


మాటల సందర్భంలో ఒక జాతకం చర్చకు వచ్చింది. వివాహవిషయం. కర్కాటక లగ్నంలో రవిశనులు ఉన్నారు. ఈ గ్రహస్తితి చూస్తూనే, 'వీరి నాన్నగారికీ ఈయనకూ భేదాభిప్రాయాల వల్ల సంబంధాలు ఆలస్యం అవుతున్నాయా?' అని అడిగాను. 'నిజమే' అని చెప్పాడు. ఇందువల్లనే కొన్ని సంబంధాలు ఆఖరి నిముషంలో కేన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇదే అనుమానం నవమంలోని కేతువువల్ల తనకూ వచ్చింది. ఈవిధంగా జాతకంలో ఒకదానికోకటి సాయం చేసుకునే గ్రహగతులుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే విషయం చక్కగా అర్ధం చేసుకోవచ్చు. సరైన పరిహారక్రియల ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చు కూడా.

మెట్రో రైల్ ఎలా పని చేస్తున్నదో చూద్దామని వెళ్ళాను. నేను బస చేసిన ద్వారకా-13 సెక్టార్ కు దగ్గరలోనే మెట్రో స్టేషన్ ఉంది. ఒకసారి ఆ మూలనించి ఈ మూలకు రైల్లో ప్రయాణం చేసి దాని పనితీరు ఎలా ఉందో గమనించాను. దానితో బాటు మనుషుల తీరుతెన్నులూ, పోకడలూ కూడా గమనించాను.హైస్కూల్ వయసునుంచీ ప్రేమలూ,ఎక్కడ చూచినా కుర్రజంటలూ కనిపించాయి. ప్రతి స్టేషన్ లోనూ ఇదే వరస. రైల్లోనూ ఇదే వరస. ఒంటరిగా ఖాళీగా ఉన్న అమ్మాయిలూ అబ్బాయిలూ తక్కువగా కనిపించారు. పక్కన మనుషులున్నారు మనం పబ్లిక్ ప్లేస్ లో ఉన్నాం అన్న ధ్యాస కూడా వీరిలో కనిపించలేదు. డిల్లీలో నేరాలూ ఎక్కువే. మనుషులలో దురుసుతనం బాగా ఎక్కువ. పనీ పాటా చేసేవాళ్ళూ, చిన్న చితకా వ్యాపారాలూ, పనులూ చేసేవాల్లందరూ రాజస్థాన్ నుంచీ, హర్యానా నుంచీ వచ్చినవాళ్ళు. ఊరంతా కార్ల మాయం. ఒక ఇంటికి కనీసం నాలుగు కార్లున్నాయి. పార్కింగ్ కి చాలా ఇబ్బంది.మెట్రో రైల్ పుణ్యమాని బస్సులూ పొగా లేవు. కాని ఊరంతా జనారణ్యం లాగా కనిపించింది. జనమంతా ఒకటే ఉరుకులు పరుగులు. జీవనపోరాటంలో ప్రతివాడూ ఒక సైనికుడి లాగా పోరాడుతున్నాడు. పొట్టతిప్పలకే జీవితంలో ఎక్కువభాగం అయిపోయేటట్లు కనిపించింది.
నేనక్కడ ఉన్నరోజునే ఒక ఘోరం జరిగిందని పేపర్లు కోడై కూశాయి. ఒకమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో ఊరంతా తిప్పుతూ ఏడుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత ఆ అమ్మాయిని ఎక్కడో రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు.వాళ్ళంతా బాగా డబ్బున్న కుటుంబాలనుంచి వచ్చిన పిల్లలు. అంతా పాతికేళ్ళ లోపున్నవాళ్ళు. రెండో రోజే డిల్లీ పోలీసులు వాళ్ళని పట్టేశారు.డబ్బు ఎక్కువైతే మనిషి బుద్ధి ఎంత వెర్రి వేషాలు వేస్తుందో వీళ్ళు నిరూపిస్తున్నారు. పెద్దలుకూడా అడ్డగోలుగా డబ్బు సంపాదించి పిల్లలకు సౌకర్యాలు సమకూర్చడమే గొప్ప అనుకుంటున్నారు గాని వారికి సంస్కారం నేర్పాలన్న జ్ఞానం వీరికి ఉండటం లేదు. దానికి తోడూ చిన్నప్పుడే సెల్ ఫోనూ, నెట్టూ, టీవీ ప్రభావమూ, స్నేహాలూ, చేతిలో డబ్బూ అన్నీ కలిసి యువనేరస్తులు పుట్టుకొస్తున్నారు. నేను చూచిన ప్రదేశాలలో ఎక్కడా ఆధ్యాత్మిక స్పందనలు అస్సలు లేవు. అంతా కామకాంచనాలమయంగా కనిపించింది.ఎవరి 'ఆరా' చూచినా ఈ రెండే ఆలోచనలు కనిపించాయి. అమ్మాయిలయితే మరీ ఘోరం. వాళ్ళు పుట్టిందే ఎక్స్ పోజింగ్ చెయ్యడానికా అన్నట్లు ఉంది ప్రతివారి వేషమూ. ఇలాంటి కిడ్నాప్ గ్యాంగులూ, క్రిమినల్సూ నాకొక్కసారి తగిల్తే బాగుండు నేర్చుకున్న విద్యకు సార్ధకత కలుగుతుంది అని చాలాసార్లు అనుకుంటాను. ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే మార్షల్ ఆర్ట్స్ వాడే అవకాశం ఒకటి రెండుసార్లు కలిగింది. తర్వాత చేతులూ కాళ్ళూ తుప్పుపట్టి పోతున్నాయి. ఇదే మాట మా ఫ్రెండ్ తో అంటే, 'నువ్వు అమ్మాయివి కావుగా, నీకా చాన్స్ లేదు' అంటాడు నవ్వుతూ.
కుతుబ్ మీనార్లో ఉన్న ప్రాచీన కట్టడాలు పరికిస్తే ఒక విషయం గోచరిస్తుంది. అక్కడ హిందూ సాంప్రదాయ శిల్పరీతులున్న మంటపాలు చాలా కనిపిస్తాయి. వాటిపక్కనే తర్వాత ముస్లింశిల్ప రీతులతో కట్టిన బురుజులూ దర్వాజాలూ కనిపిస్తాయి.హిందూ కట్టడాలు అతి ప్రాచీనమైనవని చూస్తేనే అర్ధమైతుంది. అదొక విష్ణుదేవాలయం, లేదా శివాలయం అయ్యి ఉంటుందని నాకు అనిపించింది. తురక రాజులు హిందూ దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని జయించినప్పుడు ఇక్కడ ఒక్కొక్క దర్వాజా కట్టించారు. బానిసవంశపు రాజుల సమాధులూ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళలో మొదటి రాజు అల్తమష్ సమాధి ఉంది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ సమాధి చూచినప్పుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ లో ఆన్సర్ చేసిన 'అల్లా ఉద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు' ప్రశ్న గుర్తొచ్చింది.


పరిశుభ్రత పాటించడం అంటే మనకు అస్సలు పడదు అని మళ్ళీ రుజువైంది. 'ఇండియాగేట్' పార్లమెంట్ కు అతి దగ్గరలో ఉంది. అక్కడికి విదేశీ యాత్రికులు ఎందఱో వస్తుంటారు. అక్కడ మేయిన్టేనేన్స్ మాత్రం ఘోరంగా ఉంది. ఒక 'డీ' క్లాస్ పార్కులో అంతకంటే మంచి పరిశుభ్రత ఉంటుంది. నీళ్ళన్నీ మడుగుకట్టి ఒక మురికికాలవలాగా అక్కడ తయారై ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అదిచూచి కొందరు విదేశీయులు ఎగతాళిగా నవ్వుకోడం గమనించాను. మనసు చివుక్కుమంది. ఊరిచివరనున్న 'స్లం' ఏరియాలు బాగుచెయ్యడం ఎలాగూ మనకు రాదు. దేశ రాజధాని నడిబొడ్డునకూడా పరిశుభ్రత లేకపోతే ఎలా? డిల్లీ మున్సిపల్ యంత్రాంగం ఏమి చేస్తోందో మరి? కనీసం పబ్లిక్ ప్రదేశాలలో ఖచ్చితమైన పరిశుభ్రత పాటించేలా ముందు మన దేశం మారాలి. ఈ కోణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
హజరత్ నిజాముద్దీన్ ఔలియా దర్గా చూద్దామని అనుకున్నాను కాని కుదరలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్లిరావాలి. నేను కాలేజీ రోజుల్లో సూఫీతత్వాన్ని బాగా చదివాను. అందుకే కొందరు సూఫీ సాదువులంటే నాకు చాలాఇష్టం. కరుడుగట్టిన ఎడారిలాంటి ఇస్లాంమతంలో సూఫీ సాధువులు ఒయాసిస్సుల వంటివారు. విశాలభావాలూ ప్రేమతత్వమూ వారి విధానాలు. కనుక హిందువులకు వీరు నచ్చుతారు.
మొత్తమ్మీద డిల్లీలాంటి ఉరుకులు పరుగులతో నిండిన ఇంద్రియభోగపూరిత జనారణ్య ప్రదేశాలు మనకు నప్పవు అని అతిత్వరలోనే అర్ధం అయింది. ఇంకో రెండు రోజులు అక్కడ ఉంటె పిచ్చి పుట్టేటట్లు అనిపించింది. చూచింది చాల్లే అనుకోని తిరుగుప్రయాణం మొదలు పెట్టాము.