Pages - Menu

Pages

28, ఫిబ్రవరి 2013, గురువారం

త్యాగయ్య నాదోపాసన-3(నారద స్తుతి)

నారద మౌని త్రిలోక సంచారి. త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి.పరమ కరుణామూర్తి.దీనులకు,దారితప్పిన సాధకులకు దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి.అటువంటి ఆర్తులకు ఎందరికో  ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్సాక్షాత్కారము కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు.ఈనాటికీ ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభసాధ్యమే. అది భక్తుల యెడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే గాని మన గొప్పగాదు.

భగవంతుని దర్శనము అతి కష్టము.కాని నారదమునీన్ద్రుని దర్శనము సులభసాధ్యము.కర్మ పరిపాకమున గాని నారాయణుడు కరుణించడు.కాని మహర్షి అటులగాదు.ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మక్షాళణా  ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు.హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలచినచో చాలు.ఆయన నిత్యముక్తుడు.ఆయనకు ముల్లోకములలో చెయ్యవలసిన కర్మ లేనేలేదు.నిత్య స్వతంత్రుడు.కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారిచూపడమే ఆయనకు మిగిలిన కర్తవ్యము.నిరంతర నారాయణ నామస్మరణారతుడై ఆనందానుభూతిలో తేలుతూ ఉండటము,నిజమైన సాధకులకు మార్గనిర్దేశనం చేయడం - ఈ రెండే ఆయన పనులు.గురువులకే గురువు నారద మహర్షి.

పరమ భాగవతోత్తముడైన నారదమునీంద్రుని త్యాగయ్య అనేక కీర్తనలలో సందర్భానుసారంగా స్తుతించాడు. త్యాగయ్యకు తారకరామ మంత్రోపదేశం గావించిన రామకృష్ణ యతీంద్రులు నారదులే యని ఒక నానుడి గలదు. త్యాగయ్య మొదట కొన్నేళ్ళపాటు నారద మంత్రోపాసన గావించినాడనీ తత్ఫలితముగా ఆయనకు నారద మహర్షి ప్రత్యక్షమై 'స్వరార్ణవం' అనే సంగీత గ్రంధాన్ని ఇచ్చి దానిలోని సంగీత రహస్యాలను అవగతం చేసుకునే సూక్ష్మ చేతస్సును అనుగ్రహించినాడనీ ఒక గాధ. ఆ తరువాతనే ఆయనకు ఇంతకు ముందు అర్ధం కాని రాగ రహస్యాలు అర్దమయ్యాయనీ, ఆ తదుపరి నారదులు ఉపదేశించిన రామతారక మంత్రోపాసన ప్రారంభం చేశాడనీ కూడా చెబుతారు.నారదులను తన సద్గురువుగా అనేక చోట్ల త్యాగయ్య ప్రస్తుతించాడు.

నారదుడు అనే పదమే గొప్ప అర్ధాన్ని కలిగి ఉన్నది. 'నార' అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్ధములలో 'జ్ఞానము' అనేది కూడా ఒకటి.నారదుడు అనగా 'జ్ఞానమును ప్రసాదించగలవాడు' అని అర్ధం.నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు.మహిమాన్వితుడైనట్టి ప్రాతఃస్మరణీయుడు.

నారద మహర్షి రూపమేట్టిదో ఒక్కసారి చూద్దాము.

కం|| తెల్లని దేహముతో గర
పల్లవమున వీణె మెరయ పరమాత్ముని దా
నుల్లమున దలచి సొక్కుచు
సల్లాపముతోడ మౌని సరగున వెడలెన్
 
పంతువరాళి రాగంలో పాడిన "నారదముని వెడలిన సుగుణాతిశయమును వినరే" అనే కీర్తనలో నారదముని రూప లావణ్యమునే గాక ఆయన యొక్క సుగుణాతిశయమును కూడా త్యాగయ్య వివరిస్తాడు.

'సారెకు శ్రీహరి పదసారసముల ధ్యానించుచు నారాయణ నామములను పారాయణ మొనరించుచు'- నిరంతరమూ శ్రీహరి పాదపద్మములను ధ్యానించుచూ ఆయన నామములను నిత్యపారాయణము చేయుచూ ఆయన విరాజిల్లుతూ ఉంటాడు.భేదాభేదములు లేనట్టి వేదాంత రసభరితుడు.

'కడుతెల్ల దేహమున పసిడి వీణె మెరయగ దా నెడ బాయని ప్రేమతో నడుగడుగుకు వాయించుచు' - నారదముని స్పటికము వలె తెల్లని దేహచ్చాయ గలవాడు.ఆ తెల్లని మేనిపైన ఆయన యొక్క బంగారు వీణె యగు 'మహతి'మెరయుచూ ఉండగా దానిని నిరంతరమూ మీటుతూ భక్తిచే తన్మయుడై నారాయణుని గాన,స్మరణ,ధ్యానములతో పరమ పవిత్రుడైన మహితాత్ముడు నారదమునీంద్రుడు.

దర్బారు రాగంలో పాడిన 'నారద గురుసామీ ఇకనైన నన్నాదరించవేమి ఈ కరవేమి' అనే కీర్తనలో నారదమహర్షి పై త్యాగయ్యకు గల భక్తి పొంగి ప్రవహించినది. ఆ కీర్తనలో 'సారెకు సంగీతయోగ నైగమ పారంగతుడైన పరమపావనా' అని మహర్షిని సంబోధిస్తాడు.'వేద ప్రతిపాదితమైన సంగీతయోగమున పారము దెలిసిన పావనాత్మా' అని ఆయనను భక్తిపూర్వకముగా పిలుస్తాడు.

'ఇతిహాస పురాణాగమ చరితము లెవరి వల్ల కలిగె, ద్యుతి జితశరదభ్ర నినువినా మునియతుల కెవరు సలిగె క్షితిని త్యాగరాజ వినుత నమ్మితి చిన్తదీర్చి ప్రహ్లాదుని బ్రోచిన నారద గురుసామీ' -- ఈ లోకానికి ఇతిహాసాలు పురాణాలు ఆగమాది శాస్త్రాలు నారద మహర్షి వల్లనే కలిగాయి.ఆయన త్రిలోక సంచారి మాత్రమె కాదు. త్రిలోక గురువు కూడా. ఆయన మేనిచాయ మాత్రమె తెల్లనిది కాదు. ఆయన హృదయము కూడా స్పటికము వలె రాగద్వేషాది వికారములకు అతీతమై దివ్యమైన తెల్లని కాంతిని వెదజల్లుతూ ఉంటుంది.అట్టి వినిర్మల హృదయంలో భగవంతుని దివ్యతేజస్సు నిరంతరమూ నెలకొని ఉంటుంది.నిరంతరమూ భగవద్ధ్యానం వల్ల ఆయనకు మూడులోకాలలో అడ్డు లేకుండా సంచరించగలిగే నిరంకుశ స్వాతంత్ర్యం ప్రాప్తించింది. 

త్యాగయ్య శ్రీరాముని 'నారద గానలోలా' అని పిలుస్తాడు.నారదుని గానానికి దైవాన్ని కదిలించగల శక్తి ఉన్నది.నిష్కల్మషము,భక్తిమయము,అయిన హృదయం నుంచి ఆర్తితో వచ్చిన గానానికి భగవంతుడు వెంటనే స్పందిస్తాడు.నారదుని కంటే స్వచ్చమైన హృదయం కలవారు ఇంకెవరున్నారు?కనుక భగవంతుడైన నారాయణుడు నారదగాన లోలుడయ్యాడు. తలచిన తడవున సర్వేశ్వరుడగు భగవంతుని కలసి ఆయనతో సల్లాపములాడగల శక్తి సంపన్నుడు నారద మహర్షి.

కానడ రాగంలో పాడిన 'శ్రీ నారద, నాద సరసీరుహ భ్రుంగ, శుభాంగ' అనే కీర్తన అద్భుతమైనది.

శ్రీ నారద నాద సరసీరుహ భ్రుంగ శుభాంగ 
దీనమాన రక్షక జగదీశ భేశ సంకాశ 

వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞ
భేదకర త్రితాప రహిత ఖేచర వినుత 
యాదవకులజాప్త సదా మోదహృదయ మునివర్య 
శ్రీద త్యాగరాజ వినుత శ్రీకర మాంపాలయ 

మన వేదములు ఆగమములు పురాణములు ఇతిహాసములలో నారదమహర్షి పాత్ర బహుముఖములుగా ఉన్నది.ఈ కీర్తనలో మహర్షిని త్యాగయ్య 'నాద సరసీరుహ భ్రుంగ' అని గొప్పగా భావిస్తాడు.అంటే 'నాదమనే పద్మములో నిరంతరమూ అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద' వంటి వాడని భావం.ఇది నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం.మహత్తరమైన యోగసిద్దికి తార్కాణం.'శుభాంగా' అన్న సంబోధనలో నారద మహర్షి యొక్క స్పటికనిభ సంకాశమైన శుభంకరమైన వర్చస్సు గోచరిస్తున్నది. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు. భౌతికమే అయితే త్రిలోకములలో సంచరించలేదు.భౌతిక శరీరము ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది.కాని మహర్షి త్రిలోక సంచారి.ఆయనది చిదాకాశము వంటి దివ్యదేహము గనుక ధ్యానించు వారికి శుభప్రదమైనది.

'భేశ సంకాశ' అన్న పదం అద్భుతమైనది.భేశ అనగా నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కల్గినది మహర్షి దేహచ్చాయ.ఆయన దర్శనం దీనులను కాపాడునట్టిది.ధ్రువ ప్రహ్లాదాది పరమ భక్తులకు,వ్యాసవాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారిచూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు.

ఆయన 'వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞుడు'- వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు.వీణానాదమును అంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే.అట్టి విద్యకు నారదుడు పరమ గురువు.

ఆయన యాదవ కులజాప్తుడు.శ్రీకృష్ణునికి ఆయన పరమ సన్నిహితుడు.కృష్ణుని లీలా నాటకమున ముఖ్య పాత్రధారి నారదుడు.సదా సరసమయమైన సంతోషహృదయుడు నారదుడు.ఆయనలో విచారమన్నది లేనేలేదు.ఆయన ఆకలి,దప్పిక,ముసలితనము,మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలోకిస్తూ ఉండే చిరజీవి.సమస్త లోకాలనూ భగవద్విభూతిగా ఆలోకించుచూ నిరంతర భగవన్నామ స్మరణతో యధేచ్చగా సంచరించుచూ ఉన్నట్టి పరమపావనుడా ముని వర్యుడు.ఆయన శ్రీకరుడు,అనగా దర్శనమాత్రం చేత శుభాన్ని కలిగించ గలవాడు.మహామహిమాన్వితుడు.త్రితాప రహితుడు.దేవతలచేత కూడా నిత్యమూ కీర్తించబడే దివ్యరూపుడు. సాక్షాత్తు పరమాత్మునికి అత్యంత సన్నిహితుడు.తనను కాపాడమంటూ 'మాంపాలయ' అంటూ అటువంటి మహిమాన్వితుని కీర్తిస్తాడు త్యాగయ్య.

ఇంతగా ప్రార్ధించిన భక్తునికి దర్శనమివ్వకుండా ఆగగలడా మహర్షి? తన దివ్యమైన తేజస్సుతో వెలుగుతూ త్యాగయ్య కనుల ముందు నిలిచాడు.మహర్షి దర్శనం కలిగే ముందుగా మధురమైన వీణానాదం యోగులకు వినిపిస్తుంది.శుభంకరుడైన ఆయన దర్శనం కలుగబోతున్న దనడానికి అదొక కొండగుర్తు. ఆ దర్శనాన్ని పొంది ఆనంద పరవశుడై త్యాగయ్య భైరవి రాగంలో 'శ్రీ నారద ముని గురురాయ గంటి, మేనాటి తపమో గురురాయ గంటి ' అంటూ గానం చేస్తాడు.

మనసార గోరితి గురురాయ నేడు 
కనులార కనుగొంటి గురురాయ  
మీ సేవ దొరకెను గురురాయ 
భవ పాశము తొలగెను గురురాయ 

నీవే సుజ్ఞానము గురురాయ 
నీవే అజ్ఞానశిఖి గురురాయ 
రాజిల్లు వీణె గల గురురాయ 
త్యాగరాజుని బ్రోచిన సద్గురురాయ 

'మనసారా నిన్ను చూడాలని ఎన్నాళ్లగానో తపించాను. ఏనాటి తపఫలమో నిన్ను కనులార చూడగల్గితిని. నీ సేవ చేయగల్గితిని.దానిచేత జన్మ సంసారబంధములు తొలగి సుజ్ఞానము ప్రాప్తించినది.ఎందుకనగా అజ్ఞానమును దహించు శిఖి(అగ్ని)వి నీవే కదా గురురాయా' అంటూ నారద మునీంద్రుని తన కీర్తనలలో గౌరవిస్తూ స్తుతిస్తాడు త్యాగయ్య.

విజయశ్రీ రాగంలో పాడిన 'వరనారద నారాయణ' అనే కీర్తనలో కూడా నారదుని యెడల తనకున్న భక్తిని ప్రదర్శిస్తాడు త్యాగయ్య.

వర నారద నారాయణ - స్మరణా నందానుభవము కల 
శరదిందు నిభాపఘనానఘ - సారముగాను బ్రోవుమిక 

సకలలోకములకు సద్గురువనుచు - సదా నేనతడనుచు హరియు 
ప్రకటంబుగ కీర్తి నొసంగెనే - భావుక త్యాగరాజనుత 

ఈ కీర్తనలో నారదునికి నారాయణునికి అభేదమని త్యాగయ్య సూచిస్తాడు.ఎందుకనగా భ్రమరకీట న్యాయము చేత కీటకము గూడా భ్రమరమైన రీతిని నిరంతరమూ నారాయణ నామ గాన ధ్యాన తత్పరుడైన నారదుడు నారాయణ రూపుడై భాసిస్తున్నాడు.కనుక పరిపూర్ణము పరిపక్వము అయిన భగవదానందానుభవము నారదునికే చెల్లు అని త్యాగయ్య భావము.

ఈ మాట వేరెవరో చెప్పినది కాదు. సాక్షాత్తు శ్రీహరియే ఈ మాట చెప్పినాడట.'నీవు సకల లోకములకు గురువవు.నీవే నేను నేనే నీవు అని సాక్షాతూ భగవంతుడే చెప్పి నీకు కీర్తిని ఇచ్చాడయా మహానుభావా' అంటూ నారద మహర్షిని భక్తితో స్మరిస్తాడు సద్గురు త్యాగరాజు.

నారదమహర్షుల ఘనమహిమ త్యాగయ్య వంటి సద్భక్త వరేణ్యులకే భావింపనగునుగాని, కామకాంచనాసక్తులై సంసారలంపటులై  అహంకార సర్పదష్టులైన మనవంటి అల్పబుద్ధిగల సామాన్యులకు  గోచరమగునా?