Pages - Menu

Pages

13, ఫిబ్రవరి 2013, బుధవారం

త్యాగయ్య నాదోపాసన -1 (మనం మరచిపోయిన సత్యమార్గం)

'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ' అన్నట్లు సంగీత రసానికి స్పందించని జీవి ఉండదంటే అతిశయోక్తి కానేరదు.శిశువులు పశువులు గానానికి ముగ్డులౌతారని మనకు తెలుసు.కాని విషజీవి యగు సర్పము కూడా గానరసానికి దాసోహం అంటుందంటే వింతగా ఉండవచ్చు. నమ్మశక్యం గాకపోవచ్చు.ఇందులోని నిజానిజాలను అలా ఉంచి, పిండితార్ధాన్ని గ్రహిస్తే,చరాచర సమస్త ప్రకృతీ సంగీతానికి స్పందిస్తుందనే భావం ఇందులో కనిపిస్తుంది. ఇది వాస్తవమే.

సంగీతానికి రెండు ప్రయోజనాలున్నవని భారతీయ సాంప్రదాయం చెబుతుంది. ఒకటి శ్రోతల మనస్సును రంజింప చెయ్యడం.రెండు గాయకునికి భగవద్దర్శనాన్ని కలిగించడం. మొదటిది ప్రజ్ఞ. రెండవది సాధన. మొదటిది పాండిత్యం.రెండవది ఉపాసన. సంగీతంలో పాండిత్యం ఉండటం వేరు.సంగీతోపాసన వేరు.సంగీత పండితులందరూ నాదోపాసకులు కాలేరు.గాయకులందరూ త్యాగరాజులూ కాలేరు.అలా అవ్వడానికి సంగీత పాండిత్యంతోబాటుగా సాధనాబలం కూడా తోడవ్వాలి.అమితమైన పాండిత్య ముండి కూడా దానిని లౌకికావసరాలు తీర్చుకోవడం కోసం కాకుండా భగవద్ ప్రీతి కోసం ఉపయోగించి నాదమును భగవద్రూపముగా ఉపాసన గావించి తరించిన మహానుభావుడు త్యాగరాజస్వామి.

సందర్భం వచ్చింది గనుక ఇక్కడ కొన్ని మరుగున పడిన వాస్తవాలు గమనిద్దాము. ఏ జాతి అయినా దానియొక్క మహనీయులను ఆ జాతికి సాంస్కృతిక ధార్మికభిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషమూ పాపమూ అవుతుంది.ఆ పాపఫలితాలు చాలా సూక్ష్మంగానూ తరతరాల పాటు వెంటాడేవి గానూ ఉంటాయి.మనం కూడా తెలిసో తెలియకో చేస్తున్న అటువంటి పాపం ఒకటి ఉన్నది - అదే దేవర్షియగు నారదముని నింద.

నారదమహర్షి మామూలు ఋషి కాదు.ఆయన దేవఋషి. మానవ ఋషులే వారి శాపానుగ్రహ శక్తితో మనిషి తలరాతను మార్చగల సమర్ధులు.ఇక దేవఋషి అయిన నారదుని మహత్యము చెప్పలేము.ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగా గ్రహించలేదని నా ప్రగాఢమైన నమ్మకము.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన జాతికి భిక్ష పెట్టిన ఇద్దరు మహామహితాత్ములున్నారు.ఒకరు శ్రీమద్రామాయణ కృతికర్త యగు వాల్మీకిమహర్షి.వేరొకరు శ్రీమద్భాగవతమును రచించిన వేదవ్యాసమహర్షి. మన భారతజాతికి వీరే పరమగురువులు.ఒకరు ధర్మ స్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే,ఇంకొకరు లీలామానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకు అందించారు.ఈ రెండు గ్రంధములున్నంత వరకూ భారత జాతీ,మతమూ సంస్కృతులు నిలిచి ఉంటాయి.కనుక వీరే మనకు పరమ గురువులు.

ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమొనర్చి వారు సంకటస్తితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారతజాతికి ఈ రెండు అమూల్యములైన గ్రంధములను ప్రసాదించిన పరమగురువు నారదమహర్షి. కనుక మనము పొద్దున్న లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారదమహర్షిని మాత్రమె.ఆ నారదుని దివ్యస్తితి ఎట్టిది? ఆయనకు మనవలె లౌకికవాంచలు జంజాటములు లేవు.నిరంతరమూ నారాయణుని దివ్యనామాన్ని గానం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ మూడు లోకాలలోనూ ఎక్కడా అడ్డు లేకుండా సంచరించగల పరమభక్తుడు నారదరుషి.పరమానంద ధామమైన వైకుంఠమునకు కూడా తలచినప్పుడు పోగల శక్తి సంపన్నుడు.సాక్షాత్తు భగవంతుని వద్ద అంతటి చనవు ఉన్నట్టి ప్రేమభక్తి తత్పరుడు.

రామ మంత్రమును తిరుగదిప్పి మూర్ఖుడైన అడివి మనిషికి ఉపదేశం ఇచ్చి వానిని వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందించిన సిద్ధసంకల్పుడు నారదమహర్షి.పురాణ ఉపపురాణాదులను రచించినప్పటికీ ఏదో తీరని వేదనతో బాధపడుతున్న వ్యాసమునీంద్రునికి దర్శనం ఇచ్చి ఆయనను ఊరడించి,ఉపాయమును ఉపదేశించి, అమృతోపమానమైన భాగవత సుధను వ్యాసుని ముఖతః లోకానికి ప్రసాదించిన మధుర భక్తాగ్రేసరుడు నారదమౌని.దర్శనమాత్రం చేత సమస్త బాధలనూ పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్యరూపుడు నారద మహర్షి.సంగీతశాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు గాని ఆయనను మించిన మధుర గాయకులు గాని ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. అటువంటి దేవర్షికి మనం ఇస్తున్న మర్యాద ఏమిటో ఒకసారి చూద్దాం.

మన నాటకాలలో కథలలో సినిమాలలో ఆయనను ఒక జోకర్ గా, తగాదాలు పెట్టె తంపులమారిగా,ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ ఘోరమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం.కలహభోజనుడు,మాయలమారి మొదలైన బిరుదులిచ్చి ఆయన్ను అపహాస్యం చేశారు మిడిమిడి జ్ఞాన సంపన్నులైన మన రంగస్థల చలనచిత్ర మూర్ఖ శిఖామణులు.మన ధర్మానికి పరమ గురువైన నారదమహర్షికి,మనం ఇస్తున్న విలువ ఇది. ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి మనం ఇస్తున్న మర్యాద ఇది.ఎదో రకంగా డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకే ఉన్నతాదర్శమూ లేని మనలాంటి ఆత్మాభిమానహీన జాతికి ఇంతకంటే ఇంకేమి చేతనవుతుంది? కనుకనే మన దౌర్భాగ్యం ఇలా తగలడింది. 

మన తల్లినీ తండ్రినీ ఎవరైనా ఎగతాళి చేస్తే,నిందిస్తే మనకు ఎంతటి కోపం వస్తుంది? ఒకవేళ మనమే వారిని నిందిస్తే అదెంత తప్పు? అలాంటప్పుడు ఈ జాతికి ధార్మికభిక్ష పెట్టిన ఒక మహర్షిని మనం ఎంతగా గౌరవించాలి? అది చెయ్యడంపోయి,ఆయన్ను ఒక వెకిలిమనిషిగా చిత్రీకరిస్తూ,హీనమైన బిరుదులిచ్చి ఆనందిస్తూ,మనం ఎంత మహాపరాధం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి.ఈ పాపానికి కారణం మన సినిమాలూ,వాటిని నిర్మిస్తున్న క్షుద్రజీవులే.

సంగీతాన్ని కూడా భగవద్దర్శనానికి సాధనామార్గంగా ఉపయోగించవచ్చని ప్రపంచానికి తెలిపినది మన భరతదేశపు భక్తి సంప్రదాయమే.ఇతర మతాలకు సంగీతం యొక్క ఈ మహత్వం తెలియదు.క్రైస్తవం కొంత పరవాలేదు.అందులో కీర్తనలు ఆలాపిస్తూ భగవంతుని వేడుకోవడం ఉంటుంది.అది భక్తిమార్గమే.కాని సాంప్రదాయ ఇస్లాం మాత్రం సంగీతాన్ని నిషేధిస్తుంది.అది సైతాన్ మార్గం అని దాని ఉద్దేశ్యం.మళ్ళీ ఇస్లాంలో సాధనా మార్గాలైన సూఫీ సాంప్రదాయాలలో సంగీతాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఎందఱో సూఫీ మహాత్ములు 'ఖవ్వాలీ'అనే సంగీత ప్రక్త్రియను ఆదరించారు.కాని ఇస్లాంలోని పిడివాదులు సంగీతాన్ని అంగీకరించరు. వారి దృష్టిలో సంగీతం ఒక దైవద్రోహం.

సంగీత సాధనతో భగవంతుని దర్శనాన్ని పొందవచ్చు అని చెప్పడమే గాక దానిని నిరూపించి చూపినది హిందూమతమే.దానికి తార్కాణంగా ఎందఱో మహనీయులు ఈ మార్గంలో నడిచినవారు మన మతంలో కనిపిస్తారు.సిక్కు మతంలో కూడా సంగీతానికి ప్రాధాన్యత ఉన్నది.

సంగీతం మనిషి మనస్సును అలవోకగా ఆకట్టుకుంటుంది.పాడేవారినీ వినేవారినీ కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయేట్లు చేసే శక్తి సంగీతానికి ఉన్నది.అటువంటి సంగీతంతో భగవంతుని కథలనూ గుణగణాలనూ తదేకంగా గానం చేస్తే అది అతిసులభంగా భగవంతుని ధ్యానంగా మారుతుంది.ఆ క్రమంలో చంచలమైన మనస్సు పరమ నిశ్చలతను పొందుతుంది.అటువంటి నిశ్చలమైన భక్తిపూరితమైన మనస్సులో భగవంతుని దర్శనం తప్పకుండా కలుగుతుంది. ఇది నారద మహర్షి ఈ ప్రపంచానికి ఇచ్చిన భిక్ష.దీనికి శరీరాన్ని హింసించే ఉపవాసాలు,ప్రాణాయామాలు,యోగాభ్యాసాది కఠినసాధనలు ఏవీ అవసరంలేదు.ఇవేవీ అవసరం లేకుండా చాలా సులభంగా మనిషి మనస్సును సాధనామార్గంలో ప్రవేశపెట్టే శక్తి సంగీతానికి ఉన్నది.

అటువంటి మహత్తరమైన మార్గాన్ని మనకందించిన నారదమహర్షిని మనం ఒక హాస్యగాడిగా పరిగణిస్తూ,నిత్యమూ ఎగతాళి చేస్తూ మహాపాపాన్ని తలకెత్తుకుంటున్నాం.ఆ పాపఫలితం ఎలా ఉంటుందంటే కళ్ళెదుట కనిపిస్తున్న సులభమైన సత్యమైన దారి మనకు కనపడకుండా చేస్తుంది. ఏవేవో పిచ్చిపిచ్చి దారులలో పరిభ్రమించేలా చేస్తుంది. సత్యమార్గం నుంచి మనలను దూరం చేస్తుంది ఈ పాపం.

నారదమహర్షి చూపిన ఈ సులభమైన సత్యమార్గంలో ప్రయాణించి తరించిన పరమ భాగవతోత్తములు ఎందఱో ఉన్నారు. మధ్యయుగాలలో మహారాష్ట్రలో ఉద్భవించిన భక్తతుకారాం,భక్త కుంభార్,భక్త రవిదాస్,భక్త సూరదాస్ మొదలైన మహానుభావులందరూ నారదప్రోక్తమైన భక్తిసంగీత మార్గంలో నడచిన ఘనులే.సిక్కుల ప్రధమగురువైన గురునానక్ ఈ దారిలో నడచినవాడే.వారందరినీ మన తరం మరచిపోయింది.వారికి ఆదిగురువైన నారదమహర్షినీ మరచిపోయింది.ఇదొక శాపం.మన ప్రాచీన మహర్షులు మహానుభావులను మనం మరచిపోవడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు.ఏ జాతి అయినా తన పూర్వులను విస్మరిస్తే అది చెట్టు తన వేర్లను మరచిపోయినట్లు అవుతుంది.అప్పుడా చెట్టు జీవాన్ని కోల్పోతుంది.ప్రస్తుతం మన పరిస్తితి కూడా అలాగే ఉంది.

'కృష్ణలీలా తరంగిణి' రచించిన పరమ భాగవతోత్తముడు గుంటూరు జిల్లా 'కాజ' గ్రామానికి చెందినవాడు అయిన నారాయణతీర్ధులు, పూర్వులైన మహాభక్తుల సంస్మరణ గావిస్తూ 'ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ట విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి' అంటారు.

వీరి కోవలోకి చెందిన మహనీయులే భక్త జయదేవుడు, రామదాసు, అన్నమయ్య,క్షేత్రయ్య,నారాయణ తీర్ధులు,సదాశివ బ్రహ్మేన్ద్రులు. వీరందరూ ప్రాచీనులు. కాని వీరిదారిలో నడచి రాగరాగిణీ విద్యను ఆమూలాగ్రం ఔపోసన పట్టి కర్నాటక సంగీతాన్ని పరిపుష్టం చేసిన నాదోపాసకులు, నాదసిద్ధులు అయిన సంగీతత్రిమూర్తులు త్యాగరాజు,శ్యామశాస్త్రి, ముత్తుస్వామిదీక్షితులు వీరు ముగ్గురూ మొన్నమొన్నటి వారే.మనకు చాలా దగ్గరవారే.వీరే కాక వీరి అనుచరులూ మహనీయులే,ఘనులే. ఉదాహరణకు త్యాగరాజస్వామికి పరమభక్తురాలైన 'బెంగుళూర్ నాగ రత్నమ్మ' పేరును చెప్పుకోవచ్చు.లోకం దృష్టిలో దేవదాసి అయి ఉండి ఒక వేశ్యగా ముద్ర పడినప్పటికీ మహత్తరమైన ఆశయానికి జీవితాన్ని అర్పించి పైన ఉదాహరించిన ప్రాతస్మరణీయులలో ఒకరైన త్యాగరాజు  భక్తురాలిగా మారి ఒక యోగినిస్థాయిని అందుకున్న 'బెంగుళూర్ నాగరత్నమ్మ' వంటి అనర్ఘ రత్నాలు ఉండటంవల్ల ఈ జాతికి సంపన్నత చేకూరింది గాని నీతి నియమాలు గాలికొదిలి దేశాన్ని దోచుకుతింటున్న నేటి ప్రజలూ నాయకుల వల్ల రాలేదు. 

ఇటువంటి భాగవతోత్తములు ఇంకా ఈ భూమిలో పుడుతూ ఉండటం వల్లనే మన దేశం పుణ్యభూమి అనిపించుకోగలుగుతున్నది.అంతేగాని పనికి మాలిన రాజకీయులు,స్వార్ధపరులైన చవకబారు మనస్తత్వం ఉన్న ప్రజలూ ఉన్నందువల్ల ఈ దేశానికి ఘనత రాలేదు.

అటువంటి మహానుభావులలో ఒకరైన త్యాగయ్య సాధనామార్గాన్నీ భావ పరంపరనూ ఆయన వ్రాసిన కీర్తనల నేపధ్యంలో పరిశీలిద్దాం.ఆయన జీవితంలో నారదమహర్షి పాత్రనూ పరిశీలిద్దాం.అలాగే బెంగుళూర్ నాగరత్నమ్మ జాతకాన్నీ జీవితాన్నీ కూడా వచ్చే పోస్ట్ లలో పరిశీలిద్దాం.