నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, మార్చి 2012, ఆదివారం

కుజప్రభావానికి రుజువు - అన్నీ ముందే తెలిసే స్తితి.

పౌర్ణమి తర్వాత ఈరోజు సరిగ్గా మూడోరోజు. నిన్న హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 400 పైగా గుడిసెలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అని కొందరూ, కుట్ర అని కొందరూ అంటున్నారు.ఏదిఏమైనా అగ్నిప్రమాదం మాత్రం జరిగింది.

ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి నా మిత్రుడొకరు ఫోన్ చేసాడు. 

'కంగ్రాట్స్' అన్నాడు. 

'ఎందుకు' అడిగాను.

'నీవు చెప్పిన ప్రిడిక్షన్ మళ్ళీ నిజమైంది. పౌర్ణమికి అటూఇటూగా ప్రమాదాలున్నాయనీ కుజునివల్ల  అగ్నిప్రమాదాలు జరుగవచ్చనీ చెప్పావు. అలాగే ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. అందుకే కంగ్రాట్స్' అన్నాడు.

'నాకేమీ సంతోషం లేదు. అన్ని కుటుంబాలు రోడ్డునపడిన స్తితి తలచుకొని బాధగా ఉంది.' అన్నాను.

'కానీ నీలో ఒక్కటే లోపం. హైదరాబాదులోనే,అదికూడా ఈరోజే ప్రమాదం జరుగుతుంది అని మాత్రం నీవు చెప్పలేకపోయావు' అన్నాడు.

'ఇంకా నయం. నాగోల్ లో 13 నంబర్ వార్డులో 12 /24 /3 -5 -2 నంబరు గుడిసెలో ప్రమాదం జరుగుతుందనీ అదికూడా సరిగ్గా ఉదయం 7.11నిముషాలకు గుడిసె అంటుకుంటుందనీ  చెప్పలేదని నీకు బాధగా ఉందా?' అడిగాను.

'అదికాదు. అలా చెప్పినప్పుడే కదా జ్యోతిష్యానికి విలువ?' సందేహం వ్యక్తం చేసాడు.

'ఒకవేళ అలా చెప్తే ఏం చేసేవాడివి?' అడిగాను.

'ప్రెస్ ని పిలిచి అందరినీ ఎలర్ట్ చేసి ఆ ఘోరం జరుగకుండా ఆపేవాణ్ని' అన్నాడు.

'నువ్వాపని చేస్తావనే ఆ అడ్రసు మనకు ముందుగా తెలియనివ్వదు ప్రకృతి' - చెప్పాను.

'అంటే ఇలా జరగాలని ఉంది కాబట్టి జరిగింది అంటావా? అన్నాడు.

'కావచ్చు' అన్నాను.

'మరి ముందే తెలుసుకొని ఉపయోగం ఏముంది?' అన్నాడు.

'ఉపయోగం ఉండేవాళ్లకు ఉంటుంది. అందరికీ ఉండదు.' చెప్పాను.

'అదేంటి? అర్ధం కాలేదు' అడిగాడు.

'అన్నీ ముందే తెలిసినా బయటపడేవాడు మాత్రమే బయటపడతాడు. అందరూ తప్పించుకోలేరు. నాడీజ్యోతిష్యం పేరు విన్నావుగా. అందులో అందరి జాతకాలూ ఉంటాయని చెప్తారు. కానీ అక్కడ కూడా అందరివీ తాటాకుపత్రాలు ఉండవు. నీవు అక్కడకు వెళ్లి అడుగుతావని రాసిపెట్టి ఉంటేనే అక్కడ నీ తాళపత్రం ఉంటుంది. అలాగే, నీకు బయటపడే యోగం ఉన్నపుడే నీకు ముందుగా తెలుస్తుంది.లేదా ఏదో విధంగా సాయం అందుతుంది.లేకుంటే లేదు.ప్రపంచంలో అందరూ జాతకాలు చూపించుకోలేరు.చూపించుకున్న వారిలో కూడా అందరికీ రేమేడీలు దొరకవు, దొరికినవారిలో కూడా అందరూ చెయ్యలేరు. చేసినవారికి కూడా అందరికీ ఫలితాలు దక్కవు. ' చెప్పాను.

'ఏంటి ఇదంతా? గందరగోళంగా ఉందే?' అన్నాడు. 

'అంతే అలాగే ఉంటుంది. భగవద్గీతలో 'మనుష్యాణాం సహస్రేషు' శ్లోకం తెలుసుగా. ఇదీ అంతే అనుకో.' అన్నాను.

'ఏదైనా కానీ. నువ్వు ఖచ్చితంగా ఫలానా రోజున ఫలానా డోర్ నెంబరున్న  ఇంట్లో ఫలానావ్యక్తికి ఫలానాగండం ఉంది. ఇన్ని గంటలా ఇన్ని నిముషాలకు జరుగుతుంది అని చెప్పినరోజున మాత్రమె నేను నీ జ్యోతిష్యం నమ్ముతాను. లేకుంటే నమ్మను.' నన్ను ఇంకొంచం ప్రోత్సహించడానికా అన్నట్లు చెప్పాడు.

'నువ్వు నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. దానివల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నాకొచ్చే లాభమూ లేదు. నమ్మకపోతే   నష్టమూ లేదు. ఒక రహస్యం చెప్తా విను. అలాటిస్తితి వచ్చినరోజున ఇంక నేనుమాట్లాడేది ఏమీ ఉండదు. అప్పుడసలు ఎవరికీ ఏమీ చెప్పను. అప్పుడు ఈ బ్లాగూ ఉండదు. నేను నీతో చెప్పేది కూడా ఏమీ ఉండదు. నన్నుగానీ మన శాస్త్రాలను గానీ విమర్శించినా తిట్టినాకొట్టినా కూడా ఊరకే అలా నవ్వుతూ చూస్తూ ఉంటాను. అంతే.' అన్నాను.

'ఎందుకలా?' అడిగాడు.

'అదంతే. ఇది ప్రకృతిలో ఒక వింత. అన్నీ నీకు తెలిసిన రోజున నీవు మాట్లాడేది ఏమీ ఉండదు. కొంతవరకూ  తెలుసుగనుకే మాట్లాడుతున్నావు. అన్నీ తెలిస్తే మాట్లాడవు. 'కుండ మొత్తం నిండితే శబ్దం చెయ్యదు. నిండుతూ ఉన్నప్పుడే గుడగుడమని శబ్దం చేస్తుంది' అన్న శ్రీరామకృష్ణుని మాట తెలుసుగా. అలాగే, అన్నీ తెలిసిననాడు ఇక చెప్పేది ఉండదు. వినేదీ ఉండదు. అప్పుడు అన్నీ తెలుస్తాయి. కానీ దేనినీ అడ్డుకోవడమూ ఉండదు. తప్పించడమూ ఉండదు. ముందే చెప్పడం అసలే ఉండదు. అప్పుడు నీవు నాతో మాట్లాడతావు. కాని నేను నీతో మాట్లాడేది ఏమీ ఉండదు.' అన్నాను..

'మరి అంతా దేవుడి ఇష్ట ప్రకారం జరిగితే జ్యోతిష్యం ఎందుకు?' అడిగాడు.

'అంతా విధిప్రకారమే జరుగుతుంది అని అనుకుంటూ  మనిషి ఊరుకోలేడు కాబట్టి. అలా ఊరుకోగలిగితే జ్యోతిష్యం అవసరం లేదు' చెప్పాను.

' ఏమిటో నువ్వు చెప్పేది నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు' అన్నాడు.

'అర్ధం కాకపోవడమే మంచిదిలే. అర్ధం చేసుకుందామని ప్రయత్నించిన దగ్గరనుంచీ అన్నీబాధలే. రేపటి గురించి చీకూచింతా ఆలోచనా లేనివాడే ఈ ప్రపంచంలో సుఖి. చేతనైతే నువ్వూ అలా ఉండటానికి ప్రయత్నించు' అని ముగించాను.