Pages - Menu

Pages

9, ఫిబ్రవరి 2013, శనివారం

త్యాగరాజస్వామి జాతక పరిశీలన-2



సద్గురు త్యాగరాజస్వామి జీవితంలో ముఖ్యఘట్టాలు కొన్ని మనకు తెలుసు. కనుక జ్యోతిష సూత్రాలను ఉపయోగించి ఆయన జీవితాన్ని బట్టి అందులోని ముఖ్య సంఘటనలను బట్టి ఆయన జనన సమయం ఏమై ఉండవచ్చో ఊహిద్దాం. ఎప్పుడో చనిపోయినవారి గురించి ఇటువంటి చర్చలు వ్యాసాలు ఎందుకు? అన్న అనుమానాలు వచ్చేవారికి అసలు జవాబే ఇవ్వను. 'వారి స్థాయి అంతే' అని ఒక నమస్కారం వదిలి నా పనికి ఉపక్రమిస్తాను.

త్యాగరాజస్వామి జీవితంలో ముఖ్య ఘట్టములు--
  • 4-5-1767 న తిరువారూర్ లో జననం.
  • 1772 - ఐదవ ఏట తండ్రిచే అష్టాక్షరీ మంత్రోపదేశం.తీవ్రజ్వరంతో ప్రాణగండం.
  • 1774 - ఎనిమిదవ ఏట ఉపనయనం. వేదాధ్యయనం.
  • 1782 - తన పదిహేనవ ఏట మొట్టమొదటి కీర్తనగా 'నమో నమో రాఘవాయ' అనే కీర్తనను సున్నపు రాయితో గోడలమీద వ్రాశారు.
  • 1784 - పద్దెనిమిదవ ఏట వివాహం.అదే ఏడాది రామకృష్ణ యతీన్ద్రులను ఆయన దర్శించారు.శ్రీరామ తారకమంత్రాన్ని ఉపదేశించి 96 కోట్ల మంత్ర జపాన్ని చెయ్యమని యతీంద్రులు త్యాగయ్యను ఆదేశించారు.క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక లక్షాఇరవైఅయిదువేల జపం చేస్తూ 21 సంవత్సరాల కఠోరసాధనలో త్యాగయ్య అట్టి మహాజపయజ్ఞమును పూర్తిగావించారు.ఈ సాధనా,దీక్షా అనితర సాథ్యములు.
  • ఇరువదవ ఏట తండ్రి మరణం.
  • 1789/90 తన 23 ఏట మొదటి భార్య మరణం. 
  • 1802 - శరభోజి మహారాజు త్యాగయ్యను ఆస్థానంలో విద్వాంసునిగా ఉండమని ఉద్యోగమిస్తూ ఆహ్వానించిన సంఘటన జరిగింది.ఆ సందర్భం లోనే 'నిధి చాల సుఖమా' అనే కీర్తన ఉద్భవించింది.అప్పుడు త్యాగయ్యకు 36 ఏండ్లు.దాదాపు ఇదే సమయానికి తన గురువు సూచించిన 96 కోట్ల తారక మంత్రజపాన్ని ఆయన పూర్తి చెయ్యగలిగాడు. 
  • 1804 - అన్న జపేశుడు త్యాగయ్య యొక్క పూజామూర్తులను దొంగిలించి కావేరీ నదిలో పడవేసిన సంఘటన జరిగింది.తల్లి మరణం కూడా ఇదే సమయంలోనే జరిగింది.
  • 1845 - సతీమణి మరణం.
  • 6-1-1847 - దేహత్యాగం చేసి ఇష్టదైవసన్నిధికి చేరుకున్నారు.  
(ఈ వివరములు www.thyagaraja.org అన్న సైట్ నుండి ఇంకా కొన్ని ఇతర పుస్తకముల నుండి గ్రహించబడినవి.వారికి నా ధన్యవాదములు)

బీవీ రామన్ గారి 'నోటబుల్ హోరోస్కోప్స్' ప్రకారం జనన సమయం మిట్ట మధ్యాహ్నం. అంటే కటక లగ్నం అవుతుంది. ఏరాశి అయినా దాదాపుగా రెండుగంటలు ఉంటుందని మనకు తెలుసు. ఈ రెండుగంటలలో స్వామి జన్మ సమయం ఏమిటో,జీవిత సంఘటనలనుంచి,వర్గచక్రాలనుంచి,ఇతర జ్యోతిష్యసూత్రాల నుంచి పరిశీలించి చూద్దాం.

కటక లగ్నం ఆరోజున ఉదయం 10.35 నుంచి 12.45 వరకూ తిరువారూర్ లో నడిచింది.ప్రాధమికమైన ఈ ఆధారం నుంచి మనం ముందుకు వెళ్ళాలి.

త్యాగయ్య రెండు వివాహములు చేసుకున్నాడని మనకు తెలుసును. మొదటి భార్య యగు పార్వతాంబ వివాహము తదుపరి అతి కొద్ది కాలములోనే మరణించగా ఆమె చెల్లెలైన కమలాంబను ఆయన వివాహం చేసుకున్నారు. నవాంశకుండలిని పరిశీలించగా 11.21 నుండి 11.33 వరకూ తులా నవాంశ అవుతుంది. నవాంశలో రెండు రాశులలో మాత్రమె రెండు రెండు గ్రహములు కలసి ఉన్నవి.తులా రాశిలో రవి గురులు, వృశ్చిక రాశిలో కుజ కేతువులు ఉన్నారు.11.34 నుండి 11.46 వరకూ వృశ్చిక నవాంశ అవుతుంది. కనుక జనన సమయం 11.21 నుండి 11.46 లోపే ఉండవచ్చు. సతీమతల్లుల మృదుస్వభావమును,ధార్మిక మనస్తత్వమును గమనించగా రవి గురులు కలసి యున్న తులా రాశియే నవాంశగా సరిపోతున్నది. ఇందులో సూర్యుని నీచ స్తితివల్ల మొదటి భార్య గతించుట సూచింపబడుతున్నది.వక్ర గురువు రాశి కుండలిలో కూడా కుటుంబ స్థానములో ఉండుట గమనింపగా,తద్గ్రహ సూచితురాలైన ద్వితీయ కళత్రము గోచరురాలై తులా నవాంశయే స్థిరమని ద్రువీకరిస్తున్నది. కనుక త్యాగరాజస్వామి జననం 11.21 నుండి 11.33 లోపే అని నవాంశను బట్టి తెలియుచున్నది.

ఇక దశారీత్యా, రెండవ ఘటన అయినట్టి - అయిదవ ఏట ప్రాణగండమును పరిశీలిద్దాము. అప్పుడు శని/శుక్ర/కుజ దశ నడిచినది.శని శుక్రులిరువురూ ఈ లగ్నానికి మంచివారు కారు.శని మారకుడు.శుక్రుడు బాధకుడు. కుజుడొక్కడే యోగకారకుడు. అయినను ద్వాదశరాశి స్తితుడు గనుక తీవ్ర జ్వరముతో ప్రాణగండమును కల్పించిరి.కుజుని పంచమాదిపత్యము వల్ల తండ్రి చేత అష్టాక్షరీ మంత్రోపదేశమునూ ఆ తదుపరి ఇచ్చిరి. ఈ ఘటన సరిపొయినప్పటికీ పన్నెండు నిముషముల నిడివి మాత్రము అటులనే ఉన్నది. కనుక ఇంకను సూక్ష్మ స్థాయిలకు పోవలెను.


విమ్శాంశను పరిశీలించగా ఇటుల గోచరించును. 11.27 వరకు వృశ్చిక లగ్నము తదుపరి 11.33 వరకు ధనుర్లగ్నము అగుచున్నది. వృశ్చికమునకు లగ్నాధిపుడు కుజుడు ద్వాదశమున శుక్ర స్థానమున స్థితుడై ఆధ్యాత్మిక స్థాయిని సూచించుట లేదు. పంచమాదిపతి యగు గురుడు తద్ద్వాదశమున స్థితుడై యుండుట సద్గురుని స్థాయికి సరిగాదు.అదియే ధనుర్లగ్నమైనచో లగ్నాధిపతి మూడింటనుండి నవమస్తానమును చూచుటయు పంచమాదిపతి లాభమునను ఉండుటయే గాక ధర్మాధిపతి సూర్యుడగుచు శ్రీరాముని చూపుచున్నాడు.కనుక ధనుర్లగ్నమే విమ్శాంశ లగ్నమని తెలుచూ తత్కారణమున జనన సమయము 11.28 నుండి 11.33 లోపలే యని తేలుచున్నది.

స్వామి జీవితమునందు మిగిలిన వివరములు తేదీల వారీగా లేనందున ఆయన నిర్యాణ తేదీనే లంగరుగా తీసుకొనవలసి వచ్చుచున్నది. 6-1-1847 తేదీని బట్టి చూడగా 11.33 అనే సమయమే జనన సమయముగా తేలుచున్నది. ఎందుకనగా ఆ రోజున స్వామి జాతకమున కుజ/కేతు/రవి/శని దశ జరిగినది. కుజుడు ఈ లగ్నమునకు యోగకారకుడైనప్పటికీ ద్వాదశ భావ స్థితుడై ఉన్నాడు.కేతువు లగ్నమున ఉండి చంద్రుని సూచించు చున్నాడు.రవి దశమమున ఉచ్ఛ స్థానములో ఉండి శ్రీరామ సాయుజ్యమును సూచిస్తున్నాడు.శని సప్తమమారకాదిపతిగా బాధక స్థానంలో ఉంటున్నాడు.కనుక ఈ సమయాన్ని జనన సమయంగా తీసుకోవచ్చు.పుట్టినది మే నాల్గవ తేదీ కనుక సూర్యోదయము ఆరోజున 5.55 నిముషములకు అగుచున్నది.కనుక 11.33 నిముషములకు సూర్యుడు నడినెత్తికి వచ్చి మిట్టమధ్యాన్నము అవుతుంది. బీవీ రామన్ గారు వ్రాసిన మధ్యాహ్న సమయం ఆ విధంగా సరిపోతుంది.

ఇప్పుడు ఈ సమయరీత్యా ఇతర సంఘటనలు పరిశీలిద్దాము.

అయిదవ ఏట ప్రాణగండము -- మారిన సమయాన్ని బట్టి ఇప్పుడు శని/శుక్ర/రాహు దశ నడిచినట్లు గోచరిస్తుంది.శనిశుక్రుల పాత్ర పైన చర్చించాము.ఇక రాహువు శనిని సూచిస్తూ సప్తమంలో ఉండటం వల్ల ప్రాణ గండాన్నిచ్చాడు. కనుక 11.33 అనేది జనన సమయంగా సరిపోయింది. కాని ఈ సమయంలో తండ్రిచే అష్టాక్షరీ మంత్రోపదేశం మాత్రం కల్పితమని అది జరుగలేదని తోస్తుంది.ఎందుకంటే గ్రహస్తితులు ఏవీ అటువంటి సూచన ఇవ్వడం లేదు.పైగా ఉపనయనాత్పూర్వము చిన్నికూనకు మంత్రోప దేశములు చేయడం ఆచారం కాదు.కనుక ఈ సమయంలో అనారోగ్యం నిజమే అనియూ,మంత్రోపదేశం మాత్రం కల్పన అనియూ తోచుచున్నది.

1774 లో శనిలో సూర్యుని అంతర్దశ జరిగినప్పుడు ఉపనయనం అయింది.సూర్యుడు ఉచ్ఛ స్తితిలో ఉండటం చూడవచ్చు.కనుక ఆ సమయంలో సూర్యోపాసన అయిన బ్రహ్మోపదేశం జరగడం సముచితంగా కనిపిస్తుంది.

తదుపరి 1782 లో పదిహేనవ ఏట మొదటి కీర్తనను రచించారు. అప్పుడు జాతకంలో శని మహర్దశ ముగిసి బుధ మహర్దశ మొదలైంది.ఉచ్ఛరవితో కలసి దశమాన ఉన్న బుధునిదశ గనుక బుధాదిత్య యోగం పనిచేసి కవిత్వశక్తి వికసించింది అని భావించవచ్చు.దశలు మారినప్పుడు జీవిత గమనం కూడా మారడం చాలా జాతకాలలో గమనించవచ్చు.

1784 లో వివాహం - బుధ/బుధ దశలో వివాహం జరిగింది. బుధుడు దారాకారకుడై ద్వితీయాదిపతి యగు సూర్యునితో కలసి వివాహాన్నిచ్చాడు.కాని బుధుడు కేతు నక్షత్రంలో ఉండటమూ, సప్తమాధిపతి స్పర్శ లేకుండటమూ వల్ల ప్రధమకళత్ర నష్టం జరిగింది.

ఇదే సంవత్సరంలో వివాహం కంటే అతిముఖ్యమైన సంఘటన జరిగింది.అదే రామకృష్ణ యతీంద్రుల దర్శనం. మోక్ష పదవిని కరతలామలకం చెయ్యగల తారకమంత్రోపదేశం అదే సమయంలో జరిగింది.ఇక్కడ సూర్యుని ఉచ్ఛ స్తితి బ్రహ్మాండంగా పనిచేసింది. శ్రీరామభక్తుల జాతకాలలోనూ,గాయత్రీ ఉపాసకుల జాతకాలలోనూ సూర్యుని ఉచ్ఛస్తితిని గమనించాలి. సద్గురునకు సచ్చిష్యుడు తోడైతే ఏమి జరుగుతుందో అదే జరిగింది.తన గురువును మళ్ళీ జీవితంలో మరొక్కసారి ఆయన దర్శించలేదు.ఆయనెవరో ఎక్కడ నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఎవరికీ కనిపించలేదు.కాని ఆయన ఉపదేశించిన మంత్రాన్ని నియమం తప్పకుండా రోజుకు లక్షా ఇరవై ఐదువేల జపం చొప్పున 21 సంవత్సరాల పాటు జపించి గురువు ఆదేశించిన 96 కోట్ల జపాన్ని 39 ఏళ్ళు వచ్చేసరికి పూర్తి చేశాడు త్యాగరాజస్వామి.ఇటువంటి అసాధ్య కార్యాన్ని అసలెంతమంది చెయ్యగలరో ఆలోచిస్తే వారిని ఈప్రపంచం మొత్తంమీద వేళ్ళమీద లెక్క పెట్టవచ్చు. కనుకనే త్యాగయ్య అంతటి మహానుభావుడైనాడు.అనవరతము రామనామ జపంచేత మంత్రసిద్ధి కలిగిన నోటివెంట వచ్చిన కీర్తనలు గానమూ కనుకనే నేడుకూడా వినినా పాడినా ఆ కీర్తనలు అంతటి ఆనందాన్నీ తన్మయత్వాన్నీ కలిగిస్తాయి.

1787 లో తండ్రి మరణం- ఆ సమయంలో బుధ/శుక్ర/గురు దశ నడిచింది.నవమ స్థానమైన మీనాత్ చూడగా బుధుడు బాధకుడు,శుక్రుడు మారకుడు,గురువు పితృసూచకుడు కనుక ఆ సమయంలో తండ్రి మరణం సరిగ్గా సరిపోయింది.

1792 లో తన గురువైన శొంటి వెంకటరమణయ్య గారి ఆహ్వానం మేరకు ఉగాది ఉత్సవ సభలో త్యాగరాజు గానంచేసి తన సంగీతప్రతిభను ప్రదర్శించాడు. తన సొంత కృతులైన 'జానకి రమణా","దొరకునా ఇటువంటి సేవ" అనే కీర్తనలను ఆలపించి గురువుగారిని ఇతర పండితులను ఆశ్చర్యానంద నిమగ్నులను గావించాడు. ఈ సమయంలో బుధ/రాహు/గురు దశ జరిగింది.బుధాదిత్యయోగ ఫలితంగా, సప్తమ రాహువు(దిగ్బల యుతుడైన శనిసూచకుడు) మరియు ఉచ్ఛగురువుల(నాడీసూత్ర రీత్యా)ప్రభావములు ఆ విధంగా పనిచేసి తన ప్రతిభను పండితుల సమక్షంలో ప్రదర్శించడమూ వారి మెప్పు పొందడమూ జరిగాయి. 

1802 - శరభోజి మహారాజు ఆహ్వానం-తిరస్కరణ- కేతువులో రాహు అంతర్దశలో జరిగింది. రాహు కేతువులేప్పుడూ ఇలాంటి ఏదో ఒక సంకట పరిస్తితిని సృష్టిస్తారు.ఎంతటి మహానుభావులైనా వీరి ప్రభావాన్ని తప్పించుకోలేరు.కనుకనే లౌకిక దృష్టిలో ఒక మహాదృష్టం రాజాహ్వానం రూపంలో వస్తే త్యాగయ్య వైరాగ్యభావనతో దానిని తిరస్కరించాడు. తత్ఫలితంగా అన్నగారైన పంచనదయ్య (జపేశుని) తో గొడవలూ,మేజిస్ట్రేట్ సమక్షంలో తండ్రి ఇచ్చిన ఇంటిని అన్నదమ్ములు రెండుగా పంచుకోవడమూ మొదలైన ఘటనలు జరిగాయి.ఆ సందర్భంలో రాత్రికిరాత్రి అన్నగారు తనను ఇంటినుంచి గెంటివేయగా వీధి అరుగుమీద రాత్రంతా త్యాగయ్య భార్యా కూతుర్లతో తలదాచుకున్నాడు.ఈ సమయంలో త్యాగయ్య స్నేహితుడూ శిష్యుడూ అయిన తంగిరాల రామారావు అనబడే సత్పురుషుడు ఆదుకున్నాడు.మధ్యవర్తిత్వం నెరపి ఆస్తిపంపకాలు జరిపించాడు.ఇవన్నీ రాహుకేతువుల ప్రభావమే అని వేరే చెప్పనక్కరలేదు.  

1804 లో తల్లి మరణించింది.అప్పుడు స్వామి జాతకంలో కేతు/శని దశ జరిగింది.చతుర్దాతిపతి అయిన శుక్రునితో కలసి మారకాదిపతి శని బాధకస్థానంలో ఉండటం చూస్తె ఈ దశలో తల్లి మరణం స్పష్టంగా కనిపిస్తుంది.

1845 భార్య మరణం - అప్పుడు కుజ/శని దశ జరిగింది.కుజుడు ద్వాదశంలో ఉండటమూ శని సప్తమాధిపతి కావడమూ గమనించాలి.

ఇక 1847 లో త్యాగయ్య దేహత్యాగం చేసి తన ఇష్ట దైవమైన శ్రీరాముని చేరుకున్నాడు.ఆయా గ్రహస్థితి వివరములు పైన చర్చించి యున్నాను. కనుక మరలా అవసరము లేదు. ఈ విధముగా త్యాగరాజ స్వామి జీవిత వివరములు మద్యాహ్నం 11.33 గంటలకు సరిపోవుచూ ఆయన జనన సమయం అదే అని నిరూపిస్తున్నవి.

స్వామి సాధనా విశేషములు వచ్చే పోస్ట్ లో పరిశీలిద్దాము.