నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, నవంబర్ 2012, శనివారం

మానవజీవిత గమ్యం -- వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు.

ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన రహస్యంగా చెప్పబడింది. వేదాంతమూ వైరాగ్యమూ యోగమూ ఆయన తన పద్యాలలో సరళంగా బోధించాడు.రసవాదం కూడా రహస్యంగా ఆయన పద్యాలలో చెప్పబడింది."తాళకంబెరుగరో తగరంబు నెరుగరో" అనే పద్యం రసవాద రహస్యమే.అలాంటి పద్యాలు ఇంకా ఉన్నాయి.క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విధానాన్ని గుప్తంగా వాటిలో వేమన వివరించాడు.కాని వాటిని అర్ధంచేసుకున్నవారు తక్కువ.

రసవాదమూ మొదలైన ఇతర భావాలను అలా ఉంచితే,అసలు మానవజన్మకు ఏమి చేస్తే సార్ధకత వస్తుందో వేమన భావాలలో కొంచం పరిశీలిద్దాం.

పశు పక్ష్యాదులవలె ఆహారనిద్రాభయమైదునాలలో వృధాగా గడపడానికి ఉద్దేశించబడింది కాదు మానవజన్మ.మానవజన్మకు ఒక పరమార్ధం ఉన్నది. వృధాగా పుట్టి గిట్టుటకొరకు వచ్చినది కాదు మానవజన్మ. తిరిగి పుట్టనట్టి చదువును చదువుకోవటమే మనిషిజన్మకు పరమార్ధం. జననమరణచక్రం నుంచి విముక్తి పొందగలిగే మహత్తర అవకాశం మానవజన్మకు దైవంచేత ఇవ్వబడింది. కాని దానిని గ్రహించేవారెందరు? కొండొకచో కొందరు గ్రహించినా ఆ మార్గంలో నడిచేవారెందరు? నడిచినా గమ్యాన్ని చేరేవారెందరు? నిరంతరం ఆహార సముపార్జనకు, సుఖలాలసకు అంకితం అయిన మనిషి పరమార్ధాన్ని పొందేది ఎప్పుడు?

పగలు పొట్టకోరకు బహు ధనార్జనచింత
రాత్రి రమణి తోడ రతులచింత
మోక్షచింత ఇంక మూడాత్ముకెపుడురా
విశ్వదాభిరామ వినురవేమ

మోక్షచింత వైపు మనసు పోకుండా తిండి,సంపాదన,భోగలాలసలనే మాయతో మనిషిని కప్పింది జగన్మాత.ఈ మాయను గెలిచినవాడే పరమపదం వైపు అడుగులు వెయ్యగలడు.లేకుంటే ఆ ఊబిలో మునగక తప్పదు.అసువులు బాయక తప్పదు. నిరంతరం ఈషణాత్రయంలో ఈత కొట్టే వారికి ఒడ్డు దొరికేదేన్నడు? రాగద్వేషాలనే వలలో చిక్కినవానికి విముక్తి ఎట్లా దొరుకుతుంది?తమస్సుతో నిండిన మనస్సుకు మోక్షచింత ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎంతసేపూ తిండి,సుఖం వీటిగురించే ఆలోచించే మూర్ఖునికి మోక్షచింత ఎప్పుడు కలుగుతుంది?

వినవలె దశవిధ నాదము 
గనవలె నిర్భేద పదము గాంచిన పైపై 
గనవలె సోహంభావము 
మనవలె పరిపూర్ణమూని మదిలో వేమా      

యోగాభ్యాసపరుడై లోలోన వినిపించే పదిరకాల నాదాలను వినాలి. దానిని మించినట్టి చెక్కుచెదరని గట్టిదైన భూమిని చూడాలి. దానినికూడా దాటి సోహం భావమున ప్రతిష్టితుడై పరిపూర్ణమైన బ్రహ్మపదమును సాధకుడు చేరుకోవాలి. అప్పుడే అతని జన్మకు పరిపూర్ణత.సాధనాపరుడై పరమపదాన్ని అందుకున్నపుడే మనిషి జన్మకు ధన్యత.అది లేకుంటే ఎన్నెన్ని వేషాలు వేసినా అన్నీ చివరకు వృధా అవక తప్పదు.

వ్యాపించి యున్న లోకము 
ప్రాపించక గురుని వేడి బహుతంత్రముగా 
దీపించి మనసు నిల్పుము 
రూపంబగు బట్టబయలు రూఢము వేమా

చిత్ర విచిత్రమైన హంగులతో నిండిన ఈ లోకాన్ని లెక్కించక సద్గురువైనవాడిని  సమీపించి తంత్రోక్తమైన అతని ఉపదేశము పైన మనసు నిల్పితే అంతా తేటతెల్లముగా కనిపిస్తుంది. మనిషికి ప్రధమ కర్తవ్యం ఇదే. కాని మానవులు ఇదిమాత్రం వదిలిపెట్టి తక్కిన అన్నింటినీ చక్కగా ఆచరిస్తున్నారు.అందుకే సంసార సాగరంలో మునిగి మరణిస్తున్నారు గాని దరిచేరేవారు ఒక్కరూ లేరు. మాయామోహాలతో నిండిన ఈ లోకం మనిషిని ఎంతో ఆకర్షించి అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి ఒక బానిసలా వాడుకుంటుంది. ఆ బానిసత్వమే ఆనందం అన్న భ్రమలో మనిషి గానుగెద్దులా జీవిస్తూ తన ఆయువు హరించుకు పోవడాన్ని గమనించడు. ఈ భ్రమ నుండి మనిషి బయటపడి సద్గురుప్రోక్తమైన  సాధనామార్గంలో నడక సాగించాలి. అప్పుడే అతనికి సత్యం సాక్షాత్కరిస్తుంది.

లోకము తను 'ఛీ' యనగా 
లోకము తా 'ఛీ' యనంగ లోకములోనే 
ఏ కర్మల నోనరింపక 
లోకములెంచంగ ముక్తిలోకము వేమా

లోకవిధానాలను తాను ఏవగించుకోవాలి. అనగా తనకు లోకవాసనలపైన విరక్తి కలగాలి. లోకమూ తనను అసహ్యించుకోవాలి. అంటే సమాజపు కుళ్ళుపోకడలకు విరుద్ధమైన సత్యమార్గంలో తాను నడవాలి. లోకాన్ని తాను  ఛీకోడితే లోకమూ తనను 'ఛీ' అంటుంది.అంటే లోకరీతికి భిన్నమైన మార్గంలో సాధకుడు నడవాలి.అటువంటి స్తితిలో ఉంటూ,కర్మను క్షయింపచేసుకునే రహస్యయోగమార్గాన్ని అనుసరించి,తద్వారా లభించినట్టి  యోగసిద్ధితో, సమస్త లోకాలను సాక్షిగా తిలకించగలిగితే అదే ముక్తి.

రానిది కోరిన రాదది
రానున్నది కోరకున్న రానేవచ్చున్ 
తానెంత చింత చేసిన 
కానున్నది కాకపోదు గదరా వేమా 

తనకు యోగం లేకపోతే ఎంత కోరుకున్నా అది దక్కదు.అలాగే,తనకు రాసిపెట్టి ఉంటే ఎంత వద్దనుకున్నా అది అనుభవించక తప్పదు.కనుక తానెంత చింతించినా కానున్నది కాకమానదు.రానున్నది రాకమానదు. జరుగనున్నది జరుగక మానదు.ఇది అంతిమ సత్యం.దీనిని గ్రహించి ఆచరించగలిగినవాడు ధన్యుడు.అటువంటివాడు ఒక రమణమహర్షిగా రూపు దిద్దుకుంటాడు. జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇదే భావాన్ని"అనుకున్నది జరగదు.తనకున్నది తప్పదు"అని చెప్పారు.మహనీయులు ఎవ్వరైనా ఇదే సత్యాన్ని ఎన్నో మార్లు చెప్పారు.కాని మూడత్వంతో నిండియున్నవానికి ఇది తలకేక్కుతుందా? ఎక్కదు.అందుకే లోకంలో జ్ఞానులు కొందరే ఉంటారు.మిగిలినవారు మిడుతల దండులే.పుట్టలోని చెదలే.

మాయల సంసారముకై 
మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా 
మాయను మదిలో దలచిన 
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా 

ఈ మాయదారి సంసారమోహంతో నిండిన మానవుడు మాయ అనే బురదగుంటలో పడిన పందిలాగా దొర్లుతున్నాడు. మాయాస్వరూపాన్ని తన మనసులో చింతనచేత చక్కగా అర్ధం చేసుకుంటే, ఆ మాయలో నుంచే ముక్తి అనే మార్గం చక్కగా కనిపిస్తుంది. కాని మాయను ఆనందిస్తున్న మనుజునికి మాయపై మనసు విరిగేదేన్నడు?సాధనామార్గంపైన మనసు నిలిచేది ఎప్పుడు? అసలలా జరిగే అవకాశం ఉన్నదా?

జ్ఞాననిష్ఠ బూని మేను మరచువాడు 
కామిగాడు మోక్షగామి గాని 
నియమ నిష్ఠలుడిపి నిర్గుణమ్మందురా
విశ్వదాభిరామ వినురవేమ 

జ్ఞానకాంక్షి యైనవాడు మొదటిలో నియమ నిష్టలను ఎన్నో ఏళ్ళు పాటించాలి. తర్వాత జ్ఞాననిష్టను బూని నియమనిష్టలకు అతీతుడై సర్వాతీతమైన నిర్గుణపదవిని అందుకోవాలి.ఇదే మనిషి యొక్క ప్రధమకర్తవ్యం.అంతే కాదు.ఇదే మానవ జీవితపు నిజమైన గమ్యం కూడా. దీనిని సాధించినవాడే నిజమైన మానవుడు. అతని జన్మ మాత్రమే సార్ధకమైన జన్మ.