నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, ఏప్రిల్ 2013, ఆదివారం

కోడికూత స్వామి

చాలా రోజుల క్రితం ఒక స్నేహితుడు కనిపించి ఒకచోటికి ఆహ్వానించాడు.

'భగవాన్ కోడికూత స్వామి' అని ఒకాయన ఊళ్లోకోచ్చాడు.ఆయనకు సన్మానం జరుగుతున్నది.చూద్దాం వస్తావా?

'రాను' అని చెప్పాను.

'ఎందుకు రావు? ఆయన దగ్గర చాలా మహిమలున్నాయిట' చెప్పాడు.

'అందుకే రాను.మహిమలు ఉన్న స్వాములంటే నాకు పడదు.మహిమలూ ఆడంబరాలూ లేని అతి సామాన్య స్వాములు ఎవరైనా ఉంటె చెప్పు.అలాంటి వారి దగ్గరకైతే వస్తాను' చెప్పాను.

'నీ ఇష్టం. నే పోతున్నా' అంటూ స్నేహితుడు వెళ్ళబోయాడు.

'సరే.పోయొచ్చి విశేషాలు చెప్పు' అన్నా.

అలా పోయిన వాడు తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ ఒక చోట కలిశాడు.అప్పుడు కొన్ని వివరాలు చెప్పాడు.

'కోడికూత స్వామి ఐదో తరగతి వరకే చదూకున్నాడు.కాని ఇప్పుడు ఆయన ఆశ్రమానికి మినిస్టర్లు,సినిమా స్టార్లు,అయ్యేయెస్ ఐపీయస్ ఆఫీసర్లు,బడా పారిశ్రామిక వేత్తలు క్యూలు కడుతున్నారు' అన్నాడు.

'అయితే ఇందులో ఏదో మతలబు ఉన్నట్లే.దీనిని ఖచ్చితంగా అనుమానించవలసిందే.ఇంతకీ స్వామివారు వీళ్ళందరి చేతా ఏమి చేయిస్తారు?' అన్నాను.

'ఏం లేదు.అందరికీ ఆయన సమక్షంలో మళ్ళీ పెళ్లి చేయిస్తాడు'.

నాకు మతిపోయింది.

'పెళ్ళా?అదేంటి.వాళ్లకు ఒకసారి పెళ్లి అయింది కదా?ఆయన సమక్షంలో మళ్ళీ పెళ్లి ఏమిటి? అంటే రెండో పెళ్ళా?'అడిగాను.

మిత్రుడికి కోపం వచ్చింది.'నీతో ఇదే తంటా. సరిగా వింటే చెబుతాను.లేకుంటే చెప్పను.' అరిచాడు.

'అప్పుడే ఆయన బుట్టలో పడిపోయినట్లున్నావే.సరే చెప్పు.'

'ఆయన సమక్షంలో పెళ్లి చేసుకుంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందట. అందుకే వాళ్ళు తెచ్చుకున్న భార్యతో మళ్ళీ పెళ్లి చేయిస్తాడు' అన్నాడు.

'ఓహో.అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లి కంటే ఈయన సమక్షంలో చేసుకున్న పెళ్లి పవర్ ఫుల్ అన్నమాట.అయినా తెచ్చుకున్న భార్యేమిట్రా ఉంచుకున్న భార్యన్నట్లు వినటానికే అసహ్యంగా ఉంది?సరే ఏదైతే నాకెందుకుగాని స్వామికి పెళ్లి అయిందా మరి?' అడిగాను.

'అయింది.ఒక పెళ్ళాం.నలుగురు పిల్లలూ ఉన్నారు.కాని వారిని స్వామి ఎప్పుడో వదిలేశారు' చెప్పాడు.

'భేష్.గట్టివాడే.ఆయన సంసారమే నిలబడలేదు.ఇక ఊళ్లోవాళ్ళ సంసారాలు నిలబెడతాడన్నమాట.అద్భుతం అమోఘం.నీకు సరైన గురువు ఇన్నాళ్ళకు దొరికాడు.సంతోషంరా.'అన్నాను.

'అసలు ఆయన సిద్ధాంతం వింటే నీవు మూర్చపోతావు.'అన్నాడు.

'ముఖాన నీళ్ళుచల్లి నీవు లేపుదువుగానిలే.ముందు విషయం చెప్పు.'అన్నా.

'ఆయన ఆశ్రమంలో చేరినవారికి ఒక టైం టేబుల్ ప్రకారం అంతా జరుగుతుంది.ముందుగా ఉదయం మూడు గంటలకే నిద్ర లేవాలి.' చెప్పాడు.

'ఎందుకలా?స్వామికి నిద్రపట్టని రోగం ఏమైనా ఉందా?' అడిగాను.

ఫ్రెండ్ కి మళ్ళీ బోలెడు కోపం వచ్చింది.తమాయించుకుని చెప్పాడు.

'మధ్యలో అడ్డు రాకు.ఫ్లో దెబ్బ తింటుంది.అలా పొద్దున్నే లేవడానికి ఒక కారణం ఉంది.అది తర్వాత చెప్తాను.ముందు అలా మూడింటికే నిద్రలేచి అందరూ తమతమ రూముల్లోంచి బయటకు వచ్చి తూర్పు దిక్కుకు తిరిగి చేతులు పైకెత్తి గట్టిగా 'కొక్కొరో....కో' అంటూ కూత పెట్టాలి.' చెప్పాడు.

నాకు నవ్వుతో పొలమారింది.

'అవున్లే కోడికూత స్వామికదా అందుకే ఇలా కోడికూతతో దినచర్య మొదలౌతుందన్న మాట.చాలా బాగుంది.' నవ్వుతూ అన్నాను.

'దీని వేనకాల లాజిక్ వింటే అప్పుడు అలా నవ్వవు.మనకు ఆరాధ్య దైవం సూర్యభగవానుడు కదా.దీనిని నీవు ఒప్పుకుంటావా?' అడిగాడు.

'ఒప్పుకుంటాను.మన భూగోళానికి ఆయనే సమస్తం ఇచ్చేది కనుక మనకు ఆయనే దైవం.కరెక్టే.'చెప్పాను.

'కానీ ఆ సూర్యుడు ఉదయించబోయే విషయం కూడా కోడికి ముందే తెలుస్తుంది.అందుకే అది మూడింటికే లేచి 'కొక్కొరో..కో'అని కూత పెడుతుంది.కనుక కోడి కంటే గొప్ప దైవం ఉంటానికి వీల్లేదు' చెప్పాడు.

నాకు నోట మాట రాలేదు.'ఎంత గొప్ప లాజిక్ రా.ఇది నీ సొంత బుర్రా లేక స్వామీజీ తన మెదడు నీకు అద్దెకిచ్చాడా?' అడిగాను.

'నా మొహం.నాకింత తెలివి ఎక్కడేడిసింది గాని ఇదంతా స్వామీజీ చలవే. ఇవుగో స్వామి ఉపన్యాసాల సీడీలు.ఇవి విన్నావంటే నీకు జ్ఞానోదయం తప్పకుండా అవుతుంది.'అన్నాడు.

'వద్దులే.నువ్వు ఫ్రీగా ఇచ్చినా వాటిని తీసుకునే ధైర్యం నాకు లేదులే గాని.నీవే ఉంచుకో.ఇంతకీ ఆశ్రమంలో ఆహారం ఏమి ఉంటుంది?' ఆ సీడీలు పక్కకు తోస్తూ అడిగాను.

'అంతా కోడిలాగే ఉంటుంది. లంచ్ టైంలో స్వామీజీ గింజలు వెదజల్లుతూ ఆశ్రమం గ్రౌండ్ లో తిరుగుతూ ఉంటారు.భక్తులందరూ కోడిలాగా ఎగురుతూ నోటితో ఆ గింజలు ఏరుకుంటూ తినాలి.పెద్ద పెద్ద ఒబేసిటీ పేషంట్లు కూడా అక్కడ చేరారంటే ఒక్క నెలలోనే సన్నగా బక్కపీచుల్లాగా తయారౌ తున్నారు.' చెప్పాడు.

'అబ్బ,ఎంత గొప్ప విషయం చెప్పావురా.అంటే కోడిని అనుసరించడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?' అన్నాను.

'అవును ఇప్పటికైనా స్వామి గొప్పదనం ఒప్పుకుంటావా?' అడిగాడు.

'ఒప్పుకోక చస్తానా?నీకోసమైనా ఒప్పుకుంటాలే గాని ఇంతకీ భక్తుల్ని రాత్రికి బుట్ట కింద పెట్టి మూతలేస్తాడా మీ స్వామి?' అడిగాను.

'లేదు.ఎవరి రూములో వాళ్ళు పడుకోవాలి.కాని దోమతెరనే బుట్టలాగా డిజైన్ చేశారు.అందులో పడుకుంటే మనకు బుట్టకింద పడుకున్న అనుభూతి మిగులుతుంది.' చెప్పాడు.

'మరి భక్తులు పెట్టె గుడ్లను ఎవరు పొదుగుతారు?' సీరియస్ గా ముఖం పెట్టి అడిగాను.

మావాడికి శక్తి ఉంటె వాడు చూచిన చూపుకు నేను భస్మం అయిపోయి ఉండేవాడిని.

'అన్నీ నీకే తెలిసినట్లు ప్రతిదాన్నీ ఎగతాళి చేస్తావురా?' అన్నాడు.

'అదికాదురా.నువ్వు చెప్పేది శ్రద్ధగా వింటున్నాను కదా.మధ్యలో అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? అందుకే అడిగాను.నీకు తెలిస్తే చెప్పు.కోపం ఎందుకు?' అన్నాను.

'నీవు మా ఆశ్రమంలో చేరాలంటే ముందుగా మా ఆశ్రమానికి ఒక వంద కోళ్ళను డొనేట్ చెయ్యాలి.వాటి సంరక్షణ బాధ్యత మాదే.నీకు కావలసినప్పుడు వచ్చి అవి ఎలా ఉన్నాయో చూచుకుని నీ కిష్టం వచ్చినన్ని రోజులు మాతో ఉండిపోవొచ్చు.లేదా పర్మనెంట్ గా ఆశ్రమంలో ఉంటామంటే నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తాం' అన్నాడు.

'సారీరా.నాకు ప్రస్తుతం ఏ ఆశ్రమంలోనూ చేరే ఉద్దేశ్యం లేదు.'అని చెప్పాను. ఆ తర్వాత వాడిని ఇంకా కొన్ని అనుబంధ ప్రశ్నలు అడుగుదామని అనిపించింది గాని జవాబులుగా ఇంకేం వినాల్సి వస్తుందో బాగుండదని ఊరుకున్నాను.

తర్వాత ఒక ఏడాదికి మళ్ళీ అదే స్నేహితుడు నీరసంగా ముఖం వేళ్ళాడేసుకుని కనిపించాడు.

'అదేంటి అలా ఉన్నావ్? మీ స్వామీజీ బాగున్నాడా?' అడిగాను. 

'లేదు ఆశ్రమం ఎత్తేశారు' చెప్పాడు.

'అదేంటి ఏమైంది'

'మా ఆశ్రమం బాగా పాపులర్ అవడం చూచి ఎదురుగా ఇంకో స్వామీజీ ఆశ్రమం వెలిసింది.ఆయన పేరు 'కోడికూర స్వామి' చెప్పాడు.

మళ్ళీ నాకు భలే నవ్వొచ్చింది.కాని వాడు ఏడుపు మొహంతో ఉంటె మనం నవ్వటం బాగుండదని మళ్ళీ ఆపుకున్నాను.

ఏం జరిగిందో వాడే చెప్పుకొచ్చాడు.

'కోడికూర స్వామి ఫిలాసఫీ మా స్వామికి పూర్తీ వ్యతిరేకం. ప్రకృతి అంతా నిద్రపోతూ ఉంటె కోడి ఒక్కటే చీకట్లో నిద్రలేచి కూత పెడుతుంది.అంటే అది సైతాన్ అన్నమాట.సృష్టికి వ్యతిరేకంగా పొయ్యేది సైతానే కనుక దానిని బతకనిస్తే దైవసృష్టికి ప్రమాదం అని మా స్వామి నమ్మకం.ఆయనకు సింగిల్ పాయింట్ అజెండా ఉంది.అదేంటంటే కనిపించిన కోడిని కనిపించినట్లు కరకరా వడియంలా నమిలెయ్యడమే.ఆయన శిష్యులందరూ రాత్రిళ్ళు మా ఆశ్రమం మీద పడి మేము ముద్దుగా పెంచుకుంటున్న కోళ్ళను ఎత్తుకుపోయి వండుకుని తినేసేవారు.కొన్నాళ్లకు మా ఆశ్రమంలో ఒక్క కోడీ మిగల్లేదు.చివరకు స్వామీజీ అల్లారుముద్దుగా పెంచిన పల్నాడు కోడిపుంజును కూడా వదలలేదు ఆ దుర్మార్గులు'.కన్నీరు కారుస్తూ చెప్పాడు.

'ఆ తర్వాతేమైంది త్వరగా చెప్పు' సస్పెన్స్ భరించలేక అడిగాను.

'ఏముంది?తన కళ్ళముందే కోడి జాతి అలా అంతమై పోతుంటే తట్టుకోలేని కోడికూత స్వామీజీ తన శిష్యురాళ్ళతో కలిసి ఊటీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.'

'మరి శిష్యుల్ని ఏమి చేశాడు' అడిగాను.

'వారికో దైవకార్యాన్ని అప్పగించాడు స్వామీజీ.తలా వెయ్యి కోళ్ళు పోగేసిన భక్తుడే ఊటీ ఆశ్రమానికి రావడానికి అర్హుడు అన్న నియమం పెట్టాడు.మేమందరం ఆ పనిలో ఉన్నాం.'

ఇంతలో ఒక కోడి రోడ్డుమీద పోతూ కనిపించింది.

'వస్తాన్రా.ఆ కోడిని పట్టుకోవాలి.నేను టార్గెట్ కి దగ్గర దగ్గరగా వస్తున్నాను.త్వరలో వెయ్యి కోళ్ళు పట్టుకుని ఊటీ వెళ్ళాలి.కొక్కొరో...కో' అంటూ ఆ కోడి వెంట స్పీడుగా పరిగెత్తాడు.అదేమన్నా తెలివి తక్కువదా?వీడికి చిక్కకుండా అదింకా స్పీడుగా పరిగెత్తింది.క్షణంలో కోడీ,వాడూ సందు మలుపు తిరిగి మాయమై పోయారు.

నేను నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయాను.అంతా కలిమాయ.ఈ కలియుగంలో ఇంకెంతమంది ఇలాంటి స్వాములను చూడాలో అని ఆలోచిస్తూ నిదానంగా మా ఇంటి దారి పట్టాను.