Pages - Menu

Pages

14, మార్చి 2013, గురువారం

సంగీతం-జ్యోతిషం-1

ప్రపంచంలో ఉన్న ఏ రంగాన్నైనా జ్యోతిశ్శాస్త్ర కోణంలో పరిశీలించి అర్ధం చేసుకోవచ్చు.అది ఈ శాస్త్రపు మహాత్యాలలో ఒకటి.సంగీతం దీనికి మినహాయింపు కాదు.

అసలు, సంగీతానికి జ్యోతిశ్శాస్త్రానికి యోగశాస్త్రానికి అవినాభావ సంబంధం ఉన్నది అని నేనంటాను.సప్తస్వరాలకూ సప్తగ్రహాలకూ సప్తచక్రాలకూ ఉన్న సంబంధం సంగీతయోగపు లోతులు తెలిసినవారికి విదితమే.

సంగీతం ఒక యోగం.దాని పరమ ప్రయోజనం గాయకుని ఆత్మను కరిగించి దైవానుభూతిని అతనికి కలిగించడం.వినేవారి మనస్సులను మానవ లోకపు వ్యధార్తసీమల నుంచి దాటించి అనిర్వచనీయమైన దివ్యానుభూతినిచ్చే ఎత్తులకు చేర్చడమే అసలైన సంగీత ప్రయోజనం. అటువంటి ప్రభావం చూపాలంటే ఆ గాయకునిలో ఆర్తి ఉండాలి.సాధన ఉండాలి. అతనికి హృదయపవిత్రత ఉండాలి.అతనిలో కృతకమైన ప్రజ్ఞ మాత్రమె కాక స్వచ్చమైన భావనాబలమూ, కల్మషరహితమైన మనస్సూ ఉండాలి.పాడుతున్న పాటలో లీనమై ఆ పాట సూచిస్తున్న భావంలో నిమగ్నమైన చిత్తంతో గానం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తాను మాయం కావాలి.రాగమే తనను ఉపకరణంగా చేసుకొని తనద్వారా బాహ్యానికి ప్రసరించాలి.తనద్వారా వ్యక్తమౌతున్న రాగానికి ఏఅడ్డూ కల్పించకుండా తాను తన స్వరాన్ని మాత్రమే రాగానికి అరువిచ్చి అక్కణ్ణించి తప్పుకోవాలి. తన గానాన్ని తానే ఒక శ్రోతగా వినాలి.అదీ అసలైన గానం. అప్పుడే  లోకాతీతమైన ఒకానొక దివ్యప్రభావం అతని గానంలో ప్రస్ఫుటమౌతుంది.ఈ లోకానికి చెందని ఒక సువాసన ఆ గానంద్వారా చుట్టూ వ్యాపిస్తుంది. అప్పుడు వినేవారిలోనూ దాని ప్రభావం కనిపిస్తుంది.వారి హృదయాలు వెంటనే ఏదో మాయ కమ్మినట్లుగా అయిపోతాయి.స్వామిహరిదాస్, తాన్సేన్, బైజూబావరా, త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల వంటి గాయకులలో ఆ ప్రజ్ఞ ఉండేది. 

పాతతరం సినీ గాయకులలో జేసుదాస్ గాత్రం కొంతవరకూ ఆ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.అలాగే,నేటి గాయకులలో శంకర్ మహాదేవన్ గొంతులో కూడా ఆ ప్రభావం కొంత కనిపిస్తుంది.ఇక పాతతరపు దిగ్గజాలైనా,నేటితరపు గాయకులైనా శాస్త్రీయగాయకులలో చాలామందిలో అటువంటి గాత్రం ఉన్నదనే చెప్పాలి. వారి పేర్లు వ్రాసుకుంటూ పోతే పెద్ద లిస్టు తయారౌతుంది.

ఆ విషయాలు అలా ఉంచితే,ప్రస్తుతానికి మాత్రం ఒక జాతకుడు సంగీతంలో మంచి ప్రతిభను పొందాలంటే ఏ ఏ అంశాలు కారణాలౌతాయో జ్యోతిశ్శాస్త్ర పరంగా మాత్రమే పరిశీలిద్దాం.

వాక్ స్థానం ద్వితీయం కనుక ఆ భావమూ భావాదిపతీ జాతకంలో బలంగా ఉండాలి.సహజ వాక్ స్తానాధిపతి అయిన శుక్రుడు కూడా బలంగా ఉండాలి. భారతీయసంగీతం మనోధర్మసంగీతం కనుక, పాడుతున్న పాటయొక్క భావాన్ని మనసుకు అందించడానికి చంద్రుడూ, ఆభావం బుద్ధిలో ప్రతిఫలించడానికి బుదుడూ బలంగా ఉండాలి.నలుగురిలో పాడేటప్పుడు భయం లేకుండా వణుకు రాకుండా పాడటానికి కుజుడు బలంగా ఉండాలి.శాస్త్రీయ సంగీతం భక్తిప్రధానమైనది కనుక గురువు బలంగా ఉండాలి.ఆత్మశక్తికీ సంగీతరంగంలో విజయాలు సొంతం చేసుకోవడానికీ సూర్యుని బలం ఉండాలి. అది వృత్తిగా చేసుకున్నవారికి దశమ స్థానం బలంగా ఉండాలి. దశమాదిపతి మంచి స్తితిలో ఉండాలి.సహజ దశమాదిపతి శని కూడా బలంగానే ఉండాలి.ఇలా చూస్తె సప్తగ్రహాలూ వచ్చేశాయి.ఇక మిగిలిన రాహుకేతువులు కలిసి రాకపోతే గాయకుడు ఏమీ చెయ్యలేడు.కనుక వారూ అనుగ్రహించాలి.ఈ రకంగా నవగ్రహాలు అన్నీ ఏదో ఒక రకంగా కరుణించనిదే శాస్త్రీయ సంగీతం పట్టుబడదు.

ఇకపోతే గానం చెయ్యడానికి మంచి లంగ్ పవర్ ఉండాలి.అంటే ఊపిరి కుంభించి పాడగలిగే శక్తి ఉండాలి.కనుక వాయుతత్వ రాశులైన మిధునమూ,తులా,కుంభమూ కూడా జాతకంలో బలంగా ఉండాలి.ఆ రాశుల అధిపతులైన బుధుడూ శుక్రుడూ శనీ అనుగ్రహించాలి.వీరిలో ముఖ్యంగా బుధశుక్రుల అనుగ్రహం తప్పనిసరిగా గాయకునికి ఉండి తీరాలి.ఎందుకంటే లలిత కళలకు వీరే అధిష్టాన గ్రహములు గనుక.

సహజ రాశిచక్రంలో వీరిద్దరూ వాక్కుకూ, గానానికీ,వాయుతత్వానికీ అధిపతులు అవుతున్నారు.కనుక ఆ రకంగా చూచినా వీరి అనుగ్రహం గాయకులకు తప్పనిసరిగా ఉండాలి.అంటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహమో లేక శివశక్తుల అనుగ్రహమో ఉంటే తప్ప ఎవరూ మంచి శాస్త్రీయ గాయకులు కాలేరు అన్నది నిర్వివాదాంశం.గాయకుల జాతకాలలో బుధ శుక్రుల స్తితులు బలంగా ఉండాలి.ఈ మధ్య మరణించిన పినాకపాణి గారు కూడా ఈ రెండు గ్రహాలూ నెప్ట్యూన్ తో మింగబడినప్పుడే మరణించారన్నది మన కళ్ళెదుట కనిపించిన వాస్తవం.

ఇకపోతే, నేటి లల్లాయి పాటల గురించి,అవి పాడుతున్న కోతి గాయకుల గురించీ అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది.నా దృష్టిలో నేటి సినిమా సంగీతం అసలు సంగీతమే కాదు.పిల్లికూతలూ,జంతువుల అరుపులూ,వెకిలి కేకలతో కూడిన నేటి సినిమా సంగీతం, అసలు సంగీతమనే పేరుకు ఏ మాత్రం తగదని నా నమ్మకం.సినిమా గాయకుల చండాలం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్రకృతి శక్తులను కదిలించగలిగే ప్రజ్ఞ ఉన్నవాడే అసలైన సంగీత తపస్వి అని నేను విశ్వసిస్తాను. అంటే, అతను గానం చేస్తుంటే ఖాళీ ఊయల దానంతట అది కదిలి ఊగాలి. ఒక చెట్టు కింద అతను కూచుని గానం చేస్తే ఆ చెట్టు తన పూలను అతనిపైన వర్షంలా రాల్చాలి.కాలం కాని కాలంలో మేఘాలు కమ్మి వర్షం కురవాలి. ప్రమిదలో దీపాలు వాటంతట అవి వెలగాలి. మోడులై పోయిన చెట్లు చిగురించాలి. గానంతో అతను శాసిస్తే రోగాలు పోవాలి. తుఫానులు మొదలైన ప్రకృతి భీభత్సాలు ఆగాలి. పాము వంటి విష జంతువులు అతని ముందు తలవంచి వెనుదిరగాలి.ఇలాంటి అద్భుతాలు తమ గానంతో ఎవరైనా చెయ్యగలిగితే వారు పరవాలేదని, ఒక స్థాయి వరకూ ఎదిగిన సంగీతజ్ఞులని నేనంటాను.ఒక స్థాయికి అని ఎందుకన్నానంటే, దీనికంటే ఉన్నత స్థాయిలు సంగీతయోగంలో ఇంకా చాలా ఉన్నాయి. ఇక నేను పైన చెప్పిన స్థాయితో పోలిస్తే  మిగిలిన మామూలు గాయకులు నా దృష్టిలో ఇంకా ఎంతో సాధన చెయ్యవలసిన ఉన్నవారే. వారు ఇంకా సంగీత ప్రపంచపు ప్రహరీ గోడ బయట ఆడుకుంటున్న వారని నా ఉద్దేశ్యం.లోపల ఉన్న అద్భుతాలు వారికి ఏమీ తెలియవు.

ఒక వ్యక్తి లోకంలో గొప్ప సంగీత కళాకారునిగా ఖ్యాతి బడయవచ్చు.ఎన్నో బిరుదులూ ఎంతో ధనమూ సంపాదించవచ్చు.కాని తన గానంతో ప్రకృతి శక్తులను కదిలించలేక పోతే అతని సంగీతం అంత గొప్ప సంగీతం కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మానవులిచ్చే బిరుదులకు నా దృష్టిలో ఎటువంటి విలువా లేదు. తామే అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న మానవులకు ఇతరులకు బిరుదులు ఇచ్చే స్థాయి ఎలా వస్తుంది? కనుక మానవులు చేసే సత్కారాలూ ఇచ్చే బిరుదులూ నా దృష్టిలో ఏ మాత్రం విలువ లేని గడ్డిపోచలు.ఇక సంగీతాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడాన్ని నేనొక గొప్ప విషయంగా పరిగణించను.అలా సంపాదించడానికి అదృష్టం ఉంటే చాలు. అంతమాత్రాన ఆ వ్యక్తి ఒక గొప్ప గాయకుడంటే నాకు నవ్వొస్తుంది.ఒక వ్యక్తి యొక్క నిజమైన గొప్పతనం ఆ వ్యక్తి సంపాదించిన డబ్బును చూచి  లెక్కించడం ఎప్పుడూ తప్పే అని నేను విశ్వసిస్తాను.

పాతకాలంలో సంగీత సాధన చాలా నిష్టగా ఉండేది.'దీపక్' రాగాన్ని తన వశం చేసుకోవాలంటే ఎదురుగా ప్రమిదలో నూనె పోసి వత్తి ఉంచి,దాని ఎదురుగా కూచుని దీక్షగా పాడుతూ, ఆ దీపం దానంతట అదే వెలిగే వరకూ సాధన చెయ్యాలి. అప్పుడే ఆ రాగం తనకు వశమైనట్లు లెక్క. అలాగే 'మేఘమల్హార్' రాగం కూడా. ఆ రాగం పాడితే కాలం గాని కాలమైనా సరే,మేఘాలు కమ్మి వర్షం కురవవలసిందే.అప్పుడే ఆ రాగంలో ప్రజ్ఞ లభించినట్లు లెక్క. బైరవీ రాగాన్ని గానం చేస్తే ఎదురుగా భైరవీరూపం అతనికి సాక్షాత్కారించాలి. అప్పుడే ఆ రాగం సిద్ధించినట్లు లెక్క. ఎన్నేళ్ళు పట్టినా ఆ సిద్ధి కలిగేవరకూ పట్టుగా సాధన చేసేవారు.అదీ అసలైన సంగీతం అంటే.అంతేగాని నేటి గాయకుల వలె,ఒక మూడునెలలు ఏదో మొక్కుబడిగా నేర్చుకుని వేదికలెక్కి ప్రదర్శనలిచ్చేవారు కారు.

తన గురువు ఆఖరి కోరికను తీర్చడానికి, ఆయన చితిని మామూలు నిప్పుతో గాక 'దీపక్' రాగాన్ని పాడి తాన్సేన్ వెలిగించాడని అంటారు.అంత అగ్నిని తన ప్రాణశక్తితో రగిల్చినందుకు ప్రతిఫలంగా అతని వళ్ళంతా మంటలు పుట్టి కొన్ని నెలలకు అతనూ చనిపోయాడని చెబుతారు.  

అటువంటి గాయకులు అసలు ఉంటారా అని అనుమానం రావచ్చు. ఉంటారు.ఉన్నారు.కాని వారిలో చాలామంది లోకం దృష్టిలోకి రారు.లోకవాసన సోకకుండానే వారి జీవితాలు ముగుస్తూ ఉంటాయి. వారికి మన బిరుదులూ సన్మానాలూ సత్కారాలూ అవసరం లేదు. వీటిని చూచి వారు నవ్వుతారు.వారి గానానికి ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. వారు మనుషులకోసం పాడరు.వారు పాడితే వినవలసిన శక్తులు,వ్యక్తులు వేరే ఉంటారు.అలాంటి సంగీతపు చాయలు కొంచం కాకపోతే కొంచమైనా తమ తమ గానాలలో ప్రతిఫలించే గాయకులూ గాయనీమణులూ మనకు తెలిసిన వారిలో కూడా కొందరున్నారు.అలాంటి వారి జాతకాలు కొన్ని ముందు పోస్ట్ లలో పరిశీలిద్దాం.