Pages - Menu

Pages

25, జూన్ 2012, సోమవారం

అతీతలోకాలు - అదృశ్యశక్తులు

చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు  అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది.  ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన  ఇంద్రియశక్తులను  యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు.  వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు. 

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే  ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.


ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు. 


అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.
  
మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే  మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.