నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, జనవరి 2013, సోమవారం

అసౌకర్యానికి చింతిస్తున్నాను

సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ సందర్భంగా గత మూడురోజులుగా హైదరాబాద్ లో ఉన్నాను.పాటలు పాడటం,ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ పాడటం, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సోలో సాంగ్స్ సెక్షన్ లో, "తెరే ఘర్ కే సామ్నే" చిత్రంలో నుంచి మహమ్మద్ రఫీ పాడిన 'దిల్ క భవర్ కరే పుకార్' అనే పాటను ఈ సందర్భంగా స్టేజి పైనుంచి ఆలపించాను.

మా డివిజన్ నుంచి 'మాయాబజార్' అని ఒక స్టేజి డ్రామా వేశాము. అందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాను. 'డబ్బు ప్రధానం కాదు మానవత్వం ప్రధానం'- అనే సందేశం ఈ డ్రామా ద్వారా ఇచ్చాం. కధ క్లుప్తంగా ఇలా ఉంటుంది.

ఓపెనింగ్ సీన్ లో ఒక శవం నడిరోడ్డుమీద పడి ఉంటుంది. ఒక లాయరూ,పోలీసు కానిస్టేబులూ,రాజకీయ నాయకుడూ అక్కడ చేరి దానిమీద వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు కోసం కుట్ర చేస్తుంటారు.ఈలోపల టీ అమ్ముకునే ఒక సామాన్యుడిని లాయర్ ఒప్పించి ఆ శవం తన అన్నదిగా క్లెయిం చెయ్యమని నటనకు ఒప్పిస్తాడు.కాని పోలీస్ ఈ ప్లాన్ కనిపెడతాడు.ఇంతలో ఒక విలేఖరి వచ్చి ఆ శవాన్ని తన స్నేహితుడైన సూర్యం గా గుర్తిస్తాడు.సూర్యం ఒక నిజాయితీ పరుడైన ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఈ సమాజంలో బ్రతకలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అది ఆత్మహత్య అయినా కూడా దానిని ఒక ఏక్సిడెంట్ గా చిత్రించి దుష్ట త్రయం ముగ్గురూ డబ్బుకోసం నాటకం ఆడుతుంటారు. అలా వాదనలు జరుగుతున్న నేపధ్యంలో సామాన్యుడైన టీ అమ్ముకునే వ్యక్తి మనసు మారి వారు ముగ్గురుకీ ఎదురు తిరుగుతాడు. టీ కొట్టు వాడూ,విలేఖరీ చెప్పిన డైలాగ్స్ తో ఈ ముగ్గురికీ కనువిప్పు కలిగి కొనఊపిరితో ఉన్న సూర్యాన్ని ఆస్పత్రికి తీసికెళ్ళడానికి ఉద్యమిస్తారు. ఇదీ కధ.

ఈ ప్రోగ్రాములలో ఉన్న కారణం చేత గత మూడురోజులుగా మిత్రుల మెయిల్స్ కు జవాబులివ్వలేక పోయాను.రైల్వే అనౌన్స్ మెంట్ లాగా "అసౌకర్యానికి చింతిస్తున్నాను" అని చెప్పాలి.హైదరాబాద్లో ఉన్న మిత్రులు వచ్చి కలుస్తామంటే కూడా కలవలేకపోయాను.అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.