నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, డిసెంబర్ 2012, సోమవారం

తెలుగు వారోత్సవాలు- లెట్స్ స్పీక్ ఇన్ టేల్గూ ఓన్లీ

మొన్నొకరోజు ఒక స్నేహితుని నుంఛి ఫోనొచ్చింది.

'తెలుగు వారోత్సవాలలో భాగంగా సభలు జరుగుతున్నాయి.మీ ఫ్రెండ్ మాంత్రిక స్వామి కూడా వస్తున్నాడు.నువ్వూ అటెండ్ అవుతావా?'

సామాన్యంగా ఇలాంటి తూతూ మంత్రపు తంతులు నాకిష్టం ఉండవు. ఎందుకంటే ఇలాంటివి జరిపే వారికీ,హాజరయ్యేవారికీ చిత్తశుద్ధి ఎక్కడా ఉండదు.అంతా అహంకార ప్రదర్శనకోసమో,లేకపోతే నెట్ వర్కింగ్ ద్వారా గుంపును పోగేసుకోవడం కోసమో చేస్తుంటారు.ఇలాంటివి పాతికేళ్ళ క్రితమే చూచీ చూచీ విసుగు పుట్టింది.కాని ఏదో స్నేహితుడు పిలిచాడుకదా అని సరే అనుకున్నాను.

'అటెండ్ అవను.వస్తాను.నువ్వు వెళుతున్నది తెలుగు వారోత్సవాలకు. కనీసం ఇప్పుడైనా చక్కని తెలుగు మాట్లాడరా.అటెండ్ ఏమిట్రా నీ బొంద.' అన్నాను.

అనుకున్న సమయానికి వాళ్ళింటికి వెళ్ళాను.వాడి శ్రీమతి ఎదురొచ్చింది.

'ఏడమ్మా వీడు?' అడిగాను.

ఆమె నవ్వుతూ 'గంట నుంచీ పంచె కట్టుకొవడంతో కుస్తీ పడుతున్నారు' అంటూ టీ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది.ఇదొక గోల.తెలుగు భాష అంటే చాలామందికి ముందుగా పంచె గుర్తుకొస్తుంది.

నేను హాల్లో కూచుని ఉండగా కాసేపటికి పంచెని సర్దుకుంటూ బెడ్రూమ్ లోంచి బయటకి వచ్చాడు. 

వాడి అవతారం చూస్తె నాకు నవ్వాగలేదు.'ఎక్కడన్నా కోలాటం ప్రోగ్రాం ఉందేమిట్రా?ఎవరు కట్టార్రా ఈ పంచె' అడిగాను. ఇంతలో వాడి వెనుక నుంచి ఒక బక్కపలచని శాల్తీ బయటకొచ్చింది.

'ఈయన పేరు కొండల్రావు. కోలాటం స్పెషలిస్టు.మన 'నైబర్.' చెప్పాడు వాడు.

'అందుకని నీకూ కోలాటం పంచె కట్టాడా? నీ చేతిలో రెండు కోలాటం కర్రలూ,చెవులో ఒక నెమలి పించెం పెడితే వేషం సరిగ్గా ఉంటుందిరా.' అన్నాను నవ్వుతూ.

'బాలేదంటావా?' అన్నాడు.

'ఎందుకు బాలేదు.ప్రాంగణంలో సరాసరి వెళ్లి కోలాటం గుంపులో కలిసిపోవచ్చు. ఒరేయ్. పంచె కట్టులో చాలా రకాలున్నయిరా.వెళ్లి సరిగ్గా కట్టుకొని రా.'అన్నాను.

'మరి నాకు రాదుగా.నా జన్మలో ఒకటో రెండో సార్లు మాత్రమె పంచె కట్టాను.అదికూడా ఎవరో కట్టారు.' అన్నాడు.

'సరే మామూలుగా పేంటూ షర్టూ లో రా.'అన్నాడు.

'అలా వస్తే తెలుగు వేషంలా ఉండదురా. ఈ రోజన్నా కొంచం నటించాలిగా' అంటూ నిజం ఒప్పుకున్నాడు.

'సరే పద నే కడతాను'.అంటూ వాడిని బెడ్ రూమ్ లోకి తీసికెళ్ళి చక్కగా పంచె కట్టి తీసుకోచ్చేసరికి అరగంట పట్టింది. ఎంత కట్టినా ఆ పంచె ఊడిపోతుంటే చివరికి బెల్ట్ పెట్టి దానిని బిగించి కట్టవలసి వచ్చింది.

వాడి శ్రీమతి ఇచ్చిన టీ తాగి ప్రాంగణానికి చేరుకున్నాం. అప్పటికే పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడకు చేరుకుంటున్నారు. 'హలో' 'హాయ్' 'గుడ్మానింగ్' అంటూ చేతులెగరెయ్యడాలు తప్ప చక్కగా చేతులు జోడించి 'నమస్కారం'అన్న మాటే ఎక్కడా వినిపించడంలేదు.వీడు VIP ల గుంపులో చేరిపోయాడు.నేను ప్రేక్షక సీట్లలో కూచుని అందరి వాలకాలూ చక్కగా చూస్తున్నాను.

ఎక్కణ్ణించో కాలేజీ అమ్మాయిలను పరికిణీ ఓణీలు కట్టి తీసుకొచ్చారు.ఆ డ్రస్సులు పాపం వాళ్ళు మర్చిపోయి చాలా ఏళ్ళయినట్లుంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు.తోరణాలు బేనర్లూ అన్నీ అట్టహాసంగా కట్టి ఉన్నాయి.సన్నాయి సీడీ మైకులో చక్కగా మోగుతోంది.

ప్రార్ధనా గీతాలూ గట్రాలు అయిపోయాక ఉపన్యాసాలు మొదలయ్యాయి. ప్రధాన వక్త మైకందుకున్నాడు.

'టుడే వి హావ్ గేదర్డ్ హియర్ టు సెలబ్రేట్ తెలుగు వారోత్సవాలు.' అని సంకర భాషలో ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆ దెబ్బకి నేను భావాతీత స్తితికి చేరుకొని ఏ విధమైన స్పందనా లేనట్టి స్తితిలో కెళ్ళిపోయాను.

'మన భాష తెలుగు భాష.టుడే ఇట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్.దీనిని మనం ప్రోమోట్ చెయ్యాలి.ICU లో ఉన్న ఈ యాన్షిఎంట్ లాంగ్వేజీని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ప్రౌడ్ గా నడిరోడ్డుమీద నిలబెట్టాలి' అన్నాడు.ఆయన భావం ఏమిటో నాకస్సలు అర్ధం కాలేదు.'బట్టలతోనా బట్టలు లేకుండానా' అని అడుగుదామని నోటిదాకా వచ్చింది.

'మన లాంగ్వేజీలో మంచి పోయెట్స్ చాలామంది ఉన్నారు. తిక్కన, ఎర్రన, కాళిదాసూ,శ్రీనాధుడూ,విశ్వనాధ సత్యనారాయణ,వేమనా,సిపీ బ్రౌన్ ఇంకా చాలామంది.' అన్నాడు.

నాకు చుక్కలు కనిపించాయి.కాళిదాసూ,వేమనా,బ్రౌనూ తెలుగు కవులు ఎప్పుడయ్యారా అని తెగ ఆలోచించాను.కానీ ఏమీ అర్ధం కాలేదు.నన్నయ ఏమైపోయాడో కూడా తెలీలేదు.నిలువు గుడ్లేసుకుని అలా చూస్తున్నాను.

'ఈనాడు మన తెలుగువాళ్ళు అమెరికాలో వేగంగా ముందుకెళుతున్నారు. అక్కడ డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నారు.ఈవెన్ దే ఆర్ ఎంటరింగ్ పార్లమెంట్ ఇన్ అమెరికా' అని చప్పట్ల మధ్య ఉద్ఘోషించాడు.

అమెరికాలో పార్లమెంట్ ఎక్కడుందో మళ్ళీ నాకేమీ అర్ధం కాలేదు.'మనవాళ్ళ కులగజ్జినీ, అమెరికాలో కులసంఘాలనూ,వారి మధ్య ఉన్న కుళ్ళు రాజకీయాలనూ కూడా చెబితే బాగుంటుంది కదా' అనుకున్నాను.

'మన పొరుగునున్న తమిళ సోదరులను చూసైనా వి హావ్ టు వేకప్. అదర్వైజ్ వి హావ్ నొ ఫ్యూచర్.లెట్ట్ అజ్ మార్చ్ ఫార్వార్డ్ టు మేక్ తెలుగు ఎ రియల్ గ్లోబల్ లాంగ్వేజ్.' అంటూ ముగించాడు. ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.

ఇంకొకాయన మైకందుకున్నాడు.

'తెలుగు లేనిదే భారత దేశం లేదు.' అంటూ ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలా చెబుతాడా అని చూస్తున్నాను.

'మన జాతీయ జెండా 'డిజైన్' చేసిన పింగళి వెంకయ్య తెలుగువాడు. పెన్సిలిన్ 'డిస్కవర్'చేసిన సుబ్బారావు తెలుగువాడు.మనకు ప్రైమ్మినిష్టర్ చేసిన నరశింహారావు తెలుగువాడు. ఆర్బీఐ గవర్నర్ తెలుగువాడు. అమెరికాలో కేన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు తెలుగువాడు.'అంటూ ఏమేమో చెబుతున్నాడు. 

నాకు మళ్ళీ కళ్ళు బైర్లు కమ్మాయి.వారి వారి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోడానికి వాళ్ళ కృషీ,పట్టుదలా,అదృష్టమూ కారణాలవుతాయి. అంతేగాని అందులో వాళ్ళ మాతృభాష యొక్క పాత్ర ఏమిటో మళ్ళీ ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు. ఇక అక్కడ కూచోవడం అనవసరం అనిపించింది.

ఇలా కాదని, లేచి ప్రాంగణం లోనుంచి బయటపడ్డాను.మెల్లిగా ఇంటిదారిన నడక మొదలు పెట్టాను.

ఇది ప్రభుత్వ నిధులతో జరపబడుతున్న తంతు గనుక ఎదో మొక్కుబడిగా ఈ సమావేశాలు పెట్టారు. ఇందులో ఒక్కడికీ చక్కని తెలుగు మాట్లాడదామని లేదు. సగం ఇంగ్లీష్ మాటలూ సగం తెలుగు మాటలూ కలిపి మన టీవీలలో,రేడియోలలో కులికే వగలాడి యాంకరమ్మల పుణ్యమా అని సంకర భాష సమాజం మొత్తాన్నీ కలుషితం చేసి పారేసింది. ఇంగ్లీషు వాడు వెళ్ళిపోయిన 60 ఏళ్ళ తర్వాత టీవీల ద్వారా మళ్ళీ ఇలా భాషాపరంగా దండెత్తి మనమీదకు వస్తున్నాడు. వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు కూడా ఇంత ఇంగీషు పిచ్చి మనలో లేదేమో అని నా సందేహం. అప్పుడు కూడా విదేశాలకు వెళ్లి చదువుకున్నవారున్నారు. కాని వారు ఇంగ్లీషును ఇంగ్లీషుగా చక్కగా మాట్లాడేవారు. తెలుగును తెలుగుగా మాట్లాడేవారు. రెండూ మంచి భాషలే. కాకపోతే కలగాపులగంగా కలిపి కాకుండా దేనిని దానిగా స్వచ్చంగా మాట్లాడితే వినడానికి ఇంపుగా ఉంటాయి. అదే ప్రస్తుతం లోపిస్తున్నది.ప్రస్తుతం మంచి తెలుగు మాట్లాడేవాడూ లేడు. మంచి ఇంగ్లీషు మాట్లాడేవాడూ లేడు.అంతా సంకరమయం.

ముందుగా ప్రతివాడూ తెలుగును తెలుగుగా మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి. ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా మధ్యలో రాకుండా అచ్చతెలుగు మాట్లాడే పట్టు పట్టాలి. అప్పుడే మన భాష మళ్ళీ బ్రతుకుతుంది. లేకుంటే ఇలా చిత్తశుద్ధి లేని చెత్త సమావేశాలు ఎన్ని పెట్టుకున్నా అవి వేదికలెక్కి ఒకరినొకరు ఉబ్బెసుకునే ఉత్త తంతులేగాని వీటివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.  

అలా నడుస్తూ ఒక సందులోనుంచి వస్తున్నాను.ఒక పాత కాలం ఇల్లు ముందుగా వస్తుండగా ఒక సన్నివేశం కనిపించింది.ఇంటి ముందు బాగా ఖాళీ చోటు ఉన్నది. అందులో ఒక నులక మంచంలో ఒక పెద్దాయన పడుకొని ఉన్నాడు. ఆయనకీ దాదాపు 65-70 ఏళ్ళు ఉండవచ్చు. పక్కలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు.వాడికి మూడో నాలుగో ఉంటుంది.'శ్రీరాముని దయచేతను' అంటూ ఆ పిల్లవాడికి పద్యం నేర్పిస్తున్నాడు ఆ ముసలాయన.

కాసేపు ఆయన పద్యం ఎలా నేర్పిస్తున్నాడా అని వింటూ అక్కడ ఆగిపోయాను. రెండు సన్నివేశాలు నా కళ్ళముందు కనిపించాయి. ఒకపక్క చిత్తశుద్దిలేని సమావేశాలు,మైకుల్లో అరుపులు,కాని నిత్యజీవితంలో ఆచరణ శూన్యం. ఇంకో పక్క చడీచప్పుడు లేకుండా,లోకం మెప్పు ఏమాత్రం కోరకుండా,సహజంగా మాతృభాషతో బాటు నైతిక విలువలను రంగరించి అతి చిన్నతనంలోనే ఒక భవిష్యత్ పౌరుణ్ణి తీర్చిదిద్దుతున్న నిరాడంబర ప్రయత్నం. చాలా ముచ్చటేసింది.

లోకంలో విలువైన సంఘటనలన్నీగుర్తింపుకు దూరంగా,ఏ పటాటోపమూ లేకుండా, మౌనంగానే జరుగుతాయేమో అని అనుకుంటూ ఇంటివైపు నడక సాగించాను.