Pages - Menu

Pages

27, మార్చి 2012, మంగళవారం

విరోచనాలకు పదివేలు

మన దేశంలో లా అండ్ ఆర్డర్ ఎంత అద్వాన్నంగా ఉందొ అందరికీ తెలుసు. అలాగే, వైద్య రంగంలో డాక్టర్ల జవాబుదారీతనం కూడా అంత అధ్వాన్నంగానే ఉంది. పొరపాటున ఏదోఒక రోగంతో ఆస్పత్రికి వెళ్ళామా ఇక అంతేసంగతులు. వాళ్లకు గుర్తొచ్చిన టెస్టులు అన్నీ చేయించేసి జేబులు ఖాళీ చేసేసి చివర్లో 'అబ్బే. ఏమీ లేదు. అంతా బాగానే ఉంది. అయినా ఎందుకైనా మంచిది" అంటూ రెండు సీసాలు సెలైన్ పెట్టి, బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ చేయించి సాయంత్రం దాకా ఉంచి తరువాత ఇంటికిపంపే డాక్టర్లు ఎందఱో ఉన్నారు. రోగం ఏమీ లేకపోతే మందులూ ఇంజక్షన్లూ ఎందుకో చేసేవాడికీ తెలియదు చేయించుకునే వాడికీ తెలియదు.  

మా క్లాసులో కొంతమంది 'నాకు మెడిసిన్లో అరవైశాతం వచ్చింది' అని విర్రవీగేవారు. అలాటివాళ్ళతో మా హోమియో గురువుగారు ఒక మాట అనేవారు.  "మెడిసిన్లో నీకు అరవై మార్కులోచ్చి పాసయ్యావు బాగానే ఉంది. అంటే, మిగతా నలభై శాతం నీకు సబ్జెక్టు తెలీదనేగా. ఈ అరవైని కాదు. ఆ నలభైని గుర్తుపెట్టుకో". నేటి కార్పోరేట్ డాక్టర్లు రోజూ బట్టీపట్టి మరీ గుర్తుపెట్టుకోవలసిన మాట అది. వైద్యుడనేవాడు  ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉండాలి. కాని ఆ నేర్చుకోవడం అనేది రోగిప్రాణాలతో ఆటలాడుతూ కాకూడదు.

మొన్నీ మధ్య మా స్నేహితుడు ఒకాయన విరోచనాలతో బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. వరసగా నాలుగు రోజులు క్యాంపుల మీద తిరగడంతో బయట తిండి, ఎండల వల్ల విరోచనాలు పట్టుకున్నాయి. డాక్టర్ వెంటనే అడ్మిట్ చేసుకుని సాయంత్రం వరకూ సెలైన్ పెట్టి యాంటీ బయోటిక్స్ దంచికొట్టి సాయంత్రానికి ఇంటికి పంపించాడు.ఇంటికొచ్చాక మళ్ళీ యధాప్రకారం సమస్య మొదటికొచ్చింది. ఇలాకాదని మర్నాడు ఒక కార్పోరేట్ హాస్పిటల్ కు వెళ్లారు. వాళ్ళు టెస్టు లంటూ ఏడువేలు ఖర్చు పెట్టించి సాయంత్రం దాకా కూచోపెట్టి "అంతా బానేఉంది ఏంటో అర్ధం కావడం లేదు" అంటూ ఒక మూడువేలకు మందులు మూటగట్టి ఇచ్చి మళ్ళీ రమ్మన్నారు. "అసలు కారణం మూలనున్న ముసలమ్మకే కనిపిస్తుంటే దానికి ఇన్ని టెస్ట్ లు   చేయించి, ఇన్ని యాంటీబయోటిక్సూ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవడం అవసరమా?" అంటే, "మేమేమన్నా మా ఆస్పత్రికి రమ్మని మిమ్మల్ని బొట్టుపెట్టి పిలిచామా?వచ్చినప్పుడు ఖర్మ అనుభవించక తప్పదు."అని వారిజవాబు. "రోగం ఏమిటో తెలీకుండా ఇన్ని మందులెందుకు" అని అడిగితే దానికసలు జవాబుకూడా చెప్పకుండా, "ముందా మందులువాడి తర్వాత కనపడండి" అన్నారట. వైద్యులలో చిత్తశుద్ధి ఘోరంగా లోపించింది అనడానికి ప్రతిరోజూ ఇలాంటి ఉదాహరణలు  ఎన్నో కనిపిస్తున్నాయి.  

రోగి కనిపిస్తే చాలు వాడి జేబూ ఒళ్ళూ గుల్లచేసి పంపే డాక్టర్లే నేడు ఎక్కడ చూచినా దర్శనం ఇస్తున్నారు. అంతేగాని, నాడి పరిశీలించి, వివరాలు కనుక్కుని, చిన్నపాటి మందులతో రోగాన్ని ట్రీట్ చేసే వైద్యులు ఎక్కడా లేరు. కనీసం ఆర్.ఎం.పీ కూడా నేడు సరాసరి స్టెరాయిడ్స్ తప్ప ఇంకేవీ ఇవ్వడం లేదు అంటే అతిశయోక్తి లేదని చెప్పవచ్చు. 

జవాబుదారీతనం అనేది వైద్యరంగంలో మొత్తంగా లోపించింది. జనాల భయాన్ని ఆసరాగా తీసుకొని అవసరంలేని మందులను విపరీతంగా వాడించే అలవాటు వైద్యులలో ప్రబలింది.జనాలు కూడా దానినే ఇష్టపడుతూ ఉన్నారు. కలిధర్మం ఇలాగే ఉంటుందా? నేటి వైద్యులు కలిపురుషుని ఏజెంట్లా? వారి వారి ధర్మాన్ని నిర్వర్తిస్తూ భూభారాన్ని తగ్గించే పనినీ, జనాల పాపఖర్మాన్ని అనుభవిమ్పచేసే పనినీ సక్రమంగా వాళ్లకు తెలీకుండానే నిర్వర్తిస్తూన్నారా? రోగీ పాలే కోరాడు. వైద్యుడూ పాలే చెప్పాడు అంటే ఇదేనేమో. వైద్యా నారాయణా హరీ !!!