నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, మార్చి 2013, శనివారం

M.N.Roy జాతకంలో నాస్తిక - మానవతా యోగాలు

మొన్న 21 తేదీ ఎమ్మెన్ రాయ్ పుట్టినరోజు.రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని సృష్టించి నమ్మిన ఈయన అందరు కమ్యూనిస్టుల లాగే జాతకాలనూ జ్యోతిష్యాన్నీ నమ్మేవాడు కాదు.అయితే ఒకరు నమ్మినా నమ్మకున్నా విశ్వసత్యాల కొచ్చిన భంగం ఏమీలేదు. సూర్యుడినీ చంద్రుడినీ మనం నమ్మకుంటే వారికేమీ నష్టం లేదు. నమ్మినంత మాత్రాన వారికొరిగే లాభమూ లేదు. పల్లెటూళ్ళలో ఒక సామెత వినిపిస్తుంది.'చెరువు మీద అలిగి నీళ్ళు తెచ్చుకోకపోతే ఎవరికీ నష్టం?'అని.

ఈయన ఒక మేధావి అనడంలో ఎటువంటి అనుమానమూ లేదు.అయితే అందరు మేధావుల లాగే ఈయనా చాలా విషయాలలో పప్పులో కాలేశాడు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలూ శాస్త్రాలమీద వారికి అంతా తెలిసినట్లుగా తీర్పులు తీర్చడమే చాలామంది మేధావులు చేసిన పిచ్చిపని. నాకు ఫిజిక్స్ బాగా తెలుసు కనుక ఇక ప్రపంచంలోని అన్ని సబ్జెక్టుల మీదా నేను చెప్పే తీర్పే కరెక్ట్ అని నేనంటే ( ఆ సబ్జేక్ట్లులు నేను అధ్యయనం చేసినా చెయ్యకున్నా) అదెంత హాస్యాస్పదంగా ఉంటుంది? ఈ మేధావుల వాదనా అలాగే ఉంటుంది.నేను పొలిటికల్ సైన్స్ చదివిన రోజుల్లో మిగిలిన పొలిటికల్  తత్వవేత్తల సిద్ధాంతాలతో పాటు రాయ్ యొక్క 'రాడికల్ హ్యూమనిజం' గురించి కూడా చదివాను.

రాయ్ ఇలా అన్నారు."జాతకాల మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ మార్క్స్ తనంతట తాను జాతకం చెప్పినా నేను నమ్మను".ఆయన నమ్మకాలు ఆయన వ్యక్తిగతమైనవి.నమ్మకం అనేది అనుభవం నుంచీ పరిశీలన నుంచీ కలగాలి.ఒక సబ్జెక్టులో ఈ రెండూ లేనప్పుడు దానిమీద నమ్మకాలూ అభిప్రాయాలూ ఏలా ఏర్పడతాయో నాకెప్పటికీ అర్ధం కాదు. మనకొక విషయం మీద పరిశీలనా అనుభవమూ లేనప్పుడు దానిపట్ల ఏ భావమూ లేకుండా తటస్తంగా ఉండటమే నిజమైన మేధావి లక్షణం.

సరే ఆ విషయం  అలా ఉంచి, ఆయనకున్న కమ్యూనిస్ట్ భావాల గురించి,మత వ్యతిరేక భావాల గురించి ఒక్కసారి ఆయన జాతకం ఏమంటున్నదో చూద్దాం.ఎందుకంటే ఆయన నమ్మినా నమ్మకున్నా జ్యోతిష్యవిజ్ఞానం అబద్దం చెప్పదు. ఆ విషయం న్యూయార్క్ లైబ్రరీలో కూచుని ఆయన చదివిన పాశ్చాత్యగ్రంధాలవల్ల ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు.అది ఆయన తప్పు కాదు.

ఈయన జనన సమయం తెలియలేదు.అయినా పరవాలేదు.జనన తేదీ తెలుసు.ఈయన 21-3-1887 న కలకత్తా దగ్గర లోని అర్బెలియా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. కొన్ని ప్రత్యెక సింపుల్ విధానాలు ఉపయోగించి ఈయన జాతకాన్ని ఒక్కసారి పైపైన పరిశీలిద్దాం.
  • ఈయన జాతకంలో ఆత్మకారకుడు శని అయ్యాడు. కారకాంశ మేషం అయింది.అక్కణ్ణించి గురువు సప్తమంలో ఉన్నాడు.కనుక ఈయనకు సాంప్రదాయ మతం అంటే గిట్టదని క్లియర్గా కనిపిస్తున్నది.
  • ఈయన జాతకంలో 'ఏకాకి గ్రహం' (lonely planet) శని అయ్యాడు.అంటే ఈయన బాగా లోతైన చింతనాపరుడన్న విషయం కనిపిస్తున్నది.అంతేగాక ఈయన సామాన్యజనం గురించిన ఆలోచన లోనే జీవితమంతా గడుపుతాడు అని సూచన కూడా ఉన్నది.
  • ఈయన జాతకంలో గురువు బుధుడు వక్రించి ఉన్నారు.అంటే మతానికి ఈయన దూరం అని ఇంకొక సూచన ఉన్నది.అలాగే ఈయన మేధావి అయినప్పటికీ ఆ తెలివితేటలు పెద్దగా ఎవరికీ ఉపయోగపడవు(కనీసం ఆయనక్కూడా)అనీ సూచన ఉన్నది.అందుకే ఈయన కమ్యూనిష్టులలో కూడా మైనార్టీ అయ్యాడు.వారిలో కూడా స్టాలిన్ వంటి వారితో ఈయనకు శత్రుత్వం ఉన్నది.కమ్యూనిజం కూడా కేంద్రీకృత అధికారంతో ఇంకొక రాచరికవ్యవస్థగా మారడాన్ని ఈయన వ్యతిరేకించాడు.కాని చాలా కమ్యూనిష్టు పార్టీలలోనూ దేశాలలోనూ అదే జరిగింది.కమ్యూనిజం అయినా ఇంకే 'ఇజం' అయినా ప్రాధమికంగా మానవ మనస్తత్వంలో మార్పెలా వస్తుంది?దానికి నిజమైన మతమే మార్గం.
  • రవిబుధులిద్దరూ చాలా దగ్గరగా ఇద్దరూ శనినక్షత్రంలో ఉండటం వల్లా,ఆశని నవాంశలో నీచస్తితిలో ఉండటం వల్లా ఒక విషయం గోచరిస్తున్నది.ఈయన తెలివితేటలను సామాన్యజనం కోసమే వెచ్చిస్తాడు. కాని ఈ వ్యవహారం వల్ల చివరికి ఈయనకు ఏమీ ఉపయోగం ఉండదు అన్న విషయం తెలుస్తున్నది.ఇతనికి జనసందోహంతో తీరని కర్మ చాలా ఉన్నది. అందుకే జీవితమంతా జనాన్ని గురించి ఆలోచిస్తూ గడిపాడు.
  • రవి బుధులకు తోడుగా కుజుడు ఉండటం వల్ల ఈయన వాదనలోనూ తర్కంలోనూ చాలా మొండిమనిషి అనీ,తనకు దొరికిన కుందేలుకు రెండే కాళ్ళని గట్టిగా వాదిస్తాడని తెలుస్తున్నది.
  • నీచస్థితిలో ఉన్న వక్రబుధునితో కుజుని కలయిక నాస్తిక యోగాన్నిస్తుంది.ఈ యోగం ఈయన జాతకంలో ఉండటం క్లియర్ గా చూడవచ్చు. ఈ యోగం ఉన్నవారు వారికి తెలిసిన కొద్ది సమాచారాన్ని జెనరలైజ్ చేసుకుని దానికి కుతర్కాన్ని జోడించి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.వీరికి వక్రగురువు అష్టమంలో ఉండటం ఈ యోగానికి ఇంకా బలాన్నిచ్చింది.
  • వక్ర గురువు నవాంశలో నీచస్తితిలో ఉండటం వల్ల కూడా సాంప్రదాయ మతం అంటే ఈయనకు గిట్టదని అర్ధం అవుతున్నది. 
  • చంద్రుడు కేతువుతో కలిసి శనిరాశిలో ఉండటం వల్ల మానవతా వాదమైన రాడికల్ హ్యూమనిజాన్ని స్థాపించాడని కనిపిస్తున్నది.దీనికి కారణం ఆయన వయసులో ఉన్నపుడు ఆయన్ను ప్రభావితం చేసిన  వివేకానంద,అరవిందుల భావాలే.
  • ఒక మనిషికి మతం అంటే పడక పోవచ్చు.కాని మానవత్వం అనేదానిని అతను ప్రేమించవచ్చు.వివేకానందుడు దీనినే అసలైన మతం అన్నాడు.ఈయన జాతకంలో చంద్ర కేతువులూ శనీ ప్రభావం వల్ల ఈయన ఒక మానవతావాదిగా మారాడు.నిజమైన మతంలో మానవతావాదం అంతర్లీనంగా ఉండాలి.అది లేని మతం ఆ పేరుకు తగదు.
  • ఉదాహరణకి,చాదస్తపు మతవాదులన్నా పురోహితులన్నా నాకూ పడదు.అయితే ఆ పడకపోవడానికి కారణాలు మతపరమైనవి కావు. వారిలో మానవత్వం లేకపోవడం,అహంకారం ఎక్కువగా ఉండటం మాత్రమే వారంటే నాకు అసహ్యాన్ని కలిగిస్తుంది.అంతమాత్రం చేత నేను నాస్తికుణ్ణి ఎలా అవుతాను? 
  • మానవత్వం అనే పునాది మీదనే నిజమైన మతం కట్టబడాలి అని నేనూ నమ్ముతాను.అహంకారంతో నిండిన ఒక పురోహితుడిని నేను దూరంగా ఉంచుతాను.అదే అహంకారం లేకుంటే ఒక సామాన్యుడిని కూడా నేను స్నేహితుడిగా అంగీకరిస్తాను.ఇదే నిజమైన మతం అని రాయ్ నమ్మినట్లైతే నా దృష్టిలో రాయ్ నిజమైన మతవాదే. 
  • ఈయన ఎప్పుడూ నమ్మని జ్యోతిష్య శాస్త్రం ఈయన జీవితాన్ని సరిగ్గా బొమ్మ గీసినట్లు చూపించడమే ఒక విచిత్రం.దీనివల్ల ఆయన నమ్మకం గురించి ఏమి రుజువౌతున్నదో నేను మళ్ళీ విశదీకరించడం అనవసరం అనిపిస్తున్నది.
  • పామును నేను నమ్మను అని ఒకరన్నంత మాత్రాన అతనిమీద పాము విషం పనిచెయ్యకుండా ఆగిపోదు.ఔషధాన్ని నమ్మని వారికి కూడా సేవించిన ఔషధం పనిచేస్తుంది.ఆ రోగాన్ని నయం చేస్తుంది.అలాగే జ్యోతిషాన్ని నమ్మని వారి జాతకంలో కూడా వారి మనస్తత్వమూ నమ్మకమూ చక్కగా కనిపిస్తూ ఉంటుంది.ఆబ్జెక్టివ్ సత్యాలకూ మనం అనేక కారణాలవల్ల ఏర్పరచుకునే సబ్జెక్టివ్ అభిప్రాయాలకూ చాలాసార్లు పొంతన ఉండదు.
  • కమ్యూనిష్టులలో కూడా ప్రజలను మోసం చేసి ఆస్తులు కూడబెట్టిన దొంగ కమ్యూనిష్టులున్నట్లే జ్యోతిష్కులలో కూడా మోసగాళ్ళు ఉండవచ్చు.కాని జ్యోతిష్య శాస్త్రం అబద్దం కాదు.దీనిని అధ్యయనం చేస్తే ఈ విషయం తెలుస్తుంది.
సత్యానికీ నమ్మకానికీ సంబంధం లేదు.మన నమ్మకం సత్యాధారం కావచ్చు కాకపోవచ్చు.కానీ మన నమ్మకంలోనే లొసుగు ఉన్నప్పుడు ఆ నమ్మకమే వేదం అంటే మాత్రం హాస్యాస్పదం గా ఉంటుంది.