నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, జనవరి 2013, సోమవారం

పండుగలలో అంతరార్ధాలు

గత రెండు రోజుల నుండి నాకు పండుగ శుభాకాంక్షలు చెప్పిన వారిలో కొందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను.కాని ఒక్కరు కూడా జవాబు చెప్పలేక బిక్కముఖం వేస్తున్నారు.

సంక్రాంతి పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మీరెందుకు ఈ పండుగ జరుపుకుంటున్నారు? అనేది ఆ ప్రశ్న.అందరూ ఈ పండుగను ధూమ్ ధాం గా చేసుకుంటున్నారు.కాని దీని అంతరార్ధం ఎవరికైనా తెలుసా? నేనడిగిన వారిలో ఎవరూ సరియైన జవాబు చెప్పలేకపోయారు.

ఈపండుగకు సామాజికంగానూ, ఋతువులపరంగానూ, వ్యవసాయపరం గానూ,జ్యోతిష్యపరంగానూ,ఆధ్యాత్మికపరంగానూ అర్ధమూ ప్రాముఖ్యతా ఉన్నాయి.వాటిని మరచి క్లబ్బులో ఎగరడానికి ఈ పండుగను మనం ఆచరిస్తే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.

భోగి రోజునైతే పరిస్తితి ఇంకా ఘోరంగా ఉంది.ఈ రోజున ఏదో ఒకటి తగలబెట్టాలి గామోసు,లేకపోతే ఏదో చెడు జరుగుతుందేమో అన్నస్తితికి దిగజారిన జనం,ఏదీ దొరక్కపోతే ఇంట్లో ఉన్న చెత్తకాగితాలు తెచ్చి వాటిని మంటబెట్టి ఆమంట చుట్టూ ఎగురుతున్నారు.ఎందుకు మంట పెడుతున్నారో దానిచుట్టూ ఎందుకు ఎగురుతున్నారో ఒక్కరికీ తెలీదు. పక్కవాడు ఎదో మంట పెట్టాడు, మనమూ ఎదో ఒకటి తగలబెట్టకపోతే వాడింటికి పొయ్యే లక్ష్మి మనింటికి రాదేమో అన్న భయంతో కొందరు గుడ్డిగా ఈ తంతును అనుకరిస్తున్నారు. ఈ పిచ్చి జనాన్ని చూస్తుంటే 'పులిని చూచి నక్క మంట పెట్టుకున్నట్లు' అని పాత సామెత కొంచం మారి గుర్తుకొస్తున్నది.

ప్రతిదానికీ అర్ధాలు తెలుసుకోవడం ఎందుకు? హాయిగా పండగలు ఎంజాయ్ చేస్తే పోలా?అని కొందరు అనుకుంటారు.అది అజ్ఞానజనితమైన భావన.అసలు పండగలన్నీ ఎంజాయ్ చెయ్యడం కోసం మాత్రమె ఉద్దేశించబడినవి కావు.'ఎంజాయ్ చెయ్యడం' అనేది మన దేశపు భావన కాదు.ఇది పాశ్చాత్య భావన.ఎందుకంటే వాళ్ళ జీవిత పరమావధి అదే.కాని మన భారతీయ జీవిత పరమావధి అదొక్కటే కాదు.దానితో బాటు ఇంకా ఉన్నతమైన గమ్యం మనకుంది.నిజమైన ఎంజాయ్మెంట్ అనేది మనకే తెలుసు.ఎందుకంటే మన ఎంజాయ్మెంట్ తాటాకుమంటలా భగ్గుమని ఆరిపోయే ఎంజాయ్మేంట్ కాదు.ఇది చాలా లోతైనది,ఎల్లకాలం నిలిచి ఉండేది,అద్భుతమైన తృప్తిని ఇచ్చేదీనూ.అలాంటి ఎంజాయ్మెంట్ ఎలా పొందాలో మనకు తెలుసు.'తినుము త్రాగుము సుఖించుము'-ఇదే జీవితం అనుకునే పాశ్చాత్యులకు నిజమైన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో అస్సలు తెలీదు.పాశ్చాత్య భావజాలదాసులైన భారతీయులకూ అది తెలీదు.అందుకే వారి జీవితాలు కూడా ఎంత సంపాదించినా ఏదో అసంతృప్తితోనే కునారిల్లు తుంటాయి.భారతీయమూలాల వైపు వారు మళ్ళీ దృష్టి సారిస్తేనే వారికి ఆ తృప్తి ఏమిటో అర్ధమౌతుంది.

మనం చేసే ప్రతిపనికీ అర్ధాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనమేం చేస్తున్నామో ఎటు పోతున్నామో మనకు తెలీదు.అలాంటిది మన పండుగలకే మనకు అర్ధాలు తెలీకపోతే ఎలా?

అంతరార్ధాన్ని మరచి ఒక పండుగను మనం ఊరకే తిని తాగి ఎగరడానికీ,సాయంత్రానికి సినిమాకో పబ్బుకో బారుకో పోవడానికీ  ఉపయోగించుకుంటే అది శవానికి అలంకారం చెయ్యడం వంటిది.దురదృష్ట వశాత్తూ మన పండుగలు అన్నీ అలాగే తయారయ్యాయి.గుడ్డిలో మెల్ల ఏమంటే,కనీసం కొన్ని పండుగలన్నా ఇంకా బ్రతికి ఉన్నాయి. అంతరార్ధాలు మరచిపోయినా,వాటిని ఇంకా మనం విడిచి పెట్టకుండా చేసుకుంటున్నాం. అదే కొంతలో కొంత సంతోషం.

అర్ధం తెలిసి ఆ పండుగలను చేసుకునే ఎంత బాగుంటుందో మనం ఆలోచించాలి.కనీసం ఇతర మతాల వాళ్ళు అడిగితే చెప్పడానికైనా మనకు మన మతం గురించి తెలియాలి కదా? ఆలోచించండి.