నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

20, ఫిబ్రవరి 2013, బుధవారం

నిన్నటి నుంచి మొదలైన శనీశ్వరుని వక్రత్వ ఫలితాలు

నిన్నటినుంచి శనీశ్వరుడు మళ్ళీ వక్రస్తితిలోనికి ప్రవేశించాడు. ఈ స్తితి జూలై ఏడవ తేదీవరకు అంటే దాదాపు 135 రోజులపాటు కొనసాగుతుంది. ఈ లోపల ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి స్వాతి -4 పాదం నుంచి స్వాతి -2 పాదం వరకూ వెనక్కు ప్రయాణం చేస్తాడు. ఆ క్రమంలో ఎన్నో ఇతర గ్రహాలతో ఆయనకు పరస్పరదృష్టులు స్తితులు ఏర్పడతాయి. తత్ఫలితంగా జనజీవనంలో అనేక మార్పులు కలుగుతాయి. అవి ఎలా ఉంటాయో స్థూలంగా వివరిస్తాను. సూక్ష్మ వివరాలకు వ్యక్తిగత జాతకాలు చూచుకోవలసి ఉంటుంది.

  • సామాన్య ప్రజా ఉద్యమాలు జరుగుతాయి. దానికి తార్కాణంగా ఈరోజు నుంచి రెండురోజుల పాటు జరిగే 'అఖిలభారత కార్మికసమ్మె'ను చెప్పుకోవచ్చు. శనీశ్వరుడు వక్రస్తితిలోకి వచ్చీరాక ముందే ఇది ప్రారంభం అయింది. ఇదే రోజున అదెందుకు జరగాలి?మనంతట మనం చేస్తున్నాం అనుకునే చర్యల వెనుక గ్రహబలం ఎలా పనిచేస్తుందో ఈ సంఘటనతో మనం అర్ధం చేసుకోవచ్చు.
  • కొంతమందికి ఇతరులతో సంబంధాలు దెబ్బ తింటాయి. అనవసరంగా మాటా మాటా పెరిగి ఇబ్బంది కలుగుతుంది.
  • ఇంకొంతమందికి ఎప్పటినుంచో స్తబ్దుగా ఉన్న సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఇది గతం నుంచి ఉన్న కర్మ సంబంధం వల్ల జరుగుతుంది. ఆ సంబంధం ఈ జన్మది కావచ్చు.గత జన్మలనుంచి ఉన్నది కావచ్చు.
  • ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారికి నూతన ప్రేరణ మొదలౌతుంది. ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న వారి అభ్యాసాలు తిరిగి ఊపందుకుంటాయి.
  • చాలామంది జీవితాలలో ఇది జరుగడం గమనించవచ్చు.కొత్త కొత్త పరిచయాలు కలుగుతాయి.చాలా రోజులనుంచి మాట్లాడని,కనిపించని పాత స్నేహితులు పరిచయస్తులు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తారు. మాట్లాడతారు.అలాంటి పరిస్తితులు అనుకోకుండా కల్పించ బడతాయి.వీళ్ళు మనతో మాట్లాడుతారా అనుకున్నవారు కూడా కలుపుగోలుగా మాట్లాడటం చూడవచ్చు.చాలామంది కొత్త పార్టీలలో ఫంక్షన్ల లో పాల్గొంటారు.
  • దూరంగా ఉండి కలుసుకోలేని స్నేహితులు ఈ సమయంలో (జూలై ఏడవ తేదీలోపు) తిరిగి కలుసుకుంటారు.శనీశ్వరుని బలమైన కర్మ ప్రభావం వల్ల వాళ్ళు ఒకచోటికి లాగబడతారు.
  • గతంలో వ్రాసిన రాహుకేతు పోస్ట్ లో వారి రాశిమార్పు వల్ల వారి దృష్టి బ్రిటన్ మీదకు మళ్ళుతుంది అని వ్రాశాను. తత్ఫలితంగా కొత్త వ్యాధులు విజ్రుంభిస్తాయి అని కూడా వ్రాశాను.ఎందుకంటే రాహుప్రభావం వల్ల ఊహించని కొత్త వ్యాధులు వైరస్ బాక్టీరియా రూపంలో తలెత్తే అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ జోస్యం శనీశ్వరుని వక్రత్వంతో కలిసిరావడం(coincide కావడం)జరిగింది.ఇంగ్లాండ్లో సరికొత్త ప్రాణాంతక వైరస్ తలెత్తి జనులకు గుబులు పుట్టిస్తూ ఉండటం చూడవచ్చు. ఇది కూడా శనీశ్వరుని వక్రస్తితి మొదలైన సమయంలోనే తలెత్తటం గమనార్హం.
  • అయితే ఈ వక్రత్వంవల్ల కొన్ని మంచి మార్పులు కూడా ఉన్నాయి.కొందరిలో ఇప్పటివరకూ ఉన్న స్తబ్దత తొలగిపోయి నూతనోత్సాహం ఏర్పడుతుంది.ముఖ్యంగా ఎవరి జాతకాలలో అయితే శని వక్ర స్తితిలో ఉన్నాడో వారికి కొత్త ఉత్సాహం వస్తుంది.ఉన్నట్టుండి ఏదో మార్పు వారి జీవితంలో గమనిస్తారు.ఖచ్చితంగా ఇంతకు ముందుకూ ఇప్పటికీ కొంత తేడా వస్తుంది. ఆ తేడాలు వారి వారి జాతకాలలో శనీశ్వరుడు ఉన్న భావాలను బట్టి ఆయా రంగాలలో కనిపిస్తాయి.
  • శనీశ్వరుడు క్రూరగ్రహమై ఉండి వక్రించినపుడు బలం పెరగడం చేత చాలాచెడు చెయ్యగలడు.కాని మకర,కుంభ,వృషభ,తులా లగ్నాలకు అంత చెడు చెయ్యడు. పైగా,ప్రస్తుతం ఆయన ఉచ్ఛ స్త్తితిలో ఉన్నాడు. కనుక వక్రించినప్పుడు ఉచ్చత్వానికి కొంత భంగం ఏర్పడుతుంది.ఈ రీతిగా వివిధ కారణాలవల్ల ఆయా లగ్నాలకు వివిధ రకాలైన మిశ్రమ ఫలితాలు ఇవ్వబడతాయి. 
  • మొత్తం మీద చాలామందిలో మానవ సంబంధాల గురించి, సమాజంతో ఇతరులతో తమకున్న సంబంధాల గురించి పునరాలోచన ఈ సమయంలో తప్పకుండా కలుగుతుంది.ఇంతకు ముందరి తమ ఆలోచనావిధానాన్ని ప్రవర్తనాధోరణిని ఒక్కసారి తిరిగి బేరీజు వేసుకునేటట్లు ఈ గ్రహస్తితి పనిచేస్తుంది.
  • శనీశ్వరుడు కర్మకారకుడు గనుక కర్మరంగంలో (workspot) కూడా  ఈసమయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. 
  • ఆయా గ్రహస్తితులు దృష్టులు జరిగినప్పుడు ఏ ఏ సంఘటనలు తలెత్తు తాయో ముందుముందు చూద్దాం. ప్రస్తుతానికి మీమీ జీవితాలలో పైన చెప్పిన సంఘటనలు ఎలా జరుగుతున్నాయో గమనించి ఆశ్చర్య పోవడమే మీ వంతు.