Pages - Menu

Pages

2, ఫిబ్రవరి 2013, శనివారం

త్యాగరాజస్వామి జాతకచక్రం- ఒక పరిశీలన

సద్గురు త్యాగరాజస్వామి ఆరాధ నోత్సవాలు ప్రస్తుతం జరుగు తున్నాయి.శాస్త్రీయసంగీత ప్రియులూ,అభిమానులూ, ఆరాధకులూ అందరూ నేడు భక్తితో ఆయన్ని స్మరిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన జాతకం వైపు ఒకసారి దృష్టి సారిద్దాం.

ఆయన అసలుపేరు కాకర్ల త్యాగబ్రహ్మం. ప్రకాశం జిల్లా కంభం దగ్గర ఉన్న 'కాకర్ల' వారి స్వగ్రామం. ఆయన 4-5-1767 న శుక్లసప్తమి రోజున పుష్యమీ నక్షత్రంలో ములకనాటి బ్రాహ్మణవంశంలో పుట్టినారు. ఆయన జీవితమూ చరిత్రా అందరికీ తెలుసు గనుక ఆ వివరాల జోలికి పోవడం లేదు.జ్యోతిష్య కోణంలో మాత్రమె చూద్దాం.
  • సూర్యుడు ఉచ్ఛ స్తితిలో ఉన్న బుధాదిత్య యోగం ఈయన జాతకంలో ఉన్నది.ఈ యోగం ఉన్నవారు సంగీత సాహిత్య కళారంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తారు.దైవాన్ని చేరడానికి సంగీతాన్ని ఆధారంగా చేసుకోవడం సాధ్యమేనని తన జీవితంలో నిరూపించిన నవీనకాలపు సంగీతతపస్వి త్యాగబ్రహ్మ.
  • బుధుడు దారాకారకుడు అవడం వల్ల ఈయన సతీమణి కూడా ఉత్తమ ఇల్లాలని భర్తకు ఆధ్యాత్మికంగా తోడ్పడిన మహాతల్లి అని తెలుస్తున్నది.
  •  ఆత్మకారకుడైన శని,శుక్రునితో కలసి ఉన్నందువల్ల, చంద్రకేతువులపై శనిదృష్టి వల్లా,ఈయనకు గల లౌకికజీవిత విరక్తీ,ఆధ్యాత్మికజీవిత పరిశ్రమా కనిపిస్తున్నాయి.పెళ్లి చేసుకున్నప్పటికీ సంసారజీవితం మీద నేటి సంసారులకుండే ఆసక్తి ఈయనకు లేదని సంసారాన్ని కూడా మోక్షప్రాప్తికి సోపానంగా మలచుకున్న మహనీయుడని తెలుస్తున్నది.
  • అయితే నవాంశలో సూర్యుని నీచస్తితి వల్ల తనకున్న అపారమైన సంగీత సాహిత్య పాండిత్యాన్ని 'నిధి' కోసం కాకుండా 'రాముని సన్నిధి' కోసం అర్పించి సామాన్య జీవితాన్ని గడిపినాడని సూచిస్తున్నది.
  • గురువు యొక్క వక్రత వల్ల ఈయనకు ధార్మికరంగంలో లోకంతో ఉన్న ఋణం సూచితమౌతున్నది.అందుకే అన్ని భక్తిపూరిత కీర్తనలను లోకానికి ఇచ్చినాడు.
  • నాడీసూత్రానుసారంగా ఉచ్ఛగురువు చంద్రకేతువులతో కూడి యున్నట్లు స్వీకరిస్తే ప్రపంచ విముఖత్వమూ,ధార్మిక మనస్తత్వమూ, అంతర్ముఖత్వమూ కనిపిస్తాయి.అందుకే మహారాజుల కట్న కానుకలను తృణప్రాయంగా తిరస్కరించిన మహత్వం ఆయన జీవితంలో దర్శించవచ్చు. 
  • రాహువు శ్రవణా నక్షత్రంలో 'ఏకాకిగ్రహం' గా దక్షిణ దిక్కున ఉండటం చూడగా, విష్ణు సంబంధమైన వ్యాపకంతో దక్షిణదేశాన ధ్రువతారగా నిలిచినాడన్న విషయం కనిపిస్తుంది.
  • వృశ్చికరాశిమీద శనిశుక్రుల సప్తమదృష్టి వల్ల రామదర్శనాది అంతరికానుభవాలు కలిగినవాడని సూచిస్తున్నది.నారదమహర్షికి మాత్రమె తెలిసిన 'స్వరార్ణవం' అనే సంగీత గ్రంధాన్ని స్వయానా దేవర్షి చేతుల మీదుగా అందుకున్న భాగ్యశాలి త్యాగయ్య.
  • కుంభంమీద అదే గ్రహముల దశమదృష్టి వల్ల లోకానికి భక్తి పూరితములైన ఎన్నో కీర్తనలను అందించి మేలు చేసినాడన్న విషయం కనిపిస్తున్నది.
  • జనన సమయం తెలీదు కనుక లగ్నాన్ని లెక్కించలేము.కాని,ఆయన జీవితాన్ని బట్టి కుంభలగ్నమో మీనలగ్నమో అయి ఉండవచ్చు అని నా భావన.
  • ఆయన కీర్తనలలో ఇతరులకు సూటిగా ఏమీ చెప్పలేదు.ప్రతిదీ తన మనసుకే తాను ఉద్బోధించుకునేవాడు.అదే లోకానికి దారి చూపే దివ్వె అయ్యేది.లోకంమెప్పుకోసమో,ధనంకోసమో,కీర్తికోసమో కాకుండా దైవం కోసం పాడిన నిజమైన భాగ్యశాలి.  
  • ఆయన రచించిన ఎన్నో కీర్తనలు మన చేతగానితనంవల్ల యధావిధిగా కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలినవి తమిళ సోదరుల పుణ్యమా అని మనకు లభ్యమౌతున్నాయి.తమిళ సోదరులు (తెలుగు రానివారు కూడా) సంగీతం మీద ప్రేమతో,త్యాగరాజస్వామి మీద భక్తితో, ఆ తెనుగు కీర్తనలను నేర్చుకుని పాడుతూ వాటిని కనుమరుగు కాకుండా నిలిపినందుకు వారికి తెలుగువారు ఋణపడినట్లే అనక తప్పదు.వేరొక జాతి సంపదను ఆ భాషరాని ఇంకొక జాతి తరతరాలుగా కాపాడిన ఇటువంటి సంఘటన ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు.
  • ఆయన కీర్తనలు ఏమిటో తెలియని తెలుగువారు తాము తెలుగు వారమని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆయన వ్రాసిన వందలాది కీర్తనలు అన్నీ మనకు తెలియకపోయినా కనీసం ఒక్క 'పంచరత్న కీర్తన' అయినా ఈ సందర్భంగా నేర్చుకుని ఆ మహాభక్తుని ఋణం తీర్చుకుందామా?