Pages - Menu

Pages

22, జనవరి 2013, మంగళవారం

శని రాహు యోగం -2 (ఆంధ్రా తెలంగాణా గొడవలు)

ఆంద్రదేశం గురించి మనకు తెలిసినంత వెనుకనుంచి నేటి తెలంగాణారాష్ట్ర ఉద్యమం వరకూ సంఘటనలను ప్రభావితం చేస్తున్న గ్రహస్తితులను పరికిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి.వాటిని పరిశీలిద్దాం.

కుజుడు దక్షిణ భారతదేశానికీ ముఖ్యంగా ఆంద్రరాష్ట్రానికీ సూచకుడు.దక్షిణ దిక్కుకు ఆయనే అధిపతి అని మనకు తెలుసు.ఇకపోతే రాహుశనుల కలయిక శపితయోగం అవుతుందనీ మనకు తెలుసు.ఆంద్రదేశం మీద విశ్వామిత్రుని శాపం ఉన్నదని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఎందుకంటే ఆయన ఒకానొక సమయంలో ఆంద్రదేశం గుండా వెళుతున్నపుడు ఇక్కడి ప్రజలు ఆయన మునివేషాన్ని చూచి ఎగతాళి చేశారని,ఆయనకు తిండీ నీరూ ఇవ్వకుండా వేధించారనీ దానికి ఆయన కోపించి ఈనేలను శపించాడని ఒక గాధ ఉన్నది.కనుక ఆంద్ర ప్రాంతాన్నిశపితభూమి గానే పరిగణించాలి.

రామాయణ కాలంలో ఆంద్ర ప్రాంతాన్ని దండకారణ్యం అనేవారు.శ్రీరాముని ఎదిరించిన ఖరుడు దూషణుడు మారీచుడు ఇక్కడివారే.అప్పుడీ ప్రాంతం అంతా రావణుని ఏలుబడిలో ఉండేది.రావణుడు ఈ ప్రాంతాన్ని తన చెల్లెలు శూర్పణఖకు ఆమె వివాహసమయంలో స్త్రీధనంగా ధారాదత్తం చేసాడు. అప్పుడీ ప్రాంతం అంతా భిల్లులూ,ఆచారరహితులైన అడవి జాతులూ, రాక్షసులూ నివసిస్తూ తపస్సు చేసుకునే శాంత స్వభావులైన ఋషులను నానాబాధలూ పెడుతూ ఉండేవారు. సీతాపహరణం కూడా ఇక్కడే జరిగిందని మర్చిపోరాదు.కనుక ఇది శాపభూమే.పవిత్రమైన నదుల లిస్టులో మన కృష్ణానది ఎక్కడా లేదన్న సంగతి గమనించాలి.కృష్ణానదీ తీరాన్ని ప్రాచీనులు నిందితభూమిగా పరిగణించేవారు.బహుశా అక్కడివారు బౌద్ధాన్ని ఆదరించడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.  

దానికి నిదర్శనంగానే మిగతా రాష్ట్రాలకున్నట్లు మనకంటూ ఒక సంస్కృతి లేదు.ఒక ప్రధాన దైవం లేదు.ఒక ప్రధానమైన సంగీతమూ,నాట్యమూ,కళా, సంస్కృతీ ఏవీ తెలుగువారికి లేవు(ఒక్క పంచెకట్టు తప్ప). పంచె కట్టు కూడా బెంగాలీలను కాపీకొట్టి మనం నేర్చుకున్నదే కావచ్చు.మన వ్యవహారమంతా ఇతర రాష్ట్రాలనూ ఇతర ప్రాంతాలనూ అనుకరణే.నా మాటను రుజువు చెయ్యడానికి నేటి అయ్యప్పదీక్షలనూ,షిరిడీయాత్రలనూ మించిన ఉదాహరణ ఇంకొకటి అవసరం లేదు.చివరికి మన సినిమాలు కూడా మొదటినుంచీ చాలావరకూ హిందీ సినిమాలకు,ఇంగ్లీష్ సినిమాలకూ అనుకరణలే. ఆంధ్రావాడికి సొంత వ్యక్తిత్వం విశ్వామిత్ర ఋషిశాపం తోనే పోయింది అని నా భావన.

త్యాగరాజు మావాడు అని చెప్పుకోవడమూ,కూచిపూడి మా నాట్యం అని చెప్పుకోవడమూ,రామప్ప దేవాలయం మాది అని చెప్పుకోవడమూ,ఆంద్ర నాట్యం మాది అని చెప్పుకోవడమూ తప్ప అవేమిటో ఎలా ఉంటాయో చాలామంది తెలుగువారికి ఏమీ తెలియవు. త్యాగరాజును ఆదరించింది తమిళదేశం.ఆయనే గనుక మన ఆంధ్రాలో పుట్టి ఉన్నట్లయితే నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోయి ఉండేవాడు. కూచిపూడి నాట్యానికి ఒక గుర్తింపు తేవడానికి ఆయా గురువులందరూ కృష్ణాజిల్లా నుంచి మద్రాస్ పోయి స్కూళ్ళు పెట్టుకోవలసి వచ్చింది.రామప్ప దేవాలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉంటె పట్టించుకునేవారు లేరు.ఇక ఆంద్రనాట్యం గురించి నటరాజ రామకృష్ణ శిష్యులకు తప్ప మనకు ఎవరికీ ఏమీ తెలియదు.సిద్ధేంద్ర యోగి పేరు చెప్పినా జాయప సేనాని పేరు చెప్పినా 'వాడెవడు' అని అడిగే స్తితిలో ఉన్నాం మనం.

మన తెనుగుభాష అంటే కూడా మనకు పెద్దగా అభిమానం ఏమీ ఉండదు.వాడుక లేక చాలా అచ్చతెనుగు పదాలు చచ్చిపోయాయన్నది చేదునిజం.మన పోరుగువారైన తమిళులకూ,కన్నడిగులకూ, మలయాళీలకూ వారివారి ప్రత్యేకమైన భాషాభిమానమూ,సంస్కృతీ ఉన్నాయి.ఏ ప్రత్యేకతా ఏ అభిమానమూ లేనిది మనకే.రాష్ట్రాన్ని చేతనైనంత దోచుకోవడమూ, చేతకాకుంటే రెండుముక్కలుగా చీల్చుకోవడమూ,లేకుంటే అమెరికా పోయి అక్కడ కులసంఘాలు పెట్టటం ఒక్కటే మనకు చాతనైన విద్య.చివరకు తెలుగు భాషా ఉత్సవాలు రాష్ట్ర రాజధానిలో జరుపుకోవడానికి ధైర్యం చాలక తిరుపతిలో పెట్టుకున్న ఘనత మనది.కనుక మనది శాపగ్రస్త రాష్ట్రమే అని చెప్పక తప్పదు.

కనుక ఈ శాపగ్రస్తరాష్ట్రానికి శపితయోగానికీ సంబంధం ఉండటం అనేది తార్కికంగా తోస్తుంది.కనుకనే మన ఆంధ్రాప్రాంతంలో అతి ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రతిసారీ శని,రాహువు,కుజుల పాత్ర చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది మన రాష్ట్రంలో ఒక ముఖ్య సంఘటన.1982 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కూడా శని రాహువుల మధ్యన ఖచ్చితమైన కేంద్రదృష్టి ఉన్నది.ఆ సమయంలో శని కన్యా రాశిలోనూ రాహువు మిధున రాశిలోనూ  28 డిగ్రీల మీద సంచరించారు. రాహువు గురు నక్షత్రంలోనూ శని కుజ నక్షత్రంలోనూ ఉండటం చూడవచ్చు.రాహువు ఉచ్చస్తితిలో ఉండటమూ గురు నక్షత్రంలో ఉండటమూ చూస్తె ఆ పార్టీ యొక్క జాతకం అర్ధమౌతుంది. 

ఇలాంటి సత్యాలను మరిన్ని గ్రహించడానికి చరిత్రలోకి ఒకసారి తొంగి చూద్దాం.   

1707 లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొగలాయీ సామ్రాజ్యం వేగంగా క్షీణించింది.దేశంలోని దూరప్రాంతాల పైన డిల్లీ సింహాసనం తన పట్టును కోల్పోయింది.ఆ సమయంలో శని రాహువులు వృషభ రాశిలో 7 వ డిగ్రీ పైన కృత్తికా నక్షత్రంలో సంచరించారు.ఆ విధంగా శపితయోగం ఒక్కసారి కళ్ళు తెరిచి ఆంద్ర ప్రాంతానికి తనదైన ప్రభావాన్ని చూపించింది.కృత్తిక శకనక్షత్రం.కనుక ఔరంగజేబ్ మరణంతో దేశంలో ఒక శకం ముగిసింది.  

1724 లో మరాఠా వీరులతో యుద్ధాలలో మునిగి ఉన్న మొగలాయి చక్రవర్తి దక్కన్ ప్రాంతం పైన పట్టును పూర్తిగా కోల్పోయాడు. దానిని అదనుగా తీసుకుని అప్పటివరకూ మొగలాయీల పరిపాలనలో ఉన్న దక్కన్ ప్రాంతాన్ని 'అసఫ్ జా' అనేవాడు ఆక్రమించి తనను 'నిజాం ఉల్ ముల్క్' గా ప్రకటించుకున్నాడు. ఇది చరిత్ర చదివిన ఎవరికైనా తెలుసు.కాని ఈ సంఘటనల వెనుక రాహుశనుల పాత్ర ఉన్నదని,శపితయోగ ప్రభావం ఉన్నదనీ ఎవరికీ తెలియదు.ఎంతటి చక్రవర్తులైనా గ్రహాలకు లోబడి నడువవలసిందే.దీనికి మినహాయింపు ఎవరికీ ఉండదు.

1724 చివరా 1725 మొదట్లో శని ధనూరాశిలో 22 డిగ్రీల మీద సంచరించాడు. రాహువు మేషరాశిలో 22 డిగ్రీల మీద  ఉన్నాడు.కనుక వీరిద్దరి మధ్యనా కోణదృష్టి ఏర్పడింది. కుజుడు మూలా నక్షత్రంలో సంచరిస్తూ శనితో కలిసి ధనూరాశిలోనే ఉన్నాడు. కనుక ఆ సమయంలో శపితయోగం ఏర్పడింది.అందుకే ఆంద్రప్రాంతం మొగలాయీల పాలనలో నుంచి విడిపోయి ఇంకొక చీలికకు గురయి, నిజాం పాలనలోకి వచ్చి పడింది.

అక్టోబర్ 1948 లో రాహువు మేషం లోనూ,శని సింహం లోనూ 9 డిగ్రీల మీద సంచరించారు. వీరిద్దరి మధ్యనా మళ్ళీ కోణదృష్టి ఏర్పడి శపితయోగం మళ్ళీ కళ్ళు తెరిచింది.కనుక ఆ సమయంలో సర్దార్ పటేల్ చొరవ వల్ల 'పోలీస్ యాక్షన్' జరిగి హైదరాబాద్ సంస్థానం బారతదేశంలో లీనమైంది.ఆ సమయంలో కుజుడు వ్రుశ్సికంలో శని నక్షత్రంలో ఉన్నట్లు గమనించవచ్చు. కనుకనే దేశం నడిబొడ్డున ఉన్న ఆంద్రప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిజాం నిర్ణయించుకోవడమూ,దానికి బ్రిటన్ సహాయం కోరడమూ,మన ప్రభుత్వం దీనిని వ్యతిరేకించడమూ మొదలైన ప్రకంపనలతో యుద్ధ వాతావరణం ఏర్పడింది.

1956 లో భాషాప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణా ఆంధ్రా ప్రాంతాలు కలిసి ఆంద్రప్రదేశ్ గా అవతరించింది. ఆ సమయంలో శని రాహువులు మళ్ళీ ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో వృశ్చికరాశి 7 డిగ్రీల మీద కలిసి ఉన్నారు. ఇది అనూరాధా నక్షత్రం అవుతుంది. కనుక శపితయోగం మళ్ళీ కళ్ళు తెరిచింది. ఇది మనోకారకుడైన చంద్రునికి నీచరాశి గనుక తీవ్రమైన గొడవల మధ్యన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.

సెప్టెంబర్ 2009 లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రకటింపబడినప్పుడు మళ్ళీ శని రాహువులు ఖచ్చితమైన డిగ్రీ దృష్టిలో ఉన్నారు. శని కన్యారాశిలోనూ రాహువు మకరరాశిలోనూ 2 డిగ్రీల మీద ఆ సమయంలో సంచరించారు. కనుక వీరిద్దరి మధ్యనా మళ్ళీ కోణదృష్టి ఏర్పడింది. రాజ్య కారకుడైన సూర్యుని నక్షత్రాలలో ఉత్తరా,ఉత్తరాషాడలలో వీరిద్దరూ సంచరించడం గమనార్హం.

ఇప్పుడు మళ్ళీ శని రాహువులు తులారాశిలో అతి దగ్గరగా ఉన్నారు.కనుక తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతున్నది. సెప్టెంబర్ 2013 లో వీరిద్దరూ 15 డిగ్రీల మీద స్వాతి నక్షత్రంలో సంచరిస్తారు. అదే సమయంలో దక్షిణ దిక్కుకూ ఆంద్రరాష్ట్రానికి సూచకుడైన కుజుడు కటకరాశిలో నీచ స్తితిలో ఉంటూ శని రాహువులతో కేంద్రదృష్టి లోకి వస్తున్నాడు. కనుక ఆ సమయానికి ఆంధ్రా తెలంగాణా విడిపోయే ప్రక్రియ పూర్తి కావచ్చు. కాని గొడవలు తప్పవని,ఇదంతా తేలికగా జరిగే ప్రక్రియ కాదని శని రాహు కుజుల కారకత్వాలు సూచిస్తున్నాయి.

రాబోయే పౌర్ణమి 26-1-2013 న రిపబ్లిక్ డే సందర్భంగా వస్తున్నది. అదే సమయంలో కుజుడు మకరరాశిని వీడి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు. కనుక ఆ సమయానికి కొంచం అటూ ఇటూగా తెలంగాణా ప్రకటన వెలువడవచ్చు.కానీ ప్రక్రియ మొత్తం పూర్తి గావడానికి కొన్ని నెలలు పట్టి సెప్టెంబర్ ప్రాంతానికి మళ్ళీ శనిరాహువులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లోకి వచ్చినపుడు అది నెరవేరవచ్చు.

ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యమైన మార్పులు జరిగిన ప్రతిసారీ వాటిపైన శనిరాహువుల పాత్రా కుజునిపాత్రా ఖచ్చితంగా ఉన్నది.ఇది ఖగోళంలో  కనిపించే సత్యం.ఆయా సమయాలలో శపితయోగం కళ్ళు తెరవడం జరిగింది.ఇది కాకతాళీయం ఎలా అవుతుంది? ప్రతిసారీ ఒకే గ్రహస్తితి ఎందుకుంటుంది? కనుక శపితయోగ ప్రభావం ఆంధ్రా మీద ఉన్నది అనడం  సత్యం.ప్రస్తుతం మళ్ళీ ఆ యోగం నడుస్తున్నది.దీని ఫలితంగా ఏమి జరుగబోతున్నదో త్వరలో తెలుస్తుందిగా. వేచి చూద్దాం.