Pages - Menu

Pages

1, ఏప్రిల్ 2012, ఆదివారం

బ్లాగు క్వాలిటీ -ఆధ్యాత్మిక సందేహాలు.

నిన్న ఒక మిత్రురాలు ఫోన్ చేసింది. 
'మీరేమనుకోక పోతే ఒక విషయం చెప్తా' అంది.
'చెప్పండి' అన్నాను. 
'మీ బ్లాగు గురించి మాట్లాడాలి' అంది.
'పర్లేదు చెప్పండి' అన్నాను.
'ఏమీ లేదు. మీ బ్లాగులో క్వాలిటీ తగ్గింది. మొదట్లో మంచి డెప్త్ ఉన్న పోస్ట్ లు వ్రాసేవారు. రాన్రాను వాటిల్లో డెప్త్ తగ్గుతూ వస్తున్నది. గమనించారా?' అడిగింది.
'డెప్త్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?' అడిగాను.
'అంటే,మంచి స్పిరిట్యువల్ డెప్త్ ఉన్న పోస్ట్ లు ఇంతకూ ముందు వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం తగ్గించారు. అవునా?'
'మీరు సరిగ్గానే గమనించారు. అది నిజమే.' అన్నాను.
'ఎందుకలా చేస్తున్నారు. ఇలా చెయ్యడం బాలేదు.' అవతలనుంచి ప్రశ్న.
'చదువరులకు ఆకలి ఉందేమో అని ఇంతకు ముందు మంచి ఆహారం వండి పెట్టెవాణ్ని. అది సరైన విధానం కాదు అని తెలుసుకున్నాను. అందుకే వంటలో మార్పు చేసాను.' అన్నా.
'మరి ఈ మార్పు మీ అభిమానులకు బాధ కలిగిస్తోంది. మేం మీ నుంచి ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక పోస్ట్ లు కోరుకుంటున్నాం.' చెప్పింది.
'కుదరదు. మీ కోరిక నేను తీర్చలేను' చెప్పాను.
'ఎందుకో తెలుసుకోవచ్చా.' అటునుంచి ప్రశ్న.
'ఎందుకంటే,మొదటిగా మీలో ఎవరికేం కావాలో నాకు తెలియదు. రెండవదిగా, ఆధ్యాత్మికత అనేది ఊరకే చదివి ఆనందించే విషయం కాదు. మూడవదిగా, నిత్యమౌనులముందు ఊరకే వాగుతూ ఉండటానికి నేను హరికధాభాగవతార్ని కాను. నాలుగవదిగా,మీరు పంచవటి మెంబర్ అయితే అక్కడ అడగండి.మీ సందేహం తీరుస్తాను.' చెప్పాను.
'ఇవేవీ కాకుండా మరేం చెయ్యాలి.' అడిగింది.
'ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా. మీరేం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అడగండి. చెప్తాను' అన్నాను.
'అలా అయితే అది పర్సనల్ ఇంటరాక్షన్ అవుతుంది. ఇలా కాకుండా బ్లాగులోనే మీరు మంచి మంచి పోస్ట్ లు వ్రాయవచ్చు కదా.' అడిగింది.
'దానికి జవాబు ఇందాకే ఇచ్చానుకదా.నిజమైన ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతంగా మాట్లాడి తెలుసుకోవడం ద్వారానే అర్ధమౌతుంది. పైగా ఆధ్యాత్మికత అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. వ్యాసాలలో అయితే జెనెరల్ గా మాత్రమే మనం వ్రాయగలం.అది ఊహాజనితం.దానికంటే,మీ వ్యక్తిగత ఆలోచనలు సందేహాలు అడిగి తెలుసుకోడమే మంచిది.నిజమైన ఆధ్యాత్మికత మీరంటున్న పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారానే వస్తుంది.' అన్నాను.


నా జవాబు ఆమెకు నచ్చినట్లు అనిపించలేదు. కానీ,అంతకంటే నేను చెయ్యగలిగిందీ లేదు. సత్యాన్ని చెప్పడంవరకే నావంతు. ఒకరి మెప్పు కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం నా పని కాదు.

చాలామందితో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళ మనసులో ఉన్న విషయం మనం కనిపెట్టి దానికి జవాబు చెప్పాలని కోరుకుంటారు. బయటపడి అడిగితే ఏదో తక్కువ అయినట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు, చులకన అయినట్లు బాధపడతారు. అలా దాక్కుని ఆధ్యాత్మికసందేహాలు తీర్చుకుందామని చూడటం మంచిపద్దతి కాదు. అవి అలా తీరేవీ కావు. అడిగితే మనం చులకన అవుతామేమో అని బాధపడేవాళ్ళు ఆధ్యాత్మికతకు పనికిరారు. వాళ్ళు మానసికంగా ఇంకా చాలా ఎదగవలసి ఉంటుంది. ఆవిధమైన మానసికచట్రం నుంచి వారు బయటకు రావలసి ఉంటుంది.

పత్రికలలో, టీవీలలో, 'సందేహాలు-సమాధానాలు' శీర్షికల ద్వారా కొందరు ఏవేవో అడుగుతూ ఉంటారు. చెప్పేవాళ్ళు వారికి జవాబులు చెబుతూ ఉంటారు. కొన్ని పత్రికలలో యాజమాన్యమే కల్పించి ఆ ప్రశ్నలు వ్రాస్తారని కూడా అంటారు. ఉదాహరణకి 'సీత రాముని కంటే పెద్దదా?, 'హరిశ్చంద్రుని తల్లిదండ్రులెవరు?'' ఇలాటివి. ఇవన్నీ నాకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. 


సీత రామునికంటే పెద్దదైనా చిన్నదైనా మనకు ఒరిగేదేమీలేదు. హరిశ్చంద్రుని తల్లిదండ్రులేవరో తెలిసినంత మాత్రాన మనకు ఆధ్యాత్మికంగా ఒక్క అడుగుకూడా ముందుకుపడదు.ఇలాటివన్నీ,ప్రయాణాలలో తోచక ఒకరికొకరు చెప్పుకునే కాలక్షేపం కబుర్ల వంటివి.  ఎవరి మజిలీ వచ్చిన తర్వాత వారు దిగిపోతారు. తర్వాత ఒకరికొకరు అసలు గుర్తుకూడా ఉండరు. ఈ సందేహాలూ సమాధానాలూ ఇలాంటివే. వాటివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇవి ఆధ్యాత్మికసందేహాలు కానేకావు.


అసలు ఆద్యాత్మికసందేహాలు ఆలోచనాస్థాయిలో తీరేవి కావు. నిజమైన ఆధ్యాత్మిక సందేహాలు అనుభవస్థాయికి చెందినవి. సరైన అంతరిక అనుభవంతోనే అవి తీరుతాయి. అనుభవం సాధనద్వారా మాత్రమె కలుగుతుంది. అది చెయ్యకుండా ఉత్త ఊహాజనిత సందేహాలు, పుస్తకాలు చదవడంవల్ల వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండటంవల్ల ఏమీ ఫలితం ఉండదు. ఉత్త కాలక్షేపం మాత్రం జరుగుతుంది. మహా అయితే 'అహం' ఇంకా పెరుగుతుంది.

బౌద్ధికస్థాయిలో వచ్చే సందేహాలు, ఊహాజనిత సందేహాలు, ఆధ్యాత్మికమైనవి కావని, జెనెరల్ గా వ్రాసిన వ్రాతలవల్ల వ్యక్తిగత సందేహాలు తీరవనీ మనం గుర్తుంచుకోవాలి.