నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

హైదరాబాద్ లో పాతపేలుళ్లు - జ్యోతిష పరిశీలన

సక్రమమైన పరిశోధన వల్ల నూతనసత్యాలు ఆవిష్కరింపబడటానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం కూడా దీనికి మినహాయింపు కాదు.జరిగిపోయిన సంఘటనలలో దండలో దారంలా ఉన్న సూత్రాలను గ్రహయోగాలను మనం కనుక్కోగలిగితే వాటిని భవిష్యత్తులోకి ప్రొజెక్ట్ చెయ్యడం ద్వారా జరుగబోయే సంఘటనలను అంచనా వెయ్యవచ్చు. స్టాటిస్టికల్ విధానంలో వినియోగించే ఒక సూత్రం ఇదే.ఆ కోణంలో ఒక్కసారి గతంలో హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్లను జ్యోతిష్య రీత్యా పరిశీలించి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం.

ఈ మధ్యనే 21-2-2013 న జరిగిన పేలుడు రోజున ఉన్న గ్రహస్తితిని పోయిన పోస్ట్ లో విశ్లేషించాను గనుక మళ్ళీ అక్కర్లేదు. ఆ రోజున ఉన్న ముఖ్యమైన గ్రహస్తితులు మాత్రం ఇక్కడ క్రోడీకరిద్దాం.
  • సూర్య నెప్త్యూన్ల డిగ్రీసంయోగం 
  • ఈ కలయిక రాహునక్షత్రంలో జరగడం.
  • వీరితో బుధ,శుక్ర,కుజులు కలవడం
  • శుక్ల ఏకాదశి గనుక ఆ రోజు పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • చంద్రహోరా సమయంలో పేలుడు జరిగింది.చంద్రునిపైన రాహుదృష్టి ఉన్నది.నవాంశలో చంద్రుడు శనితో కలసి ఉన్నాడు.
  • శపితయోగ ప్రభావం నడుస్తున్నది
ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన పేలుళ్లను వరుసగా పరిశీలిద్దాం.


18-5-2007 న 13.15 గంటల సమయంలో హైదరాబాద్లో మక్కా మసీదులో బాంబు పేలి 10 మంది చనిపోయారు.50 మంది గాయపడ్డారు. ఆ సమయంలో గ్రహస్తితి ఇలా ఉంది. 
  • సింహ లగ్నం కేతువుతో డిగ్రీ సంయోగంలో ఉన్నది.
  • ఆరోజు శుక్ల ద్వితీయ కనుక తిధి అమావాస్య పరిధిలో ఉన్నది.
  • అదేరోజున గురువు వక్రస్తితి మొదలైంది.
  • అదేరోజున నవాంశలో గురువు నీచస్తితిలోకి ప్రవేశం జరిగింది. 
  • లగ్నాధిపతిగా సూర్యుడు ప్లూటో తో షష్టాష్టక డిగ్రీ దృష్టిలో ఉన్నాడు
  • శనిగురువుల మధ్యన డిగ్రీ కొణద్రుష్టి ఉన్నది.
  • రాహు బుధుల మధ్య డిగ్రీ కేంద్రదృష్టి ఉన్నది.
  • యురేనస్ శనుల మధ్యన డిగ్రీ షష్టాష్టక దృష్టి ఉన్నది.
  • ఆరోజు శుక్రవారం.శుక్రుడు ఆర్ద్రా (రాహు) నక్షత్రంలో ఉన్నాడు.అంతేగాక రాహువుతో చూడబడుతున్నాడు.పాపార్గళంలో చిక్కిఉన్నాడు.
  • పేలుడు సమయంలో శుక్రహోర నడుస్తున్నది.


25-8-2007 న లుంబిని పార్కులో 19.45 గంటలకు, ఆ తర్వాత గోకుల్ చాట్లో 19.50 గంటలకు జరిగిన బాంబు పేలుళ్ళలో 44 మంది చనిపోయారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో గ్రహసితి ఇలా ఉన్నది.


  • మీనలగ్నం సున్నా డిగ్రీలలో ఉన్నది.
  • తిథి శుక్ల ద్వాదశి గనుక పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • నెప్ట్యూన్ మకరం 26 డిగ్రీలలో ఉండి కుజుని ధనిష్టా నక్షత్రంలో ఉన్నాడు. 
  • కుజుడు భారతదేశ లగ్నమైన వృషభంలో ఉన్నాడు.
  • వక్రశుక్రుడు కర్కాటకం 26 డిగ్రీలలో నెప్ట్యూన్ తో సమసప్తక డిగ్రీదృష్టిలో ఉన్నాడు.
  • గుళిక మేషం 26 డిగ్రీలలో ఉంటూ ఒకవైపు నెప్ట్యూన్ తోనూ ఇంకోవైపు శుక్రునితోనూ కేంద్ర దృష్టిలో ఉన్నాడు 
  • శని రాహువుల సమసప్తక దృష్టి వల్ల శపితయోగం అమలులో ఉన్నది.
  • ఆరోజు శనివారం.శని అస్తంగతుడై ఉన్నాడు.
  •  ఆ సమయానికి చంద్రహోర జరిగింది.చంద్రుడు నెప్ట్యూన్ తో కలిసి శని రాశిలో ఉన్నాడు. నవాంశలో చంద్ర రాహువులు కలిసి మకరంలో ఉన్నారు.


7-5-2006 న 22.30 గంటలకు ఓడియన్ థియేటర్ లో బాంబ్ పేలింది. ఎవరూ చనిపోలేదు.ఆ రోజున గ్రహస్తితి ఇలా ఉన్నది.


  • కుజుడు 19 డిగ్రీలలో మిథున రాశిలో ఆర్ద్రా(రాహు) నక్షత్రంలో ఉన్నాడు.
  • చంద్రుడు 19 డిగ్రీలలో సింహ రాశిలో పూర్వఫల్గుణి (శుక్ర) నక్షత్రంలో ఉన్నాడు.
  • వక్ర గురువు 19 డిగ్రీలలో తులా రాశిలో స్వాతి(రాహు) నక్షత్రంలో ఉన్నాడు.
  • యురేనస్ 20 డిగ్రీలలో కుంభ రాశిలో పూర్వాభాద్ర(గురు) నక్షత్రంలో ఉన్నాడు.
  • యురేనస్ నుంచి చూస్తె వీరందరూ కోణ/త్రిపాద/త్రిపాద/కోణ దృష్టితో ఒకరికొకరు బంధితులై ఉండటం చూడవచ్చు.
  • తిధి శుక్ల దశమిగా పౌర్ణమి పరిధిలో ఉండటం చూడవచ్చు.
  • మే 5 న ఇంకా ఖచ్చితమైన దృష్టులు ఉండటం గమనిస్తే, ఆ రోజునే ప్రయత్నాలు జరిగాయనీ ఎందువల్లనో అవి సఫలం కాలేదనీ తర్వాత ఏడో తేదీన పేలుడు జరిగిందనీ అర్ధమౌతుంది.  
  • ఆరోజు ఆదివారం.రవి రాశిచక్రంలో ఉచ్చస్తితిలోనూ నవాంశలో నీచస్తితిలోనూ ఉన్నాడు.
  • నవాంశలో రాహు చంద్రులు కలిసి కన్యారాశిలో ఉన్నారు.మీనంలో ఉన్న కుజునిచేత,వక్ర గురువు చేత చూడబడుతూ ఉన్నారు.
  •  ఆ సమయంలో బుధ హోర జరిగింది. బుధుడు ధనూరాశిలో ఉన్న మాందీ గ్రహంతో డిగ్రీ కోణదృష్టిలో ఉన్నాడు.
  • శని మీద గల రాహు దృష్టి వల్ల శపితయోగం నడుస్తున్నది. 


12-10-2005 న టాస్క్ ఫోర్స్ కమీషనర్ ఆఫీస్ లో జరిగిన పేలుడులో ఒకరు  చనిపోయారు.ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.ఆ రోజున గ్రహస్తితి ఇలా ఉంది.


  • ఇది పోలీస్ శాఖతో సంబంధం ఉన్న సంఘటన గనుక కుజునికి సంబంధం ఉండాలి.
  • ఆశ్చర్యకరంగా,వక్ర కుజుడు 28 డిగ్రీ మేషరాశిలో కృత్తికా(సూర్య) నక్షత్రంలో ఉన్నాడు.
  • ప్లూటో 28 డిగ్రీ వృశ్చికరాశిలో జ్యేష్టా(బుధ) నక్షత్రంలో ఉంటూ కుజునితో షష్టాష్టక డిగ్రీ దృష్టిలో ఉన్నది.
  • ఆ రోజు బుధవారం.బుధుడు యురేనస్ తో కోణదృష్టిలో ఉన్నాడు.
  • ఆరోజుకూడా శుక్ల దశమిగా పౌర్ణమి పరిధిలో ఉన్నది.
  • అన్నింటినీ మించి,లగ్నం 13 డిగ్రీలలో స్వాతి (రాహు) నక్షత్రంలో ఉండి కుంభరాశిలో 13 డిగ్రీలలో శతభిష (రాహు) నక్షత్రంలో ఉన్న యురేనస్ తో డిగ్రీ కోణ దృష్టి కలిగి ఉన్నది.
  • శపిత యోగం ఇంకా నడుస్తున్నది.
  • ఆరోజు బుధవారం.బుధుడు స్వాతీ నక్షత్రంలో రాహు ప్రభావంలో ఉన్నాడు.
  • చంద్రుడు నెప్ట్యూన్ తో కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నాడు.
  • నవాంశలో చంద్రునిపైన రాహుద్రుష్టి ఉన్నది.
  • బలమైన శపిత యోగమూ,బుధుని మీద రాహు ప్రభావమూ,కుజుని పాత్రా,యురేనస్ ప్లూటో ల పాత్రా గమనార్హం.ఈ దాడి బంగ్లాదేశ్ కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యునితో జరిగిందన్నదీ గమనార్హమే. 

21-11-2002 న సాయిబాబా గుడిలో పేలుడు జరిగి 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆరోజు గ్రహస్తితి ఇలా ఉంది.


  • వక్ర శని వృషభం లో ఉన్నట్లు తీసుకుంటే రాహువుతో కలయికవల్ల శపితయోగ ప్రభావం అప్పుడు కూడా ఉన్నది.
  •  చంద్రుడు మృగశిరా (కుజ) నక్షత్రంలోనూ గురువు ఆశ్లేషా (బుధ) నక్షత్రంలోనూ 23 డిగ్రీలలో ఉండి ఖచ్చితమైన త్రిపాదదృష్టిని కలిగి ఉన్నారు. చంద్ర గురుల యోగం వల్ల సద్గురువైన సాయిబాబా గుడిలో ఈ బాంబు పేలుడు జరిగింది. 
  • కుజ బుధ నక్షత్రాల ప్రభావం వల్ల మొండి తర్కంతో కూడిన విధ్వంస ప్రవృత్తి సూచితం అవుతుంది.తీవ్రవాదులకు మూర్ఖపు తర్కం ఉంటుంది.నవాంశలో కూడా కుజుడు ఉచ్ఛ బుదునితో కలిసి ఉండటం చూడవచ్చు.
  • లగ్నాధిపతి శత్రు స్థానంలో ఉండి,చతుర్దంలో(మాతృదేశం) ఉన్న మాంది గ్రహంతో డిగ్రీ త్రిపాద దృష్టిలో ఉన్నాడు.అంటే అదే ఊరికి చెందిన తీవ్రవాదుల పన్నాగం వల్ల జరిగింది అని తెలుస్తున్నది. 
  • చంద్రుడు రాహువు కలిసి ఉండటం ఉగ్రవాదుల విధ్వంసాన్ని సూచిస్తుంది.
  • ఆరోజు గురువారం.బహుశా బాబా గుడిలో బాగా రష్ ఉంటుందని ఆరోజును ఉగ్రవాదులు ఎంచుకొని ఉండవచ్చు.సమయం కూడా గురుహోర నడుస్తున్నది.గురువు ఆశ్లేషా(బుధ) నక్షత్రంలో సర్ప ప్రభావంలో ఉన్నాడు.ఆశ్లేష సహజంగా బుధుడు మరియు రాహువు కలిసిఉన్న నక్షత్రం.దీనిపైన వీరిద్దరి ప్రభావం ఉంటుంది.
  • నవాంశలో బుధుడు ఉచ్ఛ స్తితిలో కుజునితో కలిసి ఉన్నాడు.రాహువు చేత చూడబడుతున్నాడు.
  • ఆరోజు తిధి కృష్ణ ద్వితీయగా పౌర్ణమి పరిధిలో ఉన్నది.
వీటన్నిటిలో ప్రతి సంఘటనలోనూ మనకు కొన్ని గ్రహయోగాలు స్పష్టంగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి.అవేమిటో క్రోడీకరిద్దాం.
  • పౌర్ణమి అమావాస్యల దగ్గరలో సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రెంటిలో పౌర్ణమికే ఎక్కువ బలం కనిపిస్తున్నది.
  • చంద్ర బుధులపైన రాహువు యొక్క ప్రభావం ఉన్నది.అంటే మనస్సు బుద్ధి పైన రాహువు ప్రభావం వల్ల విధ్వంసకర ప్రవృత్తి ఈ సమయంలో మనుషులలో ఎక్కువ అవుతున్నది.
  • శపిత యోగ (శని రాహువుల) ప్రభావం ఏదో రకంగా (అంటే, గ్రహ యుతి,దృష్టి,నక్షత్ర స్థాయిలలో ఏదో ఒకటి) ఉంటున్నది. అంటే చేసిన పాపాలకు ఈ సమయంలో శిక్షలు పడుతున్నాయి.
  • యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో ల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తున్నది. వీటిలో నెప్ట్యూన్ పాత్ర ఎక్కువగా ఉన్నది.యురేనస్ పాత్ర ఉన్నపుడు కొత్త రకపు బాంబులను వాడటం గాని,విభిన్న తీరులో పేలుళ్లు ప్లాన్ చెయ్యడం గానీ జరిగింది.నెప్ట్యూన్ పాత్ర చాలా తరచుగా కనిపించింది.ప్లూటో పాత్ర ఉన్నపుడు విదేశీ విద్వంసకారుల సూటి ప్రమేయం ఆయా దాడులలో కనపడింది.సూర్యమండలంలో బాగా బయటగా దూరంగా ఉన్న గ్రహాలు కనుక బయటి వారి ప్రమేయం సూచింపబడుతుంది. 
  • విధ్వంసం జరిగిన తీరు తెన్నులను బట్టి శని,రాహు,కుజుల పాత్ర చాలా స్పష్టంగా ఉంటున్నది. ఇవి మూడూ విధ్వంసకర పోకడలను పెంచే గ్రహాలని మనకు తెలుసు.

పై సూచికల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి గ్రహస్తితులు తలెత్తినప్పుడు ప్రమాదం ముంచుకొస్తున్నదని ఊహించవచ్చు. తీసుకోగలిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా,ఎంత చర్చించినా, తీవ్రవాదులు గనుక విధ్వంసం సృష్టించాలి అనుకుంటే, ఏదో ఒకరోజున ఏదో ఒకచోట చెయ్యక మానరు.అందులోనూ జనసాంద్రత ఎక్కువగా ఉన్న మన నగరాలలో,పోలీస్ వ్యవస్థ బలహీనంగా ఉన్న ప్రాంతాలలో,అందునా మనలాంటి జాగరూకతా రహిత డొల్ల ప్రజాస్వామ్య దేశంలో అలా చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. తీవ్రవాదులకున్న ధనసరఫరా, అందదండలూ, వారి నెట్ వర్కూ,డబ్బుకు అమ్ముడయ్యేవారు అడుగడుక్కీ మన సమాజంలో ఉండటమూ,మన వ్యవస్థలో ఉన్న తీవ్రమైన లోపాలూ వీటన్నిటి కోణంలో ఆలోచిస్తే ఇలాంటి దాడులను ఆపడం ఎవరికైనా ప్రాక్టికల్ గా చాలా కష్టమే అని తోస్తుంది.మరి సామాన్య పౌరుడికి ఏమిటి దారి?

వ్యవస్థాపరంగా మన దేశంలో మంచి మార్పులు రావడం అసాధ్యం కాదుగాని చాలా కష్టం. మనం ప్రతిదాన్నీ తేలికగా తీసుకుంటూ, కళ్ళుమూసుకుని ఎవరి స్వార్ధం వారు చూసుకుంటూ ఉన్నంతకాలం,నాయకుల దృష్టిలో ప్రజల ప్రాణాలకు విలువ లేనంతకాలం,ఓటు బ్యాంకు రాజకీయాలు పోనంతకాలం ఈ విధ్వంసం తప్పదు.ఇవన్నీ ఎప్పుడు పోతాయో,మన సమాజం ఆదర్శ సమాజంగా ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు.అంతవరకు దైవం మీద భారం వేసి, రాసిపెట్టి ఉన్నంతకాలం బ్రతకడమే సామాన్యుడు చెయ్య గలిగింది.పోయిన తర్వాత ఇక చేసేదేమీ లేదు, బతికున్నవారి కుట్రలకు ఒక సమిధలా ఉపయోగ పడటం తప్ప.

ఉదాహరణకు, డిల్లీ రేప్ కేస్ ఏమైంది? నాలుగురోజులు అందరూ గోల చేశారు.ఇప్పుడు అనుకునేవాడే లేడు.పోనీ దాని తర్వాత అలాంటి సంఘటనలు ఇంకెక్కడా దేశంలో జరగలేదా? అంతకంటే ఎక్కువ ఘోరాలు చాలా చోట్ల జరిగాయి.ఇప్పటికీ జరుగుతున్నాయి.ఈరోజుకీ పేపర్లలో టీవీలలో వచ్చేవి 5 శాతం మాత్రమే.మనది సిగ్గులేని దేశం అనడానికి ఇంకా నిదర్శనాలు అవసరమా?

అసలు విషయం ఏమిటంటే,నవీన సమాజంలో సామూహిక చెడుకర్మ విపరీతంగా పోగవుతున్నది. అది ఎలా పోగవుతున్నదో చెప్పినా కూడా వినే స్తితిలో ఎవ్వరూ లేరు.పైగా చెప్పిన వారిని ఎగతాళి చేసే పరిస్తితి సమాజంలో ఉన్నది.మనుషులలో దైవం అన్నా ధర్మం అన్నా భయమూ భక్తీ రెండూ చాలా తగ్గిపోయాయి.స్వార్ధమూ,విచ్చలవిడి ప్రవర్తనా నిత్యకృత్యాలు అయ్యాయి.మాటల్లో చెబుతున్న నీతులు చేతల్లో కనిపించడం లేదు.కనుక నిత్య ప్రళయాలు జరగడం మామూలై పోతున్నది.వ్యవస్థా స్థాయిలో చూచినప్పుడు దీనికి పరిష్కారాలు అంటూ ప్రస్తుతానికి లేవు.వ్యక్తిగత స్థాయిలో ఉన్నాయి.మనుషులలో మంచిమార్పు రావాలి. ఆ మార్పు ఉత్త మాటలు చెప్పడంలో కాకుండా చేతల్లో కనపడాలి.అలా రాకపోతే ఇంకా పెద్దపెద్ద విధ్వంసాలు ప్రకృతి పరంగా జరిగే రోజులు కూడా ముందు ముందు వస్తాయి.మనిషి ప్రకృతినీ దైవాన్నీ ఎక్కువరోజులు మోసం చెయ్యలేడు. కనుక దైవబలాన్ని తనకు కవచంలా ఉంచుకుని జీవించడం తప్ప ప్రస్తుత భారత సమాజంలో సామాన్యుడు చేసేదీ,చెయ్యగలిగిందీ ఏమీ లేదు.

నేనెన్నోసార్లు చెప్పినట్లు ప్రస్తుత కుళ్ళు సమాజంలో అదొక్కటే సామాన్యుడికి శ్రీరామరక్ష. 'దిక్కులేనివారికి దేవుడే దిక్కు' అని పెద్దలు ఏనాడో చెప్పారు కదా.