటే ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంటావా? అన్నాడు.

'కావచ్చు' అన్నాను.

'మరి ముందే తెలుసుకొని ఉపయోగం ఏముంది?' అన్నాడు.

'ఉపయోగం ఉండేవాళ్లకు ఉంటుంది. అందరికీ ఉండదు.' చెప్పాను.

'అదేంటి? అర్ధం కాలేదు' అడిగాడు.

'అన్నీ ముందే తెలిసినా బయటపడేవాడు మాత్రమే బయటపడతాడు. అందరూ తప్పించుకోలేరు. నాడీజ్యోతిష్యం పేరు విన్నావుగా. అందులో అందరి జాతకాలూ ఉంటాయని చెప్తారు. కానీ అక్కడ కూడా అందరివీ తాటాకుపత్రాలు ఉండవు. నీవు అక్కడకు వెళ్లి అడుగుతావని రాసిపెట్టి ఉంటేనే అక్కడ నీ తాళపత్రం ఉంటుంది. అలాగే, నీకు బయటపడే యోగం ఉన్నపుడే నీకు ముందుగా తెలుస్తుంది.లేదా ఏదో విధంగా సాయం అందుతుంది.లేకుంటే లేదు.ప్రపంచంలో అందరూ జాతకాలు చూపించుకోలేరు.చూపించుకున్న వారిలో కూడా అందరికీ రేమేడీలు దొరకవు, దొరికినవారిలో కూడా అందరూ చెయ్యలేరు. చేసినవారికి కూడా అందరికీ ఫలితాలు దక్కవు. ' చెప్పాను.

'ఏంటి ఇదంతా? గందరగోళంగా ఉందే?' అన్నాడు. 

'అంతే అలాగే ఉంటుంది. భగవద్గీతలో 'మనుష్యాణాం సహస్రేషు' శ్లోకం తెలుసుగా. ఇదీ అంతే అనుకో.' అన్నాను.

'ఏదైనా కానీ. నువ్వు ఖచ్చితంగా ఫలానా రోజున ఫలానా డోర్ నెంబరున్న  ఇంట్లో ఫలానావ్యక్తికి ఫలానాగండం ఉంది. ఇన్ని గంటలా ఇన్ని నిముషాలకు జరుగుతుంది అని చెప్పినరోజున మాత్రమె నేను నీ జ్యోతిష్యం నమ్ముతాను. లేకుంటే నమ్మను.' నన్ను ఇంకొంచం ప్రోత్సహించడానికా అన్నట్లు చెప్పాడు.

'నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. దానివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నాకొచ్చే లాభమూ లేదు. నమ్మకపోతే   నష్టమూ లేదు. ఒక రహస్యం చెప్తా విను. అలాటిస్తితి వచ్చినరోజున ఇంక నేనుమాట్లాడేది ఏమీ ఉండదు. అప్పుడసలు ఎవరికీ ఏమీ చెప్పను. అప్పుడు ఈ బ్లాగూ ఉండదు. నేను నీతో చెప్పేది కూడా ఏమీ ఉండదు. నన్నుగానీ మన శాస్త్రాలను గానీ విమర్శించినా తిట్టినాకొట్టినా కూడా ఊరకే అలా నవ్వుతూ చూస్తూ ఉంటాను. అంతే.' అన్నాను.

'ఎందుకలా?' అడిగాడు.

'అదంతే. ఇది ప్రకృతిలో ఒక వింత. అన్నీ నీకు తెలిసిన రోజున నీవు మాట్లాడేది ఏమీ ఉండదు. కొంతవరకూ  తెలుసుగనుకే మాట్లాడుతున్నావు. అన్నీ తెలిస్తే మాట్లాడవు. 'కుండ మొత్తం నిండితే శబ్దం చెయ్యదు. నిండుతూ ఉన్నప్పుడే గుడగుడమని శబ్దం చేస్తుంది' అన్న శ్రీరామకృష్ణుని మాట తెలుసుగా. అలాగే, అన్నీ తెలిసిననాడు ఇక చెప్పేది ఉండదు. వినేదీ ఉండదు. అప్పుడు అన్నీ తెలుస్తాయి. కానీ దేనినీ అడ్డుకోవడమూ ఉండదు. తప్పించడమూ ఉండదు. ముందే చెప్పడం అసలే ఉండదు. అప్పుడు నీవు నాతో మాట్లాడతావు. కాని నేను నీతో మాట్లాడేది ఏమీ ఉండదు.' అన్నాను..

'మరి అంతా దేవుడి ఇష్ట ప్రకారం జరిగితే జ్యోతిష్యం ఎందుకు?' అడిగాడు.

'అంతా విధిప్రకారమే జరుగుతుంది అని అనుకుంటూ  మనిషి ఊరుకోలేడు కాబట్టి. అలా ఊరుకోగలిగితే జ్యోతిష్యం అవసరం లేదు' చెప్పాను.

' ఏమిటో నువ్వు చెప్పేది నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు' అన్నాడు.

'అర్ధం కాకపోవడమే మంచిదిలే. అర్ధం చేసుకుందామని ప్రయత్నించిన దగ్గరనుంచీ అన్నీబాధలే. రేపటి గురించి చీకూచింతా ఆలోచనా లేనివాడే ఈ ప్రపంచంలో సుఖి. చేతనైతే నువ్వూ అలా ఉండటానికి ప్రయత్నించు' అని ముగించాను.

10, మార్చి 2012, శనివారం

హన్నేమాన్ ది గ్రేట్ - సత్యం ఎప్పటికీ సత్యమే

కోపెన్హాగెన్ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలలో ఒక విషయం వెల్లడైందిట. అదేమంటే కీళ్ళవాతం(రుమటాయిడ్ ఆర్ధరైటిస్)ఉన్నవారికి గుండె దెబ్బతినే అవకాశం మిగతా వారికంటే 40% ఎక్కువ. అలాగే వారికి పక్షవాతం వచ్చే అవకాశమూ ఎక్కువేట. పోనీలే ఇన్నాళ్ళకైనా ఈవిషయం వారు గ్రహించగలిగారు. సంతోషం కలిగింది.

ఈ విషయాన్నిహోమియో వైద్యసృష్టికర్త శామ్యూల్ హన్నేమాన్ రెండువందల ఏళ్ల క్రితమే స్పష్టంగా చెప్పాడు. ఆయన వ్రాసిన "క్రానిక్ డిసీజెస్" అన్న పుస్తకంలో ఈ విషయం స్పష్టంగా వివరించాడు. సైకోసిస్ అనే మయాజం రక్తంలో ఉంటె దానివల్ల కీళ్ళనొప్పులు వస్తాయనీ దాని అణచివేత వల్ల గుండెదెబ్బ తింటుందనీ, గుండెకు వచ్చే దాదాపు అన్ని వ్యాదులకూ మయాజమ్స్ కారణమనీ ఆయన చాలా క్లియర్ గా తన పరిశోధనల ఫలితంగా తేల్చి చెప్పాడు. అంతేకాదు కీళ్ళనొప్పులూ గుండెజబ్బూ కూడా ప్రత్యెక వ్యాధులు కావనీ నూటికి తొంభైతొమ్మిది శాతం ' సోరా' 'సైకోసిస్' అనబడే మయాజంల వలన వచ్చే సెకండరీ మరియు టెర్షియరీ ఫలితాలనీ, అవి రెండూ ఒకేవ్యాధి యొక్క భిన్నరూపాలనీ ఎప్పుడో రెండు శతాబ్దాల క్రితమే వివరించాడు. కాని ఆయనమాట ఎవరూ పట్టించుకోలేదు.

హోమియో వైద్యవిధానంలో ఒక గుండెజబ్బును ట్రీట్ చేస్తే అది తగ్గి ఆరోగికి కీళ్ళనొప్పులు బయటపడిన కేసులూ, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయగా అవీ తగ్గి చర్మరోగాలూ, ఎప్పుడో అణచివేయబడిన గనోరియా బయటపడిన కేసులూ ఆ తర్వాత అవీ క్రమంగా తగ్గిన కేసులూ ఎన్నో ఉన్నాయి. హోమియో విధానంలో ఇది చాలా చక్కని శాస్త్రీయ అవగాహన. కానీ, చాలామంది వీటిని నమ్మరు. అనుభవించే ఖర్మ ఉన్నప్పుడు నమ్మకం కలగదు. ఎవరికీ ఎంత ఏ రకంగా వదలాలో అంత వదిలి అల్లోపతీ వైద్యుల చేతిలో నానాబాధలూ పడితేగాని కర్మతీరదు మరి.

రెండువందల ఏళ్ల క్రితమే హన్నేమాన్ చెప్పిన సిద్ధాంతాలు నేడు పరిశోదనకు నిలబడి, అవి అక్షరసత్యాలే అని కనీసం నేడైనా మెడికల్ సైన్స్ నమ్మాల్సి రావడం ముదావహం. అలాగే జ్యోతిష్యం కూడా సైన్సా కాదా అని వాదించుకునే రచ్చబండ బైతన్నలు వారే అందులో పరిశోధన చేసి అది సైన్సో కాదో నిరూపించేపనికి తామే ముందుకు వస్తే బాగుంటుందేమో. ఆ పనికి మాత్రం ఎవరూ ముందుకు రారు.అలా చెయ్యాలంటే ఎంతో అధ్యయనం చెయ్యాలి. కొన్ని వేలజాతకాలను శోధించాలి. అనేక సూత్రాలను అనేక జాతకాల మీద నిగ్గుతేల్చి చూడాలి. సిద్ధాంతబాగంలోనూ ఫలితభాగంలోనూ ఉన్న ప్రాధమికసిద్ధాంతాలనుంచి మొదలుపెట్టి అర్ధం చేసుకుంటూ పరిశీలిస్తూ రావాలి. దానికి ఎంతో కష్టపడాలి. బోలెడంత సమయమూ ధనమూ వెచ్చించాలి.ఇదంతా చేస్తే మిగిలేది ఆత్మసంతృప్తి తప్ప డాలర్లేమీ రాలవాయె. అదంతా చేసే ఓపిక ఎవరికుందీ? దానిబదులు ఏదో మన నోటికి వచ్చింది నాలుగుకామెంట్లు రాసేసి/చేసేసి, ఒకవేళ అలా ఎవరైనా రీసెర్చి చేస్తుంటే వాళ్ళమీద నాలుగు రాళ్ళేసి,మన అజ్ఞానం బయటపెట్టుకునే చాన్స్ ఉన్నపుడు ఇంత కష్టపడి ఏళ్లకేళ్ళు రీసెర్చి చేసి మాట్లాడే ఓపిక ఎవరికుంది గనుక? చిన్న ఉదాహరణ. రాహుకేతువులు అసలు భౌతికంగా లేవుకదా వాటిని గ్రహాలని చెప్పే జ్యోతిష్యం అసలు ఒక విజ్ఞానమా? అని మొన్న ఎవరో వాదిస్తున్నారు.  

జీవవిజ్ఞానం, ప్రాణవిజ్ఞానం లేనివాళ్ళు నేడు డాక్టర్లు! కనీసం గ్రహం అనే పదానికి అర్ధం తెలియనివాళ్ళు జ్యోతిష్యంమీద బ్లాగుల్లోనూ టీవీలలోనూ చర్చించి అమీతుమీ కంక్లూజన్స్ ఇచ్చేవాళ్ళు!! చూస్తుంటే, ప్రపంచంలో అసలైన సత్యాలు ఎప్పటికీ మైనారిటీలుగానే ఉండాలేమో,అవి అందరికీ తెలియకూడదేమో,సృష్టిధర్మం ఇదేనేమో  అనిపిస్తోంది. అజ్ఞానమా వర్ధిల్లు !!!

6, మార్చి 2012, మంగళవారం

మళ్ళీమళ్ళీ నిజమౌతున్న జ్యోతిష్యజ్ఞానం

భూమికి దగ్గరగా వచ్చిన కుజప్రభావం వల్ల నిన్నా ఈరోజూ జరిగిన సంఘటనలు చూద్దాం.  

>> నిన్న కుజప్రభావం మీద పోస్ట్ వ్రాసిన కొంతసేపటికే 4.9 స్థాయిలో డిల్లీలో భూకంపం వచ్చింది. ఎవరూ పోలేదు కాని బిల్డింగులు ఊగినట్లు అయ్యి జనాలు భయభ్రాంతులయ్యారు. రోడ్లమీదకి పరిగెత్తి వచ్చారు.

>> నిన్న అర్జెంటీనా లో 6.1 స్థాయిలో భూకంపం వచ్చింది. 

>> నిన్న యెమెన్లో ఆర్మీ బలగాలకూ ఆల్ ఖైదా కూ జరిగిన యుద్ధంలో 100 కంటే ఎక్కువ మంది చనిపోయారు.

>> ఈ రోజు ఫిలిప్పైన్స్ లో భూకంపం వచ్చింది. దాదాపు 50 మంది హరీ మన్నారు.

ఇవన్నీ ఈరెండు రోజులలో జరిగిన సంఘటనలు.ఇవిగాక చెదురుమదురుగా అక్కడక్కడా జరిగిన అగ్నిప్రమాదాలూ, రోడ్డు ప్రమాదాలూ లెక్క లేదు.

ఇలాంటి ఘోరాలు ఈ పౌర్ణమి దగ్గరలో జరుగబోతున్నాయని నేను జనవరి 28 తేదీన వ్రాసిన "కుజుని వక్రత్వ ఫలితాలు మొదలు" అన్న పోస్ట్ లో హెచ్చరించాను. ఒక్కసారి ఆ పోస్ట్ లోని జోస్యాలను గత నాలుగు రోజులుగా జరుగుతున్న సంఘటనలతో పోల్చుకుని చదువుకుంటే జ్యోతిష్య విజ్ఞానం అనేది ఎంతటి మహత్తరమైనదో అర్ధం అవుతుంది. పౌర్ణమికి రెండు మూడు రోజులు అటూ ఇటూ గా ఈ సంఘటనలు జరుగుతాయి అని కూడా వ్రాశాను. రేపు 8 వ తేదీ పౌర్ణమి. నాలుగో తేదీనుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ దుర్ఘటనలు జరగటం చూడవచ్చు. ఈ సంఘటనలు ప్రతిరోజూ జరిగే చిన్నచిన్న సంఘటనలు కావు. కళ్ళు తెరిచి చూస్తె వీటికీ గ్రహాల స్తితులకూ మధ్య ఉన్న సంబంధం తెలుస్తుంది.

మన ప్రాచీనఋషులు ఇటువంటి మహత్తరవిజ్ఞానాన్ని ఎన్నోవేల ఏళ్ళ క్రితమే కనుక్కుని గ్రంధస్తం చేసి మనకోసం అందించినా ఈ  నాటికీ మనం మన సంస్కృతి గొప్పదనాన్ని తెలుసుకోలేక వీటిని మూఢనమ్మకాలుగా భావించడం మన తెలివితక్కువతనానికి నిదర్శనం కాక మరేమనాలో మీరే చెప్పండి.

5, మార్చి 2012, సోమవారం

భూమికి దగ్గరైన కుజుడు -- అగ్నిప్రమాదాలు

మొన్న మూడోతేదీనుంచి ఈ రోజువరకూ కుజుడు భూమికి బాగా దగ్గరకి వచ్చాడు. ఈ రోజు వీరిద్దరి మధ్య దూరం 100 మిలియన్ కిమీ ఉంది. లెక్కల ప్రకారం వీరి మధ్యన అతి తక్కువ దూరం 55 మిలియన్ కి.మీ గానూ అతి ఎక్కువ దూరం 400 మిలియన్ కి.మీ గానూ ఉంటుంది. కనుక ప్రస్తుతం కుజుడు భూమికి బాగా దగ్గరగా ఉన్నట్లే లెక్క. అందుకే కుజుని తేజస్సు బాగా కనిపిస్తూ సింహరాశిలో ఈగ్రహం కంటికి చక్కగా దర్శనం ఇస్తోంది. మరి అగ్నితత్వ గ్రహమైన కుజుడు భూమికి దగ్గరగా వస్తే ఏమి జరుగుతుంది? కుజుని కారకత్వాలు మనకు తెలుసు. అగ్ని ప్రమాదాలు, గొడవలు, యుద్ద వాతావరణం, ప్రకృతివిలయాలు, సామూహిక జననష్టాలు ఈయన కారకత్వాలలోనివి అని జ్యోతిష్యగ్రంధాలు చెబుతున్నాయి. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇవి నిజమే అని అర్ధం అవుతుంది.

>>4 వ తేదీ ఆదివారంనాడు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆయుధడిపో పేలిపోయి దాదాపు 200 మంది మాడి మసైపోయారు. ఇంకొక 2000 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఇల్లూ వాకిళ్ళూ వదలి పారిపోయారు. 

>>3 వ తేదీ శనివారం నాడు పోలాండ్ లో రెండు రైళ్ళ హెడ్ ఆన్ కొలిజన్ లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 

>>ఇదే శనివారంనాడు సెంట్రల్ అమెరికాలో తుఫానులు భీభత్సం సృష్టించాయి. దాదాపు 13 తుఫానులు శుక్రవారం నుంచి శనివారం లోపు విలయతాండవం చేసాయి. ఇండియానా రాష్ట్రంలోని మేరీస్ విల్లి అనే ఊరు ఊరే లేకుండా మాయమై పోయింది అని న్యూస్ చెబుతోంది.

>>2 వ తేదీ శుక్రవారం పాకిస్తాన్ లో జరిగిన దాడులలో కనీసం 100 మంది చనిపోయారు. 

>>4 తేదీ ఆదివారం నాడు చైనా తన మిలిటరీ బడ్జెట్ ను 100 బిలియన్లు గా ప్రకటించింది. ఈ ప్రకటనవల్ల అనేక ప్రపంచదేశాల గుండెల్లో గుబులు మొదలైంది. యుద్దానికి, మిలటరీకి సంబంధించిన విషయాలు కుజుని ఆధీనంలో ఉంటాయని మనకు తెలుసు. 

>> ఇరాన్ తో మిగతా దేశాల వైరం ఊపందుకుంటున్నది. రాబోతున్న అమెరికా ఎన్నికల దృష్ట్యా మరొక "బూచిని" ఇరాన్ రూపంలో అమెరికా ప్రజలకు చూపించి ఓటర్లను మాయ చేసే ప్రయత్నం జరుగుతున్నది.  ఇది ముందుముందు యుద్ధానికి దారి తీసే సూచనలున్నాయి.

గ్రహప్రభావం భూమిమీద తప్పకుండా ఉంటుంది. మనిషి జీవితంమీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాకుంటే ఎక్కడ ఎలా ఆ ప్రభావాలుంటాయో తెలుసుకోగలిగితే కొంత ఉపయోగం ఉంటుంది. సామూహిక జన హననం ఆపడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే సామూహికకర్మను ఆపే శక్తి ఎవరికీ ఉండదు. ఆపగల శక్తి ఉన్నటువంటి శ్రీకృష్ణునివంటి అవతారపురుషులే చూస్తూ ఊరుకున్నారు.కాని వ్యక్తి జాతకంలో ఇలాంటి దుస్సంఘటనలు జరిగే పరిస్తితులు ఉన్నపుడు వాటిని తగిన రెమెడీస్ ద్వారా నివారించుకోవచ్చు. అంతవరకు జ్యోతిశ్శాస్త్రం వీలు కల్పిస్తుంది. ప్రపంచానికి మనం గొడుగు పట్టలేం. కాని మనవరకు మనం గొడుగు వేసుకుని ఎండనుంచి రక్షణ పొందవచ్చు.

రేపు 8 వ తేదీన పౌర్ణమి రాబోతున్నది. ఈ లోపల మరిన్ని సంఘటనలకు రెడీగా ఉందాం. వ్యక్తిగత జీవితాలలో కూడా ఈ మధ్యలో ఏక్సిడేంట్లు జరగడం , దెబ్బలు తగలడం, అనారోగ్యాలు ఎక్కువ కావడం, అనవసర ఉద్రేకాలు పెరగడం, ఇతరులతో గొడవలు,  వస్తువులు రిపేర్లు రావడం గమనించవచ్చు.

1, మార్చి 2012, గురువారం

నవీనకాలపు భయంకరపాపం

మానవుడు సైన్సుపరంగా ఎంతో ఎదిగానని విర్రవీగుతూ కన్నూమిన్నూగానక చేస్తున్న ఎన్నోతప్పులు నవీనకాలంలో ఉన్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న అబార్షన్లు వాటిలో ఒకటి.

భ్రూణహత్యను మహాపాపాలలో ఒకటిగా ధర్మశాస్త్రాలన్నీ పరిగణించాయి. అవన్నీ పనీపాటాలేని వాళ్ళు వ్రాసిన పుస్తకాలు అని ఎగతాళి చేస్తూ ఇష్టానుసారం పిచ్చి పనులు చేసేవారు అనుభవిస్తున్న ఖర్మలు దారుణంగా ఉంటున్నాయి. తల్లిగర్భం అనేది ఒక ప్రాణికి జీవంపోసి తొమ్మిదినెలలు పోషించవలసిన అమృతస్థానం. జీవం పోసుకుంటున్న అమాయకప్రాణికి అది బలిపీఠంగా మారిందంటే దాని ఫలితాలు భయంకరంగా ఉంటాయి. ప్రకృతిలో ఏది ఏపని చెయ్యాలో అది ఆపని చేసినప్పుడే అక్కడ వ్యవస్థ సక్రమంగా ఉన్నట్లు లెక్క. అంతేగాని పెంచి పోషించవలసిన చోట శ్మశానం చోటుచేసుకుంటే ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. ఆ వ్యక్తి జీవితం అక్కణ్ణించి గతి తప్పుతుంది. సూక్ష్మంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది.

ఒక గురువుకు శిష్యుణ్ణి అని చెప్పుకునే ఒక ఆధ్యాత్మికనయవంచకుడు నాకు తెలుసు. అతను కొన్నేళ్ళక్రితం బాగానే ఉండేవాడు. లోలోపల దుష్ట సంస్కారాలు ఉన్నాయని నాకు తెలుసు. కాని పైకి కొంత బాగానే ఉండేవాడు. బాగానే నటించేవాడు. అతనికి ఒకగురువు దగ్గర దీక్ష ఇప్పించడంలో ఇరవైఏళ్లక్రితం నేనుకూడా కొంతపాత్ర పోషించాను. తరువాత తరువాత అనవసరంగా నాతో శత్రుత్వం తెచ్చుకుని మాట్లాడటం మానేశాడు. సరే, ఎవరి ఖర్మకెవరు బాధ్యులు అని నేనూ అతనికి దూరంగానే ఉన్నాను. కొన్నేళ్ళ తర్వాత ఈమధ్యనే యదాలాపంగా అతన్ని కలవడం జరిగింది. అతని ముఖంలో, ఒక కిరాతకుని ముఖంలో ఉండే క్రౌర్యం కనిపించింది. ఇరవై ఏళ్ల సాధన తర్వాత ఒక మనిషిలో రావలసిన పవిత్రతా పరిపక్వతా రాకపోగా అతనిముఖం ఒక రాక్షసునిముఖంలాగా, కసాయివాడిముఖంలాగా  కనిపించింది. అతని తేజోవలయం (ఆరా) పరమచండాలంగా, రిపల్సివ్ గా ఉంది. అతనికి షేక్ హాండ్ ఇస్తే నాచెయ్యి మంటలు పుట్టింది. కారణాలు విచారించగా, భార్య వద్దని మొత్తుకుంటున్నా వినకుండా అయ్యగారు వరుసగా ఆమెకు మూడుఅబార్షన్లు చేయించాడని తెలిసింది. ఆడపిల్ల గర్భంలో ఉండడమే దానికి కారణమట. ఇలాటి వెధవలు ఆధ్యాత్మికత గురించి లెక్చర్లు ఇస్తే నాకు ఎంత కోపం వస్తుందంటే, అలాటివాళ్ళను భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్లు, ఏముక్కకు ఆముక్క చీల్చి పారేద్దామనిపిస్తుంది. నాకు పరమచీదర పుట్టి అతనితో మాట్లాడటం, అతని ముఖం చూడటంకూడా మానేశాను.

నవీనకాలంలో పెరుగుతున్న ఇంకొన్ని పోకడలున్నాయి. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు వద్దట. కొన్నేళ్ళు ఎంజాయ్ చేసి అప్పుడు పిల్లల్ని కంటారట. అందుకే కుక్కపిల్లలూ కోతిపిల్లలూ పుడుతున్నాయి.పెద్దయ్యాక పశువులశాలకు పశువుల్ని తోలినట్లు, తల్లిదండ్రుల్ని అనాదాశ్రమాలకు తోలే పిల్లలు అందుకే పుట్టుకొస్తున్నారు. దంపతులకు ఎంజాయ్మెంట్  ప్రధానం అట, సంతానం కాదుట. కనుకనే అలాంటివారికి పుట్టే పిల్లలుకూడా వారు పెద్దయిన తర్వాత 'మా ఎంజాయ్మెంట్ మాకు ముఖ్యం. మీరు మాకు అడ్డం' అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తోలుతున్నారు. పిల్లలను కనడం ఒక కళ. అది ఒక యోగం అని చెప్పవచ్చు. ప్రాచీనులకు ఆ కళ తెలుసు. ముఖ్యంగా ప్రాచీన ఋషులు ఈ విద్యలో ఉద్దండులు. వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకోగల సంతానాన్ని ఎలా కనాలో వారికి తెలిసి ఉండేది. దీనికి ఉత్తకోరిక ఉంటే చాలదు. దానికోసం మన జీవనవిధానం మార్చుకోవాలి. మన ఇష్టానుసారం మనం జీవిస్తూ మన సంతానంమాత్రం ఉత్తములుగా ఉండాలంటే అది సాధ్యంకాదు.మన పిల్లలు ఏవిధంగా ఉండాలని మనము అనుకుంటామో ఆవిధంగా పెళ్లి కాకముందు కొన్నేళ్ళపాటు మనం ఉంటే అప్పుడు ఆ జీన్స్ లోనుంచి అలాంటి పిల్లలే మనకు పుడతారు.  లేకుంటే లేదు.

పశువులుకూడా పిల్లలను కంటాయి అది గొప్పవిషయం కాదు. కాని పశువుకు పశువే పుడుతుంది. ఒక దేవతను బిడ్డగా పొందగలిగే అదృష్టం మాత్రం మనిషికే ఉంది. అలాంటి సంతానం పొందాలంటే దానికి మనిషి చిన్నప్పటినుంచే తయారు కావాలి. మన శారీరిక మానసిక పవిత్రతను ఆధ్యాత్మికబలాన్నీ బట్టే మన సంతానానికి ఉత్తమసంస్కారాలు ఏర్పడతాయి. చాలామంది తల్లిదండ్రులు 'మా పిల్లలు మా మాట వినడం లేదు' అని బాధపడటం నేను చూచాను. 'దానికి కారణం మీరే' - అని వారికి చెప్తాను.జంతువులలా సంతానాన్ని కంటే జంతువులే పుడతారు. దేవతలవంటి సంతానం కావాలంటే మనం దేవతలవలె ఉండాలి. దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంది. వివాహానికి ఎంతో ముందు నుంచే ఇద్దరూ ఆ శిక్షణలో ఉండాలి. ఆ మార్గంలో ఇద్దరూ తమ మనస్సులనూ శరీరాలనూ తయారు చేసుకోవాలి.అప్పుడే వారికి రుషితుల్యమైన సంతానం కలుగుతుంది. అది నేటి తల్లిదండ్రులకే తెలియదు ఇక తమ పిల్లలకు ఏమి నేర్పించగలరు? సంగమసమయంలో దంపతుల శారీరికపవిత్రతనుబట్టి, మానసికసంస్కారాలను బట్టి పుట్టబోయే జీవి ఉంటుంది. అటువంటి ఉత్తమ పరిస్తితులు అప్పటికప్పుడు స్నానం చేస్తే వచ్చేవి కావు. వాటికోసం ఎన్నో ఏళ్లుగా తపస్సు చెయ్యాలి. అటువంటివారికే ఉత్తమసంతానం కలుగుతుంది.

పెళ్ళయ్యాక అయిదారేళ్ళు ఎంజాయ్ చేసి పిచ్చిపిచ్చి మందులు వాడిన జంటలు తర్వాత సంతానం కలగక ఎందఱో డాక్టర్లచుట్టూ సంతానం కోసం ప్రదక్షిణాలు చేసినవిషయం నాకు తెలుసు.మా బంధువులలోనే అలాటివాళ్ళు చాలామంది ఉన్నారు. పునరుత్పత్తి వ్యవస్థ అనేది మొగవాడిలోనైనా ఆడదానిలోనైనా అతి సున్నితమైన వ్యవస్థ. తిక్కతిక్క పనులతో దానిని అస్తవ్యస్తం చేసుకుంటున్న నేటి నవీనులకు జంతుసమానులైన వాళ్ళు  సంతానంగా పుట్టటంలో వింత ఏముంటుంది? రకరకాల దురభ్యాసాలతో వీర్యనష్టానికి లోనైన యువకుని వీర్యంలో పటుత్వం ఉండదు. దానినుంచి ఉత్తమ సంతానం రాదు. అలాగే రకరకాల మందులు వాడి నెలసరి వ్యవస్థను అతలాకుతలం చేసుకుని తిక్క పనులు చేసే యువతికి కూడా సత్సంతానం కలగడం కల్ల. ఇక వీరిద్దరి కలయికతో ఎటువంటి సంతానం వస్తుందో ఊహించడానికి దివ్యదృష్టి అక్కర్లేదు, కామన్ సెన్స్ చాలు. ఇలాటివాళ్ళను ప్రోత్సహిస్తూ చెత్తవాగుడు పత్రికల్లో వాగుతూ సమాజపు డబ్బును దోచుకునే నేటి డాక్టర్లు పచ్చిదొంగలు అంటే ఎంత మాత్రం తప్పు లేదు.

మిత్రులు జయదేవ్ గారు ఇంకొక విషయం చెప్పారు. గర్భసంచి అనేదానికి కూడా మెమరీ ఉంటుందని నేటి రీసెర్చి రుజువు చేస్తున్నది. మన శరీరంలో ప్రతి కణానికీ మెమరీ ఉంటుంది అన్నది నిజమే. ఒకసారి గర్భస్రావం జరిగినప్పుడు గర్భసంచి భయంతో వణికిపోయి కుంచించుకుపోతుంది. ఆ భయం దాని సెల్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. కనుక రెండవసారి అసలు గర్భధారణనే  జరుగనివ్వదు. కనుకనే రెండుమూడుసార్లు ఎబార్షన్ చేయించుకున్న వారికి ఆ తరువాత ప్రయత్నించినా గర్భం నిలబడదు. దానికోసం మళ్ళీ మందులు వాడి నరకం అనుభవించవలసి వస్తుంది. అయినా గ్యారంటీ ఉండదు. ఇదంతా గర్భసంచి కణాల మెమరీ లో ప్రింట్ అయిపోయిన భయంవల్లే జరుగుతుంది. డాక్టర్లకు ఈవిషయం తెలీదో లేక తెలిసీ ధనాశతో మనకెందుకులే పాడైపొయ్యేది పేషంటేకదా అని వీళ్ళకు చెప్పరో అర్ధం కాదు. మనిషి మాత్రం తన అహంకారంతో అన్నీ తెలుసనీ విర్రవీగుతూ పిచ్చిపనులతో నాశనం అవుతూ ఉంటాడు.

చిన్ననాటినుంచి ఉత్తమభావాలతో నిండిన ఇంటి వాతావరణంలో పెరిగి, సాత్విక ఆహారం తీసుకుంటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్న యువతీ యువకులకు కలిగే సంతానం ఎంతో ఉత్తమగుణాలతో నిండి ఉంటుంది. అలా పుట్టిన సంతానానికి మంచీచెడులను ఒకరు నేర్పవలసిన అవసరం ఉండదు.ధర్మంగా జీవించాలని కూడా వారికి ఒకరు చెప్పవలసిన పని లేదు. చిన్నప్పటినుంచీ సక్రమమైనమార్గంలో వారే ఉంటారు. పైగా, పెద్దవారి తప్పులను కూడా సరిదిద్దగలరు.దానికి పూర్తీ వ్యతిరేకంగా, చిన్నప్పటినుంచీ సినిమాలు, టీవీలో హింసా సెక్సూ దృశ్యాలు, తినే తిండిలో మషాలాలు, మాంసాలు,చిన్నప్పటినుంచే తాగుడు,తిరుగుడు,పోకిరీవేషాలు, అసభ్యసంభాషణలు అలవాటు అవుతున్న నేటి యువతీయువకులకు ఎలాంటి సంతానం కలుగుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడరన్ భావాల ముసుగులో దాక్కుని చాలామంది నేటి తల్లిదండ్రులు వీటిని ప్రోత్సహిస్తున్నారు అనేది ఇంకొక చేదునిజం. 

మాకుతెలిసిన ఒకఅమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నపుడు, ఇంట్లోనుంచి వెళ్లి పోయి ఒక హోటల్లో నాలుగురోజులు ఉండి, వాళ్ళ క్లాస్మెట్లు  నలుగురు అబ్బాయిలతో ఎంజాయ్ చేసింది. తర్వాత మూన్నేల్లకు ఆ అమ్మాయికి కడుపు అని తేలింది. నెత్తీనోరూ బాదుకున్న ఆ తండ్రి, గుట్టుచప్పుడు కాకుండా ఆఅమ్మాయికి అబార్షన్ చేయించి, ఇంకొకడితో మూడు ముళ్ళు వేయించాడు. ఆ నలుగురు బాయ్ ప్రెండ్స్ లో అనుమానం ఉన్న ఒకడికి రౌడీలతో దేహశుద్ధి చేయించాడు. ఆ కుర్రాడు మూడునెలలు హాస్పిటల్ బెడ్లో ఉన్నాడు. ఇంతా చేస్తే ఆనలుగురిలో ఈఅమ్మాయి కడుపుకు కారణం ఎవరో ఆఅమ్మాయే చెప్పలేకపోతున్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఆఅమ్మాయి తండ్రి కూడా తక్కువవాడేమీ కాదు. అతనూ విచ్చలవిడిగా ఆడవాళ్ళతో తిరిగినవాడే. ఇప్పుడూ అతనికి తాగుడూ తిరుగుడూ అన్నిరకాల వ్యవహారాలూ ఉన్నాయి. కాని తనకూతురు దగ్గరకు వచ్చేసరికి ఆమె సతీసావిత్రిలాగా ఉండాలని ఆశించాడు. అది ఎలా సాధ్యమో నాకు అర్ధం కాదు. చాలామంది తల్లితండ్రులు ఇదే పొరపాటు చేస్తారు. తామెలా ఉన్నా తమసంతానం మాత్రం ఉత్తములుగా ఉండాలని కోరుకుంటారు. తమ జీన్స్ లోనుంచే తమ సంతానం వస్తుందని వారు మరచిపోతారో లేక గుర్తులేనట్టు నటిస్తారో అర్ధం కాదు. ఆ పిల్లల తప్పు కూడా ఏమీ ఉండదు. వాళ్ళ జీన్స్ ప్రేరేపించిన తీరులో వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి తోడు పెంపకంలో ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో చూస్తున్నపనులే వాళ్ళూ చేస్తారు. వాళ్ళను తప్పుబట్టి ప్రయోజనం లేదు.

అబ్బాయిలలోనూ అమ్మాయిలలోనూ స్వలింగసంపర్కం ఈరోజుల్లో మామూలుగా జరుగుతోంది. ఇది మరీ నీచాతినీచం. విచక్షణాజ్ఞానం లేని జంతువుకూడా ఈపని చెయ్యదు. ఇక మనిషి ఇలాటిపనులు చేస్తుంటే అతన్ని జంతువూ అంటే జంతువులు  కూడా సిగ్గు పడతాయేమో. ఇలాటి వాళ్లకు పుట్టబోయే సంతానంలో క్రిమినల్ పోకడలు తప్పకుండ ఉంటాయి. సంఘవ్యతిరేకమనస్తత్వాలూ, అసహజమనస్తత్వాలూ, సైకోలూ ఇలాగే పుట్టుకొస్తారు.కలియుగధర్మమా అని వీరికోసం న్యాయస్థానాల తీర్పులూ, వీరి హక్కులకోసం పోరాటాలూ గట్రాలూ చూస్తుంటే మనం పురోగమిస్తున్నామో లేక  తిరోగమిస్తున్నామో అర్ధం కావడం లేదు.

ఇక ప్రస్తుతవిషయానికి వస్తే, అబార్షన్లు చేయించిన లేక చేయించుకున్న కుటుంబాలు తరువాత భయంకరఫలితాలు అనుభవిస్తాయి అనడం పచ్చినిజం. నేను అనేక కేసుల్లో వీటిని కళ్ళారా చూచాను. నాకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ అబార్షన్లు చెయ్యడంలో మంచిదిట్ట. ఆపని వద్దనీ అది మంచిది కాదనీ ఎందఱో చెప్పి చూచారు. కాని ఆమె వినలేదు. కారణం ఏమంటే, ఆ పనివల్ల తేరగా ఎక్కువ డబ్బు వచ్చి పడుతుంది. ఆమె ఆస్పత్రి కింద బ్లాకులో ఈ అబార్షన్లు చేసే రూం ఒకటుంది. అక్కడకు వెళితే ఎప్పుడూ ఎవరో అక్కడ ఏడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.నేను ఒకసారి అక్కడకు వెళ్ళినపుడు ఒక్కక్షణంకూడా ఆగదిలో నిలవలేక పారిపోయినట్లు బయటకువచ్చిపడ్డాను. ఎన్నో ఆత్మలు అక్కడ గాలిలో ఏడుస్తూ తిరుతున్నట్లు నాకు అనిపించింది. తర్వాత కొన్నాళ్ళకు ఆ డాక్టర్ కుటుంబం చిన్నాభిన్నం అయిపొయింది. ఆమెకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చి చనిపోయింది. ఆమె భర్త కూడా డాక్టరే. ఆయన అకస్మాత్తుగా పక్షవాతంతో మంచానపడి మరణించాడు.పిల్లలు దిక్కులేనివాల్లయ్యారు. కూతురు ఇంటర్ కేస్ట్ ( బాగా తక్కువకులం వాడిని) మేరేజి చేసుకుని ఎక్కడో ఉంటోంది. ఈ విధంగా బంగారంలాంటి సంసారం సర్వనాశనం అయిపొయింది. ఇలా జరగడానికి కారణం ఆమె చేసిన వందలాది అబార్షన్లు అని నేను నమ్ముతాను.

నాకు తెలిసిన ఒక వ్యక్తికూతురు ఇరవై ఏళ్లక్రితం MBBS  చదివి ప్రాక్టీస్ పెట్టింది. కాని ఆమె అబార్షన్లు మాత్రమె ఎక్కువగా చేసేది. కాలుజారిన పెళ్లికాని కాలేజీయువతులు గుట్టుచప్పుడుకాకుండా వచ్చి ఈమెదగ్గర అబార్షన్ చేయించుకునేవారు. ఈమెకూడా వారివద్ద డబ్బు బాగా గుంజుతూ లీగల్ గా వారికి సహకరించేది. తర్వాత వాళ్ళు పెళ్లిచేసుకుని అమాయకంగా నటిస్తూ జీవితంలో సెటిల్ అయిపోయేవారు.ఇది మంచిపని కాదని, చెయ్యొద్దనీ  నేను చాలాసార్లు చెప్పాను. ఆమె వినలేదు. విచిత్రమేమంటే, ఆమె తండ్రి నాకు స్నేహితుడు. అతనే ఈఅమ్మాయి చేత ఈ క్లినిక్ ఓపన్ చేయించి ఇలాంటి పనులు చేయించేవాడు.తర్వాత కొన్నేళ్ళకు ఆ అమ్మాయికి పెళ్లయింది. మొగుడితో భయంకరంగా గొడవలు అయ్యి కోర్టుకెక్కి, విడిపోయి ఇద్దరూ ఇప్పుడు తలోదారీ చూసుకున్నారు. ఈ అమ్మాయి ఆరోగ్యం బాగా పాడై పోయింది. ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు. ఈ తండ్రికూడా చాలాకష్టాలలో కూరుకుపోయి ఉన్నాడు. ఇతనికి కూడా ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.ఆకుటుంబంకూడా చిన్నాభిన్నం అయిపొయింది.

అప్పటివరకూ చక్కగా సాగుతున్న సంసారాలు తెలిసోతెలియకో చేయించుకున్న  అబార్షన్ తర్వాత చిన్నాభిన్నం కావడం చాలాసార్లు చూడవచ్చు. కాకపోతే దీనికీ దానికీ లింకులు అర్ధం చేసుకోవడం చాలామందికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దృష్టి కోణాలు అందరికీ అలవాటు ఉండవు. ఈ విషయంలో మనకంటే పల్లెటూరివాళ్ళు చాలా మేలుగా ఉంటారు. వాళ్ళు ఇలాంటివాటిని భలే ఖచ్చితంగా గుర్తుపట్టి, 'ఈ పని చేసిన దగ్గరనుంచే ఇలా మనింట్లో చెడు జరుగుతోంది' అని గుర్తుపట్టగలుగుతారు. చదువుకున్న నవీనులు  తెలివిగలవాల్లమనీ అన్నీతెలుసనీ విర్రవీగుతూ ఇలాంటి తిక్క తిక్క పనులు చేసుకుని ఖర్మలు అనుభవిస్తుంటారు.

అబార్షన్లు చేసిన డాక్టర్లకూ,చేయించుకున్నవారికీ,చేయించినవారికీ భయంకరఖర్మలు కట్టి కుడుపుతాయి. అవి అనుభవించేటప్పుడు అర్ధం అవుతుంది తాముచేసింది ఎంతటితప్పో అనే విషయం. కాని అప్పటికే సమయం మించిపోతుంది.ఇదంతా చెబితే చాలామందికి సోదిలా కనిపిస్తుంది.కాని ప్రకృతిధర్మాలు మనం నమ్మినా నమ్మకున్నా జరుగుతూనే ఉంటాయి. ధర్మమూర్తి అయిన కర్మసాక్షి ఎవరికి ఇవ్వాల్సిన ఫలితాలు వారివారి కర్మానుసారం వారికి ఇస్తూనే ఉంటాడు. కళ్ళు తెరిచి గ్రహించేవాడు జాగ్రత్తగా జీవిస్తాడు. అహంకారంతో విర్రవీగేవాడు కాలక్రమేణా ఫలితాలు అనుభవిస్తాడు.

భ్రూణహత్య అనేది మహాపాపం అనీ, దాని ఉసురు తప్పకుండా తగులుతుందనీ, దాని ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయనీ దాన్ని చేయించుకునే వాళ్ళూ చేసే డాక్టర్లూ కూడా గ్రహిస్తే మంచిది. తస్మాత్ జాగ్రత.

ఈ పోస్ట్ చదివిన ఒక మిత్రురాలు మెయిల్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన అంశాలు లేవనెత్తారు. ఒక అమ్మాయి చెరచబడి గర్భం దాలిస్తే అప్పుడు ఆమె ఏమి చెయ్యాలి? ఆ కడుపును ఉంచుకొని బిడ్డను కని జీవితాంతం పెంచాలా? ఆబిడ్డను రోజూ చూస్తూ తన మానసిక క్షోభను రోజూ రెన్యూవల్ చేసుకోవాలా? అలాగే, పిండం సక్రమంగా పెరుగుతోందా లేదా అన్నది తెలుసుకునే సాంకేతిక వ్యవస్థలు నేడు మనకు ఉన్నాయి. పిండంలో నయంకాని లోపాలు భయంకరరోగాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ చేయించవచ్చా లేదా అనేది కూడా వివాదాస్పద అంశమే. కాకుంటే ఒక్కవిషయం గుర్తుంచుకోవాలి. కారణాలు ఏవయినా కావచ్చు. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు. కాని ఒక ప్రాణిని మొగ్గలోనే తుంచితే దానిఖర్మ మాత్రం అనుభవించక తప్పదు. దీనికిమాత్రం ప్రకృతిలో మినహాయింపు  లేదు. ప్రకృతిన్యాయస్థానంలో మనవాదనలు ఏమాత్రం నిలబడవు అనీ, ఆ కోర్టులో 'కంటికి కన్ను పంటికి పన్ను' అనేదే తీర్పు అన్న విషయం గుర్తుంచుకోవాలి.

జ్యోతిష్య విజ్ఞానంలో ఇటువంటి దోషాలను కనుక్కునే పద్దతులు ఉన్నాయి.   ఒక జాతకంలోని ప్రేతశాపాలను కనుక్కునే విధానాలు మహర్షి పరాశరులు తన 'హోరాశాస్త్రం'లోఇచ్చారు. చంపబడిన పిండం ప్రేతంగా మారుతుంది. దాని శాపం వీరికి తగులుతుంది. కనుక ఆయా దోష ఫలితాలు వీరిని తరతరాలు ( ఆ దోషం నివారణ అయ్యేంతవరకూ) వెంటాడతాయి. సామాన్యంగా వీటివల్ల సుతక్షయం జరుగుతుంది. అంటే వీరి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. వాటిని తెలుసుకుని రెమెడీస్ పాటించి ఆయాదోషాలను తొలగించుకుంటే అప్పటినుంచీ జాతకుని జీవితం బాగుంటుంది. అసలు ఇలాంటి పనులు చెయ్యకుండా ఉండటం ఉత్తమం. చేసిన తర్వాత ఇంకేమీ చెయ్యలేము గనుక రెమెడీస్ పాటించడమే ఎవరైనా చెయ్యగలిగింది.