Pages - Menu

Pages

11, ఏప్రిల్ 2013, గురువారం

పంచాంగ శ్రవణం


పండితుల పంచాంగ శ్రవణాలను వింటూ ఉంటె నాకు నవ్వొస్తూ ఉంటుంది.ముఖ్యంగా అధికారికంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పంచాంగ శ్రవణాలు ఫక్తు నవ్వులాటలుగా ఉంటుంటాయి.

అది చదివే పండితుడో జ్యోతిష్కుడో అతనికి ఎదురుగా మంత్రులూ అధికారులూ కూర్చుని ఉంటారు.వారి హావభావాలు చూస్తె ఎవరికీ ఈ కార్యక్రమం మీద శ్రద్ధ ఉన్నట్లు తోచదు.జోకులేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.లేకుంటే 'ఈ ఏడాది ఖజానా నిండుగా ఉంటుంది' అంటూ ఏదైనా ఒక విషయాన్ని పండితుడు చదివినప్పుడు అదేదో ఒక పెద్ద జోక్ లాగ నవ్వుతూ ఉంటారు.మొత్తం మీద ఈ పంచాంగ శ్రవణాలు అనబడేవి ఒక మొక్కుబడి ఫార్స్ గా తయారయ్యాయి.ఏదో మనమూ పంచాంగ శ్రవణం  చేసాము అని తప్ప జ్యోతిష్యవిద్యను సరిగా ఎలా వాడుకోవాలో ఎవరికీ పట్టినట్లు కనిపించదు.

నిజమైన పంచాగ శ్రవణం అనేది ఎలా ఉండాలి?

ముందుగా వర్ష(సంవత్సర)చక్రం వేసి ఆయా వ్యక్తులకు రాబోయే ఏడాది ఎలా ఉండబోతున్నది అన్న విషయం ఆయా జాతకుల వ్యక్తిగత జాతకాన్ని ఈ వర్షచక్రాన్ని కలిపి పరిశీలించి తెలుసుకోవాలి. దానికి సహకారులుగా రాబోయే ఏడాదిలో సంభవించే గ్రహణాలు ఇతర ముఖ్యమైన గ్రహస్తితులు ఆ జాతకునికి ఏఏ భావాలలో కలుగబోతున్నాయి వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గమనించి ఆయా దోషాలను నివారించుకోవడానికి  తగిన పరిహారక్రియలు చూచుకుని వాటిని ఆయా దశా సమయాలలో ఆచరించి ఆ సంవత్సరం అంతా చెడును తప్పుకొని శుభంగా గడిచేలా జీవితాన్ని దిద్దుకోవాలి. అది పంచాగ శ్రవణం యొక్క అసలైన ఉపయోగం. అంతేగాని కందాయ ఫలితాలూ రాజపూజ్య అవమానాలూ చదువుకుని జోకులేసుకుని నవ్వుకోడానికి కాదు.

ప్రస్తుతం అసలైన పంచాంగ శ్రవణ ఉపయోగం మరుగున పడి ఇదొక ఉత్తుత్తి తంతుగా మారింది. ఆ సమయానికి ఏదో తప్పదన్నట్లు పంచాగం వినడం అదికూడా సగం ఎగతాళి ధోరణితోనూ సగం నిర్లక్ష్య భావంతోనూ ముళ్ళమీద కూచున్నట్లు కూచుని పంచాంగ శ్రవణం చేసి,గబగబా తినడానికో తాగడానికో తందనాలకో పరిగెట్టడం జరుగుతున్నది. నేనెప్పుడూ చెప్పేటట్లు ఇది ప్రాణం లేని ఉత్తతంతును జరపడం మాత్రమె.ఇలాంటి మొక్కుబడి పంచాగ శ్రవణాల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు.

తెలియని వాళ్ళు ఏమి మాట్లాడినా మాట్లాడవచ్చు గాక,జ్యోతిష్య శాస్త్రం ఒక మహత్తరమైన సజీవవిజ్ఞానం అన్న విషయం దాని లోతుపాతులు తెలిసినవారికి అవగతమే.ప్రాచీనులు దానిని అనుక్షణమూ అనుసరిస్తూ జీవితాన్ని ఆనందంగా దిద్దుకునేవారు.వ్యక్తిగత జాతకాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆయా పరిహారాలు చేసుకుంటూ జీవితాలను ఉన్నతంగా నడుపుకునేవారు.కనుకనే జ్యోతిష్య విద్య సజీవంగా అప్పుడు నిలబడి ఉండింది.

రాజులు పాలించే కాలంలో పరిస్తితి భిన్నంగా ఉండేది.నేటి డొల్ల ప్రజాస్వామ్యం తో పోలిస్తే రాజరిక పాలనలు ఎంతో ఉన్నతంగా ఉండేవి.అక్కడక్కడా క్రూరులైన రాజులు ఉన్నప్పటికీ కొన్నాళ్లకు వారి అరాచకమే వారిని పదవీచ్యుతులను గావించేది.రాజులు ముఖ్యంగా ప్రజాక్షేమాన్ని చూచేవారు.ప్రజలకు రక్షణ ఇచ్చేవారు.లా అండ్ ఆర్డర్ నిక్కచ్చిగా త్వరగా అమలు చేసేవారు.వారు స్వయంగా ధర్మాన్ని ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలిచేవారు.నేరం చెయ్యాలంటే భయం ప్రజలలో ఉండేది.రాజులు మహాపండితులైన ఆస్థాన జ్యోతిష్కుల సలహాలు తీసుకుని దోషపరిహారాలు నిర్వర్తించి రాజ్యంలో ఎలాంటి దుర్భిక్షమూ లేకుండా చూచుకునేవారు. అలాంటి రాజులూ ప్రజలూ నిర్వర్తించే ఉగాది ఉత్సవాలూ,పంచాంగ శ్రవణాలకు ఒక అర్ధమూ పరమార్ధమూ ఉండేది.

నేడు అంతా భ్రష్టత్వం వచ్చింది గనుక ఇదంతా ఒక తంతుగా తయారైంది.ఆ పంచాంగం ఎందుకు చదువుతారో వినేవారికి ఎలాగూ  తెలీదు.ఇక చదివేవారికి ఆయా మంత్రుల అధికారుల వద్ద మెప్పు పొంది ఏవైనా పనులు చేయించుకోవాలని వరాలు పొందాలన్న ధ్యాస తప్ప ఉన్నదున్నట్లు చెబుదామని వారికీ తోచదు.ఉన్నదున్నట్లు చెబితే మళ్ళీ వచ్చే ఏడాది ఈయన్ను పిలవరు.అందుకని ‘వర్షాలు బ్రహ్మాండంగా పడతాయి.అంతా సుభిక్షంగా ఉంటుంది.రాష్ట్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది.’ మొదలైన ఊకదంపుడు మాటలు చెబుతారు.పోయినేడాది కూడా ఇలాగే చెప్పారు.మరి మధ్యలో వర్షాలూ పడలేదు.పంటలూ సరిగా పండలేదు.ఎందుకిలా జరిగింది?మన లెక్కలలో ఎక్కడో ఏదో తేడా ఉందా?లేక లెక్క సరిగా ఉన్నా కూడా,అలా ఉన్నదున్నట్లు చెబితే అధికారులకు నచ్చదు కనుక అలా చెబుతారా? అని ఆలోచిస్తే రెండూ కావచ్చు అని తేలుతుంది.

ఇతరుల మెప్పును ఆశించేవాడూ,వినేవారి దగ్గర నుండి ఏవేవో వరాలు ఆశించెవాడూ అసలు జ్యోతిష్య విద్యకు అనర్హుడు.చెప్పేవారికీ చిత్తశుద్ధి లేదు.వినేవారివీ శుద్ధమైన జీవితాలు కావు. వారికి జ్యోతిష్యం మీద పెద్ద నమ్మకమూ ఉండదు.ఇక ఆ తంతు యొక్క ప్రయోజనం ఏమిటి? అసలెందుకీ పనికిరాని తంతులు? హిందూమతం అంతా ఇలాంటి పనికి మాలిన తంతులతో నిండి పోయి ఉన్నది.

జీవితానికీ లోకానికీ దిక్సూచిగా ఉపయోగపడగలిగే ఒక మహత్తరమైన విద్యను సరిగా వాడుకోవడం తెలియని నేటి తరం మనుషులను చూచి,ఈ నవ్వులాట తంతులను చూచి, ఈ విద్యను లోకానికి అందించిన ప్రాచీన ఋషులూ శాస్త్రవేత్తలూ పై లోకాలలో సిగ్గుతో తలలు బాదుకుంటూ ఉంటారేమో మరి?