నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, మార్చి 2013, శనివారం

చెదిరిన స్వప్నం - జిమ్ జోన్స్ జాతక పరిశీలన

జిమ్ జోన్స్ పేరు అమెరికా చరిత్రలో నిలిచిపోయే పేర్లలో ఒకటి.కొందరు మంచిగా గుర్తుండిపోతారు.కొందరు చెడుగా చరిత్రలో మిగిలి పోతారు. ఇంకొందరు చెడు చేసినా మంచిగా మిగులుతారు.మరికొందరు మంచి చేసినా చెడ్డవారిగా ముద్రింప బడతారు.వీరిలో జిమ్ జోన్స్ ఏ కోవలోకొస్తాడో నేను నిర్ణయించను. చదువరులకే వదిలేస్తున్నాను.

దాదాపు వెయ్యిమంది ఇతని మాటలు నమ్మి ఒకేసారిగా విషంతాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఇతనికి ఎంత సమ్మోహనశక్తి ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.లేదా ఆ చనిపోయినవారు ఎంత బలహీనమనస్కులో అర్ధం చేసుకోవచ్చు.నాయకుల మాటలు ప్రసంగాలు విని ఓట్లు గుడ్డిగా వేసే మన భారతప్రజలకూ వీరికీ నాదృష్టిలో పెద్దతేడా లేదు.అమెరికా అయినా ఇండియా అయినా మనుషుల్లో గొర్రెలు ఎక్కువగా ఉంటారని,వారు నక్క నాయకుల మాటలే నమ్ముతారని ఈసంఘటనలు నిరూపిస్తున్నాయి. మనిషి చెడువైపు ఆకర్షింపబడినంతగా మంచివైపు ఆకర్షింపబడడు.

9/11 సంఘటనకు ముందు ఇదే అమెరికాచరిత్రలో అతిపెద్ద సామూహిక మరణం.ఇవి ఆత్మహత్యలా లేక హత్యలా అనే విషయం మనకు అప్రస్తుతం. గ్రహస్తితులను మాత్రమె మనం పరిశీలిద్దాం.

ఇతను 13-5-1931 న ఇండియానా స్టేట్ లోని లిన్ అనే ఊళ్ళో రాత్రి పది గంటలకు పుట్టాడు.అతని జాతకం ఇక్కడ చూడొచ్చు.ఇతని జీవితంలో ముఖ్య సంఘటనలు మాత్రమె గమనిద్దాం.
  • ఇతని తండ్రికి కు-క్లక్స్-క్లాన్ తో సంబంధాలున్నాయని అంటారు. దీనికి  నిదర్శనాలు ఇతని జాతకంలో కనిపిస్తాయి.
  • సూర్యుడు ఉచ్చ స్తితిలో ఉన్నప్పటికీ 29 డిగ్రీలో ఉండటం.
  • నవాంశలో సూర్యుడు రాహుచంద్రులతో కలిసి చాందస భావాలను సూచించే ధనుస్సులో ఉండటం. 
  • పితృకారకుడైన చంద్రుడు రాహువుతో డిగ్రీ సంయుతి లో ఉండటం. 
  • చిన్నతనంలోనే తండ్రి చనిపోవడాన్నీ ఈ గ్రహయుతులే సూచిస్తాయి.

రాశి నవాంశ విమ్శాంశలలో శుక్రుడు ఉచ్చస్తితిలో ఉండటం చూస్తె మత పరంగా ఇతనికి గల సమ్మోహనశక్తిని,తన వాగ్దాటితో ప్రజలను సమ్మోహితులను చెయ్యడాన్ని,ఇతనికున్న వ్యక్తిగత అయస్కాంతశక్తిని గమనించవచ్చు.

జూన్ 1956 లో ఇతను ఒక పెద్ద మతపరమైన మీటింగ్ ను విజయవంతంగా ఏర్పాటు చేసాడు.ఆ సమయంలో శుక్ర/చంద్ర దశ జరిగింది.పంచమ భావాన్ని గమనిస్తే ఇదెంత సరిగ్గా ఉన్నదో ఋజువౌతుంది.

లగ్నాధిపతి ధర్మస్తానంలో నీచ స్తితిలో ఉండటం చూస్తె ఇతని యొక్క మతపరమైన క్రియాకలాపాలు అర్ధమౌతాయి. మెథడిస్ట్ చర్చ్ లో సభ్యుడైన ఇతను అందులోనుంచి చీలిపోయి తన స్వంతకుంపటి పెట్టుకున్నాడు. ఇతనికి కొన్ని విచిత్రమైన దృఢమైన నమ్మకాలుండేవి.మనలో కూడా కొందరు కలియుగాంతం వస్తున్నదని నమ్మి పుస్తకాలు వ్రాసి ప్రజలను భయపెట్టినవాళ్ళున్నారు.ఇతనూ అలాంటి వాడే.త్వరలో న్యూక్లియర్  హోలోకాస్ట్ జరిగి ప్రపంచం మొత్తం బూడిదవుతుందని నమ్మి తనవాల్లందర్నీ బ్రెజిల్ కు తరలించాడు.కాని ఏమీ జరుగలేదు.ఇది 1962 ఏప్రెల్ లో శుక్ర/గురు దశలో జరిగింది.ఉచ్చ శుక్రునివల్ల ఇతని మాటలు నమ్మి వారందరూ వచ్చినప్పటికీ,అష్టమ గురువు వల్ల ఇతని ఊహ తప్పని తేలిపోయింది.

అదే సమయంలో ఇతను గుయానాను దర్శించాడు.అక్కడ ఒక ఆశ్రమం లాంటిది పెట్టాలని భావించాడు.ఆ సమయంలో అదే దశ జరుగు తున్నది.కనుక ఆ నిర్ణయం ముందుముందు ఒక భయంకర విషాద సంఘటనకు దారి తీసింది.   

ఉచ్చసూర్యుని వల్ల ఇతనికి క్రమేణా రాజకీయనాయకులతో ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.క్రమేనా వారితో గొడవల వల్ల ఇతని స్థావరాన్ని గుయానా లోని జోన్స్ టౌన్ కు మార్చాడు. అక్కడ 'పీపుల్స్ టెంపుల్' అని ఒక సంస్థను మొదలెట్టాడు.1970 లో శుక్ర/బుధ, కేతు దశలు జరిగినప్పుడే జోన్స్ టౌన్ ను నిర్మించడం మొదలుపెట్టాడు.అక్కడకు చేరిన తర్వాత, ఏదో ఒకనాడు తన అనుచరులందరితో కలసి మరణించి,అందరూ వేరే ఏదో గ్రహానికి తరలిపోయి అక్కడ హాయిగా జీవించవచ్చని నమ్మేవాడు.బహుశా తన అనుయాయులకు కూడా ఇదే నూరిపోశాడు.

తర్వాత అనేక గొడవలు లుకులుకల మధ్య ఇతని మీద రాజకీయ,మీడియా నీడలు కమ్ముకున్నాయి.నవంబర్ 1978 లో కాంగ్రెస్ సభ్యుడు 'లియో ర్యాన్' బృందం వీరి వ్యవహారాన్ని పరిశీలించడానికి జోన్స్ టౌన్ కు వచ్చింది.నవంబర్ 18 తేదీన వీరిమీద ఇతని 'రెడ్ బ్రిగేడ్' సైనికులు జరిపిన కాల్పులలో లియో ర్యాన్ బృందంలోని అయిదుగురూ దగ్గరలోని ఏయిర్ స్ట్రిప్ లో చనిపోయారు.ప్రభుత్వం తమపైన చర్య తీసుకుంటుందని భయపడిన ఇతను అందర్నీ ఆత్మహత్య చేసుకొమ్మని ప్రేరేపించాడు.తత్ఫలితంగా ఇతని కమ్యూన్ లోని 303 మంది పిల్లలూ 606 మంది పెద్దవాళ్ళూ సామూహికంగా సైనేడ్ మింగి అదేరోజున చనిపోయారు.

ఇలాంటి 'మాస్ సూయిసైడ్' చాల విచిత్రమైన సంఘటన. ఆరోజు గ్రహస్తితి పరిశీలిద్దాం.

ఆరోజు ఇతని జాతకంలో చంద్ర/కుజ/కుజ/శని దశ జరిగింది. నేనేన్నో సార్లు నా వ్యాసాలలో సూచించాను.కుజ,శనుల కలయిక భయంకరమైన సంఘటనలను ప్రేరేపిస్తుంది అని. ఇతని జాతకంలో గల చంద్ర,కుజ,శని గ్రహముల స్తితులను గమనిస్తే ఈ సంఘటన ఎంత ఖచ్చితంగా జరిగిందో అర్ధమౌతుంది.

ఇతని జాతకంలోని లోతైన విషయాలు బ్లాగుముఖంగా నేను చర్చించ దలుచుకోలేదు.అలాంటి చర్చలకు 'పంచవటి' గ్రూప్ ఎలాగూ ఉన్నది.కాని మచ్చుకు ఒక్కటి మాత్రం చెప్తాను.తృతీయంలో బలంగా ఉన్న వక్రశని (communicative skills)కి ఎదురుగా నవమంలో ఉన్న నీచకుజుని (religious accident) వల్ల ఇతని మాటలు నమ్మి మతపరంగా అనుసరించిన వారికి భయంకరమైన చావు రాసిపెట్టి ఉందన్న 'యాస్ట్రో సిగ్నేచర్' ఇతని జాతకంలో చూడగానే కనిపిస్తుంది.  

ఇతని జాతకంలో గల గ్రహస్తితుల వల్ల అష్టోత్తరీ దశ వర్తిస్తుంది అనుకున్నా కూడా అందులో ఆరోజున చంద్ర/సూర్య/చంద్ర/బుధ దశ జరిగింది.ఇది కూడా ఈ సంఘటనను నిరూపిస్తూనే ఉన్నది. ఇకపోతే ఆరోజున గ్రహస్తితి ఎలా ఉందొ గమనిద్దాం.
  • గోచర చంద్రుడు జననచంద్రునితో డిగ్రీ కేంద్ర దృష్టి.
  • గోచార రాహువు జనన సూర్యునితో డిగ్రీ కోణ దృష్టి.
  • గోచార బుధుడు జనన యురేనస్ తో డిగ్రీ కోణ దృష్టి
  • గోచార బుధుడు జనన గురువుతో డిగ్రీ 6/8 దృష్టి
  • గోచార కుజుడు జనన చంద్రునితో డిగ్రీ కోణ దృష్టి
  • గోచార కుజుడు జనన రాహువుతో డిగ్రీ కేంద్ర దృష్టి 
  • జనన గురువు,యురేనస్ లు- గోచార యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో ల మధ్య ఖచ్చితమైన దృష్టులు.
  • అంతేగాక యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లు వరుసగా కన్యా తులా వృశ్చికాలలో దాదాపు ఒకే డిగ్రీ పైన సంచరించారు.
  • గోచార శని జనన రాహుచంద్రులతో డిగ్రీ 6/8 దృష్టి
  • గోచారంలో శపితయోగం నడుస్తున్నది. నవాంశలో రాహువు కుజుడు కలసి మతపిచ్చిని సూచించే ధనుస్సులో ఉన్నారు.
  • గోచార గురువు ఉచ్చస్తితిలో ఉన్నాడు.
  • ఇన్ని విచిత్రమైన గ్రహస్తితులు ఆరోజున ఉండబట్టే దాదాపు వెయ్యిమంది ఇతను చెప్పిన ఒక్క మాటతో సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
జ్యోతిష్యజ్ఞానం ఉన్నవారికి పై కుండలులు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి.ఇతని లైంగిక కార్యకలాపాలు,డ్రగ్స్ వాడకం,కమ్యూన్ లోని ఇతర గొడవలు వంటి వివాదాస్పద అంశాల జోలికి నేను కావాలనే పోలేదు.పరిశీలిస్తే అవికూడా పై చార్ట్ లలో స్పష్టంగా కనిపిస్తాయి.

ఓషో కమ్యూన్ కూడా అనేక కారణాల వల్ల ఇలాగే ధ్వంసం చెయ్యబడింది. కాని దానిలో ఇలాంటి సామూహిక (ఆత్మ)హత్యలు జరగలేదు.అందులో కూడా చెదురుమదురుగా కొన్ని సంఘటనలు జరిగినట్లు దాఖలాలు న్నాయని కొందరంటారు. 

ఇతని జీవితం మీదా,ఇలాంటి విషయాల మీదా చర్చలు ఎలా ఉన్నప్పటికీ, జ్యోతిష్య సూత్రాలనేవి ఎంత ఖచ్చితంగా పని చేస్తాయో ఇతని జీవితం చూస్తె మరొక్క సారి అర్ధమౌతుంది.