నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

13, ఆగస్టు 2012, సోమవారం

లండన్ ఒలింపిక్స్ 2012 - మన సిగ్గులేని స్తితి

125 కోట్లమంది పనికిమాలిన జనాభా ఉన్న మన దేశానికి ఒలింపిక్స్ లో ఒక్కటంటే ఒక్క బంగారు పతకం రాకపోవడం ఊహించినదే. అది వింత కాదు. ఎందుకంటే మన వెన్నెముకలేని జాతికి అంతర్జాతీయ పోటీలలో ఏవో గోల్డ్ మెడల్స్ వస్తాయని ఊహించడమే పెద్దతప్పు. కనీసం మెడల్స్ టాలీలో పోయినసారి వచ్చిన 50 ర్యాంక్ కూడా రాకపోగా ఈసారి ఇంకో 5 స్థానాలు దిగజారి 55 స్థానంతో సరిపెట్టుకోవలసి రావడాన్ని మాత్రం జీర్ణించుకోవడం కష్టమే. 50 కంటే  55 ఎక్కువ కాబట్టి ఆ రకంగా మనం ఎదిగామని అనుకోవాలేమో. 

కుస్తీ, బాక్సింగ్, షూటింగ్, షటిల్ ఇవి తప్ప ఏ మేజర్ ఈవెంట్ లోనూ మనకు ఈడ్చి తన్నినా ఒక్క పతకమూ రాలేదు. కనీసం ఇండోనేషియా, ఎస్టోనియా, బల్గేరియా, ఫిన్లాండ్, బెల్జియం, ఉగాండా మొదలైన దేశాలకు ఒకటైనా గోల్డ్ మెడల్ వచ్చింది. మనకు అదీ లేదు. అద్భుతం.భారత్ నిజంగా వెలిగిపోతోంది.  

అంతర్జాతీయ పోటీలలో ఎన్నిసార్లు శాస్తి జరిగినా మనకు ఇంకా సిగ్గు రాకపోవడం మాత్రం మన జీన్స్ లో  ఉన్న గొప్పలక్షణంగా భావించి భారతీయుడుగా పుట్టినందుకు మనం గర్వంగా ఫీలవాలి. అసలు మనలాంటి అవినీతి దేశానికి ఒలింపిక్స్ లో బంగారు పతకం రావాలని ఆశించటం పెద్ద పొరపాటు. అక్కడకూడా ఏదైనా దొడ్డిదారి ఉంటే అప్పుడు మనకు ఏమైనా అవకాశం ఉండి ఉండేది.

అన్నిరంగాలలో లాగే క్రీడారంగంలో కూడా అవినీతి పాతాళం దాకా వేర్లు పాకించి ఉంది. బయటనుంచి చూస్తే ఇది కనపడదు. కాని ఏదో ఒక ఈవెంట్ లో ప్రాక్టీస్ చేస్తూ ఆ రంగంలో ఉన్నవారికి దాని సంగతి తెలుస్తుంది. క్రింది నుంచి పైదాకా క్రీడారంగంలో కూడా అవినీతి, లంచాలూ, సిఫార్సులూ, రాజకీయ జోక్యాలూ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక సగటు క్రీడాకారుడు స్పోర్ట్స్ ప్రపంచంలో ఎదగాలంటే మన దేశంలో చాలా చాలా కష్టం. ప్రతి మెట్టులోనూ ప్రోత్సాహం కంటే అణగదోక్కుడు అతనికి ఎదురౌతుంది.

నిజమైన క్రీడాకారుడికి మన దేశంలో ఎక్కడా ఏ సపోర్టూ ఉండదు. వాడంతట వాడు నానా కష్టాలూ పడి మెడల్ సంపాదిస్తే అప్పుడు అందరూ వచ్చి అతని పక్కన నిలబడి ఫోటోలు దిగుతారు. ఆవేశంగా ప్రైజ్ మనీని ప్రకటిస్తూ ఉంటారు. చాలా సార్లు అతనికి ప్రకటించిన ప్రైజ్ మనీ ఎన్నేళ్ళైనా అతనికి అందదు. కాని ఆ విషయం మీడియాలో రాదు. కనుక జనానికి తెలీదు. 

ఒక మేరీ కొమ్ అయినా ఒక సుశీల్ కుమార్ అయినా వాళ్ళు ప్రభుత్వ సహాయంతో ఎదిగినవాళ్ళు కారు. నానా కష్టాలూ పడి స్వంతంగా చెమటోడ్చి సాధన చేసి పైకోచ్చినవారే. ఇలాంటి ఆణిముత్యాలు మన దేశంలో మారుమూల పల్లెలతో సహా ఎన్నో చోట్ల ఎందఱో ఉన్నారు. కాని వారికి ప్రోత్సాహమూ ఉండదు. ఆదరణా ఉండదు. వారిని కనిపెట్టి, తీసుకొచ్చి, సరియైన శిక్షణ ఇస్తే, ఎందఱో మెరికల్లాంటి ఆటగాళ్ళు మనదేశంలో కూడా మూలమూలనా ఉన్నారు. కాని ఆ పని చెయ్యడానికి కావలసిన చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు.

కనీసం పక్కనున్న చైనాను చూసినా మనం నేర్చుకోలేక పోతే అంతకంటే సిగ్గుచేటు ఇక ఏమీ ఉండదు. అత్యాధునికమైన సదుపాయాలతో కూడిన కనీసం 7000  స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఆ దేశంలో ఉన్నాయంటే వాళ్ళ చిత్తశుద్దికీ పట్టుదలకూ మనం తలవంచక తప్పదు. అసలు చైనాను మనం ఎప్పటికైనా అందుకోగలమా అంటే సందేహమే అని చెప్పాలి. చైనా దేశం కూడా ఒకప్పుడు మనలాంటి దేశమే. అక్కడి సమాజమూ సంస్కృతీ దాదాపు మనలాగే ఉంటుంది. మనకు ఉన్న అన్ని అవలక్షణాలూ వాళ్ళకూ ఉన్నాయి. కాని కఠోరమైన క్రమశిక్షణా, ప్రభుత్వం అంటే భయమూ, గోల్స్ అందుకోకపోతే పడే శిక్షలూ అన్నీ కలిసి వారికి 87 పతకాలనూ అందులో 38 బంగారు పతకాలను తెచ్చి పెట్టాయి. మనకో? కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బంగారుపతకం రాలేదు. మనకెప్పుడు బుద్ధి వస్తుందో ఏమో? బహుశా ఎప్పటికీ రాకపోవచ్చు. కనీసం నడకలో కూడా మనకు పతకం రాలేదు. నిన్నగాక మొన్న అడుగుపెట్టిన టిబెట్ కు ఆ పతకం దక్కింది. ఎంత సిగ్గుచేటో ఊహించలేము.

అడుక్కోవడంలోనూ, అవినీతిలోనూ, నల్లధనాన్ని విదేశీబ్యాంకుల్లో దాచుకోవడంలోనూ, భూకబ్జాలు చెయ్యడంలోనూ, నీతిరహిత, క్రమశిక్షణారహిత సమాజపు తీరులోనూ, రూల్స్ ను తుంగలో తొక్కి అడ్డగోలుగా అన్నీ స్వాహా చెయ్యడంలోనూ, కులగజ్జిలోనూ, కుహనా మతసాంప్రదాయాలలోనూ, నీతులు ఎదుటివాడికి చెప్పి తానుమాత్రం ఏ నీతీ పాటించకుండా ఉండటంలోనూ పోటీలు పెడితే అన్ని గోల్డ్ మెడల్సూ మనకే వచ్చి ఉండేవి. ఆఫ్ కోర్స్ అందులోనూ మళ్లీ మనవాళ్ళు కమీషన్లు కొట్టేసి  స్విస్ బ్యాంక్ కు పంపించి ఉండేవారు. అది వేరే విషయం.

కనీసం ఒక వీధిరౌడీకి ఇచ్చే గౌరవం కూడా క్రీడాకారుడికి మనదేశంలో  ఇవ్వం. అదీ సగటు భారతీయుడిగా మన మానసికస్తితి. ఇలాంటి కుళ్ళిపోయిన దేశంలో ఏవో అద్భుతాలు జరగాలని అసలెలా ఊహించగలం? స్పోర్ట్స్ రంగంలో కూడా కులం అనేది ఎంతగా వేర్లు పాకించి ఉందో ఒక్కసారి లోపలికి తొంగి చూసినవారికి అర్ధమౌతుంది. డబ్బు అక్కడ ఎంతగా పనిచేస్తుందో, రాజకీయ పలుకుబడి ఎంతగా ఉపయోగపడుతుందో దిగి చూసినవారికి అర్ధమౌతుంది. బయటనుంచి చూస్తే అంతా బాగున్నట్లే ఉంటుంది. కాని అన్ని రంగాల లాగే క్రీడారంగం కూడా ఒక కుహనా ప్రపంచం. నిజమైన క్రీడాకారుడికి అక్కడ ఏ విధమైన ప్రోత్సాహమూ ఉండదు. అక్కడ కులమూ డబ్బూ రాజకీయ అండదండలూ ముఖ్యం. క్రీడానైపుణ్యం అన్నిటికంటే చివర్లో ఉంటుంది. అందుకే మన స్తితి ఇంత ఘోరంగా ఉంది.

క్రీడల్లో ప్రతి దేశానికీ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఈతలో, అధ్లేటిక్స్ లో అమెరికా, పరుగులో కెన్యా మొదలైన ఆఫ్రికన్ దేశాలు, జిమ్నాస్టిక్స్ లో రష్యన్ దేశాలు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్ మింటన్ లలో చైనా, వెయిట్ లిఫ్టింగ్ లో ఇరాన్ ఇలా ఒక్కొక్క దేశానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని దేశం మాత్రం   మన దేశమే. గర్వంగా చెప్పుకోవడానికి మనదంటూ ఫలానా అని ఒక్క ఈవేంటూ లేదు. ఉన్న ఒక్క హాకీలో కూడా ఇతరులు మనల్ని చెత్త రేగ కొడుతున్నారు. కబాడీ,హాకీవంటి మన దేశపు క్రీడల్లో, కూడా ఇతరులు ఆ క్రీడను నేర్చుకోనంత వరకే మన గొప్ప. ఒకసారి ఇతరులు అది నేర్చుకుంటే ఇక మనపని ఇంతేసంగతులు.మనకు తెలిసిన క్రీడల్లా టీవీలకు అతుక్కుపోయి పాప్ కార్న్ తింటూ చూచే పనికిమాలిన క్రికెట్ ఒక్కటే.
   
లండన్ ఒలింపిక్స్ అనుభవాల దృష్ట్యా మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని ప్రశ్నలు ఇకనుంచీ పొందు పరుచుకోవచ్చు. అవి ఏమంటే --

1. అత్యంత ఎక్కువ జనాభా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క గోల్డ్ మెడల్ సంపాదించలేక పోయిన దేశం ఏది?
2. భారత్ నుండి ఒలింపిక్స్ కు అసలు క్వాలిఫై అయిన ఈవెంట్సూ,ఆటగాళ్ళూ ఎంతమంది?
3. తమ దేశపుక్రీడ అయిన హాకీలో కూడా చెత్తచెత్తగా ఓడిపోయే దేశం ఏది?
4. క్రీడాకారులకు అత్యంత తక్కువ గౌరవం ఇచ్చే దేశం ఏది?
5. క్రీడారంగాన్ని కూడా వదలకుండా అవినీతి వ్యాపించిన దేశం ఏది?
6.క్రీడల్లో అత్యంత ఎక్కువ పొటెన్షియల్ ఉండి కూడా దానిని ఏమాత్రం పట్టించుకోని, ఉపయోగించుకొని దేశం ఏది?
7. పనికిమాలిన క్రికెట్ తప్ప ఇక ఏ క్రీడా తెలియని దేశం ఏది?
8. చెప్పుకోడానికి తమదంటూ ఒక్క ఈవేంటూ లేని దేశం ఏది?  
     
మన సొసైటీ ఒక మేడిపండు. బయట అంతా బాగున్నట్లు కనిపిస్తుంది. కాని లోపల అంతా పురుగులమయం. అన్నిరంగాలలో అవినీతికేన్సర్ బాగా ముదిరిన స్టేజిలో మన సమాజం ప్రస్తుతం ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలూ, నిత్యప్రళయాలూ  మాత్రమె మనల్ని తుడిచిపెట్టి ప్రక్షాళన చెయ్యగలవు. ఇక వేరే ఏ మార్గమూ లేదు. మన సొసైటీ బాగుపడుతుందన్న నమ్మకం నాకైతే ఎంతమాత్రమూ లేదు. భగవంతుడు కూడా మనల్ని బాగు చెయ్యలేడు.