Pages - Menu

Pages

27, మే 2012, ఆదివారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - "బోర్ వెల్ లో నీళ్ళు ఎన్ని అడుగులలో పడతాయి?"


భవిష్యత్తులో మానవాళిని కబళించబోతున్న అనేక భూతాలలో నీటి ఎద్దడి ఒకటి. మనం చేస్తున్న అనేక పిచ్చిపనుల వల్ల ఇప్పటికే భూమిలో వాటర్ టేబిల్ అడుగంటి పోతున్నది. చంద్రబాబు హయాంలో ఇంకుడుగుంటలు ప్రతి ఇంటికీ ఉండాలని ఒక మంచిప్రయత్నం మొదలు పెట్టారు.దానివల్ల వర్షపు నీరు వృధాగా కాలవల్లో కలిసి పోకుండా భూమిలోకి ఇంకి భూనీటి మట్టం పెరుగుతుంది. కాని దానికి ప్రజలలో సరియైన స్పందన రాలేదు. దానిని అమలు చెయ్యడంలో అధికారులలో చిత్తశుద్దీ లేదు. కాంక్రీట్ రోడ్లు మాత్రం ఎక్కడికక్కడ వేసేసి నగరాలలో మట్టి నేల అనేది కనపడకుండా చేస్తున్నారు. దానితో భూమి నీటితో తడవక వేడి పెరిగి పోతున్నది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.


ఈ నేపధ్యాన్ని అలా ఉంచితే, ఈ మధ్య మా ఫ్లాట్స్ లో భూగర్భ జలం అడుగంటి, ఉన్న బోర్ వెల్ పనిచెయ్యడం ఆగిపోయింది. కొత్త బోర్ వెల్ వేయించవలసి వచ్చింది. ఆ సందర్భంలో, నీళ్ళు ఎంత లోతులో పడతాయి? అని ఒకరు ప్రశ్నించారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఆఫీస్ కి బయలుదేరుతూ ఉన్నాను. మనసులో ప్రశ్న చక్రం వేసి చూచాను. ఇలా మనసులోనే చక్రం వేసి చూడటానికి ప్రతిరోజూ గ్రహగతిని పరిశీలించే అలవాటు ఉండాలి. పాతకాలంలో ఉదయాన్నే లేచి గ్రహస్తితిని గమనించి పంచాంగ పూర్వక సంకల్పాన్ని నిత్యానుష్టానంలో చెప్పుకునేవారు. కనుక ఆరోజు ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అన్నది వారికి తెలిసేది. నేడు మనకా అలవాటు తప్పింది గనుక పంచాంగం చూచో లేకపోతే ఏదో సాఫ్ట్ వేర్ మీద ఆధారపడో గ్రహగతులను పరిశీలిస్తున్నాము. అలా కాకుండా కొంత అభ్యాసం చేస్తే, అప్పుడు ఏ లగ్నం నడుతున్నది ఏ హోర నడుస్తున్నది ఏ గ్రహం ఎప్పుడు ఏ నక్షత్ర పాదంలోకి మారుతుంది అన్న విషయాలు  మనసులోనే తెలుసుకోవచ్చు.

ఈ ప్రశ్న అడిగినవారికి జవాబుగా - "అనుకున్నట్లు వెంటనే నీరు పడదు. ఆలస్యం అవుతుంది. బోర్ వెల్ మిషన్ చెడిపోతుంది. మళ్ళీ ప్రయత్నిస్తే దాదాపు 300 అడుగుల లోతులో నీరు పడుతుంది." అని చెప్పి నేను నా పనిమీద బయలుదేరి వెళ్లాను.ఇక ఆ విషయం పట్టించుకోలేదు.

అదేరోజు రాత్రి బోర్ వెల్ వెయ్యడం మొదలు పెట్టారు. మామూలుగా పది పన్నెండు గంటలలో అయిపోయే పని పూర్తి కావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే,మధ్యలో డ్రిల్లింగ్ బిట్ చెడిపోయి ఆరుగంటల పాటు దాన్ని రిపేర్ చేసుకోవడమే సరిపోయిందిట. దాని తర్వాత మళ్ళీ ప్రయత్నించగా వీళ్ళు అనుకున్నట్లు 250 అడుగులలో నీళ్ళు పడకపోతే ఇంకా లోపలి పోగా 300 అడుగులలో నీళ్ళు పడ్డాయి. ఎందుకైనా మంచిదని 350 అడుగులవరకూ వెళ్లడం జరిగింది. 

ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి," ఎలా చెప్పగలిగావు నాన్నా?" అని అడిగింది.తనకూ జ్యోతిష్య విద్యలో కొంత ఆసక్తి ఉండటంతో ఆరోజు నేను మనసులో గుణించిన ప్రశ్న చక్రాన్ని వేసి చూపించి వివరించాను. 

ప్రశ్న సమయంలో శీర్శోదయ రాశి అయిన కన్యా లగ్నం ఉదయిస్తున్నది.   లగ్నాధిపతి అయిన బుధుడు నవమకోణంలో మంచిస్తితిలో ఉన్నాడు. కనుక పని జరుగుతుంది. కాని అతడు నపుంసక గ్రహం కనుక పరిస్తితి ఆశాజనకంగా లేదు. జలసంబంధ ప్రశ్నలలో జల కారక గ్రహాలైన చంద్రుడూ శుక్రుడూ బాగుండాలి.వీరిలో శుక్రుడు వక్ర స్తితిలో ఉన్నాడు. కనుక అనుకున్న పని వెంటనే జరగదు. పైగా లగ్నంలో వక్ర శని కూచుని ఉన్నాడు. కనుక ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుంది. శని చిత్తా నక్షత్రంలో ఉండటంతో మెషినరీ రిపేర్ వస్తుంది. కాని చంద్రుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉండటం వల్ల నీరు పడక తప్పదు. ఆర్ద్ర అంటేనే చెమ్మ, తడి అని అర్ధం కదా. కాని చంద్రుని మీద శని దృష్టి వల్ల అనుకున్న దానికంటే ఆలస్యం కాక తప్పదు.

ఇప్పుడు, అసలు ప్రశ్న విషయం అయిన - "ఎంత లోతులో నీరు పడుతుంది?" అన్నది చూడాలి. చతుర్దానికి పాతాళం అని ఇంకొక పేరు. నీరు ఉండేది పాతాళం లోనే. దానికి అధిపతి గురువు అయ్యాడు. ప్రస్తుతం గోచార రీత్యా బలమైన ఫలితాలు చూపిస్తున్న గ్రహం గురువే. ఆ గురువు జలకారక గ్రహమైన శుక్రుని యొక్క  నవమంలో ఉంటూ మంచిని సూచిస్తున్నాడు. అంతే కాక లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఆటంకాలు తొలగిస్తాడు.వృషభం భూతత్వ రాశి. కన్య కూడా భూతత్వ రాశే. కనుక భూమికి సంబంధించిన పని  జరుగుతున్నది. సంఖ్యా శాస్త్ర రీత్యా గురువు అంకె 3 కనుక 300 అడుగుల లోతులో నీరు పడవచ్చు. ఎందుకంటే చీరాల మొదలైన సముద్ర తీరాలలో పడేటట్లు గుంటూరులో 30 అడుగులలో నీరు పడే ప్రసక్తే లేదు. కనుక 300 కావచ్చు అని ఊహించాను.

అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పబోయే ముందు, ఇంత విశ్లేషణ చెయ్యవలసి ఉంటుందా అని మా అమ్మాయి ఆశ్చర్యపోయింది. అవునంటూ తలాడించాను. "నీవూ నేర్చుకోవచ్చు కదా" అంటే, "ఎందుకూ? ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి నీవున్నావుగా" అని నవ్వేసింది.  నేర్చుకుందామని వెతికే వాళ్లకేమో నేర్పేవాళ్ళు దొరకరు. నేర్పుతాను అంటే శ్రద్దగా నేర్చుకునే వాళ్ళూ దొరకరు. అనేక ప్రాచీన విద్యలు ఇలాగే కాలగర్భంలో కలిసిపోయాయి.

ప్రశ్న శాస్త్రం ద్వారా ఇలాంటి విషయాలు కూడా గ్రహించవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ.

20, మే 2012, ఆదివారం

వృషభరాశిలో గురుసంచారం - ఫలితాలు

17-5-2012 న బృహస్పతి మేషరాశిని వీడి వృషభరాశిలో ప్రవేశించాడు. ఆ రోజునుంచే నర్మదా పుష్కరాలు మొదలయ్యాయి. బృహస్పతి ప్రతిరాశిలో ఏడాది పాటు ఉంటాడు. వృషభ రాశిలో ఆయన 30-5-2013 వరకూ సంచరిస్తాడు. మధ్యలో అక్టోబర్ 4 నుంచి జనవరి 29 వరకూ వక్ర స్తితిలో ప్రవేశిస్తాడు.

ఈ ఏడాది మొత్తంలో గురుగ్రహ సంచార ఫలితాలు పన్నెండు రాశులకూ స్థూలంగా చూద్దాం. సూక్ష్మ వివరాలు వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయని గ్రహించాలి. ఎవరి జాతకంలోనైనా రాశీ లగ్నమూ ఒకటే అయితే దానినుంచి ఫలితాలు గ్రహించాలి. అవి వేర్వేరు అయితే రెంటినుంచీ విడివిడిగా చూచి ఆయా ఫలితాలను కలుపుకొని గ్రహించాలి.

మేష రాశి

దూర ప్రాంతాలలో నివాసం ఉంటుంది. త్రిప్పటా, విసుగూ ఉంటాయి. కాని, కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది. ధనసంపాదన మెరుగౌతుంది. గురు అనుగ్రహం పెంచుకుంటే శత్రుబాద తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.వృత్తిలో పురోగతి ఉంటుంది.

వృషభ రాశి 

జీవితంలో ఎదుగుదల ఉంటుంది.పరిచయాలు పెరుగుతాయి. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.గురునింద అనుకొని తీవ్ర ప్రభావాలు చూపిస్తుంది. కనుక మాటమీద అదుపు ఉండాలి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కళత్ర సౌఖ్యం బాగుంటుంది.

మిధున రాశి 

ఊహించని ఖర్చులు పెరుగుతాయి.రహస్య శత్రువులు ఎక్కువౌతారు. అయితే ఇంటిలో మనశ్శాంతి దొరుకుతుంది. దీర్ఘ రోగాలతో బాధ పడేవారికి కొంచం ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. మంత్ర సాధన చేసేవారికి ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.

కర్కాటక రాశి 

అనుకోని లాభాలు కలుగుతాయి. ఊరట కలుగుతుంది. పీడిస్తున్న బాధలు తగ్గుతాయి. సమాజంతో సంబంధాలు మెరుగు పడతాయి. సంతానానికి వృద్ధి ఉంటుంది. కళత్ర సౌఖ్యం బాగుంటుంది. అయితే స్వయంకృతాపరాదాల వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువౌతుంది.

సింహ రాశి 

చదువూ, వృత్తులలో ఎదుగుదలా గుర్తింపూ వస్తాయి. ధన వృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంటాయి. శత్రువులు అదుపులో ఉంటారు. ఒకప్పటి శత్రువులు మళ్ళీ మిత్రులౌతారు. కాని వారితో జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి 

ఆధ్యాత్మిక చింతనా వైరాగ్యమూ పెరుగుతాయి. తీర్ధయాత్రలు చేస్తారు.ప్రసంగాలూ బోధలూ ఆకర్షిస్తాయి. సంతాన సౌఖ్యం బాగుంటుంది. ధన వృద్ధి ఉంటుంది. అయితే దైవదూషణ గురుదూషణ చేస్తే ఫలితాలు వక్రిస్తాయి.

తులా రాశి 

ఆరోగ్యం మందగిస్తుంది. జీర్ణకోశ బాధలు, పునరుత్పత్తి వ్యవస్థ బాధలూ ఎక్కువౌతాయి. ఖర్చులు పెరుగుతాయి.అయితే సమయానికి ధనం అందుతుంది.ఇంటిలోని వారి ఆసరా ఉంటుంది. సమాజంలో గౌరవం బాగా ఇనుమడిస్తుంది.

వృశ్చిక రాశి 

స్నేహితుల సహాయం ఉంటుంది. సమాజంతో సంబంధాలు పెరుగుతాయి. లాభాలు అందుతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. అయితే భారీ ఖర్చులు పెట్టవలసి వస్తుంది. గురుదృష్టి వీరిపైన పడుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న సాధనా మార్గంలో అడుగు పెడతారు. అంతచ్చేతనలో దాగిఉన్న భావాలు కదలికకు లోనౌతాయి.తీవ్ర భావోద్వేగాలకు గురవుతారు.

దనూ రాశి 

ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సమయానికి తిండీ నిద్రా ఉండేట్లు చూచుకోవాలి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం లేనివారికి ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ఖర్చులు పరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఆదాయం బాగుంటాయి. అనుకున్నవి  జరుగుతాయి. జీవితం లాభయుతంగా ఉంటుంది. 

మకర రాశి 

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంత్ర సాధన ఫలిస్తుంది. తీర్ధయాత్రలు చేస్తారు. గురువులను సేవిస్తారు.లాభాలు కలుగుతాయి.గురు అనుగ్రహం దైవానుగ్రహం వీరి పైన పడుతుంది. వృత్తిలో,ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది. అయితే వీరు గురునిందకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి 

ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అయితే గృహసౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా చికిత్సతో అవి తగ్గుముఖం పడతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనా తీర్ధ యాత్రలూ ఎక్కువౌతాయి.

మీన రాశి 

సమాజంతో సత్సంబంధాలు వృద్ధి అవుతాయి. ఇతరులతో వ్యాపారాలు కలిసొస్తాయి.ఆధ్యాత్మిక చింతన,మహనీయుల దర్శనం కలుగుతాయి. అయితే దీర్ఘరోగాలు, గుహ్యరోగాలు పీడిస్తాయి.

గురు అనుగ్రహాన్ని పెంచుకుంటే ఇవన్నీ పూర్తిగా జరుగుతాయి. దానికి ప్రతిగా తెలిసో తెలియకో గురుదోషాన్ని పెంచుకుంటే మంచి జరగవలసిన చోట కూడా చెడు ఎదురౌతుంది. 

ఇవి స్థూల ఫలితాలు మాత్రమె. సూక్ష్మ ఫలితాలు వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి. ఆయా జాతక వివరాలతో ఈ గోచార ఫలితాలు మిళితం చేసుకొని వివరాలు అర్ధం చేసుకోవాలి.

18, మే 2012, శుక్రవారం

సాధన

ఈ మధ్య ఒక పెద్దాయన కలిశాడు. మంచి పండితుడు. సంస్కృతం బాగా చదువుకున్నాడు.మంత్ర శాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాను అని చెప్పుకుంటాడు.

"ఏం నాయనా. ఏమిటి విషయం? ఏదో సాధన అంటూ మాట్లాడుతున్నావుట ఈ మధ్యన?" అన్నాడు.

ఆయన నాకు స్వల్ప పరిచయస్తుడే కాని సరాసరి నాతో బాగా పరిచయం ఉన్నవాడు కాదు. వారి ద్వారా వీరిద్వారా నా గురించి ఏదో విన్నాడు. 

"నేను నా చిన్నప్పటి నుంచీ ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఈ మధ్యనే విన్నట్లు ఉన్నారు" అన్నాను.

"ఇంతకీ నీవు చేసేది ఏ సాధన? ఏ మహామంత్రాన్ని నీవు ఉపాసించావు? తెలుసుకోవచ్చా?" అడిగాడు. సాధన అంటే ఏదో ఒక మంత్రాన్ని ఉపాసించడమే అనుకునే  బాపతు మనుషులు కొందరు ఉంటారు. ఈయనా ఆ కోవకు చెందినవాడే.

"తెలుసుకోకూడదు" చెప్పాను.

"పోనీ  అసలు సాధన అంటే నీ అభిప్రాయం ఏమిటి? అదైనా చెప్పు" 

"మొదట్లో పోగుచేసుకోవటం, తర్వాత ఊడ్చి పారేయ్యటం, ఈ సారి ఇంకా  ఎక్కువగా పోగు చేసుకోవటం, ఇదే నాకు తెలిసిన సాధన" చెప్పాను.

నాకు కొంచం పిచ్చేమో అన్న భావం ఆయన ముఖంలో కదలాడింది. కాని సంస్కారం అడ్డొచ్చి  మాట బయటికి రాలేదు.

"కొంచేమేమీ కాదు. బాగానే ఉంది" మళ్ళీ నేనే అన్నా. 

"ఏమిటి?" అన్నాడు ఆయన అయోమయంగా. 

"అదే. పిచ్చి." అన్నాను.

"నీవు సాధన గురించి చెప్పినది నాకు అర్ధం కాలేదు. కొంచం వివరిస్తావా?" అడిగాడు.

"వివరించే సాధన నాకు తెలీదు" అన్నాను.

మా సంభాషణ అంతటితో ముగిసింది.

12, మే 2012, శనివారం

చీకటి -- వెలుతురు


ప్రాచీనకాలంలో ఇద్దరు స్నేహితులుండేవారు. 
చర్చలు చెయ్యడం అంటే వారికి భలే ఇష్టంగా ఉండేది.
అందులోనూ తత్వశాస్త్రాన్ని గురించి వాళ్ళు తరచుగా చర్చిస్తూ ఉండేవారు.
"చీకటి అంటే ఏమిటి" అన్న విషయాన్ని గురించి ఒకరోజు చర్చ మొదలు పెట్టారు.

అసలు చీకటి ఎలా వస్తుంది? 
దానివల్ల నష్టాలేమిటి? 
వెలుగుకీ చీకటికీ ఉన్న సంబంధం ఏమిటి? 
వెలుగు లేకపోవడమే చీకటా? 
లేక దానికి ఒక ప్రత్యెక ఉనికి ఉందా? 
చీకటి లేకపోవడం వెలుగా?
చీకటి మనుషుల్ని ఎంత బాధ పెడుతుంది? 
ఎలా బాధ పెడుతుంది?
ఇత్యాది విషయాలపైన ఉదయం మొదలైన చర్చ సాయంత్రం అయినా అలాగే సాగుతోంది. ఎటూ తేలడం లేదు. 
ఇంతలో చీకటి పడింది.
వీళ్ళు దానిని పట్టించుకోకుండా అలాగే చీకట్లోనే కూచుని వాదించుకుంటూ ఉన్నారు.

ఇదంతా ఇంకొక వ్యక్తి మౌనంగా వింటున్నాడు.
చాలాసేపు వినీవినీ ఆ వ్యక్తి ఒక పని చేశాడు.
ఒక కొవ్వొత్తిని వెలిగించి వారివద్ద పెట్టి, మౌనంగా అక్కడనుంచి నిష్క్రమించాడు.
--------------------------------------------------
లోకం అంతా చీకటితో నిండి ఉందన్న విషయం సత్యం. ఇది భౌతికమైన చీకటి కాదు. భౌతికంగా చూస్తె రాత్రిని పగలుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలుసు. కాని మనిషి లోపల ఉన్న చీకటిని వెలుతురుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలియదు.

మనుషులందరూ చీకటిలో కూచుని చీకటి గురించి చర్చిస్తూ ఉన్నారు. దానిని ఎలా పోగొట్టాలి అని వాదప్రతివాదాలు చేస్తున్నారు.కాని ఒక్కరు
కూడా లేచి దీపం వెలిగిద్దామని ప్రయత్నం చెయ్యటం లేదు. వాదాలతో చీకటి పోదు. దీపం వెలిగిస్తేనే అది మాయం  అవుతుంది. దీపం వెలిగించడం అంటే సాధన  చెయ్యడం. జ్ఞానజ్యోతిని వెలిగించడం.

మనిషికి కావలసింది వాదన కాదు. ఆచరణ కావాలి. 
మనిషి చెయ్యవలసింది విషయసేకరణా, బోధనా కాదు. 
స్వీయసాధన  చేయాలి.
చీకటిని గురించిన చర్చ ముఖ్యం కాదు.
దీపాన్ని వెలిగించడమే ముఖ్యం. 
అది చెయ్యనంతవరకూ చీకటి పోదు.

చర్చలు జోరుగా సాగవచ్చు. ఆనందాన్ని ఇవ్వవచ్చు.
కాని చర్చలు చేసేవారు చీకటిలోనే ఉంటారు.
తత్వచింతన ముఖ్యం కాదు.
నిత్యశోధన  ఉండాలి. 
సత్యసాధన  కావాలి.
అప్పుడే  చీకటి మాయం అవుతుంది. 
అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది.

10, మే 2012, గురువారం

మహావీరుల జాతకాలలో కుజకేతువుల ప్రభావం

యుద్ధ విద్యలకు కారకుడు అంగారకుడు లేదా కుజుడు.ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా వాటిలో ప్రావీణ్యం సంపాదించాలన్నా అతనికి కుజుని అనుగ్రహం ఉండాలి.కుజునికి అధిదేవత అయిన సుబ్రమణ్యస్వామిని దేవసేనాపతి అంటారని మనకు తెలుసు.దివ్యశక్తుల సైన్యానికి ఆయన సేనాపతి.కనుక యుద్ధవిద్యలు నేర్వాలంటే ఆయన అనుగ్రహం తప్పక ఉండాలి.కుజుడు ఆత్మకారకునిగా ఉన్న జాతకాల్లో ఇతర కాంబినేషన్స్ కలిస్తే ఆ జాతకునికి వీరవిద్యలు ఖచ్చితంగా వస్తాయి.

ఆయా యోగాలవల్ల ఏ విధమైన మార్షల్ఆర్ట్ ఆజాతకునికి వస్తుందో,అతనికి  ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు."కుజవత్ కేతు" అనే సూత్రం ప్రకారం, కేతువు కుజుని లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక కుజ కేతువులు ఒక జాతకంలో కలిస్తే ఆ జాతకునికి మార్షల్ ఆర్స్ లో నైపుణ్యాన్ని తప్పక ఇస్తారు. ఒకరకంగా మార్షల్ ఆర్ట్స్ అనేవి హింసకు సంబంధం ఉన్న విద్యలే కనుక కుజ కేతువుల హింసా ప్రవృత్తి వీటిలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ జాతకులలో అమితమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు కొందరు ప్రముఖ వీరుల జాతకాల్లో కుజకేతువులను పరిశీలిద్దాం.

మొదటగా టైగర్ క్రేన్ కుంగ్ ఫూ లో ఉద్దండుడైన "వాంగ్ ఫే హంగ్" జాతకాన్ని చూద్దాం. ఈయన 9-7-1847 న చైనాలోని ఫోషాన్ లో జన్మించాడు.ఈయన కుంగ్ఫూ విద్యలో మహావీరుడే కాక, ఆక్యుపంచర్ లో మంచి ప్రజ్ఞాశాలి. ప్రముఖ వైద్యుడు,విప్లవవీరుడు. అయిదేళ్ళ వయసులో ఈయన కుంగ్ఫూ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పదమూడేళ్ళు వచ్చేసరికి ఒక మాస్టర్ గా ఎదిగాడు. ఈయన "షాడో లెస్ కిక్" అనే ఒక కిక్ ను కనిపెట్టాడు. ఈయన రకరకాల ఆయుధాలను వాడటంలో కూడా మంచి నైపుణ్యం కలవాడు. ఒకసారి చేతికర్రను ఆయుధంగా వాడి ముప్పైమంది బందిపోట్లను తరిమికోట్టాడు.   ఈయన మీద వందకు పైగా సినిమాలు వచ్చాయి. జెట్ లీ హీరో గా నటించిన "Once upon a time in China" సీరీస్ అన్నీ ఈయన జీవితాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించినవే. జాకీ చాన్ హీరోగా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన "The young master" సినిమా కూడా ఆయన జీవిత గాధ ఆధారంగా తీసినదే. ఈయన జాతకంలో కుజకేతువులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉండటం చూడవచ్చు. వారిద్దరూ మీనరాశి 22 డిగ్రీల మీద రేవతీ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు కర్కాటకరాశిలో స్వనక్షత్రం లో ఉండటం, చంద్రుడు ఉచ్చ స్తితిలో ఉండటం చూడవచ్చు. అందుకే ఈయనకు వీరవిద్యలతో బాటు మంచి వైద్యుడు అన్న పేరూ ఉంది. చైనీస్ మిలిటరీకి ఈయన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా,వైద్యుడిగా ఉండేవాడు. ఈయన 70 ఏళ్ళు పైన బతికాడు. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.

రెండవ జాతకానికి మనం మూడుసార్లు ప్రపంచ వూషూ చాంపియన్ అయిన గోల్డెన్ గర్ల్ "జు హుయిహుయి"జాతకాన్ని తీసుకుందాం. ఈమె 2008 ఒలింపిక్స్ లో "వూషూ" లో ప్రధమ స్థానంలో నిలిచింది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పెరిగి తన తల్లి అడుగుజాడలలో నడిచి వీరవిద్యలు అభ్యాసం చేసింది. ఏళ్ల తరబడి అభ్యాసం తర్వాత తిరుగులేని వీరవనితగా రాటుదేలింది. తర్వాత ఈ అమ్మాయి అనేక సినిమాలలో నటించింది. ఈమె చేసే విన్యాసాలు చూస్తె అసలు ఈమె శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవా అని అనుమానం కలుగుతుంది. వెపన్స్ ను ప్రయోగించడం లోనూ, వెపన్ లెస్ ఫామ్స్ చెయ్యడం లోనూ ఈమె వేగం అనితర సాధ్యం. ఈమె జాతకంలో కూడా కుజ కేతువులు 10 డిగ్రీల మీద ఉన్నప్పటికీ, వేర్వేరు రాశులలో ఉన్నారు. కుజుడు శనితో కలసి శని నక్షత్రంలో స్వరాశిలో ఉంటూ అమిత శ్రమకు ఓర్చి చెమటలు కార్చి నేర్చుకున్న వీరవిద్యలను సూచిస్తున్నాడు. కేతువు కుజునికి ద్వాదశంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. 

వాంగ్ ఫే హంగ్ జాతకానికీ ఈమె జాతకానికీ తేడా ఏమిటంటే, వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడు. ఈమె ప్రదర్శన కళ అయిన వూషూ లో నిపుణురాలు. నిజజీవితంలో ఈమె వీరవిద్యలను వాడే అవసరం రాలేదు. కాని వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడే గాక మిలిటరీకి శిక్షకుడు. అందుకే ఆయన జాతకంలో కుజకేతువులు ఒకే డిగ్రీ మీద కలిసి ఉన్నారు. కాని ఈమె జాతకంలో అలా లేరు. సినిమారంగానికీ వినోదరంగానికీ చెందిన తులారాశిలో కేతువు ఉంటూ,శుక్రున్ని సూచిస్తూ ఈమెకు ఆయా వినోదరంగాలలో ప్రవేశం ఇచ్చాడు. అందుకే ఈమె సినిమాలకూ క్రీడలకూ అంకితం అయ్యింది. వాంగ్ ఫే హుంగ్ జాతకంలో కేతువు గురువును సూచిస్తున్నాడు. అందుకే ఆయన ఒక సాంప్రదాయబద్దమైన  మార్షల్    ఆర్ట్స్  గురువు అయ్యాడు.

ఈ విధంగా రకరకాల తేడాలున్న కాంబినేషన్స్ ద్వారా కుజకేతువులు వివిధ రకాలైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ఇస్తారని మనం ఒక జాతకంలో గమనించవచ్చు.