Pages - Menu

Pages

25, అక్టోబర్ 2012, గురువారం

దేశజాతకం -- రవిశని దశ

మన దేశజాతకాన్ని చూచి చాలా నెలలైంది.ఎప్పుడో రవిలో రాహుదశలో స్కాములు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ విషయాన్ని చర్చించాను.మధ్యలో గురుదశ గడిచిపోయింది.ఇప్పుడు శని అంతర్దశ వచ్చింది.వచ్చి కూడా మూడు నెలలైంది. ఒకసారి మళ్ళీ అటువైపు దృష్టి సారిద్దాం.

ప్రస్తుతం జూలై 2012 నుంచి జూన్ 2013 వరకూ రవిదశలో శని అంతర్దశ నడుస్తున్నది.ప్రస్తుతం గోచారంలో కూడా రవిశనులిద్దరూ కలిసి ఉన్నారు.దీని ప్రభావంతో ఈ దశాకాలంలో ఏమి జరుగనుందో చూద్దాం.

**దేశ ప్రతిష్ట దిగజారుతుంది. 
**నాయకులపైన నీలినీడలు పడతాయి.
**పాలకులలో ధైర్యం సన్నగిల్లుతుంది.
**కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం తగ్గదు.
**పాలకులకూ సామాన్యులకూ గొడవలు జరుగుతాయి. 
**ప్రజాపోరాటాలు తలెత్తుతాయి.
**ఆర్ధికరంగం సంక్షోభంలో పడుతుంది.
**అంతా బాగుంది అనుకోవడం భ్రమ అని తెలిసొస్తుంది.
**తాగునీటివల్ల,గాలివల్ల వచ్చే రోగాలు విజ్రుంభిస్తాయి.
**ప్రతి రాష్ట్రంలోనూ అశాంతికర పరిస్థితులు ఉంటాయి.
**నవంబర్ 1నుంచి 18 వరకూ హటాత్ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
**ప్రముఖులమరణం సంభవిస్తుంది.అది సంగీత సాహిత్య రంగంలోనో, క్రీడారంగంలోనో, రాజకీయరంగంలోనో లేక అన్నింటా కావచ్చు.
**నాయకుల పరువు పోతుంది, లేదా సంకటస్తితిలో పడుతుంది (ఇప్పుడు ఉంటేగా కొత్తగా పోవడానికి అంటే చెప్పేదేమీ లేదు)
**మన దేశాన్ని మన పాలసీలు కాకుండా విదేశాలు నడిపిస్తాయి.
**పశ్చిమాన ప్రజావిజయం తొంగిచూస్తుంది.
**పాలకులు ప్రజలకు మేలు చెయ్యడంతప్ప ఇతర గోలంతా చేస్తారు.
**ప్రస్తుతం దేశానికి అర్ధాష్టమ శని జరుగుతున్నందువల్ల మంచి జరగదు.

21, అక్టోబర్ 2012, ఆదివారం

విలువైన జీవితం

మనిషి జీవితం చాలా విలువైనది. ఎంత విలువైనది? అంటే, దాని విలువ ఎంతో మనం గ్రహించలేనంత విలువైనది. తేరగా వచ్చిన వాటి విలువ మనకు తెలీదు.అలాగే మన జీవితాన్నికూడా మనం తేలికగా తీసుకుంటున్నాం. అందుకే దానివిలువ మనకు తెలీదు. విలువ తెలీదు గాబట్టి దాన్ని ఇష్టం వచ్చిన పిచ్చిపనులలో వృధా చేసుకుంటున్నాం.

ఈ విలువతెలీనితనానికి కారణం ఒకటుంది. జననానికి ముందు ఈ జన్మ కోసం మనం ఎంత బాధపడ్డామో,సూక్ష్మలోకాలలో ఎంత వేచి చూచామో, మానవ జన్మఎత్తే ఒక్క అవకాశం ఇమ్మని దైవాన్ని ఎంతగా ప్రాధేయపడి వేడుకున్నామో మనకు గుర్తు లేదు. అదంతా గుర్తొస్తే అప్పుడు మనకు ఈ జన్మ విలువ తెలుస్తుంది. మన తెలివితక్కువతనానికి మన మతిమరుపుకు అప్పుడు మనమీద మనకే అసహ్యం కలుగుతుంది.

లక్షమంది లాటరీ టికెట్లు కొంటే ఒకడికి మాత్రమె లాటరీ తగులుతుంది.ఈ మానవజన్మకూడా అలాంటిదే అని చెప్పవచ్చు.అయితే లాటరీలాగా ఇది తేలికగా తేరగా వచ్చినది కాదు. గత జన్మలో మరణం తర్వాత, ఈ జన్మలో భూమిమీదకు అడుగుపెట్టే మధ్యకాలంలో జీవి పడిన బాధలు గుర్తువస్తే,ఆ వ్యక్తికి మాత్రమె మానవజన్మ యొక్క విలువ తెలుస్తుంది. మిగతావాళ్ళకు తెలియదు. ప్రకృతి ఏర్పరచే మరుపే దానికి కారణం.

నిజానికి మానవులందరూ దైవద్రోహులే. తనకు ఈ జన్మ ఎలా వచ్చిందో మరచిపోయి, సూక్ష్మశరీరంలో ఉన్నపుడు దైవానికి తాను చేసిన ప్రమాణాలు ఒప్పందాలు అన్నీ మరచిపోయి, ఒక్కసారి ఈలోకంలో అడుగు పెట్టిన తర్వాత విజ్రుంభించి ఇంద్రియలౌల్యంలో మునిగే మనుషులను దైవద్రోహులు అనడం చాలా చిన్నమాట అనిపిస్తుంది. కానీ దైవం మనల్ని మళ్ళీమళ్ళీ క్షమిస్తూనే ఉంటుంది. ప్రతిసారీ మరొక్క అవకాశం ఇస్తూనే ఉంటుంది. అదే దైవం యొక్క క్షమ.

మానవ జీవితం వస్తుసంపాదన కోసమూ, ఇంద్రియభోగాల కోసమూ ఉద్దేశించబడింది కాదు. అనంతమైన ఈ సృష్టిలో మానవజన్మకు ఒక ప్రత్యెకమైన అర్హతా విలువా ఉన్నాయి.మానవజన్మ అనేది త్రిశంకుస్వర్గం లాంటిది. త్రిశంకువు పైకీ వెళ్ళలేడు కిందకూ రాలేడు.కాని మనిషి రెండూ చెయ్యగలడు.తెలివితక్కువగా జీవిస్తే జంతువులూ,పక్షులూ,క్రిమికీటకాదుల వంటి నీచజన్మలకు పోగలడు.తెలివితో అంతరిక సాధనలో నడిస్తే దేవతాలోకాలను అందుకోగలడు.చివరికి తానే దైవంగా మారగలడు.అంతటి మహత్తరమైన అవకాశం మానవ జన్మలో ఉన్నది.

మానవజన్మ కోసం అర్రులు చాచే కోటానుకోట్లు జీవులు  సూక్ష్మలోకాలలో ఎన్ని ఉన్నాయో దర్శిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆ దర్శనం పొందినవానికి నోటమాట రాదు.అటువంటి వాటిల్లో అన్నింటికీ రాని అవకాశం కొన్నిజీవులకు మాత్రమె వస్తున్నది. అలాంటి మానవజన్మను ఎత్తిన జీవి, ఆ జన్మను వృధాగా ఈషణాత్రయంలో గడిపి మళ్ళీ ఏడుస్తూ వృధాగా మరణిస్తే దానికి విలువేముంది? ప్రకృతి ఇచ్చిన మహదవకాశాన్ని కాలదన్నుకోవడం తెలివి ఎలా అవుతుంది?

మానవజన్మను ఎత్తినందుకు జీవితానికి ఒక సార్ధకత ఉండాలి.అలాటి సార్ధకతలలో అత్యంత ఉన్నతమైనది ఆత్మసాక్షాత్కారాన్ని, దైవసాక్షాత్కారాన్ని పొందటం మాత్రమే.మనిషి పెట్టుకునే గమ్యాలలో అత్యున్నతమైనవి ఇవి రెండే. మిగతావన్నీ ఉత్త కాలక్షేపం చేష్టలు. అయితే దీనిని ఒప్పుకోడానికి, కోరికలతో అహంకారంతో నిండిన మనిషి మనసు ఏ మాత్రం అంగీకరించదు. ఒకవేళ పైపైకి తలూపినా అంతరాంతరాలలో ఏ మనిషీ ఈ స్టేట్మెంట్ ను ఒప్పుకోలేడు.

సంపాదించడం, సుఖాలను అనుభవించడం, పెళ్లి చేసుకుని పిల్లలను కని వారిని పెంచి పెద్దచేసి ఆస్తులు వారికి అప్పగించడం, లేదా తనకంటే వారు ఇంకా ఎక్కువగా ఆస్తులు సంపాదించేలా చెయ్యడం, తర్వాత తాను మరణించడం -- చాలా మంది వీటినే ఏదో గొప్ప ఘనకార్యాలుగా భావిస్తారు. నిజానికి జంతువులు కూడా ఇవే పనులు చేస్తాయి. జీవితాదర్శాలు ఇవే అయ్యే పనైతే మనిషికీ జంతువుకీ ఏమీ భేదం లేదు. వీటన్నిటికీ భిన్నమైన ఉన్నతమైన ఆత్మావలోకనా ప్రయత్నం చేసిననాడే మానవజన్మకు నిజమైన సార్ధకత. లేకుంటే జంతుజన్మకూ మనజన్మకూ ఏమీ భేదం లేదు. జంతువులు బట్టలు వేసుకోవు, చదువుకోవు, ఉద్యోగాలు వ్యాపారాలు చెయ్యవు. మనం చేస్తాం. అంతే వాటికీ మనకూ తేడా. ఇంద్రియానుభవంలో మనిషికీ జంతువుకూ ఏమీ తేడా లేదు.

బ్రతకడం కోసమూ,తన అహాన్ని తృప్తిపరచుకోవడం కోసమూ,చేసే ప్రయత్నంలోనే మనిషి జీవితంలో మూడుమ్ముప్పాతిక వంతులు వృధాగా గడిచిపోతుంది. అయితే అదే ఏదో ఘనకార్యంగా మనిషి భావిస్తాడు. ఏవో గోల్స్ పెట్టుకుని వాటిని సాధించడం కోసం కష్టపడి అదేదో గొప్ప ఘనకార్యంగా భావిస్తాడు. ఏ గమ్యమూ లేని జీవితంకంటే ఏదోఒక గమ్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేసే జీవితం ఉన్నతమైనదే. కాదనలేము. కాని ఆ గమ్యాలలో కూడా అత్యున్నతమైన గమ్యం ఆత్మసాక్షాత్కారమే. కనుక దానికోసం ప్రయత్నం చేసే మనిషి జీవితం మాత్రమే అత్యుత్తమమైనది.

లౌకికగమ్యాలు ఏవీకూడా మనిషికి నిజమైన తృప్తిని ఇవ్వలేవు.అవి ఎండమావులవంటివి. ఎండమావి కనిపిస్తూ ఊరిస్తూ ఉంటుంది. అక్కడకు పోయి చూస్తే ఏమీ ఉండదు. మరికొంత దూరంలో ఇంకొక ఎండమావి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ మనిషి అక్కడికి పయనం సాగిస్తాడు.ఈ క్రమంలో ఏదో ఒకచోట ప్రాణాలు పోగొట్టుకుని శవంలా నేలరాలిపోతాడు. ఇది జీవితసత్యం.

మనం ఎవరికోసమైతే జీవితమంతా మన విలువైన సమయాన్ని వెచ్సిస్తున్నామో వారికి మనమీద నిజమైన ప్రేమ ఉందనుకోవడం పిచ్చిభ్రమ.ఈ ప్రపంచంలో ప్రేమ అనేది లేనేలేదు.ఇక్కడ ఉన్నదంతా స్వార్ధం మాత్రమే.ఈ స్టేట్మెంట్ కూడా అందరికీ నచ్చదు.కానీ ఒకరికి నచ్చినా నచ్చకున్నా ఇదే అంతిమ సత్యం అని నేను గట్టిగా చెప్పగలను.నాది  పెస్సిమిస్టిక్ యాటిట్యూడ్ అని కొందరు అనుకోవచ్చు.వారి అజ్ఞానానికి జాలిపడటం తప్ప ప్రస్తుతం ఏమీ చెయ్యలేను.ఒకవిషయం మాత్రం చెబుతాను.జీవితసత్యాలన్నీ చేదుగానే ఉంటాయి. అయితే ఈ సత్యం అర్ధం కావడానికి మనిషికి ఒక జీవితకాలం పడుతుంది. ఇదంత త్వరగా అర్ధం కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నతర్వాత గానీ,ఎన్నో ఆశాభంగాలు పొందిన తర్వాతగానీ ఈ చేదునిజం మనిషికి మింగుడు పడదు.అయితే చాలామందికి అప్పటికే జీవితం అయిపోతుంది.ఇక అప్పుడు ఈ సత్యం అర్ధమయ్యీ చేసేదేమీ ఉండదు.

ఈలోకంలో ఇద్దరు మనుషుల మధ్యన బైండింగ్ ఫోర్స్ అనేది రకరకాలుగా ఉంటుంది.అది శారీరిక అవసరం కావచ్చు,ఆర్ధిక అవసరం  కావచ్చు,తప్పని బాధ్యత కావచ్చు,అహంతృప్తి కావచ్చు,సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు,ఇంకేదైనా కావచ్చు..కానీ ప్రేమ మాత్రం ఉండనే ఉండదు.చాలామంది మనుషులు ప్రేమని నటిస్తారు అంతేగాని నిజంగా ప్రేమించలేరు.నిజమైన ప్రేమ అనేది మానవులలో చాలామందికి  అనుభవంలో ఉండదని నా ప్రగాఢవిశ్వాసం. నా ఈ విశ్వాసం వెనుక దాదాపు నలభైఏళ్ల జీవిత పరిశీలన ఉన్నది. ప్రేమికులమని భావించే వారి మధ్యన కూడా ప్రేమ ఉండదనేది నా అనుభవంలో తేలిన నగ్నసత్యం.ఈలోకంలో రాజ్యమేలే రారాజు స్వార్ధం మాత్రమే. స్వార్ధం, ఈర్ష్యా, ద్వేషం, కోపం, కోరికలతో నిండి ఉన్న మనసుకు 'ప్రేమ' అన్న భావం అందనే అందదు. అందుకే మనుషుల్లో చాలామందికి ప్రేమ అనేది తెలియదని నేను బలంగా నమ్ముతాను.

అదలా ఉంచితే,చిన్నతనంలో పిల్లచేష్టలలోనూ,యౌవ్వనంలో చిలిపిచేష్టలలోనూ,నడివయస్సులో బాధ్యతల బరువులోనూ,ముసలి వయసులో మౌనవేదనలోనూ మనిషి జీవితం గడిచి వృధాగా మట్టిలో కలిసిపోతుంది.దీనిని ఎంతోమంది జీవితాలలో గమనించాను.కానీ, ఎందుకోసం ఈ మానవజన్మ వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఏమి చేస్తే జన్మకు సాఫల్యత కలుగుతుందో కూడా ఎవరికీ తెలీదు.ఈలోపు కాలం ఎవరికోసమూ ఆగదు. కాలగతిలో ఎందరి కుత్తుకలో అలా నిర్దాక్షిణ్యంగా తెగిపోతూనే ఉంటాయి. అయోమయంలో మనిషి జీవితం తెల్లవారిపోతూనే ఉంటుంది.

అసలు సింపుల్ గా బ్రతకడం కోసం మనిషి ఇంత కష్టపడాలా? అని ఆలోచిస్తే అక్కర్లేదు అని జవాబు వస్తుంది.నిరాడంబరంగా జీవింఛడానికి మనిషి ఇంతగా శ్రమించనక్కరలేదు.ఇప్పుడు చేస్తున్న శ్రమలో వందో వంతు చాలు. అప్పుడు మిగిలిన సమయాన్ని ఆత్మసాధనకు ఉపయోగించవచ్చు. కాని అలా చేస్తే మనిషికి విలాసాలు దొరకవు. జల్సాలూ ఇంద్రియభోగాలూ  లభించవు. కానీ అలా జీవించాలంటే తెగింపు కావాలి. ఆ తెగింపు ఎందరిలో ఉంటుంది?ఎవరికీ ఉండదు.అందరూ ఈపరుగుపందెంలో పరిగెత్తుతున్నారు. పక్కవాడు పరుగేడుతున్నాడు కనుక తానూ పరిగెత్తాలి.అంతేగాని తాను  ఎందుకు పరిగేడుతున్నాడో ఎవరికీ తెలియదు.

కాబట్టి దీనినిబట్టి ఏమి అర్ధమౌతున్నది?మనిషి వేస్తున్న వేషాలు,పొద్దుట్నించీ రాత్రివరకూ క్షణం తీరిక లేకుండా పరుగులెత్తడం, అవసరాలు తీరినా కూడా ఇంకాఇంకా సంపాదించడం ఇదంతా దేనికోసం?అంటే ఇదంతా విలాసాలు పొందడం కోసం మనిషిచేస్తున్న ప్రయత్నం మాత్రమే అన్నవిషయం చక్కగా కనిపిస్తున్నది. ఇంద్రియలౌల్యతలో మనిషి కొట్టుకుపోతూ దానికి స్వధర్మం అనో,బాధ్యతనో,తప్పదనో ఇంకోటనో ముసుగు తగిలించి ఆత్మవంచనలో కాలం వెళ్లదీస్తున్నాడు.సాయంతానికి నిద్రమాత్రలో ఆల్కహాలో తీసుకుంటే తప్ప రాత్రికి నిద్రపట్టనంత టెన్షన్ పడాల్సిన అవసరం మనిషి జన్మకు లేనేలేదు.ఇదంతా స్వయంకృతాపరాధమే. ఈ పరుగుపందెంలో తలమునకలై ఉన్న మనిషికి అంతరిక సాధన చెయ్యడానికి తీరిక ఏదీ?

ఏది ఎంతవరకు? అన్న విఛక్షణ మనిషికి కలగాలి. దేనికి ఎంత విలువ ఇవ్వాలో మనిషికి తెలియాలి. జీవితంలో ప్రయారిటీస్ అనేవి మనిషికి ఉండాలి.అవి లౌకిక జీవితంలోనో ఉద్యోగంలోనో ఆస్తులు సంపాదించడంలోనో డబ్బు కూడబెట్ట్టడంలోనో మాత్రమే ఉంటే చాలదు.వాటిని మనిషి జీవితం మొత్తానికీ వర్తింపచేసుకోవాలి.అతి ముఖ్యమైన అంతరికసాధనకు అతితక్కువ ప్రయారిటీని మనిషి ఇస్తున్నంతకాలం మనిషిజన్మ వృధా అవుతూనే ఉంటుంది.

రామకృష్ణులు ఒక కధ చెప్పారు.ఒక మనిషి రాజకార్యం నిమిత్తమై రాజధానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ నగరం హంగులూ అక్కడి విలాసాలూ చూస్తూ ఊరంతా తిరుగుతూ తానోచ్చిన పని మరిచిపోయాడు.ఇంతలో చీకటి పడింది. తనకు ఉండటానికి బస లేదు. చీకటిలో చలిలో రాత్రంతా ఆరుబయట ఉండవలసి వచ్చింది.రోజంతా నగరశోభ చూస్తూ బససంగతే మరచిపోయాడు.అంతే గాదు.తను ఏపని మీద అక్కడికి వచ్చాడో కూడా మర్చిపోయి రోజంతా తిరుగుతూ ఉండటం వల్ల, మర్నాడు రాజదండనకు గురయ్యాడు. 

మనిషి జీవితం కూడా ఇంతే.ఏ మనిషి జీవితమైనా అంతిమంగా ఇంతే. జీవిత సాఫల్యతనూ, అంతిమతృప్తినీ ఇచ్చే అంతరిక సాధనను వదిలిపెట్ట్టి మనిషి వృధాగా ఈలోకంలో రకరకాల పనుల్లో తిరుగుతున్నాడు. మానవజన్మ అనేది ఒక మహత్తరమైన అవకాశంగా దైవం చేత మనిషికి ఇవ్వబడింది. ఈ లోకంలోకి మనిషి ఒక ముఖ్యమైన పనిమీద వస్తున్నాడు. కాని వచ్చిన తర్వాత ఆ పనిని మరచిపోయి వృధాగా కాలక్షేపం చేసి నిష్క్రమిస్తున్నాడు. కళ్ళు తెరిచి ఈ విషయాన్ని మొదటగా అతను గ్రహించాలి. 

అనవసరమైన జంజాటనలో మనిషి తన జీవితాన్ని వృధాగా గడుపుతున్నాడుగాని తాను చెయ్యవలసి అసలైన పనిని ఎప్పటికీ వాయిదా వేస్తూ పోతున్నాడు. ఇదే ప్రాధమికంగా మనిషి చేస్తున్న మొదటి తప్పు.ఈ తప్పును గ్రహించి సరిదిద్దుకున్నప్పుడే మనిషి జీవితం సాఫల్యతా మార్గంలో మొదటిఅడుగు వేస్తుంది.అలా చేయ్యనంతవరకూ మనిషి జన్మకూ జంతుజన్మకూ పెద్దగా తేడాలేదు.చేతులో ఉన్న సమయాన్ని వృధా చేసుకొని ముసలివయసులోనో మరణ సమయంలోనో బాధపడితే అప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు.

ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే మనిషి జన్మకు సాఫల్యత. ఆ దిశగా ప్రయత్నం చేయ్యనప్పుడు, మనిషి తన జీవితాన్ని ఇంకెలా గడిపినా అది పూర్తి వృధానే అని చెప్పాలి.

17, అక్టోబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -15

సప్తమిలోపు కదుల్తాయి పీఠాలు 
ప్రజాగ్రహం ముందు తలవంచాలి చీకటిరాజులు 
దశమీ ఏకాదశి చేస్తాయి విచిత్రాలు
మసకబారునింక మహిళా ప్రతిష్టలు

కళ్ళుతెరిచిన ధర్మం నోరుమూసుకోక తప్పదు 
అన్యాయపు పంచన తలదాచుకోక తప్పదు
ప్రజలే అవినీతిపరులైతే ఇంకేం చెయ్యగలం మనం?
ప్రకృతే కన్నుతెరిస్తే తప్పదుగా జనహననం?

ఎన్ని గొంతులు నినదించినా ఎన్ని చేతులు ప్రశ్నించినా
బానిసలకెలా వస్తుంది విముక్తి? పేడిజాతికెలా వస్తుంది శక్తి?
దోచుకోబడటం గొప్పనుకుంటే జనం
అమ్ముడుపోవడమే నీతనుకుంటే జనం   
అలాంటి దేశంలో ఎన్నున్నా ఏం ప్రయోజనం?

16, అక్టోబర్ 2012, మంగళవారం

తులారాశిలో శని సంచారఫలితాలు

శనీశ్వరుడు 15 నవంబర్ 2011  న తులారాశిలో ప్రవేశించాడు.దాదాపు మూడేళ్ళు అంటే 3 నవంబర్ 2014 వరకూ ఈ రాశిలో ఉండబోయే కాలంలో ఆయన గమనస్తితులు ఇలా ఉంటాయి.

I.ఋజుగమనం
(1)15-11-2011 నుండి 7-2-2012 వరకు,  
(2)25-6-2012 నుండి 18-2-2013 వరకు,
(3)8-7-2013 నుండి 2-3-2014 వరకు
(4)21-7-2014 నుండి 3-11-2014 వరకు   
II.వక్రగమనం
(1)8-2-2012 నుండి 24-6-2012 వరకు,
(2)19-2-2013 నుండి 7-7-2013 వరకు,  
(3)3-3-2014 నుండి 20-7-2014 వరకు 
III.నక్షత్రపాద సంచారం
15-11-2011 -- 18-12-2011(చిత్త -3 తులా నవాంశ)
19-12-2011 -- 30-3-2012(చిత్త -4 వృశ్చిక నవాంశ)
31-3-2012 -- 15-5-2012(చిత్త -3 తులా నవాంశ)
16-5-2012 -- 3-8-2012(చిత్త -2 కన్యా నవాంశ)
04-8-2012 -- 11-9-2012(చిత్త -3 తులా నవాంశ)
12-9-2012 -- 11-10-2012(చిత్త -4 వృశ్చిక నవాంశ)
12-10-2012 -- 8-11-2012(స్వాతి -1 ధనుర్నవాంశ)
08-11-2012 -- 7-12-2012(స్వాతి -2 మకరనవాంశ)
08-12-2012 -- 18-1-2013(స్వాతి -3 కుంభనవాంశ)
19-1-2013 -- 21-3-2013(స్వాతి -4 మీననవాంశ)
22-3-2013 -- 9-5-2013(స్వాతి -3 కుంభనవాంశ)
10-5-2013 -- 3-9-2013(స్వాతి -2 మకరనవాంశ)
4-9-2013 -- 7-10-2013(స్వాతి -3 కుంభనవాంశ)
8-10-2013 -- 4-11-2013(స్వాతి -4 మీననవాంశ)
5-11-2013 -- 2-12-2013(విశాఖ -1 మేషనవాంశ)
3-12-2013 -- 4-1-2014(విశాఖ -2 వృషభనవాంశ)
5-1-2014 -- 30-4-2014(విశాఖ -3 మిధుననవాంశ) 
1-5-2014 -- 19-6-2014(విశాఖ -2 వృషభనవాంశ)
20-6-2014 -- 20-8-2014(విశాఖ -1 మేషనవాంశ)
21-8-2014 -- 2-10-2014(విశాఖ -2 వృషభనవాంశ)
3-10-2014 -- 2-11-2014(విశాఖ -3 మిధుననవాంశ)

వివిధ రాశులలో జన్మించినవారికి ఈ శనిగోచారం ఎలా ఫలితాలు ఇస్తుందో వచ్చే పోస్ట్ లలో చూద్దాం.