Pages - Menu

Pages

22, జూన్ 2012, శుక్రవారం

వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు

ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ నీచకేతువుతో కలిసి ఉన్నాడు. ఈయన దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో ఉండబోతున్నాడు. ఈ గ్రహయుతి ఫలితాలు ఎలా ఉంటున్నాయో కొంచం గమనిద్దాం. వృషభరాశి నవీన భారతదేశాన్ని సూచిస్తుంది. కనుక ఈ గ్రహ ఫలితాలు మన దేశంమీద ఎక్కువగా ఉంటున్నాయి. 

గురువు న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ సూచకుడు. ఈయన కేతుగ్రస్తుడవడం వల్ల న్యాయరంగానికి మలినం పట్టింది. ఈ మధ్యన న్యాయమూర్తులు కూడా అవినీతికేసుల్లో ఇరుక్కుని అరెష్టవడం దీని ప్రభావమే. న్యాయం కూడా ఒంటి కాలిమీద నడుస్తూ ఉండటం చూడవచ్చు.   

గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు కూడా. కనుక నకిలీ గురువులు కొందరు వివాదాస్పద అంశాలలో ఇరుక్కుని జైలు పాలవడం, రాజకీయాలలో తలదూర్చి నాయకులతో విరోధాలు పెంచుకోవడం, విమర్శలు చెయ్యడం, వార్తలకేక్కడం జరుగుతోంది.

గురువు నాయకులకూ, ఉన్నత అధికారులకూ సూచకుడు. ఈ మధ్యన నాయకులందరూ అరెష్టు కాబడటం, ఇన్నాళ్ళూ ఇతరులకు ఆదేశాలు ఇచ్చిన అయ్యేఎస్ అధికారులు కటకటాల వెనక్కు వెళ్లడం కూడా ఈ గ్రహయుతి ప్రభావమే.

ఇంకా చూస్తె, గురువు వృద్ధనాయకులకు సూచకుడు. కనుక త్వరలో కొందరు వృద్ధ నాయకులు అకస్మాత్తుగా పరలోక ప్రయాణం కట్టే సూచనలున్నాయి.

గురువు ధర్మానికీ సూచకుడే. అందుకే ఈ మధ్యలో ధర్మం దారి తప్పినంతగా ఎన్నడూ జరుగలేదు. ప్రజలలో ధర్మం అనేది పూర్తిగా లోపించి స్వార్ధం కరాలనృత్యం చేస్తున్న మాట నిజం. ప్రస్తుతం ఎవరిలోనూ ధార్మిక చింతన లేదు అని చెప్పవచ్చు. ధర్మం పేరుతో మతం పేరుతో జరుగుతున్నది అంతా కూడా చాలావరకూ మోసమే.

అయితే దీనిలో ఇంకొక కోణం కూడా ఉన్నది. గురు కేతువుల యుతి వల్ల నిజమైన ఆధ్యాత్మిక పరులకు సహాయపడే స్పందనలు ఇప్పుడు అధికం అవుతాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అటువంటి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఈ పరిస్తితి ఒక ఏడాది పాటు ఉంటుంది కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ గ్రహ ప్రభావాన్ని సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది.

వృషభ రాశి భూతత్వ రాశి కనుక ఈ గ్రహయుతి వల్ల భారతదేశంలో భూకంపాలు వస్తున్నాయి. శనీశ్వరుడు కూడా భూతత్వ రాశి అయిన కన్య లో ఉండటం గమనిస్తే ఇదెంత ఖచ్చితంగా జరుగుతున్నదో అర్ధం అవుతుంది. మొన్న అమావాశ్య ప్రభావంతో సత్తెనపల్లి కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. దీని ఫలితంగా గుంటూరులో కూడా ఇళ్ళు ఇంట్లోని వస్తువులు రెండు మూడు సెకన్లు ఊగినట్లు అనిపించింది.


ప్రస్తుతం గురుకేతువులు ఒకరికొకరు ఒక డిగ్రీ దగ్గరలో ఉన్నారు. నిన్న గురువారం నాడు ముంబాయిలోని మహారాష్ట్ర సెక్రెటేరియట్ కు నిప్పంటుకుని ఘోరప్రమాదం జరిగింది.ఇద్దరు ముగ్గురు చనిపోయారని అంటున్నారు. మంత్రులు కొద్దిలో బయటపడ్డారు. కేతువు కారకత్వాలలో ఒకటైన షార్ట్ సర్క్యూట్ కారణం అని అంటున్నారు. అధికారకేంద్రం అయిన విధానసౌధంలో ఇది జరగటం గురువు కేతువుల సంయోగ ఫలితమే. ఆర్ధిక రాజధానిలో ఇది జరగడం శుక్రుని రాశి అయిన వృషభంలో  కేతువు ఉన్న ఫలితమే. ఇది అగ్ని ప్రమాదాలకు కారకుడైన కుజ హోరలో జరిగింది. కుజుడు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో ఉండి తన శత్రువైన శనిని సమీపిస్తూ చాలా అసౌకర్యంగా ఉన్నాడు.

డిసెంబర్ 23 వరకూ కేతువు వృషభరాశిలోనే ఉంటాడు. అప్పటివరకూ  ఇలాంటి ఫలితాలు మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. తమతమ జాతకాలకు సరిపోయే రేమేడీలు పాటించడం వల్ల ఈ దుష్ప్రభావాల నుండి బయట పడవచ్చు.