Pages - Menu

Pages

16, ఆగస్టు 2012, గురువారం

శనికుజుల కలయిక - జరుగుతున్న ప్రమాదాలు

నిన్న ఆగస్ట్ 15 తేదీన శని కుజులు తులా రాశి 0 డిగ్రీలలో చిత్తా నక్షత్రంలో ఖచ్చితమైన డిగ్రీ కన్జంక్షన్లోకి వచ్చారు. రేపు అమావాస్య. అంటే అమావాస్యకు మూడురోజుల సమీపంలోనే ఈ గ్రహయుతి జరిగింది. దీని ఫలితంగా ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో ఒక్కసారి చూద్దాం.

>>విలాస్ రావ్ దేశముఖ్ మరణించాడు. ప్రముఖుల మరణాన్ని ఇంతకు  ముందు దేవానంద్, రాజేష్ ఖన్నా ల గురించి వ్రాసిన పోస్ట్ లో సూచించాను. లివర్ వ్యాధితో బాధపడుతూ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యడానికి లివర్ దొరక్క ఆయన చనిపోయాడు. గురువు కాలేయానికీ జీర్ణక్రియకూ సూచకుడనీ ప్రస్తుతం గోచారరీత్యా గురుని కేత్రుగ్రస్త స్తితివల్ల ఇది జరిగిందనీ గ్రహించాలి. గ్రహ ప్రభావం ప్రతికూలిస్తే ఎంత ధనవంతులైనా ఆ సమయానికి అందవలసిన సాయం దొరకదని గ్రహించాలి.

>>షాద్ నగర్ స్టీల్ యూనిట్లో  అగ్నిప్రమాదం జరిగింది. కరిగిన ఇనుము పేలి మనుషులమీద పడింది. ఇనుము శనికీ, పేలుడు కుజునికీ వీరిద్దరి కలయిక విస్ఫోటనానికీ సూచికలు. ప్రస్తుతం వీరిద్దరూ కుజనక్షత్రంలో ఉన్నారనీ అందువల్ల అగ్నిప్రమాదాలు జరుగుతాయనీ,  నవాంశలో కూడా శని తులారాశిలోనే ఉండి కుజునితో సమానబలంతో ఉన్నాడనీ గ్రహిస్తే విషయం బాగా అర్ధమౌతుంది.

>>ఈ రెండురోజుల్లో ఎన్నో అగ్నిప్రమాదాలు రోడ్ ఏక్సిడెంట్ లూ జరిగాయి. ఇంకో మూడు రోజులు జరుగుతూనే ఉంటాయి.

>>ఈశాన్య భారతంలో గొడవలు ఎక్కువయ్యాయి. బెంగుళూరు నుంచి వేలమంది కార్మికులు భయభ్రాంతులై అస్సాం, బెంగాల్, గౌహతీలకు పయనం కడుతున్నారు. ఈశాన్యదిక్కు గురువు అధీనంలో ఉందన్న విషయం గుర్తించాలి.

>>మంత్రి 'ధర్మాన' హటాత్తుగా సంకటస్తితిలో పడ్డాడు. ధర్మం అనేది గురుగ్రహం అధీనంలో ఉంటుంది. అంతేగాక గురువు ఉన్నత అధికారులకు సూచకుడు. ఇది ప్రస్తుత గురుకేతువుల సంయోగం ఫలితమే.  పేరులో ఉన్న ఈ సామ్యం వల్ల అలా జరుగదుగాని, ప్రస్తుత గ్రహస్తితికి సరిపోవడం మాత్రం విచిత్రంగా ఉన్నది.ఉన్నత స్తితిలో ఉన్న అధికారులు హటాత్తుగా పతనం కావడంగా దీనిని గ్రహించాలి.

>>రాజస్థాన్ లోని క్రిష్ణగంజ్ లో ఫుట్ బాల్ మాచ్ లో తలెత్తిన గొడవలో లాటీ చార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగమూ జరిగి, అప్పటికీ ఉద్రేకాలు కంట్రోల్ కాక చివరికి  కర్ఫ్యూ విధించే పరిస్తితికి దారితీసింది. క్రీడలు కుజుని ఆధీనంలో ఉంటాయని గమనించాలి.

>>ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరుస  బాంబులు పేలి ప్రజలు గాయపడ్డారు.

>> మనుషుల మధ్యన మళ్లీ చిన్న విషయాలకే మనస్పర్ధలు గొడవలు అవుతున్నాయి. మాటా మాటా అనుకోవడం జరుగుతున్నది.ఆఫీసులలో ఇళ్లలో ప్రతి చోటా దీనిని గమనించవచ్చు. ఇదంతా ఈ గ్రహ ప్రభావమే. 

మనుషుల మీద గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అని ఈ సంఘటనలు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నాయి.అంతేగాక ప్రాచీనులు ఎంతో దూరదృష్టితో ఏర్పరచిన గ్రహ కారకత్వాలనూ ఈ సంఘటనలు మళ్లీ నిరూపిస్తున్నాయి.