నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, జూన్ 2012, బుధవారం

పంచవటి సాధనా సమ్మేళనం - 4

జూన్ 11,12 తేదీలలో పంచవటి నాలుగో సాధనాసమ్మేళనం హైదరాబాద్ లో ఒక సభ్యురాలి ఇంటిలో జరిగింది. ఈ రెండురోజులూ పంచవటి సభ్యులు దాదాపు 25 మంది హాజరై ఉదయం నుంచి సాయంత్రంవరకూ ఎన్నో ఆధ్యాత్మికవిషయాల మీద చర్చించి వారివారి సందేహాలు తీర్చుకుని జ్ఞానలబ్దిని పొందారు. ప్రాణాయామ ధ్యానాది సాధనలు కొన్ని ప్రాక్టికల్ గా చేసి ప్రత్యక్షంగా సాధనామార్గం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. 

వేదోపనిషత్తుల సారాన్ని, మహనీయుల జీవిత ఘట్టాలనూ, వివిధ సాధనా మార్గాలనూ, వాటిలోని లోతుపాతులనూ, నిత్యజీవితంలో వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి,ఎలా ఆచరించాలి అన్న విషయాలనూ, సాధనా మార్గంలో ఎలా ఎదగాలి, నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించి అర్ధం చేసుకోవడానికి ఈ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగపడింది. సమావేశంలో పాల్గొన్న వారికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వీలు కల్పించబడి ఆనందాన్ని కలిగించింది.

ఈ సమావేశానికి హాజరైనవారందరూ నిష్కల్మషమైన విశాలమైన భావాలు కలిగినవారే.ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసినవారే. ఇంకా చేస్తూ ఉన్నవారే కావడంతో వారికి కలిగిన కలుగుతున్న సందేహాలు చర్చించి సమాధానాలు పొందటానికి అనువైన వాతావరణం ఈ సమ్మేళనంలో కల్పించబడింది. స్వచ్చమైన,నిజమైన ఆధ్యాత్మికతను కొంతైనా అర్ధం చేసుకున్నామన్న ఆనందాన్ని ఈ సమ్మేళనం వారిలో నింపింది. జీవితసాఫల్యతా సాధనలో ముందడుగు వేస్తామన్న నమ్మకాన్ని పెంచింది. జీవన పోరాటాన్ని దైవబలంతో ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని కలిగించింది.

నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమ్మేళనంలో పాల్గొన్న పంచవటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.