నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, జనవరి 2013, బుధవారం

మాయా ప్రపంచం తమ్ముడూ..

ఒక మిత్రుడు మొన్నీమధ్యన జరిగిన ఒక సంగతి చెప్పాడు. అతను ఒక ప్రసిద్ధ యోగాగురువుకి శిష్యుడు. నరసరావుపేటలో ఈ మధ్యనే వాళ్ళొక కేంప్ జరిపారు.అందులో 'నాడీపరీక్ష' జరిపి రోగులకు ఆయుర్వేద మందులిస్తారు.రోగి స్తితిని బట్టి ఆహార విహారాదులలో జాగ్రత్తలు చెబుతారు. అంతవరకూ బాగానే ఉంది.

కానీ ఆ కేంప్ కు దాదాపు పదిమంది ఇంగ్లీషువైద్యులు వచ్చి వారంతా నాడీపరీక్ష చేయించుకోవడమే గాక, వారి బాధలు తగ్గడానికి ఆయుర్వేద మందులు కూడా తీసుకువెళ్ళారు. అదీ విచిత్రం.

'నాడీ పరీక్ష ఎలా చేస్తారు?దానితో రోగి తత్వాన్ని ఎలా కనుక్కుంటారు? ఏ స్కానింగులూ చెయ్యకుండానే రోగి యొక్క వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? అనే విషయం మీద మీకు ఉత్సుకత ఉంటె నాడీపరీక్ష ఎలా ఉంటుందో చూడడంకోసం వచ్చి ఉండవచ్చు.కాని మా మందులు మీరెందుకు తీసుకుంటున్నారు? మీ మందులు మీకున్నాయి కదా' అని వాళ్ళను క్యాంప్ నిర్వాహకులు అడిగారు. దానికి వారు చెప్పిన జవాబు వింతగా ఉంది.

'we dont want to fill our bodies with synthetic drugs that have poisonous side effects' అని వారు జవాబిచ్చారు. ఇది ఒకరకంగా మంచి పరిణామమే.ఇష్టం వచ్చినట్లు పచారీకొట్లో పప్పుల మాదిరి నేడు డాక్టర్లు వాడిస్తున్న మందులవల్ల ప్రజల శరీరాలలో తీవ్రమైన విషపరిణామాలు కలుగుతున్నమాట వాస్తవం.కానీ ఒక రోగికి ఇరవైరకాల మందులు వ్రాసి వాడమని చెప్పే డాక్టరు, తనకు రోగమొస్తే తానుమాత్రం వాటిలో ఒక్కటి కూడా వాడడు.ఎందుకంటే వాటివల్ల కలిగే చెడు పరిణామాలు అతనికి బాగా తెలుసు. ఎంతైనా తన ప్రాణం తనకు తీపి కదా.

అందుకే డాక్టర్లు మాత్రం తెలివిగా హెర్బల్ మందులూ, యోగా, రోజూ వ్యాయామం చెయ్యడమూ,ఆహార నియమాలూ మొదలైనవి పాటిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ జాగ్రత్తగా ఉంటున్నారు.రోగులకు మాత్రం పప్పు బెల్లాల మాదిరి యాంటీ బయోటిక్స్, కార్టిజాన్స్ వాడిస్తున్నారు. పోతే పొయ్యేది రోగే కదా.అడిగేవాడూ లేదు చెప్పేవాడూ లేడు.మన దేశంలో డాక్టర్లను కట్టుదిట్టం చేసే చట్టాలు ఏమీ లేవు.ఒకవేళ పేపర్ మీద ఉన్నా ఆచరణలో ఎక్కడా కనిపించవు.కనుక ట్రీట్మెంట్ లో ఏ రకమైన పొరపాట్లు చేసినా డాక్టర్లు మనదేశంలో చక్కగా తప్పించుకోగలుగుతారు.మన చట్టాలు నేరస్తులకూ, డాక్టర్లకూ చుట్టాలు. భారతీయడాక్టరు ఎవరికీ,కనీసం తాను ట్రీట్మెంట్ ఇస్తున్న రోగికి కూడా,ఎట్టి పరిస్తితిలోనూ జవాబుదారీ కాడు.

మా స్నేహితుడు ఇదే మాట ఆ డాక్టర్లను అడిగాడు. దానికి వారు చెప్పిన జవాబు ఇంకా కళ్ళు బైర్లు కమ్మించేలా ఉంది.

'అవునండి.మేం డిగ్రీ తీసుకుని బయటకు రావడానికి కోటి రూపాయలు అవుతున్నది.ఈలోపు పదేళ్ళు పడుతున్నది. మాకేమో అప్పటికే మధ్యవయసు వచ్చేస్తున్నది. ఆ కోటి రూపాయలు వడ్డీతో సహా చూసుకుంటే రెండు కోట్లు అవుతుంది. ఆ రెండు కోట్లు మేమెప్పుడు రాబట్టుకోవాలి? ముందా రెండు కోట్లు రాబట్టుకుంటే ఆ తర్వాత దానిపైన వచ్చేదేకదా మా అసలైన సంపాదన? కనుక ఒక పేషంటు మా వద్దకు వస్తే టెస్ట్ లని మందులని అవనీ ఇవనీ చెప్పి ఒక లక్షకు అతన్ని టార్గెట్ చేస్తాం.ఒకవేళ కొంచం తెలివైన పేషంట్ అయితే ఏభై వేలతో సరిపెడతాం.ఇంకా తెలివైన పేషంట్ అయ్యి,రికమెండేషన్ తో వస్తే ఒక పాతికవేలకు సర్డుకుంటాం. అలా చెయ్యకపోతే మేం ఖర్చు పెట్టిన డబ్బు ఎలాతిరిగి రాబట్టుకోవడం?

'మరి ఈ క్రమంలో మీరు వాడే మందులతో రోగుల ఒళ్ళు గుల్ల అయినా మీకేం పట్టదా?'

'ఇక అవన్నీ ఆలోచిస్తూ కూచుంటే మేం దుకాణం మూసుకోవలసిందే.ఎవరి ఖర్మ వారిది.పొయ్యేవాడు ఎలాగూ పోతాడు.దానికి మేమేం చెయ్యగలం చెప్పండి. ప్రతిరోజూ యాక్సిడెంట్లలో కొన్ని వేలమంది పోతున్నారు.దానికీ మేమే బాధ్యులమా?'

'మరి మీకు రోగమొస్తే అవే మందులు మీరు వాడటం లేదుగా? అది కరెక్ట్ కాదు కదా?'

'భలేవారు సార్.ఇది మా ఒళ్ళు. మా జాగ్రత్తలు మేం తీసుకోవాలిగా.అది వృత్తి. ఇది పర్సనల్ జాగ్రత్త. అవసరం అయితే తప్ప మందులు వాడకూడదనీ చీటికీ మాటికీ మందులు వాడితే ఒళ్ళు గుల్లౌతుందనీ మాకు తెలుసు.అందుకే సాధ్యమైనంత వరకూ ఆహారనియమాలూ,వ్యాయామమూ వీటితో నెట్టుకు రావడమే అత్యుత్తమం." అని ఆ డాక్టర్లు అందరూ ముక్త కంఠంతో వాక్రుచ్చారు.

ఈ స్నేహితుని బంధువులలో ఒకరికి ఇలాగే ఏదో సీరియస్ అయితే హైదరాబాద్లో పేరుగాంచిన ఒక ఆస్పత్రిలో చేర్చారట.ఆ ఆస్పత్రి పేరు వద్దులెండి.అందరికీ తెలిసినదే.వారు 20 రోజులపాటు రోగిని అక్కడ ICU లో ఉంచుకుని 16 లక్షలు బిల్లేసి చివరికి ఒక రోజున "ఇంకో నాలుగు లక్షలు రెడీ చేసుకోండి అర్జంటుగా ఒక ఆపరేషన్ చెయ్యాలి" అని చెప్పారట.'ఈలోపల వీళ్ళ అదృష్టం బాగుండి ఆ రోగి హరీమనడంతో ఆ నాలుగు లక్షలూ మిగిలాయి. లేకుంటే 20 లక్షలు కట్టి బాడీని తెచ్చుకోవలసి వచ్చేది'అని నావద్ద చెప్పి వాపోయాడు.

ఇదీ నేటి డాక్టర్ల బాగోతం."వైద్యో నారాయణో హరి:" అన్నదాన్ని 'అయ్యా వైద్యనారాయణా(నీచేతిలో పడితే మాపని)హరీ'అని మార్చి చదువు కోవలసిన పరిస్తితి నవీనకాలపు వైద్యులవల్ల వచ్చింది.అన్ని రంగాలలో లాగే వైద్యరంగంలో కూడా కనిపించని అవినీతి విలయతాండవం చేస్తున్నది.

కాని ఒక్క వైద్యులను మాత్రమె తప్పు పట్టలేము.ప్రజల అక్రమ సంపాదనను వదిలించి వారి ఖర్మను దారి మళ్ళించే పని డాక్టర్లు చేస్తున్నారు.ఈ కర్మచక్రంలో వారి పాత్ర వారూ చక్కగా పోషిస్తున్నారు.జీవచక్రంలో స్కావెంజింగ్ స్పిషీస్ కొన్నుంటాయి.కర్మచక్రంలో ప్రస్తుతం ఆ పాత్రను డాక్టర్లుకూడా పోషిస్తున్నారు.జాతకదోషాలు పోగొట్టే పనిలో భాగంగా నువ్వులదానం తీసుకుని అది కడుక్కోడానికి నానాతిప్పలూ పడే బ్రాహ్మణులలాగా,నేటి ప్రజల అక్రమసంపాదనను ప్రక్షాళన చేసే బృహత్తర కార్యక్రమంలో డాక్టర్లను ఈ రకమైన పాత్రదారులుగా చేసి ఈ వింతాటను నడిపిస్తున్నాడు పరమేశ్వరుడు.

ఒక నది అనేక మలుపులు తిరుగుతూ పైనించి కింద పడుతూ, మళ్ళీ లేస్తూ , ఈ లోపల అడవుల్లోంచి కొండల్లోంచి గుట్టల్లోంచి రకరకాల మార్పులతో ఎలా ప్రయాణం చేస్తుందో అలాగే రకరకాలైన మార్పులతో నడుస్తున్న ఈలోకంలోని ప్రజల కర్మగతిని చూస్తూ అర్ధం చేసుకుంటూ వినోదించడమే మన పని.అంతకంటే ఇక మనం ఏమీ చెయ్యలేము.చెప్పినా వినే స్తితిలో కూడా ఎవరూ లేరు.ఇదంతా ఏదో వినాశనంతోనే ముగిసేలా కనిపిస్తున్నది.

ఇదంతా చూస్తుంటే 'మాయా సంసారం తమ్ముడూ...ఇది మాయా సంసారం తమ్ముడూ...నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడూ' అనే పాత పాట ఒకటి గుర్తొస్తున్నది.