నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, ఆగస్టు 2012, శనివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 3

'వ' దగ్గర కొంచంసేపు కూచుందాము పదండి' అంటూ అందరమూ పక్కనే ఉన్న అక్కయ్య ఇంటికి దారితీశాము. మేము వెళ్లేసరికి అక్కయ్య ఒక చెక్కమంచం మీద శాంతంగా కూచుని ఉంది. చరణ్ను ఆమె వెంటనే గుర్తుపడుతుంది. నేను ఒకటి రెండుసార్లు మాత్రమే ఆమె దగ్గరకు వెళ్ళాను గనుక అంతగా గుర్తులేను. మమ్మల్ని చూచి 'రండి నాయనా'అంటూ ప్రేమగా ఆహ్వానించింది.

చరణ్ సరాసరి వెళ్లి నేలమీద ఆమె కాళ్ళదగ్గర కూచున్నాడు. మేము కొంచం దూరంగా కూచున్నాం. పైన కుర్చీల్లో కూచోమని ఆమె వారించిందిగాని, ఆమె ముందు కుర్చీలో కూచోవడం ఏమిటని కిందే కూచున్నాం. క్షేమసమాచారాలు అయిన తర్వాత అసలు చర్చ మొదలైంది.

'అన్నగారు ! మీ సందేహం అడగండి.' అన్నాడు చరణ్.

'మీరు అమ్మతో చాలా చనువుగా మెసిలేవారు కదా. ఎంతో కాలం అమ్మకు సేవలు కూడా చేశారు కదా. అతీతలోకాల గురించి, పునర్జన్మల గురించి అమ్మ ఎప్పుడైనా సందర్భావశాత్తూ మాట్లాడిందా? చరణేమో అమ్మ అలా చెప్పి ఉండదు అంటున్నాడు.' అన్నా నేను.

అక్కయ్య సాలోచనగా చూచింది.

'అమ్మ ఎప్పుడూ అందరికీ ఒకే మాట చెప్పలేదు నాయనా. మనిషిని బట్టి అతని స్థాయిని బట్టి అమ్మ మాట్లాడేది. ఒకరికి వచ్చిన సందేహం ఇంకొకరికి రాదుకదా. అలాగే, అమ్మ సమాధానం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పేది. జన్మల గురించి కూడా అప్పుడప్పుడూ చెప్పేది. అయితే బాగా వివరించేది కాదు. చాలాసార్లు అమ్మ ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేది. అప్పుడు ఆమె ముఖం మారిపోయేది. మన స్పృహలో ఉండేది కాదు. మేము కూడా అలాంటి సమయంలో ఆమెను పలకరించేవాళ్ళం కాదు. దూరంగా మౌనంగా ఉండేవాళ్ళం. అల్లాంటి సమయాల్లో ఒక్కొక్కసారి ఎవరితోనో మాట్లాడేది. ఏదో భాషలో మాట్లాడేది. గోణుగుతున్నట్లు ఒక్కొక్కసారి మనకు కనిపించని ఎవరితోనో ఏదో చెప్పేది. మనకు అర్ధం అయ్యేది కాదు. 

మామూలుగా ఉన్నప్పుడు మాత్రం 'జన్మలేందుకు నాన్నా. సముద్రంలో అలలవంటివి జన్మలు. ఒక అల ఇంకో అలకు కారణం అవుతుంది. వాటికి అంతేక్కడుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. నిన్నఏమి తిన్నామో ఈరోజు మనకు గుర్తుండదు. పాత జన్మల సంగతి ఎందుకు నాన్నా?' అనేది.

అమ్మ ట్రాన్స్ లో ఉన్నపుడు అందరం ఆమెను సమీపించడానికి భయపడేవాళ్ళం. ఆ సమయంలో ఏవేవో మాట్లాడేది. ఎన్నో విచిత్రాలు జరిగేవి. నాకు బాగా గుర్తున్న ఒక సంఘటన చెప్తా వినండి. ఆ రోజు 14-6-1962 ఆ రోజు అమ్మ బావి దగ్గరకెళ్ళి వరుసగా బక్కెట్లు తోడి పోసుకుంటూనే ఉంది. ఎంతసేపు అలా స్నానం చేసిందో తెలీదు. తర్వాత మమ్మల్ని తోడి పోయ్యమంది. మేమూ చాలాసేపు నీళ్ళు అలా తోడి పోస్తూనే ఉన్నాం. ఆ తర్వాత తినడానికి ఏమున్నాయని అడిగింది. అమ్మ ఎప్పుడూ అలా అడగదు. అసలు అమ్మ మనలాగా అన్నం తినడమే మేము చూడలేదు. ఏదన్న వండి ఆమె ఎదుటకు తెస్తే కొంచం మాత్రం తన చేత్తో తిని మిగతాది ప్రసాదంగా అందరికీ పెట్టేది. అప్పుడప్పుడూ కాఫీ తాగేది. అలాంటి అమ్మ ఆరోజు అలా అడగడం మాకు విచిత్రం అనిపించింది. ఇంట్లో వెదికితే 16 మామిడిపండ్లు మాత్రం కనిపించాయి. సరే ఆ సంగతే అమ్మతో చెప్పాం. ఆ పండ్లు అన్నీ ముక్కలు కోసి తెమ్మని చెప్పి ఒక్క ముక్కా వదలకుండా ఎవరికీ పెట్టకుండా అన్నీ తానే తినేసింది. 'అడివిలో శ్యామల ఆకలితో ఉందమ్మా' అన్నట్లుగా ఏదో గొణిగింది. లేకుంటే 'వాళ్ళు అడివిలో తపస్సులో ఉన్నారు. వారికేవరు తిండి పెడతారు?' అనేది. ఇలా మనకు అర్ధం కాని ఏవేవో మాటలు కొద్దిగా అనేది. అప్పుడు మాకు అర్ధం అయేది కాదు. తర్వాత ఎప్పుడో తెలిసేది. ఎక్కడో ఎవరో ఆకలితో అలమటిస్తూ ఉంటే, తాను ఇక్కడ తిని వారి ఆకలి తీర్చేది అని. ఇలాంటివి మహనీయుల జీవితాలలో చదివాం. కుండలో మిగిలిన ఒక్క మెతుకు కృష్ణుడు తిని శిష్యులతో సహా భోజనానికి వచ్చిన దుర్వాసుని ఆకలి తీర్చాడని చదివాం. కాని మేము కళ్ళారా అమ్మను చూచాం. ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగేవి.

కొంతమందికి అతీతలోకాల గురించి చెప్పేది. కాని అందరికీ చెప్పేది కాదు. కొందరితోనేమో 'వాటి గురించి ఎందుకు నాన్నా? నీవోచ్చిన పని చూచుకో' అనేది. ఇలా మనిషిని బట్టి అమ్మ సంభాషణ ఉండేది.

ఎందఱో ఎన్నో సమస్యలతో వచ్చేవారు. కొందరు చెప్పేవి శ్రద్దగా విన్నట్లు కనిపించేది. కొందరు చెప్పేవి విననట్లుగా అన్యమనస్కంగా ఉండేది. వారికి అనుమానం వచ్చేది. అసలు అమ్మ మనం చెబుతున్నది వింటూన్నదా లేదా అని. కాని వారు తిరిగి ఇంటికి వెళ్లేసరికి వారి సమస్య తీరిపోయి ఉండేది. అలా మాట్లాడకుండానే అమ్మ అన్నీ చేసేది. ఒక్కొక్కసారి మాట్లాడేది. ఒక్కొక్కసారి మౌనంగా ఉండేది. మన ఊహలకు అతీతంగా అమ్మ వ్యవహారం ఉండేది. 'నేను మాటలమ్మను కాను మూటలమ్మను'. అనేది. మాటలతో పని లేదు. అనుకుంటే ఇచ్చేసేది. అంతే.

చాగంటి వెంకట్రావు గారని ఒక రిటైర్ అయిన డీఎస్పీ ఉండేవాడు. ఒకజు అమ్మతో ' అమ్మా నాకు సినిమాలలో నటించాలని ఉందమ్మా' అని ప్రార్ధించాడు. అమ్మ మౌనంగా విననట్లుగా ఉంది. తర్వాత కొంతకాలానికి   దర్శకుడు బాలచందర్ తనంత తానే ఇతన్ని పిలిచి 'కోకిలమ్మ' సినిమాలో ఒక వేషం ఇచ్చాడు. అలా జరిగేవి.

చిన్నచిన్న మాటల్లోనే జీవితసత్యాలు చెప్పేది. ఉపదేశాలూ అలాగే ఉండేవి. ఉదాహరణకు అమ్మ ప్రసిద్ధ వాక్యం 'నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకో' తెలుసుగా. ప్రస్తుతం ఎవరికీ తృప్తి ఉన్నదో చెప్పు నాయనా? అందరికీ అత్యాసే కదా. ఇకపోతే ఇతర్లకు ఆదరణగా ఎవరు పెడుతున్నారు? ఏడుస్తూనో, లేదా ఏదో ఆశించో మాత్రమె ఇతరులకు మనం ఏదైనా చేస్తాం. అది కూడదు. ఇప్పుడు మనం తినేదే తృప్తిగా తినలేకపోతున్నాం. అప్పుడు కూడా ఏదో ఆలోచనలే. ఎవరో ఏదో సంపాదిస్తున్నారు, మనకులేదు అన్న చింతలే.ఇలాంటివి వినడానికి చిన్న ఉపదేశాలలాగే కనిపిస్తాయి. కాని ఆచరించగలిగితే అంతకంటే మానవజన్మలో చెయ్యగలిగేది ఇంకేమీ ఉండదు. అమ్మ ఉపదేశాలు అలా ఉండేవి. అవి మహావాక్యాలు.

అమ్మకు శుభ్రత చాలా ఎక్కువ. సర్దినదే మళ్ళీ సర్దమనేది. తుడిచినదే మళ్ళీ తుడవమనేది.నా వెనుకే నిలబడి గమనిస్తూ అన్నీ శుభ్రం చేయించేది. ఏ పనినీ మధ్యలో వదిలేయ్యడమూ, అరకొరగా చెయ్యడమూ అమ్మకు నచ్చదు. వస్తువులు ఎక్కడ తీసినవి మళ్ళీ అక్కడే ఉంచాలి అనేది. చీపురు కూడా అది ఉండాల్సిన చోట ఉండాల్సిందే. 

'వ' ఇలా చెబుతుంటే నాకు శారదామాత జీవితం గుర్తొచ్చింది. అమ్మ కూడా ఇలాగె ఉండేది. ఒకసారి ఒక శిష్యురాలు చీపిరితో ఇల్లు చిమ్మిన తర్వాత దానిని ఒక మూలకు విసిరి కొట్టింది. అది చూచి అమ్మ ' ప్రతి వస్తువునూ గౌరవించడం నేర్చుకో. దాని విలువ దానికి ఇవ్వాలి. అలా విసిరే బదులు, దానిని చక్కగా ఆ మూల ఉంచితే నీకు ఏమి పోతుంది. పని తీరంటే ఇది కాదు' అంటూ మందలించింది. ఒకసారి బేలూర్ నుంచి ఒక సన్యాసి అమ్మ దర్శనానికి వచ్చాడు. అతను కూచుని అమ్మతో మాట్లాడుతుండగా ఒక శిష్యురాలు అదే గదిలో పక్కనించి నడుస్తూ వెళ్ళింది. ఆమె చీరకొంగు ఆ స్వామికి తగిలింది. దానికి అమ్మ ఆమెను చీవాట్లు పెడుతూ, ' వాళ్ళు అన్నింటినీ పరిత్యజించిన సన్యాసులు.వారితో ఇలాగేనా మేలిగేది? చూచుకుని నడువు.నీ నిర్లక్ష్యంవల్ల నీకే చెడుజరిగే ప్రమాదం ఉన్నది' అని హెచ్చరించింది. మహానీయులతో జీవనం అంటే మాటలు కాదు. చాలా కష్టం. వారి పరిశీలన చాలా సూక్ష్మంగా ఉంటుంది. అనుక్షణం ప్రతిపనిలో పరిపూర్ణతను వారు ఆశిస్తారు.

'వ' తన మాటలు కొనసాగించింది.

'అమ్మకు ఎందరి బాధలో తెలిసేవి. దూరం ఉన్నా సరే వారి ఆవేదన అమ్మకు తెలిసిపోయేది. అందుకే తన ఆరోగ్యం బాగాలేకున్నా సరే అరుణాచలం వెళ్లి చలాన్ని సౌరిస్ ని కలిసి పలకరించి వచ్చింది. అక్కడే జేమ్స్ ఉన్నాడు. అమ్మ అతని కళ్ళలోకి రెండు క్షణాలు చూచింది. అంతే. మేము మా యాత్ర ముగించుకుని వచ్చేసరికి జేమ్స్ జిల్లెల్లమూడికి వచ్చి చేరుకున్నాడు. వచ్చినవాడు మళ్ళీ వెనక్కు పోనేలేదు. 

అమ్మ ఎన్ని మహత్యాలు అద్భుతాలు చేసిందో లెక్కే లేదు. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నగలు పెట్టుకుని బాపట్ల సముద్రతీరంలో తిరుగుతుంటే ఒక చేపలు పట్టేవాడు ఆ నగలు కాజెయ్యాలని అమ్మను సముద్రంలోకి తోసేశాడు. కాసేపటికి రక్షించమని కేకలు వేస్తూ సముద్రంలో అతనే మునిగిపోతున్నాడు. అమ్మ ఒడ్డున నిలబడి ఉంది. అతన్ని రక్షించి బయటకు తెచ్చారు. 'ఈ నగల కోసమా ఇదంతా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా నాయనా. తీసుకో' అంటూ వాటిని వొలిచి అతనికి ఇచ్చేసింది ఆ చిన్నపిల్ల. చిన్నప్పుడే అంత దివ్యత్వాన్ని ప్రదర్శించింది.

ఒకసారి నక్సలైట్లు ఆశ్రమంమీద దాడిచేసి అంతా దోచుకుపోయారు. పోలీసులు వారిని వెతికి పట్టుకొచ్చారు. ఆ దొంగలకు భోజనం పెట్టి, కొత్త బట్టలు పెట్టి పంపింది అమ్మ. వాళ్ళూ తన పిల్లలే అంటుంది. ఆ ప్రేమకు అంతు లేదు.

అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి రమణాశ్రమం వెళ్లి రమణ మహర్షిని దర్శించింది. అప్పుడు మహర్షి అమ్మను చూచి ' మాతృశ్రీ వచ్చింది' అన్నారు. తర్వాత రోజుల్లో చలాన్ని చూడటానికి అమ్మ రమణాశ్రమం వెళ్లి అక్కణ్ణించి కంచికి వెళ్ళింది. మేమూ ఆ బృందంలో ఉన్నాం. కంచి పరమాచార్యులు అమ్మను చూచి ముద్రాసహితంగా అమ్మకు నమస్కరిస్తూ ఇరవైనిముషాలు అలా నిలబడే ఉన్నారు.' మనం ఇక్కడ ఉన్నంతవరకూ ఆయన అలా నిలబడే ఉంటారు. పదండి పోదాం' అంటూ అమ్మే బయలుదేరింది. అమ్మెవరో అలాంటి మహనీయులు గ్రహించగలిగే వారు. మనకు తెలిసేది కాదు.

నాకొకసారి మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చెయ్యాలన్నారు.అప్పట్లో ఇంతగా సర్జరీ లేదు. లేవలేక నెలల తరబడి మంచంలో ఉన్నాను. అమ్మ మదనపల్లిలో ఉన్నది. అమ్మ లేకుండా నేను ఆపరేషన్ చేయించుకోను అని చెప్పాను. సరే నన్నే అక్కడికి తీసుకు వెళ్లారు. అప్పట్లో అందరికీ అభిమానాలు ప్రేమలు ఉండేవి.ఎవరికి ఏమొచ్చినా అందరూ కదిలి వచ్చేవారు. ఇప్పుడవన్నీ పోయాయి. ఇప్పటి కాలపు మనుషులకు ప్రేమలు లేవు. ఒకవేళ పోతే ఓహో పోయిందా అంటారు. మర్నాటికి మర్చిపోతారు. లేదా పేపర్లో ఒక వ్యాసం వ్రాస్తారు. అంతే.

సరే, నేను మదనపల్లి వెళ్ళాను. అమ్మ నన్ను చూచింది. ఏమీ మాట్లాడలేదు. తనతో ఉండమంది. మర్నాడు వేరే ఊరికి బయలుదేరుతూ, నన్ను లేచి నడవమంది. నా వల్ల కాదని చెప్పాను.లేవాలని ప్రయత్నం చేస్తే యమబాధ పుడుతున్నది. అయినా సరే అమ్మ వినలేదు.అలాగే లేచి కారు వరకూ కుంటుతూ వచ్చి కారేక్కాను. అడుగు వేస్తుంటే ప్రాణం పోయినంత బాధ పుట్టింది. అక్కణ్ణించి తనతోనే రోజంతా తిప్పింది సాయంత్రానికి మామూలుగా నడువగలిగాను. తర్వాత మళ్ళీ పరీక్షలు చేయిస్తే మోకాళ్ళు మామూలుగా ఉన్నట్లు వచ్చింది. ఇది నాకే జరిగింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఒకసారి ఒకాయనకు కేన్సర్ వచ్చింది. ఆపరేషన్ చేస్తామన్నారు. ఆయన అమ్మ భక్తుడు. అమ్మ దగ్గరకి వెళ్లి వస్తానని అంటే డాక్టర్ ఎగతాళిగా నవ్వాడు. ఇలాటి అమ్మలవల్ల బాబాలవల్ల ఏమౌతుంది అంటూ. అయినా వినకుండా అతను అమ్మ దగ్గరికి వచ్చాడు. అతను ఏదో మాట్లాడుతుంటే అవేమీ వినకుండా తనకు అన్నీ తెలిసినట్లు అతనికి ఎక్కడ బాధ ఉందొ ఆ ప్రదేశంలో చెయ్యి వేసి నిమిరింది. తర్వాత అతను వెనక్కు వెళ్లి మళ్ళీ పరీక్ష చేయిస్తే రోగం ఏమీ లేదు. ఆ డాక్టర్ బిత్తరపోయి పరిగెత్తుకుంటూ జిల్లెళ్ళమూడి వచ్చాడు.  ఇలాంటివి చాలా జరిగాయి.

అంతెందుకు ఒకసారి అమ్మకే కేన్సర్ అనుకున్నారు. లోపల గడ్డలాంటిది ఏదో వచ్చి పరీక్ష చేయిస్తే మేలిగ్నేంట్ అని రిపోర్ట్ వచ్చింది. దినకర్ అన్నయ్యా, రామక్రిష్ణ అన్నయ్యా ఈ వార్త విని ఏడుస్తూ సాయంత్రం వరకూ కనపడకుండా ఎక్కడో తిరుగుతున్నారు. అమ్మకు అన్నీ తెలుసు. కానీ తెలియనట్లు నటిస్తుంది. నన్ను పిలిచి ' ఏమే. వీళ్ళేక్కడికి పోయారు. ఏమైంది?' అని అడిగింది. ' ఏమో అమ్మా నాకేం తెలుసు?' అని జవాబు చెప్పాను. 'నీకు తెలియకుండా ఎందుకుంటుంది? చెప్పు.' అంది. 'నాకు తెలీదమ్మా వాళ్ళేక్కడున్నారో? అని చెప్పాను. సాయంత్రానికి వాళ్ళోచ్చి అమ్మ దగ్గర కూచొని,  చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు. అంతా విని ' ఇందుకా మీరు ఇలా చేస్తున్నారు. ఆ రోగం నాకెందుకుంటుంది నాన్నా. ఉండదు. మళ్ళీ ఇప్పుడు చూడండి' అన్నది. మళ్ళీ పరీక్ష చేయిస్తే ఏమీ లేదని వచ్చింది. ఇలా ఎన్నో జరిగాయి.

అమ్మ అంతరంగాన్ని తెలుసుకోలేం. అతీతలోకాలు, జన్మలు ఉన్నాయని కొన్నిసార్లు చెప్పేది. కాని కొన్నిసార్లు చెప్పకుండా మాట దాటవేసేది. అంతా అడిగేవారి స్థాయిని బట్టి, వారి తపనను బట్టి ఉండేది.

అంటూ వ'ము'గించింది.

(సశేషం)